పశ్చిమగోదావరి

నిర్వాసితుల తరలింపులో అవినీతికి తావులేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 22: పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన నిర్వాసితుల తరలింపులో అవినీతికి ఎక్కడా తావివ్వలేదని, చట్టప్రకారమే తరలింపులు, వాటికి బిల్లుల చెల్లింపులు జరిగినట్టు ఆర్డీవో ఎస్ లవన్న స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే పూర్తిచేయడమే లక్ష్యంగా తొలివిడత ఎనిమిది నిర్వాసిత గ్రామాలలోని 2,584 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించామని చెప్పారు. తరలింపులో జాప్యం జరిగితే స్పిల్‌వే నిర్మాణం ఆలస్యమై ఆధునిక యంత్ర పరికరాలు సైతం ఖాళీగా ఉండే పరిస్థితి రాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత చట్టం ప్రకారం నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించినట్టు చెప్పారు. నిర్వాసితులను సకాలంలో తరలించి, ప్రాజెక్టు నిర్మాణ పనులకు మార్గం సుగమం చేసామన్నారు. నిర్వాసితుల తరలింపునకు కుటుంబానికి రూ.5వేలు చొప్పున రూ.1.29 కోట్లు ఖర్చవుతుందని, కానీ తాము కేవలం రూ.1.15 కోట్లు మాత్రమే ఖర్చుచేసి, రూ.14 లక్షలు ప్రభుత్వ ధనం ఆదా చేసినట్టు వివరించారు. తరలింపునకు ప్రయివేటు వాహనాలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, ఆటోలు, లారీలు ఉపయోగించినట్టు తెలిపారు. గృహ సామాన్లు పాడయిపోతాయనే ఉద్దేశ్యంతో వారి కోరిక మేరకు ప్రయివేటు వాహనాలలో తరలించామని చెప్పారు. ఇండ్లు తొలగించిన దూలాలు, వాసాలు వంటివి మాత్రం కాంట్రాక్టర్‌కు చెందిన వాహనాల్లో ఉచితంగా తరలించినట్టు వివరించారు. తరలింపు సమయంలో వాహనాల చెల్లింపులు, భోజనాలు, టిప్‌టాప్ సామాన్లు, హమాలీలు, ఫోటోగ్రాఫర్ల ఖర్చులు కలిపి రూ.1.15 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఆర్‌అండ్‌ఆర్ అధికారిగా తాను ఎటువంటి తప్పుచేయలేదని స్పష్టం చేశారు. ఎన్నో కష్టాలకోర్చి, ఎండనకా, వాననకా, రేయింబవళ్లు కష్టపడి నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించి, నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలిస్తే తమపై కొంత మంది లేనిపోని నీఛమైన ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఒకరిద్దరు స్వార్థపరులు పనిగట్టుకుని ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసారని, దీనిపై ఎసిబి డిఎస్పీ విచారణ చేపట్టగా, తాము రికార్డులు అందజేసి, పూర్తి సహాయ సహకారాలు అందించామని చెప్పారు. తాము ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఎటువంటి దొంగ బిల్లులు పెట్టలేదని స్పష్టం చేసారు. గ్రామాలు ఖాళీ చేసేందుకు నిర్వాసితులు చేసిన సహకారం మరువలేనిదన్నారు. ఎవరో పెట్టిన ఫిర్యాదు వల్ల విచారణ ఎదుర్కొంటున్నాము తప్ప అవినీతి జరిగింది లేదన్నారు. అవినీతికి పాల్పడి ఉంటే ఎసిబి విచారణలో తేటతెల్లమవుతుందన్నారు. నిర్వాసితుల తరపున సింగన్నపల్లి, రామయ్యపేట, పైడిపాకలకు చెందిన నిర్వాసిత ప్రతినిధులు ఉక్కుసూది పోసిబాబు, మాల్చి పోశమ్మ, మడకం సత్యవతి, కొవ్వాసు కన్నమ్మ, కాట్రాజుల నాగేశ్వరరావు, మాగాపు బాలమ్మ తదితరులు తమ కుటుంబ సామాన్లు ప్రయివేటు వాహనాల్లో తరలించారని, ఒక్కో కుటుంబానికి నాలుగు ట్రిప్పులు తోలిన సందర్భాలు ఉన్నాయన్నారు. తమ ఇళ్లు తొలగించిన తరువాత దూలాలు, వాసాలు మాత్రమే కాంట్రాక్టర్ వాహనాల్లో తరలించినట్టు వివరించారు. కాగా చౌకడిపో దుకాణదారుడిని రెవెన్యూ అధికారులు బెదిరించి సంతకాలు చేయించినట్టు వచ్చిన ఆరోపణల్లో కూడా వాస్తవం లేదని చౌకడిపో డీలర్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు పి అన్వర్‌బాషా వివరణ ఇచ్చారు. ఇటీవల కాలంలో చౌకడిపో డీలర్లు రోడ్డున పడ్డారని, ఈ పరిస్థితులలో రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చే ప్రశే్న తలెత్తదన్నారు. సమావేశంలో పోలవరం తహసీల్దార్ మేరుగ ముక్కంటి, ఆర్డీవో కార్యాలయ డిటి పసుమర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.