పశ్చిమగోదావరి

కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 21: రొయ్యలకు గిట్టుబాటు ధర లభించటం లేదని, ఎగుమతి దారుల విధానాల వల్ల తాము నష్టపోతున్నామని పేర్కొంటూ జిల్లాలోని ఆక్వా రైతులు సోమవారం స్ధానిక కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. పెద్దసంఖ్యలో ఆక్వా రైతులు కలెక్టరేట్ ప్రధానద్వారం వద్ద నినాదాలు చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గిట్టుబాటు ధర లభించకపోతే తాము తీవ్రస్దాయిలో నష్టపోతామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎగుమతిదారులను కట్టడి చేయకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని, ఇదే పరిస్దితి ఎదురైతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. రొయ్యలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవటంతో తాము ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆక్వా రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ వారి వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం తనచేతుల్లో లేదని, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అమరావతిలో నేడు ఉన్నత స్ధాయి సమావేశం జరుగుతోందని, దానికి జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టరును పంపి పూర్తిస్ధాయి విషయాలను వెల్లడిస్తామన్నారు. జిల్లాలో ఆక్వారైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించి భవిష్యత్‌లో ఆక్వారంగం మరింత అభివృద్ధి సాధించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఐపిఆర్ మోహనరాజు, బిహెచ్ నాగేంద్రవర్మ, బిహెచ్‌వి సుబ్బరాజు, సిహెచ్‌వి రామరాజు, కె సూర్యనారాయణరాజు, కె గోపతివర్మ, జివి అనూప్‌వర్ధ, ఐఆర్‌కె రాజు, కె వెంకట్రాజు, శ్రీనివాసరాజు, జివిఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సిఎస్‌డిటిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
ఏలూరు, మే 21 : ఏలూరు సిఎస్‌డిటి ఎల్‌వి సాగర్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలిసి కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు రాష్ట్ర రెవిన్యూ అసోసియేషన్ కోశాధికారి కేశవనాయుడు, రాష్ట్ర రెవిన్యూ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసవర్మ, పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు కె రమేష్‌కుమార్, కార్యదర్శి ప్రమోద్‌లతో కలిసి కలెక్టర్ డాక్టర్ భాస్కర్‌ను కలుసుకుని సాగర్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాగర్‌పై విచారణ జరుగుతుండగా మధ్యలో సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తామని చట్టం తనపని తాను చేసుకుంటుందని, ఈ విషయంలో తానేమీ చేయలేనని త్వరలోనే విచారణ నివేదిక బట్టి నిర్ణయం అమలు చేస్తామని కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు.

గృహనిర్మాణానికి నిధుల కొరత లేదు
*కలెక్టర్ భాస్కర్

ఏలూరు, మే 21: గృహనిర్మాణానికి నిధుల కొరత లేదని, మరో వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 54 వేల ఇళ్లు మంజూరు చేశామని, ఆ ఇళ్లు అన్నీ యుద్దప్రాతిపదికపై పూర్తి చేసి గృహాప్రవేశాలు జరిగేలా గృహనిర్మాణసంస్ధ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రానున్న ఎనిమిది నెలలకాలంలో మంజూరు అయిన ఇళ్లు అన్నీ పూర్తికావాలన్నారు. గృహనిర్మాణానికి రాష్టస్ధ్రాయిలో కేటాయించిన బడ్జెట్‌లో 70 శాతం నిధులు కేవలం పశ్చిమగోదావరి జిల్లాకే గతంలో ఇచ్చారని, ఈ బడ్జెట్‌లో కూడా అదే పరిస్దితి కొనసాగిందన్నారు. వచ్చే ఏడాది నాటికల్లా అర్హతగల పేదలందరికి పక్కా ఇళ్లు మంజూరుచేసి ఇవ్వడానికి అవసరమైతే మరో వందకోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టరు భాస్కర్ చెప్పారు. గృహనిర్మాణ తీరుపై ఇకపై ప్రతిరోజూ సమీక్షిస్తానని, రోజువారీ ప్రగతిని పరిశీలిస్తానని, ఏడాది తర్వాత జిల్లాలో ఇల్లు లేదనే మాట వినపడకూడదన్నారు. అర్హతగల వారందరి పేర్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో పొందుపర్చామని, ఇంకా ఎవరైనా ఇల్లు కావాల్సి వస్తే వారి పేర్లను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు. జిల్లాలో పేదలకోసం నిర్మించే ఇళ్లకు అయా గ్రామంలోగాని, పట్టణంలోగాని స్ధలం ఉందా, లేదా అని పరిశీలించాలని తప్పనిసరి పరిస్ధితుల్లో భూసేకరణ చేసి ఇస్తామని ఒక్కొక్క ఇంటికి డెల్టాలో 50వేలు, అప్‌ల్యాండ్‌లో 25వేలు భూసేకరణ ఖర్చు చేస్తామే తప్ప లక్షలు లక్షలు వెచ్చించాలంటే సాధ్యం కాదన్నారు. చంద్రన్న బీమా పధకం అమలులో ఎంతో కష్టపడుతున్నప్పటికీ ప్రజాసంతృప్తిలో బాగా వెనుకపడ్డామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిశితంగా పరిశీలిస్తామని, ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఈవిధానాన్ని అమలుచేసి తీరాల్సిందేనన్నారు.
ఆదరణలో అందరికి న్యాయం
వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదరణ పధకాన్ని మళ్లీ ప్రవేశపెట్టిందని, దీనిద్వారా అర్హులైన బిసిలు అందరికి న్యాయం జరుగుతుందని కలెక్టరు చెప్పారు. ఈనెల 17నుండి మళ్లీ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభమైందని, ఏ వృత్తిచేస్తున్నా వారందరికి ఆధునిక పనిముట్లు, యంత్రాలు అందించి ఉత్పత్తి పెంచే యూనిట్ల స్ధాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 2.12లక్షల మంది బిసి లబ్దిదారులకు జిల్లాలో ఆర్ధికచేయూతను అందించేందుకు తగుప్రతిపాదనలు సిద్ధం చేశామని, 70శాతం సబ్సిడీపై రుణాలు అందిస్తామని కలెక్టరు భాస్కర్ చెప్పారు. జిల్లాలో అన్ని పశువులకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. మీ-సేవా, మీ-కోసం తదితర కార్యక్రమాల్లో ప్రజాసమస్యల పరిష్కారం తీరును కలెక్టరు సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు ఎం వేణుగోపాల్‌రెడ్డి, డిఆర్వో సత్యనారాయణ, గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు, డిపిఓ ఎం వెంకటరమణ, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మలకుమారి, ఇరిగేషన్ ఎస్‌ఇ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.