పశ్చిమగోదావరి

20 నుంచి అసెంబ్లీకి వెళతా : చింతమనేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 16 : రాష్ట్ర హైకోర్టులో తనకు సరైన న్యాయం జరిగిందని, కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో చింతమనేని క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హైకోర్టులో చింతమనేనికి ఊరట లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పూలవర్షం కురిపించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ భీమడోలు కోర్టు తనకు రెండు సంవత్సరాలు శిక్ష విధించడంతో బాధపడలేదని, కోర్టు నిర్ణయం శిరోధార్యమన్న ఉద్దేశ్యంతోనే ముందుకు వెళ్లానని చెప్పారు. అలాగే ఆ తీర్పును శిరసా వహించి తానే నైతిక బాధ్యతగా భావించి అసెంబ్లీకి కూడా వెళ్లలేదని చెప్పారు. హైకోర్టులో తనకు ఊరట లభించిన దృష్ట్యా ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటానని ఆయన చెప్పారు. దెందులూరులో జరిగిన ఘటనలో 15 మందిని తప్పించి తనను బాధ్యులను చేస్తూ శిక్ష విధించారని, అయితే హైకోర్టులో తనకు ఊరట లభించిందని, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రజా జీవితంలో ఆటుపోట్లు తప్పవని, ప్రజల అభిమానంతో ఈ తీర్పుతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. కొన్ని కారణాల వల్ల కోర్టుల్లో శిక్ష పడటం ప్రజాప్రతినిధులకు తప్పదని, అయినా కోర్టు తీర్పును గౌరవిస్తూ ఆనాటి నుంచి కోర్టు తీర్పుపై ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నైతిక బాధ్యతగా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మధ్యే వున్నానన్నారు. తనకు డబ్బు ఇచ్చి తెచ్చుకునే కార్యకర్తలు కాకుండా సైనికుల్లాంటి కార్యకర్తలు, అభిమానులు వున్నారని, వారి అండదండలతో భవిష్యత్తులో రాజీ లేని సేవలను ప్రజలకు అందిస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తామన్నారు. కార్యకర్తలెవరూ పొగడ్తలకు పొంగిపోవడం, విమర్శలకు కుంగిపోవడం వంటివి కూడదని, రాజకీయాల్లో ప్రత్యర్దులెప్పుడూ మన ఓటమిని కోరుకుంటారని, అటువంటి వారికి ధీటుగా మనం కష్టపడి పనిచేసి ప్రజల పక్షాన నిలబడినప్పుడే భవిష్యత్తులో ఎదురు ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మండలాధికారులు ఆయన్ను పూలమాలలతో ముంచెత్తారు.

పంచాయతీ బరిలో జనసేన
* యువతకు దక్కనున్న రాజకీయ ప్రాధాన్యత

భీమవరం, మార్చి 16: ఈ ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దిగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు ఆవిర్భావ సభలో స్పష్టం చేశారు. దీంతో జిల్లాలోని యువతకు రాజకీయ ప్రాధాన్యత లభించనుంది. ఇక పంచాయతీల్లో అధికార తెలుగుదేశం పార్టీ, వైసీపీ, కాంగ్రెస్ తదితరులతో పాటు జనసేన పార్టీ కూడా బరిలో నిలవనుంది. తెలివైన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటనలపై జిల్లాలో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. జనసేనాని సభ సక్సెస్ కావడంతో తెలుగుదేశం, వైసీపీల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిన్నటివరకు 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే జనసేన పోటీలో ఉంటుందని భావించిన రాజకీయ పార్టీలు పంచాయతీల్లో కూడా పోటీలో ఉంటానని ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చాలా తీవ్రమైన చర్చే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికల్లో అంటే గ్రామస్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు మెజార్టీతో గెలిస్తే గ్రామ, మండల స్థాయిలో పార్టీ పట్టు సాధించినట్టు అవుతోంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందు వరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం క్యూ కడతారని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ టీడీపీకి ఎన్నికల ప్రచారం చేయడంతో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం, ఆ పార్టీ అభ్యర్థులను గెలుపించుకోవడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికలకు బరిలో నిలిస్తే కాపు సామాజికవర్గం ఓటర్లు అటువైపే మొగ్గు చూపుతారన్నది సీనియర్ రాజకీయ నాయకుల విశే్లషణ. జనసేన ప్రభావం తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఉంటుందని జిల్లా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

అమరజీవిని మరచిన రాష్ట్ర ప్రభుత్వం
* జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్

భీమవరం, మార్చి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాముల కోసం ఆర్యవైశ్య కుటుంబం కదిలింది. మద్రాసు రాష్ట్రం నుంచి పోరాడిన మహాయోధుడను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వక్ష్యం చేసిందన్న భావన రాష్ట్రంలోని ఆర్యవైశ్య కుటుంబంలో ఆవేదన కలిగించింది. దీంతో ఆయన జయంతిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని భీమవరం రూరల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు అమర వెంకట సుబ్బారావు జ్యోతిని వెలిగించి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అధ్యక్షుడు కొప్పురావూరి వీరవెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సోము వీరవెంకట సత్యనారాయణ, కోశాధికారి బలభద్ర సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం రూరల్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు పెనుగొండ రామ్మూర్తి, సోము రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు సోము వెంకటేష్, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సోము కపర్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు మండా వెంకయ్య తదితరులు ఆదివారం బజార్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. అక్కడ తహసీల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఆయన జయంతిని శెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేవరపల్లిలో కొనసాగిన ఆక్రమణల తొలగింపు
దేవరపల్లి, మార్చి 16: దేవరపల్లిలో ఆక్రమణల తొలగింపు రెండో రోజు కూడా కొనసాగింది. గుండుగొలను - కొవ్వూరు హైవే విస్తరణ, దేవరపల్లి బస్టాండ్ విస్తరించాలన్న ఆలోచనతో రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. శుక్రవారం మెయిన్ బజారులో ఆర్‌అండ్‌బి ఆక్రమణలు తొలగించడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యమైంది. తహసీల్దారు వై రవికుమార్, ఎస్‌ఐ పి వాసు, రెవెన్యూ అధికారులు, ఆర్‌అండ్‌బి అధికారులు, మార్కింగ్ వేయగా యుద్ధప్రాతిపదికపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. కాగా నిరాశ్రయులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.