పశ్చిమగోదావరి

మళ్లీ సశేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 23: మాసపత్రికల్లో సీరియల్ మాదిరిగా అధికారపార్టీలో చింతలపూడి నియోజకవర్గ వ్యవహారం సాగిపోతోంది. ఒకటి తర్వాత ఒకటి మాదిరిగా ఈవివాదం సాగిపోతూనే ఉన్నా ముగింపు వాక్యం జిల్లాస్థాయిలో పడే అవకాశాలు లేనేలేవని మరోసారి రుజువైంది. సశేషం మాదిరిగా ఈ వివాదం తెరలుతెరలుగా సాగుతూనే ఉంది. ఎన్నిసార్లు రాజీ ప్రయత్నాలు జరిగినా వర్గాల మధ్య మరింత దూరం పెరగడం మినహా దగ్గరయ్యే పరిస్ధితులు కనిపించటం లేదు. దాదాపుగా రెండు,మూడేళ్ల నుంచి చింతలపూడి నియోజకవర్గం వేదికగా ఈవివాదం సాగుతూనే ఉండటం తెల్సిందే. స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం, మరోవైపు ఏలూరు ఎంపి మాగంటి బాబు వర్గం మాదిరిగా మోహరించి మరీ ఎత్తులకుపైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని నడిపిస్తూనే వస్తున్నారు. పీతల సుజాత మంత్రిగా పనిచేసిన కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇక ఆతర్వాత మరింత జోరందుకుందనే చెప్పాలి. ఏదీఏమైనా ఈ పరిధిలో వచ్చిన అసలు వివాదం ఏమిటి, ఎక్కడనుంచి ఈ వివాదం రగిలింది అన్నది రెండువర్గాల్లోని కీలకనాయకులు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందనే చెప్పాలి. మొత్తంమీద ఈరెండువర్గాలు చెరోవైపు మోహరించి ఎవరివంతు రాజకీయాన్ని వారు నడిపించుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితమే ప్రభుత్వం స్వయంగా చింతలపూడి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను, ఇతర కమిటీ సభ్యులను నియమిస్తూ జివో జారీ చేసి నెలలు గడిచిపోతున్నా దానికి ఇంతవరకు అతీగతీ లేకుండా పోయింది. ఈనేపధ్యంలోనే శుక్రవారం ఈరెండువర్గాల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీపరంగా కార్యక్రమాలను మరింత బలోపేతంగా నిర్వహించాలని తలపోశారు. దీనికోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చొరవ తీసుకుని మరీ రెండువర్గాలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆపరిస్థితుల్లోనే ఏలూరు జడ్పీ అతిధిగృహంలో మాగంటి బాబు వర్గం మోహరించటం, మంత్రి పితాని వ్యాఖ్యలతో వ్యవహారం మరింత రసకందాయంలో పడటం తెల్సిందే. అ అంశాన్ని అలాఉంచిత ఆతర్వాత చింతలపూడిలో పీతల సుజాత వర్గం భారీ బహిరంగసభను నిర్వహించింది. ఈసందర్భంగా నాయకులంతా కలిసి ఉన్నారన్న సంకేతాన్ని ఇచ్చేందుకు అమాత్యులు ప్రయత్నించారు. అయితే ఈవివాదానికి ఏలూరులోనే ఫుల్‌స్ట్ఫా పెట్టి ఆతర్వాత చింతలపూడి సభలో నేతలంతా పాల్గొనేలా చూసి ఉంటే సరిపోయేదన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. చింతలపూడి సభలో మేమంతా ఒక్కటేనన్న సంకేతాలు ఇచ్చిన నేతలు ఆతర్వాత మాత్రం ఆ పరిస్థితిని కొనసాగించలేకపోయారు. మళ్లీ ఏలూరులో వర్గాల మధ్య సయోధ్య యత్నాలు జరిగినప్పటికీ రెండువర్గాలు ఎదురెదురు పడే పరిస్దితి లేకుండా పోయింది. అటు చర్చలు కూడా జరగలేదు, ఇటు వివాదానికి కూడా ఫుల్‌స్ట్ఫా పడలేదు. ఈవిషయంలో ఎవరి కారణాలు వారికి ఉన్నప్పటికీ క్రమశిక్షణకు మారుపేరు అని నాయకులు చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఈస్దాయిలో వివాదం రేగడం, అది ఇంతకాలం కొనసాగటం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. దీనికితోడు రోజులు గడుస్తున్న కొద్ది వివాదం సర్దుమణగకపోగా మరింత విస్తృతమయ్యే పరిస్దితులు కన్పిస్తున్నాయి. రెండువర్గాలవైపు ఎవరి సామాజిక వర్గం వారి వైపు మోహరిస్తూ ఈవ్యవహారాన్ని మరింత పెద్దది చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు కొనసాగితే రానున్న రోజుల్లో సామాజిక వర్గాల మధ్య కూడా సయోధ్య చేయాల్సిన పరిస్ధితి రాకతప్పదన్న హెచ్చరికలు కూడా