పశ్చిమగోదావరి

ప్రజా సేవలో పోలీసు శాఖ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 21: సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుని పోలీసు వ్యవస్థ పలు సంస్కరణలు తీసుకువచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జవహర్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ శాఖగా గుర్తింపు పొందుతూ ఎప్పటికప్పుడు నేర నియంత్రణలో, నేర పరిశోధనలో నూతన ఆధునిక పద్దతులను అవలంభిస్తూ ప్రజా సేవలో పోలీసు శాఖ ముందడుగు వేస్తోందని ఆయన ప్రశంసించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కె ఎస్ జవహర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి జవహర్ మాట్లాడుతూ పోలీసులు వున్నారన్న ధైర్యంతోనే ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, పోలీసులంటే ప్రజలకు ఒక ధైర్యం, నమ్మకం అంటూ పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడటానికి సంఘ విద్రోహ శక్తులతో పోరాడి ప్రాణాలు అర్పిస్తున్నారని, అటువంటి పోలీసుల సేవలను ప్రతీ ఒక్కరూ నిండు మనస్సుతో అభినందించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రజా సహకారంతో అసాంఘిక శక్తులపై మరింత ఉక్కుపాదం మోపాలన్నారు. నేరాల అదుపులో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వలన త్వరితగతిన సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ మాట్లాడుతూ అమరులైన పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అలుపెరగకుండా శాంతిభద్రతలు పరిరక్షణకు ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 383 మంది తమ ప్రాణాలు కోల్పోయారని, అమర వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులను అణచివేయడంలో మడమతిప్పని మహాయోధులు పోలీసులని కొనియాడారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అహర్నిశలు ప్రజలు, దేశ రక్షణ కోసం పాటుపడిన పోలీసుల త్యాగాలను మరువలేమని, విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన 809 మందికి ఈ సందర్భంగా సర్ట్ఫికెట్లను అందజేశారు. అదే విధంగా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్ధినీ విద్యార్ధులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు మంత్రి జవహర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి వి రత్న, ఎ ఆర్ జిల్లా అదనపు ఎస్‌పి ఎం మహేష్‌కుమార్, ఎస్‌బి డి ఎస్‌పి పి భాస్కరరావు, డిటిసి డి ఎస్‌పి రాజేశ్వరరావు, ఎ ఆర్ డి ఎస్‌పి వి ఎస్ వాసన్, ఏలూరు డి ఎస్‌పి కె ఈశ్వరరావు, సిసి ఎస్ డి ఎస్‌పి టి సత్యనారాయణ, ఏలూరు ట్రాఫిక్ డి ఎస్‌పి ఎ శ్రీనివాసరావు, ఎస్‌సి, ఎస్‌టి సెల్ -1 డి ఎస్‌పి విజయశేఖర్, ఎస్‌బి సి ఐ ఎస్ కొండలరావు, డిసి ఆర్‌బి సి ఐ జివి కృష్ణారావు, ఎ ఆర్ ఆర్ ఐ వెంకట్రావు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు కె నాగరాజు, పలువురు సి ఐలు, ఎస్ ఐలు, కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పూర్వవైభవానికి టిడిపి కసరత్తు
* నేడు నరసాపురంలో తోట అధ్యక్షతన సమన్వయ కమిటీ భేటీ
* అంబేద్కర్ సెంటర్‌లో బహిరంగ సభ
* హాజరుకానున్న మంత్రులు ప్రత్తిపాటి, జవహర్, పితాని

భీమవరం, అక్టోబర్ 21: జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన పూర్వవైభవాన్ని కొనసాగించేందుకు కసరత్తులు ప్రారంభించబోతోంది. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండాలు రెపరెపలాడాలని ఇప్పటినుంచే వ్యూహరచనలు చేస్తోంది. ఇప్పటికే ఇటీవల జరిగిన నంద్యాల, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల ఉత్సాహం వర్ణనాతీతం. సరిగ్గా అదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చాలా ఉత్సాహంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు ఏమైనా ఉంటే అడిగి మరీ తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజల కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాల్లో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఆ పథకాల్లో ముఖ్యంగా చంద్రన్న బీమా వంటి వాటిలో సభ్యత్వం లేకపోతే వెంటనే ట్యాబ్‌లో వారి పేర్లను నమోదు చేసేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఏదైనా లోపాలుంటే వాటి వివరాలను కూడా నమోదు చేసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి 30 రోజులు పైగానే దాటింది. జిల్లాలో ఈ కార్యక్రమం వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాదాపుగా ఓటర్లకు దగ్గరయ్యారని చెప్పవచ్చు. జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా పట్టణాలు, గ్రామాలు, వార్డులు, నియోజకవర్గ స్థాయిలోని నాయకులకు, క్యాడర్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ స్పందన ఈ కార్యక్రమం ద్వారా లభించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో జిల్లాలో మరింత పట్టుసాధించేందుకు, ప్రతిపక్షాన్ని డైలమాలో పడేసేందుకు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం ముగింపును భారీ ఎత్తున నిర్వహించే ఆలోచనలో ఉంది. ప్రతీ నియోజకవర్గంలో చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముగించేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ముఖ్యం శనివారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో ఇది స్పష్టమైంది. ఇక ఇదే సమావేశాల్లో జిల్లా సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాల గురించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలావుండగా ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నరసాపురంలో జిల్లా సమన్వయ కమిటీ భేటీ అవుతోంది. నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. అదేవిధంగా నరసాపురంలోని అంబేద్కర్ సెంటర్‌లో భారీ బహిరంగ సభను కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసింది. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కెఎస్ జవహర్, కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హాజరవుతారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఈ సభ జరగనుంది. ఇక నుంచి ప్రతీ నెలా నియోజకవర్గాల వారీగా జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం, బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు సమాచారం.
