పశ్చిమగోదావరి

బోట్లు, లాంచీలకు సామర్ధ్యానికి అనుగుణంగా అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, మే 24: గోదావరి నదిపై ప్రయాణికులను తీసుకువెళ్లే టూరిజం బోటులు, లాంచీలకు ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి తగ్గట్టు అనుమతులు ఇస్తామని కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్ర తెలిపారు. గురువారం ఉదయం పోలవరం మండలం సింగన్నపల్లి వద్ద టూరిజం బోటులు, లాంచీలు పెర్రీ పాయింట్ల వద్ద ప్రయాణికులను గోదావరి నది దాటించే పడవలను పోర్టు కన్జర్వేటర్ కె వర్మతో కలిసి ధర్మశాస్త్ర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టు అధికారి ధర్మశాస్త్ర విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం గోదావరి నదిపై తిరిగే బోట్లకు కొత్త నిబంధనలు తీసుకువచ్చిందని, వాటి ప్రకారమే బోటు నిర్మాణం, ప్రయాణికుల సామర్థ్యం, లైఫ్ జాకెట్లు ఉంటేనే అనుమతులు ఇస్తామన్నారు. ప్రస్తుతం మూడు నెలలకు తాత్కాలికంగా అనుమతులిస్తామని, ప్రస్తుతమున్న సామర్థ్యానికి 50 శాతం మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తామన్నారు. అలాగే ఈ బోట్లలో వినియోగించే లైఫ్ జాకెట్లు ఆమోదయోగ్యం కాదని, తాము సూచించిన వాటినే అందుబాటులో ఉంచాలన్నారు. ఈ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగిస్తామన్నారు. ఈయన వెంట బోటు సూపరింటెండెంట్ జి ప్రసన్నకుమార్, ఐటీడీఏ పీవో హరేంద్రప్రసాద్, మత్స్య శాఖ ఇన్స్‌పెక్టర్ అబ్బులు తదితరులు ఉన్నారు.

జగన్‌కు ఘనస్వాగతం
ఆకివీడు, మే 24: వైఎస్ జగన్‌కు ఉండి నియోజకవర్గంలోని మహిళలు గురువారం స్వాగతం పలికారు. ఉదయానే పూలమాలలతో ఉండి మండలం ఆరేడు వద్ద వేచి ఉన్నారు. మహిళలు వేచి ఉన్న స్థలానికి జగన్ చేరుకున్నప్పుడు అన్నా అంటూ ముందుకు ఆప్యాయంగా వెళ్లారు. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మేకా పార్వతితో పాటు పలువురు మహిళలు అక్కడకు చేరుకుని జగన్‌కు స్వాగతం పలికారు. జగన్ పాదయాత్ర చేపట్టే రహదారిలో దారి పొడవునా మహిళలు ఆయనకు స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు.

ఆకివీడు చేపల మార్కెటకు భారీ వాలుగ చేపలు
ఆకివీడు, మే 24: ఆకివీడు చేపల మార్కెట్‌కు గురువారం భారీ వాలుగ చేపలు వచ్చాయి. వేసవికాలం కావడంతో ఈ ప్రాంతంలోని పంటబోదెలు, కాలవలలో మత్స్యకారులు వీటిని పడుతుంటారు. ఇవి ఒక్కొక్కటి 10 నుండి 15 కిలోల సైజు వరకు ఉన్నాయి. కేజీ వాలుగ చేప ధర రూ.200 వరకు పలికింది. వీటిని కొనుగోలు చేసేందుకు మాంస ప్రియులు ముందుకు వచ్చారు.

4.5 లక్షల కిలోల పొగాకు అమ్మకాలు
దేవరపల్లి, మే 24: దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఇప్పటి వరకూ 4.5 లక్షల కిలోల పొగాకు అమ్మకాలు జరిగినట్టు వేలం నిర్వహణాధికారి హనుమంతురావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ అత్యధిక ధర కిలో రూ.166లు కాగా, అత్యల్ప ధర రూ.110లని చెప్పారు. సరాసరి ధర రూ.154.25లని తెలిపారు. ఇప్పటి వరకూ సరాసరి ధర రూ.153.55లన్నారు. రైతులు పొగాకును వేలం కేంద్రానికి తీసుకురావాలని కోరారు.

ఆంధ్రాబ్యాంకు ఉద్యోగుల నిరసన
కొవ్వూరు, మే 24: వేతన సవరణ కోరుతూ కొవ్వూరు ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బ్యాంకు ఎదుట నినాదాలు చేశారు. తమ న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా కొవ్వూరులో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంకు ఉద్యోగులకు ప్రతీ ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరగాలని, కానీ 2017 అక్టోబరుతో గడువు తీరినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు అన్నారు. ఐబీఏ, బ్యాంకు ఉద్యోగుల తరపున యూఎఫ్‌బీయూ మధ్య చర్చలు విఫలమయ్యాయన్నారు. ఐబీఏ కేవలం రెండు శాతం జీతాలు పెంచడానికి మాత్రమే అంగీకరించడం బ్యాంకు ఉద్యోగులను అవమానించడమేనని, దానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్ పాటించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పి శ్రీనివాసరావు, వై రాధిక, ఎస్‌డి శ్యాంసన్, ఎ రాజేశ్వరి, బి వౌనిక, వి ప్రసాద్, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్నడూ చేయని రీతిలో బ్యాంకు ఉద్యోగులు 48 గంటలపాటు సమ్మెకు దిగుతున్నారు. దీనితో రెండురోజులపాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్‌లు ఇచ్చిన పిలుపుమేరకు ఈ సమ్మె చేస్తున్నారు.

