పశ్చిమగోదావరి

మళ్లీ మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, అక్టోబర్ 22: 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోనుందని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కెఎస్ జవహర్‌లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినదించారు. ఆదివారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిధులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ 2014లో పశ్చిమ జిల్లా వాసులు తెలుగుదేశం పార్టీపై చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. ప్రజలు ఇచ్చిన బలంతో మూడున్నర తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి సమ న్యాయం చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రజల కష్టాలు తెలిసిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జిల్లాపై ఉన్న ప్రత్యేక అభిమానంతో అడగకుండానే అన్నివరాలు ఇస్తున్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరికైన వశిష్ట వంతెన నిర్మించేంత వరకూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే నరసాపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రూ.463 కోట్లతో అభివృద్ధి చేశాని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే దళితులు, బిసిలకు న్యాయం జరిగిందన్నారు. గతంలో సామాజికంగా బలంగా ఉన్నవారికే పదవులు దక్కేవన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులు, వెనుకబడిన వర్గాలను ప్రోత్సహిస్తూ పదవులు కట్టబెడుతున్నారన్నారు. వీటితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలూ కృషి చేస్తున్నారని మంత్రి జవహర్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యురాలు, టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజలకు పార్టీపై మరింత మమకారం పెరిగిందన్నారు. మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి విదేశీ పర్యటన చేస్తుంటే వైసిపి విమర్శించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎ రాధాకృష్ణ, వేటుకూరి శివరామ రాజు, గన్ని వీరాంజనేయులు, ఎం వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఎంఎ షరీఫ్, అంగర రామ్మోహనరావు, వర్మ, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, డిసిసిబి ఛైర్మన్ రత్నం, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పాలి ప్రసాద్, టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, కొక్కిరిగడ్డ జయరాజు, అంబిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి
*ఎక్సయిజ్ శాఖ మంత్రి జవహర్
కొవ్వూరు, అక్టోబర్ 22: రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఘన వ్యర్థాల నిర్వాహణ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ద్వారా గ్రామాలను తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కేంద్రం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు పార్కులు అభివృద్ధి చేయాలన్నారు. కొవ్వూరు మండలంలోని 16 గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ వేగి చిన్న, తహసీల్దారు కె విజయకుమార్, ఎంపిడిఒ ఎ రాము తదితరులు పాల్గొన్నారు.
పంచారామాలకు 15 బస్సులు
- ఆర్‌ఎం ధనుంజయరావు
ఏలూరు, అక్టోబర్ 22 : కార్తీకమాసంలోని సోమవారం రోజున పంచారామాలను భక్తులు దర్శించుకునేందుకు గాను జిల్లాలోని 7 డిపోల నుంచి 12 బస్సులను పంపినట్లు సంబంధిత ఆర్ ఎం ఎస్ ధనుంజయరావు తెలిపారు. ఆదివారం రాత్రి ఈ బస్సులు బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఏలూరు డిపో నుంచి 2 బస్సులు, భీమవరం నుంచి 3, నర్సాపురం నుంచి 1, తాడేపల్లిగూడెం నుంచి 1, తణుకు నుంచి 2, కొవ్వూరు నుంచి 1, జంగారెడ్డిగూడెం నుంచి రెండు బస్సులు పంచారామాలకు వెళ్లినట్లు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో వెళ్లిన భక్తులు అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని ద్రాక్షారామం, సామర్లకోటలోని భీమారామం ఆలయాలను సోమవారం సందర్శించుకుంటారని, సోమవారం రాత్రికి తిరిగి బయలుదేరిన స్థలాలకు బస్సులు చేరుకుంటాయన్నారు. దీపావళి సెలవులు ముగిసిన నేపధ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు 15 ప్రత్యేక సర్వీసులను పంపినట్లు ఆర్ ఎం ధనుంజయరావు వివరించారు.