పర్యాటక స్థలాల అభివృద్ధికి కృషిచేయాలి
*అధికారులకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, అక్టోబర్ 21 : జిల్లాలో పర్యాటక స్థలాల అభివృద్ధి కోసం పర్యాటక శాఖాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. శనివారం కలెక్టర్ ఛాంబరులో జరిగిన జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వున్న పర్యాటక కేంద్రాలలో వౌలిక సౌకర్యాలు కల్పిస్తూ 2016-17లో పరిపాలనా అనుమతులు పొందిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో జిల్లాలో 100 పర్యాటక స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగిదని ఇప్పటి వరకు ఎన్ని గుర్తించారని కలెక్టర్ ప్రశ్నించగా 34 పర్యాటక స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో 13, పోలవరంలో 6, పాలకోడేరులో 3, నిడదవోలులో 2, పెనుగొండ 2, ఆచంట 3, యలమంచిలి 2, పెదవేగిలో 3 స్థలాలను గుర్తించామని వీటిలో ఎకో టూరిజం ద్వారా రీసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తామని ప్రాంతీయ పర్యాటక సంచాలకులు భీమ శంకరరావు కలెక్టర్‌కు వివరించారు. గత సమావేశంలో జిల్లా పర్యాటక అభివృద్ధి కోసం ఎవరైనా అయిదు ఎకరాల స్థలం స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ స్థలంలో పర్యాటకులకు రీసార్ట్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున విద్యుత్, రోడ్లు, నీరు తదితర సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. నరసాపురం, పేరుపాలెం, చించినాడ తదితర ప్రాంతాలలో పిపిపి మోడ్‌లో అభివృద్ధి కొరకు స్థలాలను చూడాలని పర్యాటక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 2017-18కి లోకల్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా సిద్ధాంతంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి కొరకు 6.7కోట్లకు పరిపాలన అనుమతి జూలైలో ఇచ్చిన పనులకు ఇరిగేషన్ వారి దగ్గర టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే 7.75 కోట్లకు కొవ్వూరు పట్టనంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి టెండర్లను వెంటనే ఖరారు చేయాలని, ఆ దిశగా పర్యాటక అధికారులు చర్యలు చేప్టాలని ఆదేశించారు. సమావేశంలో పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, జిల్లా పర్యటక సహాయ అధికారి ఎన్ పట్ట్భారామయ్య, డి ఎఫ్‌వో వైల్డ్‌లైఫ్ సాయిబాబ పాల్గొన్నారు.
గోపాలపురం మార్కెట్‌కు నెమలికోన
గోపాలపురం, అక్టోబర్ 21: గోపాలపురం ఫిష్ మార్కెట్‌కు శనివారం అమ్మకానికి భారీ సముద్రం చేప రావడంతో ప్రజలు భారీగా తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. స్థానిక చేపల వ్యాపారి చిట్టిబోయిన వెంకట్రావు కాకినాడలో సుమారు 135 కిలోల బరువు గల ఈ చేపను సుమారు 28 వేల రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువచ్చారు. మూడు మీటర్లు పొడవున్న నెమలికోన జాతికి చెందిన ఈ చేపను చూసేందుకు తరలి వచ్చి చేప మాంసం కోసం క్యూ కట్టారు.