జిఎంఆర్‌ను అరెస్టు చేసేంత వరకు ఆందోళన
ఏలూరు, మే 24: కొమడవోలు గ్రామ కార్యదర్శి యువి రత్నంపై దౌర్జన్యం చేసి నిర్బంధించి దుర్భాషలాడిన సర్పంచ్ సోదరుడు ఘంటా మోహనరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్టు చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ హెచ్చరించారు. గురువారం స్ధానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర, జిల్లాల కమిటీల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు యువి రత్నం మాట్లాడుతూ కొమడవోలు సర్పంచ్ సోదరుడు ఘంటా మోహనరావు తనపై ఏ విధంగా దాడి చేశాడో సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తన సోదరుని సర్పంచ్ పదవి పూర్తికావస్తోంది కాబట్టి అయదు లక్షల రూపాయల విలువైన రెండు రకాల చెక్కులను తయారుచేసి సొమ్ము తనకు అప్పచెప్పాలని మోహనరావు హుకుం జారీ చేశారన్నారు. అయితే తాను దానికి నిరాకరించినట్లు తెలిపారు. పనులు జరగకుండా, బిల్లులు లేకుండా ఏ విధంగా నిధులు విడుదల చేస్తామని ప్రశ్నించటంతో మోహనరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై దాడిచేసి దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. సంఘటన అనంతరం ఏలూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ రత్నంకు న్యాయం జరిగేంతవరకు రాష్ట్ర, జిల్లా కమిటీలు అండగా ఉంటాయని, అవసరమైతే రాష్టవ్య్రాప్తంగా కూడా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి నాగేశ్వరరావు, కార్యదర్శి కెవిఎల్ తనూజ, కోశాధికారి పిఎస్ శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు విజిఎంవిఆర్ కృష్ణారావు, సహాయ అధ్యక్షులు ఎల్ సత్యనారాయణ, శ్రీనివాస్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎన్‌జిఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్ హరినాధ్, చోడగిరి శ్రీనివాసరావులు సమావేశానికి హాజరై రత్నానికి సంఘీభావం తెలిపారు. సర్పంచ్ గంటా సత్యనారాయణ చెక్‌పవరు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెక్ పవరు ఉంటే ఇలాంటి అన్యాయాలే చేస్తారని, వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మోహనరావును అరెస్టు చేయాలి
కలెక్టరు, ఎస్పీలకు వినతి
కొమడవోలు పంచాయితీ సర్పంచ్ తమ్ముడు గంటా మోహనరావు పంచాయితీ కార్యదర్శి యువి రత్నంను అయిదులక్షలు అడ్వాన్సు చెక్కు కావాలని సర్పంచ్ ఇంటికి పిలిపించి ఇవ్వకపోతే చంపుతానని నానా దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించిన మోహనరావును తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా జెఎసి ఛైర్మన్ ఆర్‌ఎస్ హరినాధ్, కన్వీనర్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం రవిప్రకాష్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షులు వైకెడి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రమణ, జిల్లా గౌరవాధ్యక్షులు విజిఎంవి కృష్ణారావు, జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి కెవిఎల్ తనూజ, ఏలూరు తాలూకా ఎన్‌జిఓల అధ్యక్షులు ఐవిఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద తపాలా ఉద్యోగుల ధర్నా
ఏలూరు, మే 24: జిడిఎస్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికనాయకులు డిఎన్‌విడి ప్రసాద్, బండి వెంకటేశ్వరరావు, యు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావులు పేర్కొన్నారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ వద్ద తపాలా ఉద్యోగులతోపాటు ప్రజాసంఘాల నాయకులు సంయుక్తంగా ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. ధర్నానుద్దేశించి ప్రసాద్, వెంకటేశ్వరరావు, యువిలు మాట్లాడుతూ కమలేష్‌చంద్ర కమిటీ నివేదిక ప్రకారం 7వ వేతన సవరణ కింద వేతనాలు ఇవ్వాలని గత మూడురోజులుగా తపాలా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా కేంద్రప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కేంద్రం అమలుచేయటం లేదన్నారు. ప్రభుత్వశాఖలను ప్రైవేటీకరణ చేసే పనిలో మోదీలో నిమగ్నమయ్యారన్నారు. తక్షణమే మోదీ తన పద్దతి మార్చుకోవాలన్నారు. జిడిఎస్ ఉద్యోగులకు నెలసరీ వేతనం 18వేల రూపాయలు ఇవ్వాలని, అంతేకాకుండా పిఎఫ్, ఇఎస్‌ఐ, పెన్షన్ వంటి సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల జెఎసి నాయకులు బాపిరాజు, సత్యనారాయణ, స్వామి, మరియన్న, ఎడ్వర్డ్ తదితరులు పాల్గొన్నారు.