విన్పిస్తున్నాయి. వివాదానికి ఒక కారణంగా చెప్పుకుంటున్న మార్కెట్ కమిటీ ప్రకటన విషయంలో అమాత్యులు కూడా ఎందుకు చొరవ చూపలేకపోతున్నారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనిపై అధిష్టానం సీరియస్‌గానే ఉందని, ముందుగా ప్రకటించిన విధంగానే కోనేరు సుబ్బారావును ఎఎంసి ఛైర్మన్‌గా ప్రకటించాల్సిందేనని అక్కడ నుంచి జిల్లాకు ఆదేశాలు అందాయని చెపుతున్నారు. సోమవారంనాటికి ఎఎంసి విషయంలో ప్రకటన వెలువడుతుందన్న సంకేతాలు ఉన్నప్పటికీ అది ఎంతవరకు వాస్తవరూపం ధరిస్తుందన్నది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.
ఆత్మగౌరవం లేదా!
రహదారుల నిర్మాణ పనులపై అధికారులను ప్రశ్నించిన కలెక్టర్ భాస్కర్
ఏలూరు, సెప్టెంబర్ 23: జిల్లాలో పలు జాతీయ రహదారుల నిర్మాణ పనుల విషయంలో పదేపదే చెప్పించుకోవటం సిగ్గుగా లేదా, ఈవిషయంలో సంబంధిత అధికారులకు ఆత్మగౌరవం లేదా అంటూ కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 40కిలోమీటర్ల రహదారిని సంవత్సరకాలంలో పూర్తి చేయకపోతే ఏమనుకోవాలని ప్రశ్నించారు. జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణను త్వరితగతిన పూర్తిచేసి ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్నప్పటికీ సివిల్ పనులు చేసే సమయానికి ఆ కాలాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బికి సంబంధించి ఎన్‌హెచ్ 16లో తాడేపల్లిగూడెం జాతీయరహదారి నుండి అయిదు సమాంతర రోడ్డులకు సంబంధించి ఇప్పటికే మూడింటికి మంజూరు ఇవ్వగా మిగిలిన రెండు త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కన్నాపురం, పట్టిసం, కొవ్వూరుకు సంబంధించి 85కిలోమీటర్ల 365 బిబి ఎన్‌హెచ్ రహదారి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును న్యూఢిల్లీకి పంపటం జరిగిందని, వీటికి సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులకు సంబంధించి నవయుగ, మెగా కంపెనీలు తమ పరిధిలో చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రాధమిక ప్రకటన వచ్చే వారం నాటికి పూర్తి చేయాలన్నారు. భీమవరం-నిడదవోలు రైల్వేలైను విస్తరణకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఆకివీడు-్భమవరం మధ్య రైల్వే విస్తరణ పనులపై కూడా ఆయన సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భానుప్రసాద్, జాయింట్ కలెక్టరు-2 ఎంహెచ్ షరీఫ్, డిఆర్వో కె హైమావతి, నరసాపురం సబ్‌కలెక్టరు సుమిత్‌కుమార్‌గాంధీ, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్, జలవనరులశాఖ ఎస్‌ఇ ఇ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మల, పిఆర్ ఎస్‌ఇ మాణిక్యం, వ్యవసాయశాఖ జెడి డాక్టరు గౌసియాబేగం, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మిదేవి, ఆర్డీవోలు జి చక్రధరరావు, బి శ్రీనివాసరావు, లవన్న తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
భీమడోలు, సెప్టెంబర్ 23 : మండలంలోని పూళ్ల గ్రామంలో మరో అగ్రిగోల్డ్ బాధితుడు ఎ రామకృష్ణ గుండెపోటుతో శనివారం మృతిచెందాడు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన ఏజెంట్లు నిర్వహించిన రోజువారి పొదుపు, ఫిక్స్‌డ్ డెపాజిట్టు సొమ్ము ఇక రావనే భయంతో తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటు వచ్చినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటు వచ్చిన రామకృష్ణను చికిత్స నిమిత్తం ఏలూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. టైలరింగ్ వృత్తి చేసుకునే రామకృష్ణకు భార్య సత్యవతి, ఇద్దరు కుమార్తెలు వున్నారు. కుమార్తెల వివాహాలు జరిగాయి. రోజువారీ సంపాదనా పరుడైన రామకృష్ణ 2012 సంవత్సరం నుంచి అగ్రిగోల్డ్ సంస్థలో రోజువారీ పొదుపు