పశ్చిమగోదావరి

బహిరంగ విమర్శలు చేస్తే క్రమశిక్షణా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 26: ప్రభుత్వ సిసిఎ రూల్స్ ప్రకారం ప్రతి ఉద్యోగి ప్రభుత్వం చెప్పిన పని చేయాల్సిందేనని, అలా చేయలేకపోతే ఉద్యోగం వదులుకోవాలే తప్ప పత్రికా ప్రకటనలు, బహిరంగవిమర్శలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ ప్రగతిపై ఎంఇఓలతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖకు ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయని, దాని ప్రకారం ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంగాని, పత్రికా ప్రకటనలు విడుదల చేయటంగాని చట్టరీత్యానేరమని అటువంటివారు ఎంతటివారైనా శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. జిల్లాలో తాను సొంతంగా ఏ పని చెప్పడం లేదని, ప్రభుత్వం చెప్పిన పనులను మాత్రమే చేయాలని ఉద్యోగులనుగాని, టీచర్లను గాని, వైద్యసిబ్బందిగాని ఆదేశిస్తున్నానే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తనకు లేదని కలెక్టరు స్పష్టం చేశారు. పాఠశాలల్లో విద్యార్ధినీవిద్యార్ధుల బయోమెట్రిక్ హాజరు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఖచ్చితంగా అమలుచేస్తామని, ప్రస్తుతం టీచర్లు పనిభారం పడకూడదనే ఉద్దేశ్యంతో క్లాస్‌లో హాజరైన విద్యార్ధినీవిద్యార్ధుల ఫోటో తీసి ఆప్‌లోడ్ చేయాలని టీచర్లకు వెసులుబాటు కల్పిస్తే ఫోటో తీసే పని మాదికాదని కొందరు అంటున్నారన్నారు. జిల్లాలో స్కూల్‌వారీగా టీచర్ల బయోమెట్రిక్ హాజరుశాతం తనకు నివేదిక సమర్పించాలని గత వారం చెప్పినప్పటికీ ఎందుకు నివేదిక సమర్పించలేదని డిఇఓను కలెక్టరు ప్రశ్నించారు. కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం అదనపు నిధులు తాను ప్రభుత్వం నుండి మంజూరు చేయించి దీనికి ప్రత్యేక ఖాతా ఓపెన్ చేయాలని డిఇఓకు చెప్పినా మూడునెలలు అయినా ఖాతా ప్రారంభించలేదని, తాను ట్రజరీ అధికారితో మాట్లాడి గంటన్నరలో ప్రత్యేక ఖాతా తెరిపించానని, బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తించటం ఉద్యోగ ధర్మం కాదన్నారు. తనకు తెలియకుండా రెమిడియల్ క్లాసులు ఎందుకు వాయిదా వేసారని ఆయన ప్రశ్నిస్తూ దీనికి సంబంధించి తగు నివేదిక సమర్పించాలని ఎస్‌ఎస్‌ఎ పిఓ, డిఇఓలను ఆదేశించారు. సమావేశానికి హాజరుకాని ఎంఇఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టరు ఆదేశించారు. సమావేశంలో డిఇఓ రేణుక, ఎస్‌ఎస్‌ఎ పిఓ డాక్టరు బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు పాలిసెట్-2018
ఏలూరు, ఏప్రిల్ 26: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించనున్న ఎపి పాలిసెట్-2018 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్ సిఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎపి పాలిసెట్ ఏలూరు సెంటరు కో-ఆర్డినేటరు కెఎన్ వరప్రసాద్ తెలిపారు. ఈ పరీక్ష జిల్లాలోని మూడు కేంద్రాల్లో జరుగుతుందన్నారు. ఏలూరులోని ఎనిమిది సెంటరులలో జరిగే పరీక్షకు 3300 మంది విద్యార్ధులు, తణుకులోని 13 సెంటర్లలో 4406 మంది విద్యార్ధులు, భీమవరంలోని ఏడు సెంటర్లలో 2764 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాత పరీక్ష 27వ తేదీ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్‌లను తమ వెంట తెచ్చుకోవాలని, ఉదయం 10గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్ధులను అనుమతిస్తారని, పరీక్ష ప్రారంభ సమయం తర్వాత ఒక నిముషం ఆలస్యంగా వచ్చిన అనుమతించరని వరప్రసాద్ వివరించారు.
మత్స్యావతార అలంకారంలో చిన వెంకన్న
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 26: మత్స్యావతారంగా శ్రీవారు ఆలయ ఆవరణలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఉద్భవించారు. ఇందులో భాగంగా మత్స్యావతార అలంకారంలో ఉన్న చిన వెంకన్నను పలువురు భక్తులు దర్శించి పరవశించారు. శ్రీవారి వైశాఖ మాస బ్రహోత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో స్వామి వారు రోజుకో అలంకారంలో భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. మత్స్యావతార అలంకారంలో చిన వెంకన్న రూపం భక్తులను పరవశింప చేసింది.
బీజేపీ నమ్మించి మోసం
తాళ్లపూడి, ఏప్రిల్ 26: కాంగ్రెస్ పార్టీ అనైతికంగా రాష్ట్రాన్ని విభజించిందని, ప్రత్యేక హోదా అమలులో బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ పేర్కొన్నారు. గురువారం తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట, గజ్జరం, పోచవరం, రాగోలపల్లి, తాడిపూడి గ్రామాల్లో సైకిల్ యాత్ర ప్రారంభిస్తూ మంత్రి టీడీపీ వర్గీయులను ఉద్దేశించి మాట్లాడారు. సైకిల్ యాత్ర సందర్భంగా అన్నదేవరపేటలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారు వెంకట్రావు మంత్రి జవహర్‌కు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరికి కొత్త సైకిళ్లను బహూకరించారు. అన్నదేవరపేట పసుపు జెండాలతో పసుపుమయమైంది. గజ్జరంలో టీడీపీ నాయకులు కాకర్ల వంశి ఆధ్వర్యంలో సైకిల్ యాత్రకు స్వాగతం పలికారు. పోచవరంలో సీనియర్ నాయకులు అనపర్తి పరమేశ్వరరావు, రాగోలపల్లిలో చలపాటి ప్రకాష్ సైకిల్ యాత్రకు స్వాగతం పలికారు. తాడిపూడిలో టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు నామా సురేంద్ర, సీనియర్ నాయకుడు నామా శ్రీరాములు ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సైకిల్ యాత్రలో గ్రామాల్లోని అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ యాత్ర కొనసాగింది. ఈ సైకిల్ యాత్ర సందర్భంగా అన్నదేవరపేట, పోచవరం గ్రామాల్లో వర్గ విభేదాలు వెలుగుచూశాయి. పోచవరం సీనియర్ నాయకులు అనపర్తి పరమేశ్వరరావు తన స్వగృహానికి మంత్రిని తీసుకువెళ్లే నేపధ్యంలో రాగోలపల్లి నాయకులు చలపాటి ప్రకాష్‌తో వాగ్వివాదం జరిగింది. సైకిల్ యాత్ర అనంతరం తాడిపూడిలో మంత్రి సమక్షంలో గర్రే ఈశ్వరుడుతోపాటు 10 మంది యువకులు పార్టీలో చేరారు. వీరిని పసుపు రంగు కండువాతో మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నదేవరపుపేట నుండి కాకర్ల వైష్ణవి అనే బాలిక అయిదు కిలోమీటర్ల మేర సైకిల్ యాత్రలో పాల్గొని మంత్రితోపాటు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
విద్యుత్ స్తంభం తొలగింపు
ఆకివీడు, ఏప్రిల్ 26: ఆకివీడులో ప్రమాదభరితంగా మారిన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ శాఖ ఎట్టకేలకు తొలగించింది. స్థానిక ఎస్ టర్నింగ్‌లోని విద్యుత్ స్తంభం ఒంగిపోయి ఏ క్షణాన్నైనా పడిపోయే స్థితికి చేరింది. అయితే విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖాధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేదు. దీంతో ఆకివీడు ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్ దృష్టికి తెచ్చారు. విషయాన్ని విద్యుత్ శాఖాధికారుల దృష్టికి ప్రసాద్ తీసుకువెళ్లారు. గురువారం హుటాహుటిన విద్యుత్ స్తంభం తొలగించే పని ప్రారంభించారు. సుమారు మూడుగంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ స్తంభం తొలగించారు.

