పశ్చిమగోదావరి

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 22 : ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ నెల 23న ఉదయం జరగనున్న డయల్ యువర్ కలెక్టర్, జిల్లా అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశం, మీ-కోసం కార్యక్రమం రద్దు చేశామని కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణ తెలిపారు. అధికారులంతా ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనవలసి ఉన్నందున ఏలూరులో అధికారులు అందుబాటులో వుండని దృష్ట్యా ఈ కార్యక్రమాలు వాయిదా వేయడమైందన్నారు.

నమ్మక ద్రోహాన్ని తెలియజేసేందుకు సైకిల్ యాత్ర
యలమంచిలి, ఏప్రిల్ 22: కేంద్ర ప్రభుత్వం అయిదుకోట్ల ఆంధ్రులకు చేసిన నమ్మక ద్రోహాన్ని తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర ప్రారంభించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పోడూరు మండలం పి పోలవరం, కవిటం, జగన్నాధపురం, పోడూరు గ్రామాల్లో ఆదివారం టీడీపీ శ్రేణులు సైకిల్ యాత్ర నిర్వహించారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టి, మంత్రి పితాని, టీడీపీ శ్రేణులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని, ఈ విషయంలో రాజీ ప్రసక్తేలేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం ద్వారా రావాల్సిన హక్కులు సాధించేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, ఎంపీపీ మేకా పద్మకుమారి, జడ్పీటీసీ సభ్యులు బండి రామారావు, బొక్కా నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రుద్రరాజు రవిరాజు తదితరులు పాల్గొన్నారు.

మండుటెండలో ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర
యలమంచిలి, ఏప్రిల్ 22: మండలంలో రెండు రోజుల నుంచి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండుటెండను సైతం లెక్కచేయకుండా సైకిల్ యాత్ర పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ యాత్ర కొనసాగిస్తూ, అదే గ్రామంలో నివాసం ఉంటూ మర్నాడు తిరిగి యాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోరుతూ నియోజకవర్గంలో ఈ యాత్ర చేబట్టినట్టు ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. ఆదివారం మండలంలోని పెనుమర్రు, నేరేడుమిల్లి, మేడపాడు, ఆర్యపేట, యలమంచిలి, చించినాడ, వైవి లంక, బాడవ గ్రామాల మీదుగా 35 కిలోమీటర్ల మేర ఈ యాత్ర నిర్వహించారు. రాత్రి కలగంపూడి గ్రామంలో బస చేశారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

డిఎన్నార్ డిగ్రీ ఫలితాలు విడుదల

భీమవరం, ఏప్రిల్ 22: దంతులూరి నారాయణరాజు డిగ్రీ కళాశాల ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. కళాశాల అసోసియేషన్ పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నర్సింహరాజు, సెక్రటరీ, కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) 2,4,6 సెమిస్టర్ల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బిఎ 90.19శాతం, బిఎస్సీ 73.75శాతం, బికాం జనరల్ 93.75శాతం, బికాం కంప్యూటర్ అప్లికేషన్స్ 91.67శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎన్ మాధవి ( బికాం కంప్యూటర్ అప్లికేషన్స్) 9.80, వివివి లక్ష్మి ఉమా జ్యోతి ( బికాం జనరల్) 9.75, బి.పృధ్వీరాజ్ ( బికాం కంప్యూటర్ అప్లికేషన్స్) 9.75 సిజిపిఎతో మొదటి మూడు ర్యాంకులు సాధించారని చెప్పారు. పరీక్షలకు హాజరైన తృతీయ సంవత్సర విద్యార్థుల్లో 82 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన వివరించారు. రీవాల్యుయేషన్, సమాధాన పత్రం ప్రత్యక్ష పరిశీలనకు విద్యార్థులకు ఈనెల 30 వరకు అవకాశం కల్పించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెవివిఎపిటి సూర్యారావు చెప్పారు. మే 8న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. వైఎస్ ప్రిన్సిపాల్ ఎంవి రఘుపతిరాజు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ భాస్కరరావుఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ముత్యాల
ఉంగుటూరు, ఏప్రిల్ 22: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామానికి చెందిన ముత్యాల బాలాజీ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బాలాజీ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ అభివృద్ధికోసం శక్తికి మించి పనిచేస్తానన్నారు. ఇటీవల విజయవాడలో జరిపిన ఎన్నికల్లో బాలాజీని సభ్యులు ఎన్నుకున్నారు.