పధకంలోచేరి రోజుకు 20 రూపాయలు చొప్పున తన ఖాతాలో జమ చేసేవాడు. నామినీగా కుమార్తె సత్యవాణిని ఉంచారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ప్రియా కాండక్ట్ ప్రాజెక్టులో ఒకటిన్నర సంవత్సరాల కాల వ్యవధిలో 50 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. దాని నిమిత్తం 80 వేల రూపాయలు రావాల్సి వుంది. వ్యవధి పూర్తయినప్పటికీ సొమ్ములు తిరిగి రాకపోవడంతో స్థానికంగా వున్న ఏజెంట్‌ను సంప్రదించగా తన వల్ల కాదంటూ చేతులు ఎత్తేశాడు. తాడేపల్లిగూడెంలోని సంస్థ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనితో తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతిచెందాడు.
దశలవారీగా ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధి
*మంత్రి పితాని: అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆచంట, సెప్టెంబర్ 23: నియోజకవర్గంలోని అన్ని మండల ప్రభుత్వ కార్యాలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం పెనుమంట్ర మండలంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఓ పక్క సంక్షేమాన్ని వదలిపెట్టకుండా, అభివృద్ధిని కూడా తనదైన శైలిలో చేస్తున్నారన్నారు. పెనుమంట్రలో రూ. 1 కోటితో నిర్మించనున్న మండల పరిషత్ కార్యాలయానికి భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.10 లక్షలతో నిర్మించిన వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని, రూ. 10.80 లక్షలతో నిర్మించిన మండల ఎగ్జికూటివ్ ఇంజినీరు కార్యాలయాన్ని, రూ. 5 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి పితాని ప్రారంభించారు. పెనుమంట్ర గ్రామ శివారు గరువులో మార్టేరు నుండి పెనుమంట్ర వరకు వెళ్ళే రూ. 1 కోటి 35 లక్షలతో నిర్మించిన 33 కెవి విద్యుత్ లైన్‌ను మంత్రి ప్రారంభించారు. రూ. 26 లక్షలు విలువైన 4 ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందించారు. మండలంలో మార్టేరు, నెగ్గిపూడి, పొలమూరు, మాముడూరు గ్రామాలకు రూ. 1.15 లక్షలు విలువ చేసే నాలుగు చెత్త సేకరించే బ్యాటరీ వాహనాలను మంత్రి ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అందజేశారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, ఎంపిపి కె. సరోజిని, వైస్ ఎంపిపి కట్టా బాలాజీ వనకుమార్, ఎంపిడిఒ బి. రామప్రసాద్, తహసీల్దార్ పి. వెంకట్రావు, పిహెచ్‌సి ఛైర్మన్ కర్రి సుబ్బారెడ్డి, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ వెలగల బులిరామకృష్ణారెడ్డి, పంచాయితీరాజ్ ఇఇ ఎస్. రఘుబాబు, డిఇ కె. రామకృష్ణ, ఎఇ కె. శామ్యూల్, వ్యవసాయాధికారులు ఎంవి రమేష్, కె.కమలాకరరావు, ఎలక్ట్రికల్ ఎడిఇ డి. శ్రీనివాస్, ఎఇ టి. ఈశ్వరరావు, ఇఒపిఆర్‌డి పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్టు

రూ.12 లక్షలు విలువైన బంగారం స్వాధీనం
ఏలూరు, సెప్టెంబర్ 23 : నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో భారీ దోపిడీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ తెలిపారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ఒక సెల్, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలోని నిడదవోలుకు చెందిన పాల కిరణ్ అలియాస్ లక్ష్మీపతి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన కుంభ సాంబశివరావు అలియాస్ శివ, గుంటూరు జిల్లా తెనాలి మండలం ఇస్లాం పేటకు చెందిన కట్టా శ్రీను, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునుపల్లికి చెందిన గుంటూరు సాల్మన్ అనే వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి దాదాపు 20 చోట్ల వివిధ రాష్ట్రాల్లో భారీ చోరీలకు పాల్పడ్డారన్నారు. వీరిలో పాలా