బహిష్కృతులైన వెంకటాపురం సర్పంచ్ దీప్తి ఉష తిరిగి బాధ్యతలు స్వీకరణ
ఏలూరు, ఏప్రిల్ 26 : అవినీతి ఆరోపణల నేపధ్యంలో ప్రభుత్వం ఆర్నెల్ల క్రితం వెంకటాపురం సర్పంచ్ చెరుకూరి దీప్తి ఉషను సస్పెండ్ చేసి చెక్‌పవర్‌ను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించగా సర్పంచ్‌గా కొనసాగాలని ఆదేశించడంతో ఆ ఆదేశాల మేరకు గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డుమెంబర్లతోపాటు టిడిపి నాయకులు అమరావతి అశోక్‌బాబు, చిన్ని అర్జున్, ఎంపిటిసి ఛాంబర్ అధ్యక్షులు పైడి వెంకట్రావు, ఎంపిటిసి రమేష్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు సర్పంచ్‌ను పూలమాలలతో సత్కరించారు. సిబ్బంది అభినందించారు.

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా బాబు
*క్షత్రియుల్లో అసంతృప్తి

భీమవరం, ఏప్రిల్ 26: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు)ను నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆయన చేతులు మీదుగా ఆయన కార్యాలయంలో గాదిరాజు బాబుకు అందజేశారు. పార్టీ సీనియర్ నేతలు ఆర్టీసి రీజియన్ ఛైర్మన్ మెంటే పార్థసారధి, మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ తదితరుల సమక్షంలో అందజేశారు. ఇదిలా ఉండగా పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా గాదిరాజు బాబు నియామక పత్రాన్ని అందుకున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని బోర్డు డైరెక్టర్ వంటి పదవిని ఆశించిన గాదిరాజు బాబుకు భంగపాటు తప్పలేదు. ఆయన వర్గం కూడా టీటీడీ బోర్డులో ఖచ్చితంగా మంచి స్థానాన్ని ఇస్తారని భావించారు. అదే విధంగా క్షత్రియ సామాజికవర్గంకు చెందిన గాదిరాజు బాబుకు టీటీడీ బోర్డు డైరెక్టర్ పదవిని ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు అటవీ అభివృద్ధి సంస్థలో సభ్యునిగా నియమించడం ప్రాధాన్యత తగ్గించడమేనని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.