పశ్చిమగోదావరి

పూర్తయిన పోలవరం పునరావాసం, భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, డిసెంబర్ 14: జిల్లాలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస భూసేకరణ దాదాపుగా పూర్తయిందని కుకునూరు సబ్ కలెక్టర్, కెఆర్ పురం ఐటీడీఏ పీవో హరేందిరప్రసాద్ తెలిపారు. ఐటీడీఏ పీవో తన ఛాంబర్‌లో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం మండలంలోని ఎనిమిది గ్రామాల నిర్వాసితులకు ఎల్‌ఎన్‌డి పేట, చుట్టుపక్కల గ్రామాల్లో కాలనీలు నిర్మించి, లబ్ధిదారులకు అప్పగించామన్నారు. మరో 13 కాలనీల్లో 25 వేల ఇళ్ల నిర్మాణాలు మొదలవుతున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో గిరిజనేతర నిర్వాసితులకు 14 వేల ఇళ్లు, బుట్టాయగూడెం, కుకునూరు, జీలుగుమిల్లి మండలాల్లో గిరిజన నిర్వాసితులకు 11 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. 2018 జనవరి నుంచి ఇళ్ల నిర్మాణం మొదలై, 2018 జూన్ నెలాఖరుకు లబ్ధిదారులకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలవరం, కుకునూరు, వేలేరుపాడు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భూమికి భూమి, ఇళ్ల నిర్మాణం కోసం 10,700 ఎకరాలకు 9300 ఎకరాలు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో , మరో 1300 ఎకరాలు తాడువాయిలో సేకరించామని వివరించారు. ప్రాజెక్టు కారణంగా పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 41 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు తెలిపారు. దీనిలో అధిక భాగం అసైన్డ్ భూములుగా పేర్కొన్నారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో భూమికి భూమి కోసం 4475 ఎకరాలు, ఇళ్ల కోసం 2500 ఎకరాలు సేకరించామన్నారు. పట్టా భూములకు మాత్రమే భూమికి భూమి ఇచ్చామని, అసైన్డ్ భూములకు నగదు రూపంలో పరిహారం చెల్లించామన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీగా ఇప్పటికి రూ.2,380 కోట్లు ఖర్చుచేయగా, పోలవరం మండలంలోని 8 గ్రామాల నిర్వాసితులకు భూమికి భూమి, ఇళ్లు, ప్యాకేజీకి రూ.160 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు మాత్రమే ప్యాకేజీ అమలు జరుగుతుందని స్పష్టంచేశారు. భూసేకరణలో సొమ్ములు చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న సుమారు 153 కేసులలో చాలావరకు పరిష్కరించినట్లు చెప్పారు. ఇంకా సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్‌లు ఉన్నాయని తెలిపారు. ఎక్కౌంట్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్ల అనుసంధానం, జన్‌ధన్ ఖాతాలు, గ్రామీణ బ్యాంకు ఖాతాలు, తదితర అంశాల్లో వచ్చిన సాంకేతిక కారణాల వలన చెల్లింపులలో జాప్యం జరుగుతుందని పీవో వివరించారు.

చింతలపూడి కాలువ పనులు అడ్డుకున్న రైతులు
గోపాలపురం, డిసెంబర్ 14: చింతలపూడి కాలువ నిర్మాణ భూములకు న్యాయమైన నష్ట పరిహారం ఇచ్చే వరకూ పనులు చేపడితే సహించేది లేదని రైతులు హెచ్చరించారు. మండలంలోని కొవ్వూరుపాడు, భీమోలు, గుడ్డిగూడెం రెవెన్యూ పరిధిలోని భూముల్లో చింతలపూడి కాలువ నిర్మాణ పనులు చేబట్టనున్నారు. నష్టపరిహారం విషయంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో రైతులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. గురువారం గుత్తేదారులు రైతులకు చెందిన భూముల్లో పనులు చేపట్టగా బాధిత రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరెడ్డి, కొవ్వూరు డీటీ రామారావులతో మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ల కిందట గ్రామానికి చెందిన రైతుల పంట భూములకు ఎకరాకు రూ.26.5లక్షల వరకూ నష్టపరిహారం అందజేశారన్నారు. అయితే కాలువ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే సదుద్దేశ్యంతో తాము రూ.21.5 లక్షలకే అంగీకరించి, ఒప్పంద పత్రాలు రాసిచ్చినట్టు తెలిపారు. తీరా అవార్డు ప్రకటించగా కేవలం రూ.12.5లక్షలే ఎకరాకు ఇచ్చేలా అధికారులు చర్యలు చేబట్టి, తమను వంచించారన్నారు. న్యాయమైన నష్టపరిహారం ఇచ్చే వరకూ తమ పొలాల్లో పనులు చేస్తే ఊరుకునేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దీనిపై డీఈ, డీటీలు ఈ సమస్యను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లతామని బాధిత రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు పనులు నిలిపివేయాలని గుత్తేదారులకు తెలిపి ఆందోళన విరమించారు.

జీఎస్టీపై అవగాహనకు సేవా కేంద్రాలు
*జీఎస్టీ రాష్ట్ర కమిషనర్ శ్రీహరిరావు
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 14: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)పై వ్యాపారులకు నిరంతరం అవగాహన కల్పించేందుకు సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కస్టమ్స్ అండ్ సెట్రల్ ఎక్సైజ్, జిఎస్‌టి రాష్ట్ర కమిషనర్ ఎం.శ్రీహరిరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ ట్యాక్స్, సిజిఎస్‌టి రేంజ్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం రేంజ్‌లో 14 మండలాలు ఉంటాయన్నారు. ఈ ప్రాంతం ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉండటం, పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ రేంజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యాలయంలో వ్యాపారులకు నిరంతరం జిఎస్‌టిపై అవగాహన కల్పిస్తారన్నారు. ఏలూరు, నిడదవోలు, తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెంలో కలిపి ఐదు రేంజ్ కార్యాలయాలు ఉన్నాయన్నారు. జిఎస్‌టిపై సలహాలు సూచనలు కావాలంటే ఈ కార్యాలయాలకు వెళ్ళి సంప్రదించాలన్నారు. జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలోకి జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు, జీలుగుమిల్లి, కుక్కునూరు, టి.నరసాపురం, చింతలపూడి, ద్వారకాతిరుమల, బూర్గంపాడు, గోపాలపురం, కామవరపుకోట, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, లింగపాలెం, భీమడోలు మండలాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, స్టేట్ జిఎస్‌టి జెసి టి.రాజశేఖర్, ఎసిలు ప్రేమ్‌కుమార్, సి.శంకరన్, రాజు, స్థానిక రేంజ్ కార్యాలయ సూపరింటెండెంట్ జె.వీరాస్వామి, అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ డి.లలితకుమారి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు వందనపు వెంకటేశ్వరరావు,పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.