పశ్చిమగోదావరి

ఆధ్యాత్మిక భావనలతోనే సమాజాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, నవంబర్17: ఆధ్యాత్మిక భావనలతోనే సమాజాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన లక్ష దీపోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణి ఆధ్యాత్మిక ప్రసంగాన్ని, శివ తత్వంపై ఆయన పాడిన పాటలను మంత్రి పైడికొండల ఆసాంతం ఆస్వాదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ధార్మిక కార్యక్రమాలు విరివిగా జరగాలని, కార్తిక మాసంలో భక్తిప్రపత్తులతో లక్ష దీపోత్సవం వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం సాహసోపేతమని అన్నారు. ఆలయాలలో ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం కూడా ఇతోధికంగా సహకరిస్తుందన్నారు. మాధవసేవతోపాటు మానవసేవ కూడా చేయాలన్నారు. వీరంపాలెం శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకట రమణ సిద్ధాంతి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసారని, అందువల్లే కార్యక్రమం విజయవంతమైందన్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న మహిళలను అభినందించారు. కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకువచ్చిన పాలపర్తి శ్రీనివాస్, రాజాన పండు తదితరులను అభినందించారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ సమాజంలో ధర్మం పెంపొందాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లక్ష దీపోత్సవం నిర్వహించిన వారిని అభినందించారు. అనంతరం తనికెళ్ల భరణిని లక్ష దీపోత్సవ కమిటీ తరపున దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, డీసీసీబీ మజీ ఛైర్మన్ కరాటం రాంబాబులు సత్కరించారు. తనికెళ్ల భరణితోపాటు వీణాపాణి, ఆయన కుమారుడు, శిష్య బృందాన్ని కమిటీ సత్కరించింది. కార్యక్రమంలో శ్రీ మద్ది దేవస్థానం ఛైర్మన్ యిందుకూరి రంగరాజు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, మహాత్మా ఫూలే అవార్డు గ్రహీత డీకేడీ సత్యనారాయణ, డాక్టర్ టీ కేశవరావు, కర్పూరం నారాయణరావు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, పలు దేవస్థానాల ఛైర్మన్లు, ఈఓలు పాల్గొన్నారు.
దివ్యాత్మ స్వరూపమే ఆత్మజ్యోతి: తనికెళ్ల భరణి
సర్వం శివమయమని, దివ్యాత్మ స్వరూపమే ఆత్మజ్యోతి అని అది తెలుసుకుని ప్రవర్తించడమే లక్ష దీపోత్సవ అంతరార్థమని సినీ నటుడు, శివతత్వవేత్త తనికెళ్ళ భరణి అన్నారు. పట్టణంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న లక్ష దీపోత్సంలో శుక్రవారం రాత్రి ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. శివతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలమేమోగాని పూర్తిగా అందుకోలేమని చెప్పారు. శివానుగ్రహాన్ని అత్యంత సులభసాధ్యంగా సాధన ద్వారా అందుకోవచ్చని భోళా శంకరుడు, భక్త వరదుడు, అభయప్రదాత తెలియజేసాడని అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు సగం శక్తి ఉందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడుతున్నది కేవలం మహిళలేనన్నారు. పరమశివుడు పార్వతికి అర్థశరీరాన్నిచ్చి అర్థనారీశ్వరుడయాడని అన్నారు. అనంతరం శివనామస్మరణ మధ్య భక్తుల జయజయ నినాదాలతో వేద మంత్రోఛ్ఛారణల మధ్య కైలాస ప్రస్తార జ్యోతిర్లింగార్చన అనంతరం సామూహిక లక్షదీప ప్రజ్వలన జరిగింది. మహదాశీర్వచనం అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేసారు.
తిమ్మాపురంలో పాల పోటీలు
ద్వారకాతిరుమల, నవంబర్ 17: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్థక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని తిమ్మాపురంలో శుక్రవారం దేశీయ జాతీయ గేదెలు, ఆవుల పాల పోటీలను నిర్వహించారు. అలాగే లేగ దూడల అందాల పోటీలను నిర్వహించి, గెలుపొందిన పశువుల యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ద్వారకాతిరుమల, భీమడోలు మండలాలకు చెందిన రైతులు తమ పశువులను తీసుకువచ్చారు. పొదువులు ఖాళీచేసిన పశువుల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వాహకులు పాలను సేకరించారు. ఇందులో తిరుమలంపాలెంకు చెందిన రైతు బొప్పన వీరరాఘవులుకు చెందిన ఒంగోలు జాతి ఆవు అధిక పాలను ఇచ్చి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. అలాగే శ్రీవారి దేవస్థానానికి చెందిన కాంక్రీడు జాతి ఆవు ద్వితీయ బహుమతిని, తిమ్మాపురానికి చెందిన రైతు వీర్రాజుకు చెందిన ముర్రా జాతి గేదె అధిక పాలనిచ్చి ప్రథమ స్థానాన్ని, తిరుమలంపాలెంకు చెందిన రైతు ఆర్ నాగరాజుకు చెందిన గేదె ద్వితీయ బహుమతిని సాధించాయి. అనంతరం లేగ దూడల అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ అధికారులు, రైతులు, పశువైద్యులు పాల్గొన్నారు.