పశ్చిమగోదావరి

204 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు: జడ్పీ చైర్మన్ ముళ్లపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 21 : జిల్లాలో 204 ఉన్నత పాఠశాలల్లో కోటి పది లక్షల రూపాయలతో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. బుధవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్తు స్టాండింగ్ కమిటీ సమావేశంలో విద్యాప్రగతిపై ఛైర్మన్ బాపిరాజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 204 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని సర్వశిక్ష అభియాన్ జిల్లా విద్యాశాఖాధికారి నిర్ణయించగా ఇందుకు అయ్యే ఖర్చును తాము సంబంధిత సాంకేతిక నిపుణులతో సంప్రదించి 55 వేల రూపాయలతో యూనిట్ స్థాపించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు కోటి పది లక్షల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేయగా 60 లక్షల రూపాయలు దాతల నుండి విరాళాలుగా మిగిలిన 50 లక్షలు జిల్లా పరిషత్తు నుండి వెచ్చించాలనుకున్నామన్నారు. అయితే ఇప్పటికే 107 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాట్లుకు జడ్పీటిసిలు, ఎన్ ఆర్ ఐలు, హెచ్ ఎంలు తదితరులు స్పందించి ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వచ్చారన్నారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ బోళ్ల బుల్లిరామయ్య మనుమడు బోళ్ల రాజీవ్ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు పది లక్షల రూపాయలను తమ ఆయిల్‌ఫామ్ కంపెనీ నుంచి సి ఎస్ ఆర్ కింద అందించడం అభినందనీయమన్నారు. తనకు ఎన్ ఆర్ ఐలతో ఉన్న సత్సంబంధాలు మూలంగా ఇప్పటికే 35 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని మరో 30 లక్షల ప్రజావిరాళంగా వచ్చాయని, ప్రస్తుతం బోళ్ల రాజీవ్ పది లక్షలు అందించారని మరో 25 లక్షలు జిల్లా కలెక్టర్ అందిస్తామని చెప్పారని తెలిపారు.

రైతుల రాస్తారోకో
ఏలూరు, మార్చి 21 : చింతలపూడి ఎత్తిపోతల పధకం భూ నిర్వాసిత రైతులకు ఎకరానికి రూ.30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామవరపుకోటలోని బొర్రంపాలెం అడ్డరోడ్డు సెంటరులో బుధవారం రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీనితో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలచిపోయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, చింతలపూడి ఎత్తిపోతల పధకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ అధ్యక్షులు అలవాల ఖాదర్‌బాబు రెడ్డి మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులు గత రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అతితక్కువ పరిహారం చూపించి రైతుల భూములను బలవంతంగా ప్రభుత్వం లాగేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం, భూసేకరణ అధికారులు రైతులతో చర్చలు జరపాలని కోరారు. ఎకరానికి రూ.30 లక్షల పరిహారంతోపాటు ఇళ్లు, షెడ్లు, చెట్లు, బోర్లు, పైపులైన్లు, ఫెన్సింగ్ తదితర వాటికి కూడా పరిహారాన్ని ఇవ్వాలన్నారు. ఫేజ్-1 కాలువను మొదట పూర్తి చేసి మెట్ట ప్రాంత భూములకు నీరు అందించిన తరువాతే ఫేజ్-2 పనులను పూర్తి చేయాలన్నారు. అస్సైన్డ్ భూములకు కూడా పట్టా భూములు మాదిరిగా పరిహారం అందించాలని కోరారు.

మద్దతు ధరకోసం మంత్రికి వేలేరుపాడు రైతాంగం వినతి
వేలేరుపాడు, మార్చి 21: తాము పండించిన మినుము, కంది, సెనగ పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వేలేరుపాడు మండల రైతాంగం బుధవారం మార్కెటింగ్ శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణరెడ్డికి విన్నవించారు. అమరావతిలో మంత్రిని ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 20 మంది రైతులు మంత్రిని కలిసి సమస్యలు విన్నవించారు. ఈ విషయమై తాము కొంతకాలంగా మార్కెఫెడ్ అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయిందని, దళారీలను అడ్డుపెట్టుకుని అధికారులు వారి వద్దే కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన మంత్రి మార్కెఫెడ్ ఉన్నతాధికారులను తక్షణం వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో అపరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 23 నుండి వేలేరుపాడులో కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో రైతులు పోతిన హరిప్రసాద్, పాలేటి సీతారామాంజనేయులు, పున్నమిరాజు నాగేంద్రబాబు, టి నాగేంద్రం, చీమల వెంకటేశ్వర్లు తదితరులున్నారు.