పశ్చిమగోదావరి

ఇ-పోస్‌తోనే పన్ను వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 17 : ఇక నుంచి జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో పన్ను వసూళ్లు అన్నీ ఇ-పోస్ యంత్రాల ద్వారానే జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. అంతేకాకుండా ఉపాధి హామీ పధకం కింద కార్మికులకు వేతనాలు చెల్లింపు కూడా ఇ-పోస్ మిషన్ల ద్వారానే జరగాలని పేర్కొన్నారు. దీని నిమిత్తం హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంకు ద్వారా ఇ-పోస్ మిషన్లను సమకూరుస్తున్నామని చెప్పారు. ఇంటి పన్నుల వసూళ్లు ఇ-పోస్ మిషన్ల ద్వారా చేయకపోతే అక్కడ అవకతవకలకు పాల్పడుతున్నట్లు పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీల ప్రగతి, పన్నుల వసూళ్ల తీరు, ఇతర అంశాలపై ఇవో పి ఆర్‌డిలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-పోస్ ద్వారా పన్నులు చెల్లించే విషయంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, దీనిలో భాగంగా ప్రతీ గ్రామంలోని ముఖ్య కూడళ్లలో సంబంధిత సమాచారం తెలిపే బోర్డులు కనీసం నాలుగు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాలో ఇంత వరకు 43.46 లక్షల రూపాయలు నగదురూపంలో పన్నులు వసూలు చేశారని చెప్పారు. నగదు రూపంలో వసూలు చేయడం వలన అనేక అవకతవకలకు పాల్పడే అవకాశం వుంటుందని చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 8 నెలలు గడచినా పన్ను వసూళ్లలో జిల్లా సగటు 17 శాతం మాత్రమే వుందన్నారు. పన్ను వసూళ్లపై ఇప్పటి నుంచి దృష్టి సారించి మార్చి నెలాఖరు నాటికి నూరుశాతం పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌గా దీన్ని నిర్వహించాలన్నారు. ఈ విషయంలో సంబంధిత డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవోపి ఆర్‌డిలు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. జిల్లాలో అన్ని గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాలోని అన్ని గ్రామాలు చెత్తరహితంగా మారాలని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ఈ విషయంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. వచ్చే మార్చి నాటికి ప్రతీ పల్లె పరిశుభ్రంగా వుండాల్సిందేనని, ఈ విషయాన్ని సంబంధిత కార్యదర్శి, ఇవో పి ఆర్‌డిలు ప్రతీ రోజూ పర్యవేక్షించాలన్నారు. ప్రతీ గ్రామంలో ఇంటింటా చెత్త సేకరించేందుకు వాహనాలను సమకూరుస్తామన్నారు. దీనిలో భాగంగా ఎస్‌సి, బిసి, కాపు, క్రిస్టియన్ కార్పొరేషన్లు, మైనార్టీ, ట్రైకార్ ద్వారా 470 మంది లబ్ధిదారులకు చెత్త సేకరించే వాహనాలను అందించేందుకు డాక్యుమెంటేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేసి బ్యాంకులో ఖాతాలు తెరిపించాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయితీల్లో బయోమెట్రిక్ హాజరు విధిగా జరగాల్సిందేనన్నారు. తాళ్లపూడిలో 98 శాతం, గోపాలపురంలో 82 శాతం జరుగుతున్నప్పుడు మిగిలిన చోట్ల ఎందుకు నమోదు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయితీల్లో 80 శాతం కన్నా తక్కువ బయోమెట్రిక్ హాజరు నమోదైన వారి నుంచి సంజాయిషీ కోరాలని డిపివోను కలెక్టర్ ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరువేయకపోతే సంబంధిత అధికారి గానీ, సిబ్బంది గానీ విధుల్లో లేనట్లే భావించాల్సి వుంటుందన్నారు. జీతాల బిల్లులను ఆధార్, బయోమెట్రిక్ హాజరు సమాచారంతో ట్రెజరీకి సమర్పించాలని ఆదేశించారు. పంచాయితీల ద్వారా భవన నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఇచ్చే విషయంపై బిల్డింగ్ ప్లాన్, లే అవుట్లు ఏ విధంగా ఆమోదించాలనే అంశంపై సంబంధిత నిపుణులతో శిక్షణ అందించాలని కలెక్టర్ చెప్పారు. లైసెన్సుడు సర్వేయర్లతో నిమిత్తం లేకుండా భవన యజమానే స్వీయ భవన ప్లాన్‌ను సమర్పించే రీతిలో సాఫ్ట్‌వేర్ రూపొందించాలన్నారు. గ్రామాల్లో రెండేళ్లు అవుతున్నా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లు నిర్మించకపోవడం బాధ్యతారాహిత్యమేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ షెడ్లు నిర్మించకపోతే సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇంత వరకు కేవలం 160 పంచాయితీల్లో మాత్రమే షెడ్లు నిర్మించారని, మిగిలిన చోట్ల నిర్మాణం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో బాగా పెండింగ్‌లో వున్న 12 మంది ఇవో పి ఆర్‌డిలను సంజాయిషీ కోరాలని