పశ్చిమగోదావరి

ఆకివీడులో చిరకాల సమస్యలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, మే 22: ఆకివీడులో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానికంగా ఉన్న అందేవారి బోదె, గంగానమ్మకోడు, మూలలంక బోదెల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రూ.15.5 కోట్లతో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చేతులమీదుగా బుధవారం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఆకివీడు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వివరాలు వెల్లడించారు. రూ.8.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు, రైల్వే కేబిన్ ఎదురుగా రహదారి నిర్మాణానికి రూ.1.5 కోట్లు, పైపులైను నిర్మాణంతోపాటు చెరువుల అభివృద్ధికి రూ.3.5 కోట్లు వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.2కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. ఈ నిధుల్లో పంచాయతీ మ్యాచింగ్ గ్రాంటు రూ.1.5 కోట్లు కాగా ఎమ్మెల్యే ల్యాడ్స్, ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేపట్టనున్నామన్నారు. అలాగే తాళ్లకోడులోని ఇండ్ల స్థలాలను జూన్ నెలాఖరుకు పేదలకు అందించనున్నామని చెప్పారు. వంతెన నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్డులు వేసి లే అవుట్లుచేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వీటిని ఎక్కడా అవకతవకలు లేకుండా నిరుపేదలకు అందించడానికి ప్రజాప్రతినిధులు, వార్డుసభ్యులతోపాటు తాను స్వయంగా లబ్ధిదారుల జాబితాను పరిశీలించి పారదర్శకంగా అందజేస్తామని చెప్పారు. తదుపరి స్టేజిలో దొరగారి చెరువును మల్టీప్లెక్స్‌గా మార్చి ఆకివీడు స్వరూపమే మారుస్తామన్నారు. బుధవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చే కలెక్టర్ భాస్కర్‌కు ప్రజలంతా ఘనంగా స్వాగతం పలకాలన్నారు. తొలుత కలెక్టర్ తాళ్లకోడు వంతెన నిర్మాణ పనులు పరిశీలిస్తారన్నారు. తర్వాత బైపాస్ రోడ్డు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం పాత బస్టాండు వద్ద ఉన్న గంగానమ్మకోడు తవ్వకం పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి రైల్వే కేబిన్ ఎదురుగా ఉన్న రహదారికి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే శివరామరాజు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ మనె్న లలితాదేవి, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎస్‌కె గోరీబాబు, కార్యదర్శి నందేటి ఠాగూర్ పాల్గొన్నారు.
జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేన్ సభ్యులుగా ఉప్పలపాటి
పాలకొల్లు, మే 22: జిన్నూరు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఉప్పలపాటి బాబు జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేన్ సభ్యులుగా ఎంపికయ్యారు. జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్ సింగనయ్య ఈ నియామకం చేశారు. పద్మభూషణ్ డాక్టర్ పుల్లెల గోపీచంద్ ఈ నియామక ఉత్తర్వును బాబుకు అందించారు. గ్రామీణ ప్రాంతంలో జన్మించి జాతీయ స్థాయికి బాబు ఎదగటం పట్ల మాంటిసోరీస్ సంస్థ అథినేత మద్దాల వాసు, ఎఎస్‌ఆర్ విద్యా సంస్థల అధినేత పిబివి సుబ్బరాజు, ఆదుర్తి రాధాకృష్ణ, అల్లం వెంకటరంగం తదితరులు హర్షం ప్రకటించారు.

