పశ్చిమగోదావరి

కదలిక కనిపిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 22 : ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఒక రకమైన కదలిక స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికల సంరంభానికి సన్నాహంగా కొంతమంది రాజకీయ నాయకులు పేర్కొంటున్నా పరిస్థితి చూస్తే మాత్రం ఆలూ లేదు... చూలూ లేదు... కొడుకు పేరు ఏదో అన్న సామెత గుర్తుకురాక మానదు. అయితే అధిష్టానాల నుంచి ఏదో సంకేతం కనిపించడం వల్లే ఒక రకంగా చాలా పార్టీల్లో ఈ కదలిక కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీలో ఒక రకంగా, మిగిలిన పార్టీల్లో మరో రకంగా ఈ కదలిక గోచరిస్తోందనే చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడచిపోయింది. ఇక మిగిలింది రెండేళ్లు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికల వాదనను తెరపైకి తీసుకురావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా వుంటుందోనన్న చర్చ మొదలైంది. ఆ అంశాన్ని అలా ఉంచితే మరో రకమైన ప్రచారం కూడా విస్తృతంగానే సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వ్యవహారం కొలిక్కి వచ్చే తరుణంలో అధికార పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతుందన్నది ఒక అంశం. అదే జరిగితే 2018 నాటికి ఈ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏజెన్సీలను పరుగులు పెట్టిస్తుండటం తెలిసిందే. ఆ రకంగా చూస్తే 2018 నాటికి ఒక రకంగా ఎన్నికల వాతావరణం పూర్తిస్థాయిలో తెరపైకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వచ్చే నెల నుంచి ఆర్నెల్లపాటు పాదయాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండటం తెలిసిందే. ఆ నేపధ్యంలో పాదయాత్ర ఊపందుకుని రాజకీయంగా మార్పులను తీసుకువచ్చే పరిస్థితుల వరకు వేచి ఉండకూడదన్న వ్యూహం కూడా మరొకటి తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా ఏ రకంగా చూసినా 2018 నాటికి చాలా వరకు రాజకీయ వాతావరణం ఎన్నికల సన్నాహంతో వేడెక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశే్లషకులు భావిస్తున్నారు. ఇంకా మరో రెండు నెలలే మిగిలి ఉండటంతో ఇప్పటికే అన్ని పార్టీల్లోనూ దాదాపు ఇదే రకమైన ఊహాగానాల మధ్య రాజకీయ సందడి ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అధికార పార్టీలో ఈ వ్యవహారం కొంత అంతర్మధనం రీతిలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో పరిస్థితి చూస్తే మొత్తం 15 నియోజకవర్గాల్లోను టిడిపి, బిజెపి కూటమి పాగా వేయడం తెలిసిందే. కాగా ఈసారి కూడా అదే స్థాయి విజయం సాధ్యమవుతుందా అన్న అంశంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి సాగుతుందా లేక ఒంటరి పోరు తెరపైకి వస్తుందా అన్నది కూడా తేలాల్సి వుంది. మరో వైపు ప్రస్తుతం వున్న ప్రజా ప్రతినిధుల తీరు తెన్నులపై ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అధికార పార్టీలో కొంత ఆందోళనకు కారణమవుతోందన్న అంచనాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు మళ్లీ వ్యూహాలకు పదును పెడుతూ మరో వైపు అన్ని వర్గాలకు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. కాగా మళ్లీ అవకాశం ఎంత వరకు లభిస్తుందన్న అంశంపై కూడా అధిష్టానానికి చేరువగా వున్న నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తమ అవకాశాలను భేరీజు వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొంతమందికి మాత్రం దాదాపుగా ఇప్పుడే మొండిచేయి ఖాయమన్న సంకేతాలు వస్తుండటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీలో ప్రస్తుతం వున్న ఎమ్మెల్యేల్లో కొంతమందికి అవకాశాలు దక్కకపోవచ్చునన్న ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఆ స్థానం భర్తీ చేసేందుకు మరికొందరు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడినట్లు చెబుతున్నారు. ఆ రకంగా అధికార పార్టీలో వ్యవహారాలు సాగుతుంటే ప్రతిపక్షంలోనూ దాదాపుగా ఇదే రీతిలో కదలికలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్న వారికే ఈ సారి టికెట్ లభిస్తుందా? లేక కొత్త వారిని తెరపైకి తీసుకువస్తారా అన్న సందేహాలు నేతలను చుట్టుముట్టాయి. మరోవైపు ఇప్పుడున్న ఇన్‌ఛార్జులు కూడా ఇంతకాలం స్తబ్ధుగా ఉండిపోయినా ఇప్పుడు తమకున్న శక్తియుక్తులు, వర్గాలతో వున్న పరిచయాలను వెలికితీసి వాటికి పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక కొత్తగా వస్తున్న జనసేన పార్టీలో ఇప్పటికే కదలిక మొదలైంది. అయితే నాయకుల విషయం మాత్రం ఈ పార్టీలో ఇప్పటికీ ఒక కొలిక్కిరాని పరిస్థితే కనిపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలో కొంత చురుగ్గా వున్న ద్వితీయ శ్రేణి నేతలపై ఈ పార్టీ కన్ను వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా అన్ని పార్టీల్లోనూ రాజకీయ హడావిడి కొంత కనిపిస్తోంది. ఇదే సమయంలో అన్ని పార్టీల నేతలు కుల సంఘాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కులాల ప్రభావం మరింత అధికంగా కనిపిస్తున్న తరుణంలో ఈ సంఘాలను ముందుగానే ప్రసన్నం చేసుకుంటే కొంత భరోసా ఉంటుందన్న ఉద్దేశ్యంలో నేతలు వున్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా అన్ని పార్టీల్లోనూ రాజకీయ కదలిక గట్టిగానే కనిపిస్తోందని చెప్పాలి.
ఇంటింటికి టిడిపిలో జిల్లాకు రెండోస్థానం
*మంత్రి ప్రత్తిపాటి

భీమవరం, అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునందుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశంలో పశ్చిమ గోదావరి జిల్లా రెండోస్థానంలో ఉందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఉంగుటూరు నియోజకవర్గం, పోలవరం, నిడదవోలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. నరసాపురంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముందు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీనాయకులు పలు అంశాలు ఉంచారు. జిల్లాలోని ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయని, వాటి కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సుమారు రూ.80 కోట్లు మేర పనులు చేయ్యాల్సి వస్తోందన్నారు. అదే విధంగా పంచాయతీల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సిసి రహదారుల నిర్మాణాలు పూర్తి చేశామని, కొంతమేర మాత్రమే ఇంకా చేయాల్సి ఉందన్నారు. ప్రధానంగా ఆర్‌అండ్‌బి రహదారులపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేలు సూచించారు. ప్రధాన రహదారులపై దృష్టిసారిస్తే మరింత అభివృద్ధి చేసిన వాళ్లమవుతామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన నేపధ్యంలో జిల్లాకు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి 200 పడకలతో కేటాయిస్తామని ప్రకటించారని, భీమవరం లేదా తాడేపల్లిగూడెంనకు ఈ ఆసుపత్రిని కేటాయించాలని సూచించారు. మరి కొన్ని అంశాలపై చర్చించారు. ఈ సారి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తామని కమిటీ ప్రకటించింది.