పశ్చిమగోదావరి

రఫ్ఫాడించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 16: మొత్తంమీద జిల్లా పందెగాళ్లు రఫ్ఫాడించేశారు. అటు న్యాయస్ధానం, ఇటు పోలీసుల ఆంక్షలను పక్కనపెట్టి మరీ ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. ఆ మూడురోజులు మొదలైంది మొదలు నగదు పరవళ్లు తొక్కిందనే చెప్పాలి. ఎటిఎంల్లో నగదు లేక జనం అంతా గగ్గోలు పెడుతుంటే పందెం బరుల్లో మాత్రం కట్టలు తెగిపడ్డాయి. కోడిపుంజులు అదే రేంజ్‌లో. కోడిపందాల మాటున ఈసారి కూడా జూదాలు విశృంఖలస్ధాయిలో విజృంభించాయంటే ఆతిశయోక్తి కాదు. పందాల కన్నా మించి పేకాటపైనే భారీఎత్తున నగదుమార్పిడి జరిగిందనే చెప్పాలి. ఇక దీంతోపాటు గుండాట, కోతాట వంటివాటికి అడ్డూఅదుపు లేదనే చెప్పాలి. ఈసారి గతానికి భిన్నంగా కుటుంబాలు కూడా ఏదొ విహారయాత్రకు వచ్చినట్లు జంకుగొంకు లేకుండా ఈపందాలను ప్రశాంతంగా వీక్షించాయి. ఇక గుండాటలు, కోతాటల దగ్గర చిన్నారుల సందడి చెప్పనక్కర్లేదు. పెద్దలకు ధీటుగా వీరే ఇక్కడ జూదంలో ఆరితేరుతుండటం గమనార్హం. అయితే మొత్తంగా చూస్తే మాత్రం భీమవరం సమీపంలోని వెంపలో కోడిపందాలను నిరోధించటం ఒక్కటే పోలీసు విజయంగా చెప్పుకోవచ్చు. అక్కడ తప్ప మిగిలిన అన్నిచోట్ల పందాల, జూదాల జాతర చెప్పలేనిస్దాయిలో సాగిపోయింది. ప్రాధమిక అంచనాలే వందలకోట్లు దాటుతుంటే బుధవారం నాటికి ఈసంఖ్య ఏ రేంజ్‌కు తేలుతుందో వేచిచూడాలి. గుండాట, కోతాట వీటితోపాటు మద్యం ఇలా అన్నివిధాలుగా జూదాల సూపర్‌బజార్‌గా పశ్చిమగోదావరిని మూడురోజులపాటు మార్చివేశారు. మంగళవారం మాత్రం ఒక్కసారిగా పోలీసులు మేమున్నామంటూ వారికే గుర్తు వచ్చిందో, లేక ఎవరైనా గుర్తు చేశారోగాని బుధవారం నుంచి పందాలు వేస్తే సహించేది లేదని, కఠినచర్యలు తప్పవని పాత పాటే పాడుతూ మళ్లీ బయటకు వస్తున్నారు. ఏదీఏమైనా ఈసారి సంక్రాంతి సీజన్ మాత్రం గతానికి భిన్నంగానే జరిగింది. ఇంతకుముందు ఎన్నడూలేని రీతిలో పందాలకు అడ్డంకులు కన్పించినా చివరకు ఆమూడురోజులపాటు అవన్నీ మాయమైపోయాయి. ఖాకీలంతా స్టేషన్లకు పరిమితమైపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్లపై కనపడలేదంటే ఆతిశయోక్తి కాదు. దీంతో అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉన్న పందెగాళ్లు, నిర్వాహకులు చెలరేగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లాను పూర్తిగా దాదాపు వారే అదుపులోకి తీసుకున్నట్లు పరిస్ధితి మారిపోయింది. వాడవాడలా అన్నరీతిలో పందాలు ఆడేశారు. పేటపేటనా పేకాట కుమ్మేశారు. ప్రతిచోటా మద్యం పరవళ్లై పారింది. ఈ వ్యవహారం