కిరణ్ అనే వ్యక్తి పాత నేరస్తుడు కాగా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న తరుణంలో సాంబశివరావు, శ్రీను, సాల్మన్‌లతో పరిచయం ఏర్పాటు చేసుకుని ఒక పధకం ప్రకారం చోరీలు చేస్తూ వచ్చారని అన్నారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను, ఒంటరిగా వెళుతున్న వ్యక్తులను టార్గెట్‌లుగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారన్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి మారణాయుధాలు చూపించి దోచుకుంటున్నారని అన్నారు. వీరిపై వివిధ స్టేషన్లలో 20 కేసులు, ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, తెలంగాణ ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం టౌన్‌లో వీరిపై నమోదైన కేసు ఆధారంగా సి ఐ ఎం ఆర్ ఎల్ ఎస్ ఎస్ మూర్తి దర్యాప్తు ప్రారంభించగా వీరు ఎట్టకేలకు పట్టుబడ్డారన్నారు. ఈ కేసులో అంతర్‌రాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు పెంటపాడు ఎస్ ఐ బి సుబ్రహ్మణ్యం, తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ ఐ బి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం టుటౌన్ ఎ ఎస్ ఐ సాంబశివరావు, హెచ్‌సి జానకిరావు, పిసిలు ఎం సూర్యచంద్రరావు, ఎ సత్యనారాయణ, ఎస్ నాగరాజు, టి మురళీ, గంగాధర్, సతీష్‌లు చాకచక్యంగా నిందితులను గుర్తించి కేసులను చేధించారని ఎస్‌పి తెలియజేసి వారిని అభినందించారు. విలేఖరుల సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
*ఎంపి మాగంటి బాబు
ఏలూరు, సెప్టెంబర్ 23 : తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లక్ష్యమే ప్రజలకు మెరుగైన సేవలు అందించడమేనని ఏలూరు ఎంపి మాగంటి బాబు అన్నారు. శనివారం ఏలూరులోని 34వ డివిజన్‌లో ఎమ్మెల్యే, మేయర్‌లతో కలిసి ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన సేవలు కోరుకుంటున్నారని అడిగి నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు 34వ డివిజన్ కార్పొరేటర్ ఈడ్పుగంటి స్వరూపరాణి అధ్యక్షత వహఙంచారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో సంక్షేమ పధకాలను పకడ్బందీగా అమలుచేస్తున్నారని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ త్వరలో ఏలూరులో అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరిస్తామని, 2018లో పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పనకు రుణాలు ముమ్మరంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ నాయుడు పోతురాజు, విప్ గూడవల్లి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, గాంధీస్కూలు ఛైర్మన్ బంకా రామ్మోహనరావు, ఆర్ ఆర్ పేట వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ శలా మాణిక్యాలరావు (రాజాబాబు), ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాసరావు, జంపా సూర్యనారాయణ, కార్పొరేటర్లు పునుకొల్లు పార్ధసారధి, కోమర్తి వేణుగోపాలరావు (గోపి), దాకారపు రాజేశ్వరరావు, టిడిపి ఎస్‌సి సెల్ నాయకులు దాసరి ఆంజనేయులు, టిడిపి నాయకులు ఈడ్పుగంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆ డివిజన్‌లోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా ఒక యువతి స్కాలర్‌షిప్ మంజూరు చేయాలంటూ వినతిపత్రం అందజేయగా ఎమ్మెల్యే బుజ్జి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. అదే ప్రాంతానికి చెందని అప్పాయమ్మ అనే మహిళ తాను అగ్రిగోల్డ్‌లో నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ చేశానని, తన డబ్బు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దశల వారీగా అందరి సమస్యలు పరిష్కరిస్తానని ఎంపి, ఎమ్మెల్యే మేయర్‌లు భరోసా ఇచ్చారు.
గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం: మంత్రి పితాని
ఆచంట, సెప్టెంబర్ 23: ప్రతి గ్రామంలో వౌలిక సదుపాయాలు కల్పించాలన్నదే ధ్యేయమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. శనివారం పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు నిలిచిపోకుండా చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలుపరుస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రతి పౌరుడు ప్రభుత్వం చేసే పనులకు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరు చంద్రన్న బీమా ప్రీమియం చెల్లించి తమ కుటుంబాలకు భరోసానివ్వాలని మంత్రి పితాని కోరారు. కార్యక్రమంలో ఎంపిపిలు, జడ్పీటిసిలు, గ్రామ సర్పంచ్‌లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఏలూరు, సెప్టెంబర్ 23 : ఒక ఎ ఆర్ కానిస్టేబుల్ తనకు కేటాయించిన క్వార్టర్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దాసరి ఉదయ్‌కుమార్ (29) ఇరవై రోజుల క్రితం తన క్వార్టర్స్‌ను ఖాళీ చేసి ఎన్ ఆర్ పేటలోని ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. శనివారం తనకు కేటాయించిన క్వార్టర్స్‌కు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో వున్న అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఉదయ్‌కుమార్‌కు భార్య, ఒక పాప వున్నారు. ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని ఏలూరు డిఎస్‌పి జి వెంకటేశ్వరరావు, వన్‌టౌన్ సిఐ ఎ నాగమురళీ, త్రీటౌన్ ఎస్ ఐ పైడిబాబులు తదితరులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా? లేక ఆర్ధిక ఇబ్బందులా తేలాల్సి వుందని పోలీసులు పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక చైతన్యానికి ఆలయాలే కేంద్రం
*విహెచ్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనికెళ్ల
బుట్టాయగూడెం, సెప్టెంబర్ 23: సమాజంలో ధర్మాన్ని నిలిపే ఆధ్యాత్మిక చైతన్యానికి ఆలయాలే కేంద్రంగా నిలుస్తాయని, గ్రామాల్లో ఆలయ నిర్మాణాలు, నిర్వహణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనికెళ్ల సత్యరవికుమార్ అన్నారు. మండలంలోని గురుగుమిల్లిలో శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్, విశ్వహిందూ పరిషత్, సమరసత సేవాఫౌండేషన్ అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు అనిపెద్ది రామకృష్ణశర్మ నేతృత్వంలో పురోహితులు శనివారం తెల్లవారు ఝాము నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచన, దీక్షాధారణ, దేవాలయ యాగశాల ప్రవేశం, మండపారాధన, కలశ స్థాపన, ప్రతిష్ఠా విగ్రహాలకు పంచగవ్యాది అధివాసములు, పంచామృతాభిషేకాలు, ధాన్యాధివాసం, దర్పణాధివాసం, శయ్యాధివాసం, అగ్నిప్రతిష్ఠ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనం, భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా తనికెళ్ళ సత్య రవికుమార్ మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని, గ్రామాల్లో రామాలయాలు సంస్కృతికి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింతనకు మూలకేంద్రాలుగా పేర్కొన్నారు. గిరిజనుల్లో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ ఆలయాలు ప్రజల ధర్మనిరతికి, మంచితనానికి, సామరస్యతకు దోహదపడాలన్నారు. వైసిపి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ గ్రామాల్లో రామాలయాలు నైతికతను, ధర్మాన్ని ప్రబోధించేవిగా పేర్కొన్నారు. ఆలయ స్థలదాత పోలోజు కృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో జగన్నాథపురం గీతాశ్రమంకు చెందిన శ్రీ సద్గురు సత్యానందగిరి, కాకర్ల చంద్రశేఖర్, మండల సమరసత సేవాఫౌండేషన్ ధర్మజాగరణ ప్రముఖ్ కొండపల్లి వీర్రాజు, సోర్న శ్రీనివాసరావు, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయుని సేవలో ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 23: మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పవన సుతునికి పంచామృతాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచామృతాభిషేకం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో వాహన పూజలు, అన్నప్రాసనలు జరిగాయి. ఆలయ పూజామండపంలో నాగవల్లీ దళాలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ హేమా ముని వెంకటప్ప, వారి తల్లి ఎల్లమ్మ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి తమలపాకులతో అష్టోత్తర పూజ చేసిన తరువాత ముఖ మండపంలో వేదాశీస్సులు అందజేశారు. వీరిని స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసినట్టు దేవస్థానం ఛైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) తెలిపారు. కాగా, జంగారెడ్డిగూడెం నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ కె.బాలరాజు మద్ది ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. వీరిని కూడా స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి, వేదాశీస్సులు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నసమారాధన చేశారు. శనివారం ఒక్కరోజు ఆలయానికి 77,077 రూపాయల ఆదాయం లభించినట్టు ఇ.ఒ శివ తెలిపారు.