అన్ని వయస్సుల్లోనూ అయోడిన్ లోపాన్ని అధిగమించాలి
* వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు గీతాప్రసాదిని
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 21: అన్ని వయస్సుల్లోనూ అయోడిన్ లోపాన్ని అధిగమించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ టి గీతాప్రసాదిని అన్నారు. ప్రపంచ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి భగత్‌సింగ్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్‌ల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ టి గీతాప్రసాదిని ప్రారంభించారు. అనంతరం స్థానిక దండమూడి రామలక్ష్మి కల్యాణ మండపంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె కోటేశ్వరి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. అయోడిన్ లోపం అనేక రుగ్మతలకు దారి తీస్తుందన్నారు. అయోడిన్‌లోపం వల్ల గర్భస్థ శిశువు మొదలు అన్ని వయస్సులవారికి అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెప్పారు. పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని చెప్పారు. ముఖ్యంగా చిన్నారుల్లో అయోడిన్ లోపాన్ని గుర్తించి, తగిన చికిత్స అందించాల్సి ఉందన్నారు. అయోడిన్ సమపాళ్లలో కలిసిన ఆహారం తీసుకోవాలన్నారు. అయోడిన్ లోపాన్ని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని, ఇప్పటికే అన్ని పిహెచ్‌సిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అయోడిన్ కలిపిన ఉప్పు వాడకం వల్ల ఈ రుగ్మతలను అధిగమించవచ్చన్నారు. అయోడైజ్డ్ ఉప్పు వాడకంపై కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. అయోడిన్‌లోపం అధిగమించేందుకు ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందన్నారు. ఈ సదస్సులో జిల్లా అదనపు డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ పద్మజారాణి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి వీరభద్రరావు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్, హెల్త్ ఎడ్యుకేటర్లు జి నరేంద్రశేషు, పేరయ్య, తహసీల్దార్ జివివి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, మున్సిపల్ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి వి అమరావతి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు అభివృద్ధిలో కమిషనర్ కృషి అభినందనీయం
-ఎమ్మెల్యే బడేటి
ఏలూరు, అక్టోబర్ 21: అభివృద్ధిలో రాష్ట్రంలో ఏలూరు నగరాన్ని గర్వించదగ్గ స్థానంలో ఉంచడంలో కమిషనర్ వై సాయి శ్రీకాంత్ కృషి అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రాత్రి రాజమండ్రి రీజనల్ డైరెక్టరుగా వెళుతున్న కమిషనర్ వై సాయి శ్రీకాంత్‌కు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిపాలనలో ఎంతో అనుభవం గడించిన శ్రీకాంత్ ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా, స్మార్ట్ నగరంగా రూపుదిద్దారన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో కౌన్సిల్, అధికారులు, పురపాలక శాఖ మధ్య మంచి సమన్వయాన్ని తీసుకుని సాయి శ్రీకాంత్ ముందుకు వెళ్లారన్నారు. తన పరిపాలనా అనుభవంతో అందరినీ కలుపుకుని నగర అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. వచ్చే జనవరిలో పదవీ విరమణ పొందుతున్న సాయి శ్రీకాంత్‌కు అన్ని వేళలా శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుని ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా ముందుకు తీసుకెళ్లడంలో శ్రీకాంత్ మంచి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా సాయి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతంగా పేర్కొంటూ ఏలూరు నగరాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదన్నారు. నగరంలో ఎల్‌ఇడి బల్బులు అమరికలో నూరుశాతం లక్ష్యం సాధించడం, 13వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగించడంలో, 14వ ఆర్ధిక సంఘం నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ నూర్జహాన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, డిప్యూటీ మేయర్ పోతురాజు, విప్ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం తదితరులు దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నగర కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నాయుడు పోతురాజు, విప్ గూడవల్లి శ్రీనివాస్, సిటీ డిజైనర్ మోటేపల్లి చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, డిప్యూటీ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సూర్యారావు, మున్సిపల్ ఇంజనీరు కొండలరావు, ప్రజా ఆరోగ్య సంస్థ ఎస్ ఇ సుబ్బారావుతోపాటుపలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కారం
అత్తిలి, అక్టోబర్ 21: గ్రామాల్లోని ప్రధాన సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని మంచిలి గ్రామంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని పాటిమీద, అయ్యప్ప కాలనీ, ఎన్టీఆర్ కాలనీలలో రోడ్లు, డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కేతా సత్యనారాయణ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, సర్పంచ్ మల్లిపూడి సూర్యారావు, నాయకులు కందుల సత్యనారాయణ, ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, అరవా అబ్బులు, పూతినీడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో చోరీ
భీమడోలు, అక్టోబర్ 21: భీమడోలు గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో శనివారం తెల్లవారుఝామున చోరీ జరిగింది. 27 కిలోల స్వామివారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆలయ కమిటీ కార్యదర్శి ఎం లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏలూరు డి ఎస్‌పి ఈశ్వరరావు ఆలయాన్ని సందర్శించారు. భీమడోలు సి ఐ నాయక్ పర్యవేక్షణలో ఎస్ ఐ శ్రీరామ గంగాధర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఈ విధంగా వున్నాయి. స్వామివారి ఆలయం శుక్రవారం రాత్రి మూసిన తరువాత శనివారం ఉదయం కమిటీ కార్యదర్శి తెల్లవారుఝామున 5 గంటలకు సందర్శించారు. తాళం తీసి ఉండటం గమనించి తలుపులు తెరవగా స్వామివారి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. 18 కిలోల బరువు వున్న వెండి మకర తోరణం, వెండి సింహాసనం, రెండు సింహాలతోపాటు స్వామివారి వెండి కిరీటం, వెండి పాదుకలు, వెండి గొడుగు, అభిషేకం బిందె, శటారిలు చోరీకి గురైనట్లు గుర్తించారు. భీమడోలు పోలీసులు సమాచారం అందుకుని క్లూస్‌టీమ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వేలిముద్రలను సేకరించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జడ్పీటిసి పెద్దిరాజు, ఎంపిటిసి ఎస్ ఎస్ గిరి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణలు ఆలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.