అంతా పోలీసు యంత్రాంగం చోద్యం చూసినట్లే చూసింది. ఇప్పటిదాకా కళ్లు మూసుకుని ఇప్పుడు మళ్లీ ఖాకీ దుస్తులు గుర్తుకొచ్చినట్లు రూల్స్ భుజాన వేసుకుని బుధవారం నుంచి రంగంలోకి దిగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇదివరకు దాదాపు వారం, పదిరోజులపాటు ఈ పందాల జాతర సాగుతుండేది. అటు పోలీసు హుకుంలు, ఇటు పందెగాళ్ల ధిక్కరింపులు యధాప్రకారం సాగేవి. కానీ అప్పట్లో పందాలపై చేతులు మారిన మొత్తం ఈసారి ఒక్క మూడురోజుల్లోనే చేతులు మారిపోయిందంటే ఆతిశయోక్తి కాదు. పలుప్రాంతాల్లో పెద్దపందాలు దర్శనమిచ్చాయి. ఇక చిన్నచితకా పందాలకు చిన్నచిన్న కూడళ్లే వేదికలయ్యాయి. దీంతోపాటు ప్రధాన రహదారులకు పక్కనే పేకాట శిబిరాలు రాత్రికి రాత్రికి వెలిశాయి. అప్పటికప్పుడు ఫ్లడ్‌లైట్లు, శిబిరాలు, బిర్యానీపాయింట్లు, బెల్టుషాపులు ఇలా అన్ని హంగులను అమర్చుకుని గంటల వ్యవధిలో దర్శనమిచ్చాయి. ఇక అక్కడ రాత్రి,పగలు తేడా లేకుండా జూదాల జాతర వరద మాదిరిగానే సాగిపోయింది. వీటిలో ఇంతకుముందు మాదిరిగానే మహిళల హడావిడి కూడా కొంత గట్టిగానే కన్పించింది. మగమహారాజులతో పోటీగా మహిళలే మహారాణులంటూ పందానికి లక్ష చొప్పున ఒడ్డిన మహిళామణులు ఉన్నారంటే ఆతిశయోక్తి కాదు. వీటి అన్నింటికి మించి న్యాయస్ధానాలు, పోలీసు యంత్రాంగం ఆదేశాలు ఇవన్నీ రాజకీయం ముందు నిలవలేకపోయాయి. ఆవిధంగానే అన్నిస్ధాయిల్లోనూ వత్తిళ్లు తీసుకువచ్చారు. దీనికి ఇతర పార్టీల నుంచి ఒక్క వ్యతిరేక ప్రకటన కూడా రాకపోవటం చూస్తే ఇలాంటి పందాల విషయంలో నేతలంతా ఒక్కటేనన్న విషయం తేటతెల్లమవుతుంది. ఏదీఏమైనా నిబంధనలన్నీ రాజకీయం ముందు బలాదూర్ అయ్యాయి. పందాల జోరుతో సమానంగా పేకాట శిబిరాలు ఏర్పాటుకావటం ఈసారి మరో విశేషం. ఈసారి పేకాటను కసి కొద్ది ఆడేశారు. వందలు, వేలు, లక్షలు ఇలా నగదు సంఖ్యతో సంబంధం లేకుండా పేకాట ఆడటమే పరమావధిగా వారికి మారిపోయింది. ఇక గుండాట, కోతాట వంటి వ్యవహారాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అటు పేకాట శిబిరాల్లోను, ఇటు పందెం బరుల వద్ద కూడా ఈ జూదాలు దర్శనమిచ్చాయి. వీటి దగ్గర పందాలకు సమానంగా జనం తమ జూద ఆసక్తిని తీర్చేసుకున్నారంటే ఆతిశయోక్తి కాదు. దాదాపుగా ఈ మూడురోజుల్లోనూ వందల కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయని అంచనా వేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు ఇలా అనేకమంది కోడిపందాల్లో పాల్గొని తమ సరదా తీర్చుకున్నారు. తమ విజయాన్ని చాటుకున్నారు. మొత్తంమీద జూదాల వరద జిల్లాను ఈ మూడురోజులు పట్టి కుదిపేసింది.