డిపివోను ఆదేశించారు. వారం వారం సమీక్షిస్తున్నా ఫలితాలు రావడం లేదని, దేనికైనా ఓపిక పట్టడానికి ఒక హద్దు వుంటుందని చెప్పారు. విధి నిర్వహణలో చాలా కష్టపడిపోతున్నామనే భావన చాలామందిలో వుందని, నిజంగా కష్టపడితే పనుల్లో ప్రగతి ఎందుకు కనిపించడం లేదన్నారు. పనిచేయాలనే శ్రద్ధ వుంటే ఏ పనులైనా సజావుగా ముందుకు సాగుతాయని చెప్పారు. గ్రామ పంచాయితీల్లో ఇకపై అన్ని కార్యకలాపాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 756 పంచాయితీల్లో దీనికి సంబంధించిన పనులు పూర్తికాగా మరో 153 పంచాయితీల్లో పూర్తికావాల్సి వుందన్నారు. మీ-సేవ కింద అన్ని గ్రామ పంచాయితీల్లో 74 వేల దరఖాస్తులు పరిష్కారం కాలేదని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల్లో ఫిర్యాదుదారుని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్లు లేకపోతే వాటిని తిరస్కరించాలన్నారు. ఫోన్ నెంబరు గానీ, చిరునామా గానీ ఉంటే వారితో సంప్రదించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్, డిపివో ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రూ. 290 కోట్లతో కొవ్వూరు అభివృద్ధి
*ఎక్సయిజ్ శాఖ మంత్రి జవహర్
కొవ్వూరు, నవంబర్ 17: కొవ్వూరు పట్టణాన్ని 290 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మంత్రి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితవాడల్లో పది కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ వేగి చిన్న, టీడీపీ నాయకులు జెవిఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
‘పోలవరం’ సందర్శించిన రైతు బృందం
* నిధుల వ్యయం, పనితీరును తెలుసుకున్న రైతులు

భీమవరం, నవంబర్ 17: బహుళార్థక ప్రాజెక్టుగా పేరొందిన పోలవరం ప్రాజెక్టులో రైతు బృందం శుక్రవారం పర్యటించింది. జిల్లాలోని డెల్టా రైతాంగం రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ సమితి అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు నేతృత్వంలో పర్యటించింది. భీమవరం కార్లు, బస్సులో ముఖ్యమైన రైతు నాయకుల బృందం పయనమైంది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జలవనరుల శాఖ అధికారులను కోరగా సుమారు రెండు గంటలపాటు వారు వీడియో టేపుల ద్వారా టెలికాస్ట్ చేసి పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ ప్రాజెక్టుపై ఎంత విశ్వసనీయతతో పనిచేస్తున్నారో వారు రైతుల బృందానికి వివరించారు. కాఫర్ డ్యాం, ప్రాజెక్టు తదితర వాటి గురించి అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాఫర్ డ్యాం అంటే కాపర్‌తో నిర్మితమవుతోందన్న అపోహలు ఉన్నాయని చెప్పగా అటువంటిది ఏమీలేదని, అసలైన ప్రాజెక్టుకు ముందు తాత్కాలికంగా ఏర్పాటుచేసేది కాఫర్ డ్యాం అని వారు ఈ బృందానికి వివరించారు. అదే విధంగా అసలు గోదావరి మీద పోలవరం ప్రాజెక్టును ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తారు, దాని వైశాల్యం ఎంత తదితర వివరాలను తెలుసుకున్నారు. జలవనరుల శాఖలోని సీనియర్ అధికారులు సమగ్రంగా వారికి పోలవరం ప్రాజెక్టు గురించి వివరిస్తూ, గ్రావిటిపై 2019 నాటికన్నా ముందే ఏ విధంగా నీటిని అందివ్వడం జరుగుతుందో, ప్రతీ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల తీరును ఎలా పరిశీలిస్తున్నారో తెలిపారు. ప్రపంచంలో అత్యంత గొప్పదైనదీ, భారతదేశంలో ఆఖరిది ఈ పోలవరం ప్రాజెక్టు అని తెలిపారు. కోట్లాది రూపాయల వ్యయంతో బెకమ్ అనే జర్మనీ కంపెనీతోపాటు పనిచేసే యంత్రాలు చైనా, జపాన్ కన్నా అత్యుత్తమమైనవిగా వివరించారు. నిధుల వ్యయం, పనితీరు గురించి ఆరా తీశారు. వాటి పనితీరు ఏ విధంగా గత మూడేళ్లుగా జరుగుతున్న పనినిబట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు. ఖచ్చితంగా పోలవరం జీవనాడి అని, గోదావరి జిల్లాల్లోని రైతులు ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఏడున్నర లక్షల ఎకరాలకే కాకుండా మరిన్ని లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రైతు బృందంలో నేతలు గాదిరాజు సుబ్బరాజు, ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్ పాతపాటి మురళీరామరాజు, లంకా కృష్ణమూర్తి, గాదిరాజు నాగేశ్వరరాజు తదితరులు వారికి ఉన్న అనుమానాలను ఇంజినీర్లను అడిగి నివృత్తి చేసుకున్నారు. వడ్డీ సుబ్బారావు, జంపన ఫణి, కలిదిండి గోపాలకృష్ణంరాజు తదితర రైతులు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు.