పశ్చిమగోదావరి

నెగ్గిపూడిలో వంతెన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమంట్ర, మే 25: పెనుమంట్ర మండలం నెగ్గిపూడి లాకుల వద్ద నుంచి చించినాడ వెళ్లే ఛానల్ దగ్గరలో కాలువ మధ్యలో పిల్లర్లతో అనుమతి లేకుండా వంతెన నిర్మించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే చేలకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో అనుమతి లేకుండా ఇలా కాలువలో పిల్లర్లు నిర్మిస్తే నీటి ప్రవాహం మరింత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. చించినాడ ఛానల్‌పై ఆధారపడిన యలమంచిలి, పోడూరు మండలాలకు చెందిన వందలాది రైతులు శుక్రవారం వంతెన నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు. వంతెన నిర్మాణ పనులు వెంటనే ఆపాలని నినాదాలు చేశారు. దీనితో నెగ్గిపూడి గ్రామస్థులకు, రైతులకు మధ్య సుమారు మూడు గంటలపాటు వాగ్వాదం జరగడంతోపాటు స్వల్పంగా తోపులాట జరిగింది. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు రంగప్రవేశంచేశారు.
దీనితో సంఘటనాస్థలానికి నరసాపురం నీటిపారుదల శాఖ డీఈ సీహెచ్ వెంకటనారాయణ, ఏఈ పి సత్యనారాయణ చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి ఈసమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ 17వేల ఎకరాలకు సాగు నీరందించడంతోపాటు, తాగునీటి చెరువులకు ఇదే ప్రధాన కాలువ అన్నారు. ఈ కాలువపై సుమారు 18 నుంచి 20 గ్రామాలు ఆధారపడి ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని ఆటంకపరిచే వంతెన నిర్మాణ పనులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఎకరానికి సుమారు 60బస్తాలు అందరూ పండిస్తుంటే తాము నీరందక కనీసం పాతిక బస్తాలు కూడా పండించలేని దుస్థితిలో ఉన్నామన్నారు. ఎత్తిపోతల పథకం కింద నక్కల కాలువ నుంచి ఉప్పునీరును తీసుకోవడంతో వరిచేలు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకునే నాయకులే కరువయ్యారని వారు వాపోయారు.
ఇరిగేషన్ డీఈ మాట్లాడుతూ కాలువపై బ్రిడ్జి నిర్మాణం విషయమై తమకు సమాచారం లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పదిలక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మిస్తున్నట్టు తెలిసిందన్నారు. కాగా ఇరిగేషన్ ఏఈ పి సత్యనారాయణతో చెప్పి ఆయన సలహా మేరకే ఈ పనులు ప్రారంభించామని పంచాయతీరాజ్ ఏఈ ఎస్ నాగిరెడ్డి ఈసందర్భంగా పేర్కొనడం గమనార్హం. ఈ సమస్యను త్వరలో పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళన కారణంగా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మండుటెండలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ అధికార్ల హామీ
-ఎమ్మెల్యే రామానాయుడు

పాలకొల్లు, మే 25: చించినాడ కాలువపై నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ అధికార్లు హామీ ఇచ్చారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా చించినాడ కాలువ నుండి భూమికి సమాంతరంగా కాకుండా పైనుండి నీరు సరఫరా అవుతున్నందున పోడూరు, యలమంచిలి మండలాల్లోని సుమారు రెండు వేల ఎకరాలకు సాగు నీరు, పలు గ్రామాలకు తాగునీరు సమస్య తలెత్తుతోందన్నారు. గోదావరిలో నీటి ఎద్దడి తలెత్తినపుడల్లా ఈ కాలువ కింద ఉన్న రైతులకు నీరుఅందక రెండు వేల ఎకరాలు పంట పండించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీనికితోడు ఈ కాలువకు దగ్గర్లో నర్సాపురం కెనాల్‌పై వంతెన నిర్మాణం చేబట్టి కాలువ మధ్యలో పిల్లరు నిర్మాణానికి దిమ్మ కట్టడంవల్ల నీటి ప్రవాహానికి మరింత ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈసమస్యపై ఇటీవల జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడానన్నారు.
కాగా ఆందోళనకు గురైన యలమంలిచిలి, రావిపాడు, పెనుమదం, పోడూరు, పెనుమర్రు తదితర ప్రాంతాల నుండి రైతులు వంతెన నిర్మాణ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారన్నారు. దీనిపై ఇరిగేషన్ ఛీప్ ఇంజనీరు, సూపరింటెంటింగ్ ఇంజినీర్లతో మాట్లాడానని ఎమ్మెల్యే తెలిపారు.
వెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఇరిగేషన్ ఇంజినీర్లు హామీయివ్వడంతో రైతులు ఆందోళన విరమించారన్నారు. సమస్యను పరిష్కరించకపోతే రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని ఎమ్మెల్యే రామానాయుడు హెచ్చరించారు.