మూడురోజులు రైడ్‌ఫ్రీ జోన్‌గా జిల్లా
ఏలూరు, జనవరి 16: పౌరుషానికి ప్రతీకగా సాగే కోడిపందాల్లో ఎవరో ఒకరు ఓడిపోయి నష్టపోవచ్చుగాని, ఈసంక్రాంతి కోడిపందాల్లో బాగా లబ్దిపొందింది మాత్రం పోలీసులే... ఇది ఒకరి మాట కాదు... అందరి నోటా ఇవే పలుకులు. గత మూడురోజులుగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే నిజమేనన్న అనుమానాలు కలగకమానవు. మరోవైపు సంక్రాంతి కోడిపందాలు పోలీసులకు గతంలో ఎన్నడూలేనివిధంగా అపఖ్యాతిని మూటకట్టాయి. సంక్రాంతికి ముందు ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికిన పోలీసులు ఆతర్వాత ఎక్కడా కన్పించలేదు. దీనికితోడు ప్రజాప్రతినిధులు కూడా గుంభనంగా తమ వ్యవహారాన్ని కొనసాగించడంతో జరుగుతున్నదేమిటో తెలిసేలోగా వ్యవహారం పోలీసుల చెయ్యి దాటిపోయింది. ప్రకటనలు మాత్రమే మిగిలాయి. గతంలో పొలాల్లోనూ, శివారుప్రాంతాల్లోనూ ఈపందాలను రహస్యంగా నిర్వహించేందుకు ప్రయత్నించేవారు. ఈసారి పందాలబరులు పట్టణ ప్రాంతాలకు దగ్గరలోనే ఏర్పాటుకావటం గమనార్హం. అయితే మూడురోజులపాటు జిల్లాను రైడ్ ఫ్రీజోన్‌గా ప్రకటించినట్లుగా ఎక్కడా పోలీసు అధికారులుగాని, కానిస్టేబుళ్లుగాని బహిరంగంగా కన్పించలేదు. పెద్దపందాలకు అండాదండా ఉన్న నేతలు సారధ్యం వహించగా చిన్నపాటి పందాలు కూడా భారీగా సాగిపోవటం పోలీసు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. చాలాగ్రామాల్లో రోడ్డుప్రక్క, చెర్వుగట్టుమీద, పొలాల్లోనూ కూడా ఎక్కడ అందుబాటులో స్ధలం ఉంటే అక్కడ పందాలు నిర్వహించారు. అంతేకాకుండా మరికొంతమంది అప్పటికప్పుడు పందాలకు నిర్ణయించుకోవటం, ఏదోఒకచోట గ్రామంలోనే స్ధలం చూసుకుని కోడిపందాలు జోరుగా నిర్వహించటం జరిగిపోయింది. గతంలో చిన్నపాటి వ్యవహారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపేవారు. కానీ ఈసారి పెద్దవారికి లేని నిబంధనలు చిన్నవారికి ఎందుకనుకున్నారో ఏమోగాని ఈపందాలపై కూడా దృష్టి సారించలేకపోయారు. కోడిపందాలతోపాటు ఈసారి పేకాట జోరుగా సాగిపోయింది. దీనిపై కూడా పోలీసులు దృష్టి పెట్టలేకపోయారు. కాగా కొన్నిప్రాంతాల్లో కోడిపందాలను ఎలాగూ ఆపగలిగేది లేదన్న నమ్మకంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా తమవంతు అనుమతులకు తెరలేపారు. భారీగా ముడుపులు ఈవిషయంలో చేతులు మారాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. పందెం బరికి ఇంతని చెప్పి ముందుగానే మాట్లాడుకుని ఆమేరకు ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో పంపకాలు పూర్తి చేశారని చెపుతున్నారు. అనధికారిక అనుమతులు కొన్నైతే ఆ ముసుగులో కొంతమంది భారీగా పందాల జాతరకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి లాభాల పంట పండించుకున్నారు. మొత్తంమీద అటు కోళ్లు, ఇటు పందెగాళ్లు ఓడిపోయినా చివరకు విధినిర్వహణ చేయకుండా పోలీసులు మాత్రం పందెం బరిలో విజేతలుగా నిలిచారు.