ప్రముఖ న్యాయవాది గంధం మోహన్‌దాస్ మృతి

భీమవరం, మే 22: ప్రముఖ న్యాయవాది, విద్యాసంస్థల మాజీ అధ్యక్షుడు గంధం మోహన్‌దాస్ (84) మంగళవారం మృతిచెందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కెజిఆర్‌ఎల్ కళాశాల పాలకవర్గ మాజీ సభ్యులు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులుగా పనిచేశారు. దీంతోపాటు అనేక పదవులను ఆయన చేపట్టారు. పట్టణంలోని పలు సేవాసంస్థల సభ్యునిగా ఆయన సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ న్యాయవాదిగా, విద్యాసంస్థలకు అధ్యక్షులుగా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, డిఎన్నార్ కళాశాల పాలకవర్గ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ ఛైర్మన్ మెంటే పార్థసారధి, మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఉద్దరాజు కాశీవిశ్వనాధరాజు, చెరుకువాడ సోదరులు, వబిలిశెట్టి కనకరాజు, వైఎన్ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు, చీడే సత్యనారాయణ, డాక్టర్ యువి రమణారావు, కిరణ్‌కుమార్, తాడిమళ్ల గిరి, కొండూరి సుబ్రహ్మణ్యం, ఎన్‌విపి శేషసాయి తదితరులు భౌతిక కాయం వద్ద నివాళి అర్పించారు. డాక్టర్ యువి రమణరాజు నేత్రాలయానికి మోహన్‌దాస్ నేత్రాలు అందించామని ఆయన కుమారుడు డాక్టర్ విశే్వశ్వరరావు తెలిపారు.

నరసాపురం ఏఎంసీ నూతన కార్యవర్గం జూన్ 2న ప్రమాణ స్వీకారం
నరసాపురం, మే 22: నరసాపురం ఏఎంసీ నూతన కార్యవర్గం జూన్ 2న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు చెప్పారు. మంగళవారం స్థానిక రాయపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఎంసీ ఛైర్మన్‌గా టీడీపీ కార్యకర్త కొప్పాడ రవీంద్రనాధ్‌ను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. పార్టీకోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తోందనేదానికి కొప్పాడే నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో కొప్పాడ వంటి కార్యకర్తలు పార్టీని బతికించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పార్టీ అభివృద్ధికి రవీంద్రనాధ్ ఠాగూర్ చేసిన కృషికి గుర్తింపుగా ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆయనకు ఏఎంసీ ఛైర్మన్ పదవితో సముచిత స్ధానం కల్పించారని రామరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండారు పటేల్‌రాజా నాయుడు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఏఎంసీ ఛైర్మన్‌గా ఎంపికైన రవీంద్రనాధ్ ఠాగూర్ రైతులకు మేలైన సేవలు అందించాలని పటేల్‌రాజా నాయుడు ఆకాంక్షించారు. ఏఎంసీ ఛైర్మన్‌గా ఎంపికైన రవీంద్రనాధ్ ఠాగూర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి కల్పించిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషిచేస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు జక్కం శ్రీమన్నారాయణ, తంగెళ్ళ నాగేశ్వరరావు, తోటకూర శివాజీరాజు, పులపర్తి సత్యనాగేంద్రప్రసాద్, ముచ్చర్ల శ్రీనివాసు, అందే సత్యనారాయణ, సంధి నరసింహరావు, కొండేటి శ్రీనివాసు, పెదశింగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థగా తపాలా శాఖ
*మాజీ మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, మే 22: నిజాయితీగా ప్రజలకు సేవలందించే తపాలా ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల వేతన కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం తపాలా ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును తన కార్యాలయంలో కలిసి తపాల ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ గ్రామీణ తపాల ఉద్యోగుల వేతన కమిటిని అమలు చేసేందుకు కృషి జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన బ్యాంకిం ఆర్థిక సేవలు అందించే వ్యవప్థగా తపాలా శాఖను రూపుదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. గత వాజ్‌పాయ్ ప్రభుత్వంలోనే తపాలా ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అర్థ రూపాయి పోస్టు కార్డును, వంద రూపాయల మనీ ఆర్డర్‌ను సైతం కక్షిదారులకు ఖచ్చితంగా అందించే గ్రామీణ తపాలా ఉద్యోగుల సేవలు ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసునన్నారు. తపాలా శాఖను బహుముఖ ఆర్థిక సేవలందించే వ్యవస్థగా రూపుదిద్దేందుకు మంచి వేతనాలను ఇచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు యెగ్గిన నాగబాబు, కంచుమర్తి నాగేశ్వరరావు, జేఏసి నేతలు ఎం.రామ్మోహన్, ఎస్‌ఎన్‌వి ప్రసాద్, ఆనందరావు, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.