పశ్చిమగోదావరి

ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ కోడి పందేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జనవరి 16: సంక్రాంతి పేరుతో ఏజన్సీ, మెట్ట ప్రాంతాల్లో మూడు రోజులూ కోడి పందాలు, జూదాల జాతర విచ్చలవిడిగా జరిగింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ కోడి పందాలు నిర్వహించారు. కోడిపందాలతో పాటు రాత్రివేళల్లోను జూదాలు కొనసాగాయి. గ్రామ గ్రామాన పేకాట, గుండాటలు, కోడి పందాలు నిర్వహించారు. పట్టణ శివార్లలో బైపాస్ రోడ్డు శ్రీనివాసపురం జంక్షన్ వద్ద తోటలో జరిగిన కోడి పందాలకు మంగళవారం కనుమ రోజు బుల్లితెర నటులు విజయ్, నాని తదితరులు హాజరయ్యారు. పందాల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఐక్యత ప్రదర్శించారు. జూదాల జాతరలో రాజకీయ ఐకమత్యాన్ని ప్రజానీకానికి మరోసారి చాటిచెప్పారు. కోడి పందాల పేరుతో పేకాట గ్యాంబ్లింగ్, గుండాటలు ఆడేవారి వద్ద భారీ మొత్తాలు తీసుకుని కోడిపందాల నిర్వాహకులు కోట్లు గడించారు. సంప్రదాయం ముసుగులో ప్రజా ప్రతినిధులు ఈ మూడురోజుల్లో లక్షలు గడించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలో భారీగా పందాలు, జూదాల జాతర జరిగింది. పగలు రాత్రి తేడా లేకుండా పందాలు, పేకాటలు ఫ్లడ్ లైట్ల వెలుగులో తెల్లవార్లూ వేస్తూనే ఉన్నారు. జంగారెడ్డిగూడెం సాయిబాబా గుడి వద్ద పామాయిల్ తోటలో సైతం ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడిపందాలు, గుండాటలు నిర్వహించారు. స్థానిక మార్కెట్ వద్ద పాత శ్రీనివాసా థియేటర్ వద్ద పేకాట గ్యాంబ్లింగ్ రాత్రివేళల్లో నిర్వహించారు. పందాలు జరగనీయబోమని ముందస్తు హెచ్చరికలు చేసిన పోలీసు బాసులు రాజకీయ వత్తిడులకు తలొగ్గి మొహం చాటేయటంతో ఈ మూడు రోజులు పోలీసు శాఖ లేని రాజ్యం నడిచింది. మరో ప్రక్క జిల్లా కలెక్టర్ ప్రకటించిన 144 సెక్షన్ నిషేధాజ్ఞలను బరులు అవహేళన చేసాయి. పట్టణ శివార్లలోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద కాంగ్రెస్ నేత పోల్నాటి ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు బల్లే రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాల బరిలో బుల్లితెర నటులు, ప్రముఖలు తళుక్కున మెరిశారు. మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరంలో రెండు చోట్ల, పేరంపేట, ఎ.పోలవరం, గురవాయిగూడెం, దేవులపల్లి, కేతవరం, తిరుమలాపురం, పంగిడిగూడెం, తాడువాయి తదితర గ్రామాలలో కోడిపందాలు, పేకాటలు జోరుగా జరిగాయి. కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో తెలుగుదేశం నేత పరిమి రాంబాబు ఆధ్వర్యంలో క్రమశిక్షణతో భారీగా పందాలు జరిగాయని పందాలు తిలకించిన పలువురు ప్రజాప్రతినిధులు చెప్పారు. ఈ బరిలో పందాలు తిలకించేందుకు గ్యాలరీలో సోఫాసెట్‌లు సైతం ఏర్పాటు చేసారు. శ్రీనివాసపురం బరిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు కోడిపందాలు తిలకించారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన అధిక బరుల్లో ఖమ్మం జిల్లా, విలీన మండలాలకు చెందిన పందాలరాయుళ్ళు స్థానిక బృందాలను ఎదుర్కొన్నారు. విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు నుండి కూడా భారీగా కోళ్ళతో తరలివచ్చారు. చిన్న బరుల్లో పది వేల నుండి పెద్ద బరుల్లో లక్ష, రెండు లక్షల రూపాయల వరకు పందాలు కాసారు. సామాన్యులు తెచ్చుకున్న కోడి పుంజులు వేరే చిన్నబరిలో పందెం వేసారు. జూదాల జాతరలో మద్యం, బిర్యాని విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ సారి పందాలు ఎక్కడపడితే అక్కడ జరగడంతో రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. పందాల రాయుళ్ళు, మైసూర్, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల నుండి వచ్చిన పేకాట గ్యాంబ్లర్లతో పట్టణంలోని లాడ్జిలు నిండి పోయాయి. ఈ మూడు రోజుల్లో పది కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. కనుమ రోజుతో పందాలకు పోలీసులు ముగింపు పలికే సూచనలు సైతం కనిపించడం లేదు. మంగళవారం రాత్రి కూడా పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ముక్కనుమ పేరుతో బుధవారం కొన్ని బరుల్లో పందాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బుధవారం నుండి కోడిపందాలు నిర్వహిస్తే సహించేది లేదని పోలీసు అధికార్లు హెచ్చరికలు జారీ చేశారు.
పాలకొల్లు కోడి పందాలు ఉండవన్న అపనమ్మకం నుండి దర్జాగా ఆడుకొంటున్న కోడి పందాలకు, జూదాలకు మూడోరోజూ జోరు తగ్గలేదు. ఈ నెల 17 సాయంత్రం వరకు ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కోడి పందాల వద్ద కన్నా గుండాటల వద్ద జనం ఎక్కువ ఉన్నారు. ఒక కోడి పందెం వద్ద ఒక కోడి పందెం జరుగుతుంటే 20 చోట్ల గుండాట సాగింది. జూదంలో కొత్త రకం ఆటలో లాఘవంగా నిర్వహకులు సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యలో ఒక సినీ నటి బొమ్మ అర్ధనగ్నంగా ఉంటుంది. ఒక పక్క పవన్ కల్యాణ్, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు ఉంటాయి. పేక మీద మూడు బొమ్మలు ఉంటాయి. వాటిని కలిపి తిప్పుతూ ఉంటారు. ఏ బొమ్మ వస్తే ఆ బొమ్మ నెగ్గినట్లు, మరో బొమ్మ ఓడినట్లుగా చూపుతారు. రెండు భాగాల్లోను నిర్వాహకులకు ఈ సొమ్ము వెళుతుంది. మరొక ఆట తాడాట, నవ్వారు లాంటి తాడును గుండ్రంగా చుట్టి మధ్యలో పెన్ను పెడతారు. పన్నుకు తాడు అడ్డుపడితే పందె పోయినట్టు. తాడు అడ్డం లేకుండా వస్తే పందెం నెగ్గినట్టు. చేతి లాఘవంతో ఆడే ఈ ఆటలో జూదరులు సొమ్మును పెద్ద ఎత్తున పోగొట్టుకుంటున్నారు. పూలపల్లిలో మూడవ రోజు రెండుచోట్ల కోడి పందాలు ఈ విధంగా సాగుతూనే ఉన్నాయి. గెస్టులకు బాల్కనీ ఏర్పాటు చేశారు. కుటుంబాలతో సైతం చూడటానికి వచ్చినవారికి ఏర్పాట్లు చేశారు. మోటారు సైకిళ్లు, కార్లపై వచ్చిన వారికి పార్కింగ్‌కు వీలుగా లే ఔట్ స్థలాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మద్యం కూడా ఎక్కువగానే ఉంది. ఇక మాంసం పకోడీలకు మంచి గిరాకీ ఉంది.