నదులను రక్షించుకుందాం
ర్యాలీ ఫర్ రివర్స్‌లో విష్ణు విద్యార్థులు

భీమవరం, సెప్టెంబర్ 23: ర్యాలీ ఫర్ రివర్స్ నినాదంతో భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇంజినీర్లు భారీ ఎత్తున శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులను చేతపట్టుకుని కళాశాల వద్ద భారీ ఎత్తున ప్రదర్శన జరిపారు. అదే విధంగా ఇంజినీర్లు భీమవరం మండలంలోని కొవ్వాడ గ్రామంలో ఫెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి నదుల ప్రాముఖ్యత గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నదుల రక్షణ - భారత సంరక్షణ అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నదుల ప్రాముఖ్యత ఇప్పుడు అన్ని తరాల వారికి తెలుస్తోందన్నారు. జీవ నదులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ప్రకృతి, జలాలను కాపాడుకుందాం అని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు.
2వ తేదీ నుంచి ఇంటింటికీ అన్నసంజీవని: కలెక్టర్
ఏలూరు, సెప్టెంబర్ 23: జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ నుంచి 2లక్షల 25వేల మందికి ఇంటింటికి అన్నసంజీవని ద్వారా జనరిక్ మందులు పంపిణి చేస్తున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం డిఆర్‌డిఎ, మెప్మా, వయోజనవిద్యా కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో అన్నసంజీవని మందుల దుకాణాలను ప్రతిమండలం, మున్సిపాల్టీల్లో ఏర్పాటుచేశామని, సర్వేలో 2లక్షల 25వేల మంది మందులు కావాల్సిన వారు ఉన్నట్లు తేలిందని, వారి ఇంటికే మందులు పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. చంద్రన్న బీమాలో క్లైయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెప్మాలో స్వయం సహాయక సంఘాల ఆన్‌లైన్ డేటాను నరసాపురం, భీమవరం, ఏలూరు, పాలకొల్లు, తణుకులలో మందకొడిగా సాగుతోందన్నారు. జిల్లాలో ప్రతిఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినప్పుడే 2021 నాటికి జిల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందన్నారు. ఊరూరా పశుక్షేత్రాలు అంశాన్ని సమీక్షిస్తూ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 50లక్షల ఎకరాలు నిర్దేశించి తప్పనిసరిగా మేలైన పశుగ్రాసాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, మెప్మా పిడి డాక్టరు ప్రకాశరావు, డ్వామా పిడి ముళ్లపూడి వెంకటరమణ, వయోజనవిద్య ఉపసంచాలకులు రత్నకుమార్, ఎపిడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
టిడిపి జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు ప్రాధాన్యత
ఏలూరు, సెప్టెంబర్ 23 : తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన ఎంఎ షరీఫ్‌ను కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కొత్తపల్లి సుబ్బారాయుడును రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముళ్లపూడి రేణుకను రాష్టప్రార్టీ అధికార ప్రతినిధిగా, మెంటే పార్ధసారధిని రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శిగా, మంతెన వెంకట సత్యనారాయణరాజును రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శిగా, అంగర రామ్మోహనరావును రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శిగా, కొక్కిరగడ్డ జయరాజును రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, మద్దిపాటి వెంకటరాజును రాష్ట్ర పార్టీ హెచ్‌ఆర్‌డి సభ్యునిగా నియమిస్తూ ఆదేశాలు వచ్చినట్లు టిడిపి జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శనివారం తెలిపారు.