మంజూరు దశలో తాగునీటి ప్రాజెక్టు పనులు
తాళ్లపూడి, ఏప్రిల్ 22: గోదావరి ఉపరితల జలాలను శుద్ధిచేసి కొవ్వూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు పంపిణీ చేసేందుకు 130 కోట్ల రూపాయలతో పంపిన ప్రతిపాదనలు మంజూరు దశలో ఉన్నాయని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. వేగేశ్వరపురంలో ఆదివారం పైపులైను నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. సుమారు 3.7 కోట్ల రూపాయలతో మండలంలోని అన్ని గ్రామాల్లో పైపులైను పనులు చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో తాగునీటి ప్రాజెక్టు రానున్న ఎన్నికలలోపు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. పంగిడిలో 76 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఎంపీపీ కాసాని అనంతలక్ష్మి, వేగేశ్వరపురం సర్పంచ్ కావూరి కుమారి, జడ్పీటీసీ కైగాల మంగాభవాని, ఎత్తిపోతల పథకం అధ్యక్షులు కైగాల రాంబాబు, కొఠారు వెంకట్రావు, ఇల్లూరి బాబ్జి, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ జి శ్రీనివాసప్రసాద్, డీఈ రమేష్, ప్రాజెక్టు ఇన్‌చార్జి ఏఈ సూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.

అసిస్టెంటు లేబర్ కమిషనర్‌గా గిరిజన విద్యార్థిని
గోపాలపురం, ఏప్రిల్ 22: మండలంలోని రేగులకుంట గ్రామానికి చెందిన నిమ్మగడ్డ బుల్లిరాణి అసిస్టెంటు లేబర్ కమిషనర్‌గా నియమితులు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన పంచాయతీలోని గ్రామంలో జన్మించిన బుల్లిరాణి ఒకటి నుండి పదో తరగతి వరకు వేళ్లచింతలగూడెం ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్మీడియట్ జంగారెడ్డిగూడెంలో, డిగ్రీ కాకినాడలో చదివి ప్రస్తుతం నాగార్జున యూనివర్శిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారు. ఇటీవల జరిగిన గ్రూపు-1 పరీక్షల్లో ఆమె అసిస్టెంటు లేబర్ కమిషనర్ పోస్టుకు ఎంపికైనట్టు సత్యనారాయణ తెలిపారు.

నదుల శివారు ప్రాంతాలకు 20 శాతం నీరు విడుదల చేయాలి

భీమవరం, ఏప్రిల్ 22: నదుల శివారు ప్రాంతాలకు తప్పనిసరిగా 20 శాతం నీరు విడుదల చేయకపోతే గోదావరి, కృష్ణాడెల్టాలు ఉప్పునీటి ప్రాంతాలుగా మారిపోతాయని ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల పరిశోధనా విభాగం డీన్ డాక్టర్ పి రామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఎర్త్ డేను ఆదివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఎపి స్టేట్ సెంటర్ ఐఇఐ భీమవరం సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి స్టేట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పి కోదండరామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణంరాజు మాట్లాడుతూ గోదావరి, కృష్ణాడెల్టాల నడుమ కొల్లేరు సరస్సు డెల్టా ప్రాంతానికి ఒక వరమన్నారు. అయితే ఇప్పటికే కొల్లేరు సరస్సు 80 శాతం తన సహజత్వం కోల్పోయిందన్నారు. నదులలో నీటి యాజమాన్య పద్ధతులు సక్రమంగా అమలు జరగకపోవడమే ఇందుకు కారణమన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బ్రహ్మరాజు, ప్రొఫెసర్ వికె విశ్వనాధరాజు, డైరెక్టర్ జె సుధీర్‌కుమార్, కళాశాల డైరెక్టర్ ఎస్‌ఆర్‌కె రెడ్డి, ఎస్‌ఆర్‌కెఆర్ పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ డి రంగరాజు తదితరులు పాల్గొన్నారు.