పశ్చిమగోదావరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 19 : ప్రధాని మోడీ, ఎపి సి ఎం చంద్రబాబులు అనుసరిస్తున్న విధానాల వలన ప్రజల్లో రోజురోజుకూ ప్రభుత్వాలపై అసంతృప్తి పెరుగుతోందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిపి ఎం శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శనివారపుపేటలోని సారధి గార్డెన్స్‌లో సిపి ఎం 24వ జిల్లా మహాసభలు 2వ రోజు ముఖ్య అతిధిగా మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశ రాజకీయాల్లో సరళీకరణ విధానాలకు ప్రతిఘటన మొదలైందన్నారు. ఉద్యమాలకు ఇది అనుకూలమైన సమయమని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్ధిక విధానాలు మొదటిలో చాలా మందికి అనుకూలంగా వ్యవహరించారని, ప్రపంచీకరణ విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా దేశంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిందన్నారు. అణచివేత జరుగుతోందని, ఫలితంగా ప్రపంచీకరణ విధానాన్ని తిప్పికొట్టేందుకు ప్రజా వ్యతిరేకత వస్తోందని పేర్కొన్నారు. వెనుకబడిన దేశాల నుంచి అమెరికా వ్యతిరేక దేశాలకు ఉపాధి కోసం వెళ్లడంతో అక్కడి కార్మికులు వేతనాలు తగ్గడంతోపాటు నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రపంచీకరణను ప్రోత్సహించిన దేశాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్నారు. దేశంలో మోడీ సరళీకరణ విధానాల వలన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు వచ్చినప్పటికీ దేశ ఆర్ధిక వ్యవస్థలో మార్పు తీసుకురాలేకపోయిందన్నారు. ఎన్నికల సమయంలో మోడీ ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతీ ఖాతాలో 17 లక్షల రూపాయలు జమ చేస్తామన్నది, నల్లడబ్బు తీసుకువస్తామన్నది అమలు చేయలేకపోయారన్నారు. వాటిని మరిపించేందుకు జి ఎస్‌టి, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను తీసుకువచ్చినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఈ ఫలితంగా చేతివృత్తులు, వౌలిక పరిశ్రమలు, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. పరిశ్రమల్లో గతంలో పర్మినెంట్ ఉద్యోగి మాత్రమే వుండేవారని, ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరుతో కార్మిక శ్రమకు విలువ తగ్గిందన్నారు. విశాఖలోని ఉక్కు ఫ్యాక్టరీలో పాత టెక్నాలజీతో, పది వేల మంది కార్మికులతో రోజుకు అయిదు వేల టన్నులు ఉత్పత్తి చేసేవారన్నారు. కొత్త టెక్నాలజీ వచ్చిన తరువాత కార్మికుల సంఖ్య తగ్గిందే తప్ప అదే ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఏ రంగంలో చూసినా సరళీకరణ విధానాలతో కార్మిక వ్యతిరేకత మొదలైందన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో జరిగిన ఉద్యమాలు జిల్లా స్వరూపానే మార్చేవిగా సాగాయని అభినందించారు. ఏజెన్సీలో జరిగిన గిరిజన ఉద్యమం, తుందుర్రులో జరిగిన కాలుష్యంపై పోరాటం, గరగపర్రులో జరిగిన దళిత సామాజిక సమస్యలపై జరిగిన పోరాటాల్లో జిల్లాలో సిపి ఎం ముఖ్య పాత్ర వహించడం ద్వారా తన బలాన్ని పెంచుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా కేసులు బనాయించి అరెస్టులు చేసి జైళ్లల్లో నిర్బంధించినా ప్రజలు ధైర్యంగా పోరాడటం అభినందనీయమన్నారు. మహాసభల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎంపి, సిపి ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడియం బాబూరావు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న బిజెపి మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కులపై బిజెపి దాడి చేస్తోందని అన్నారు. గో సంరక్షణ, గొడ్డుమాంసం పేరుతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం జి ఎస్‌టి పేరుతో మోయలేని భారాలు మోపిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక చర్యలపై సిపి ఎం పోరాడుతోందని స్పష్టం చేశారు. మహాసభల్లో సిపి ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి ఉమామహేశ్వరరావు, కమిటీ సభ్యులు మంతెన సీతారామ్, సీనియర్ నేత ఆర్ సత్యనారాయణరాజు, జిల్లా కార్యదర్శి బి బలరామ్, జిల్లా నాయకులు చింతకాయల బాబూరావు, బి వాసుదేవరావు, జి విజయలక్ష్మి, డి రామకృష్ణ, పి రామకృష్ణ, జుత్తిగ నరసింహమూర్తి, కె రాజారామ్మోహన్‌రాయ్, గుడిపాటి నరసింహారావు, గోపాలన్, శ్రీనివాస్, ఎ రవి, కేతా గోపాలన్, డి ఎన్‌విడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ

భీమవరం, నవంబర్ 19: రాష్ట్రంలోనే అత్యధిక గృహాలను కేంద్ర ప్రభుత్వం భీమవరానికి ప్రకటించింది. 9500 ఇళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని అప్పటి నుంచి భీమవరం వాసులు మోదీ ఇళ్ళుగా పిలుచుకుంటున్నారు. ఈ ఇళ్ళను ఆదివారం పురపాలక శాఖా మంత్రి డాక్టర్ పి నారాయణ పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జి+3 పద్ధతిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లను పరిశీలించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, వైఎస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, కౌన్సిల్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శిలు తోట భోగయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యనిర్వాహక కార్యదర్శి మెంటే పార్థసారథి పాల్గొన్నారు. ఇళ్ళ నిర్మాణం తదితర వివరాలను మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావు మంత్రికి వివరించారు. అదేవిధంగా ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధుల బృందం ద్వారా మరిన్ని వివరాలను మంత్రికి కమిషనర్ తెలియచేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి దశలో ఇళ్ళను ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి పరిశీలించిన అనంతరం అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నామని, భూకంపాలు వచ్చినా తట్టుకుంటాయని అన్నారు. అనంతరం మంత్రి నారాయణకు ఎంపీ సీతారామలక్ష్మి మెమెంటో అందచేసి సత్కరించారు. జేసీ పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హోదాకోసం ‘చలో అసెంబ్లీ’

భీమవరం, నవంబర్ 19: ప్రత్యేక హోదా కోసం ‘్ఛలో అసెంబ్లీ’కి బీజేపీ, టీడీపీ మినహా పోరాడాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఆదివారం భీమవరంలోని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ‘అఖిల’ పేరిట సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గ్రంధి శ్రీనివాస్, ఉండి ఇన్‌ఛార్జి పీవీఎల్ నర్సింహరావు, చలసాని శ్రీనివాస్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ డాక్టర్ పీ రామకృష్ణంరాజు, సీపీఐ ఎం సీతారాంప్రసాద్, రైతు కార్యాచరణ సమితి నాయకులు లంకా కృష్ణమూర్తి, సమితి నాయకులు జీ సత్యనారాయణరాజు, మేళం దుర్గాప్రసాద్, రేవూరి గోగురాజు, కరీముల్లా భాష, అద్దంకి దొరబాబు తదితరులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 15 అంశాలపై ప్రశ్నిస్తూ లేఖలను పత్రికలకు విడుదల చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, హామీలు అమలు చెయ్యాల్సినవి, ఇచ్చిన హామీలు, ఉద్యోగాలు, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర తదితర అంశాల గురించి ప్రస్తావించారు. రానున్న రోజుల్లో హోదా కోసం మహోద్యమం చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో భీమవరం పరిసర ప్రాంతాల్లోని కొందరు నేతలను పోలీసులు హౌస్ అరెస్టుచేసినట్లు సమాచారం.