పశ్చిమగోదావరి

మళ్లీ రోహిణీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 17: రోహిణి కార్తెలో రోకళ్లు బద్దలవుతాయని నానుడి. ఇంతకుముందు అలా బద్దలుకావటం ఎంతమంది చూశారోగాని ఇప్పుడున్న పరిస్దితి చూస్తే ఆ రోకళ్లే ఉంటే నిజంగా బద్దలవుతాయి అన్పించేలా ఎండలు జనాన్ని విలవిలలాడేలా చేస్తున్నాయి. మరచిపోయాం ఇంకా ఎండకాలంలో ఉన్నామేమో అన్పించేలా ఎండలు మాడ్చేస్తున్నాయనే చెప్పాలి. రుతుపవనాలు వచ్చేసి నాలుగురోజులు తొలకరి పలకరించి వెళ్లిపోగా ఆతర్వాత మళ్లీ రోహిణీకార్తె వచ్చిందేమో అన్నట్లుగా భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మరోసారి వెనక్కి తిరిగి వచ్చేశాయి. గత మూడు,నాలుగురోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ దానికితోడు వడగాల్పులు కూడా జతగా రావటంతో జనం అంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. వీటికిమించి వడగాలులు తమ ప్రతాపాన్ని పూర్తిస్ధాయిలో ప్రదర్శిస్తున్నాయి. దీంతో సహజంగానే జనం అంతా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా వడగాలుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆదివారంనాటి పరిణామంలో పలు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలోనే వడగాలుల ప్రభావానికి గురై చికిత్స పొందుతున్నవారు ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగిపోతుందని అనుమానిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చేరినవారు అధికశాతం మంది కూలీనాలి చేసుకుంటున్నవారే. మిగిలిన వర్గాల్లో ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికసంఖ్యలోనే చేరిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈపరిస్దితి మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. అటు పిల్లల ఆసుపత్రులు, ఇటు సాధారణ అసుపత్రులు కూడా వడగాలుల ప్రభావానికి గురైనవారితో కిటకిటలాడిపోతున్నాయి. సిలైన్ల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తంగా చూస్తే గత నాలుగు రోజులుగా 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత నమోదవుతూ వచ్చి ఆదివారంనాటికి 42కు చేరిపోయింది. తొలకరి వర్షాలు కురిసిన తర్వాత కూడా ఈస్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావటం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేవని, అయితే కొంత వేడిమి కొనసాగేదని, కానీ ఇలా వడగాల్పుల తరహాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవటం ఈమధ్యకాలంలో చూడలేదని ఎంతోమంది వృద్ధులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎండవేడిమి, వడగాలుల తీవ్రతను పరిశీలిస్తే ఉష్ణోగ్రతలు రెట్టింపు అయ్యాయా అన్న అనుమానం రాకమానదు. మధ్యాహ్న సమయానికి తీవ్రస్దాయికి చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు ఉదయం నుంచే ప్రారంభం కావటం గమనార్హం. అ వేడి రాత్రి సమయానికి కూడా పెద్దగా తగ్గుముఖం పట్టకపోవటం, ఉక్కపోత, వడగాలుల ప్రభావం పొద్దుపోయే వరకు కొనసాగుతూనే వస్తోంది. ఈనేపధ్యంలో వచ్చే మూడు,నాలుగురోజుల్లో మరింత భారీగా వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పరిస్ధితుల్లో రానున్న కొద్దిరోజులపాటు వృద్ధులు, పిల్లలు కొంత అప్రమత్తంగానే ఉండకతప్పదని చెపుతున్నారు. అకాల ఎండల తరహాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన నేపధ్యంలో పగటిపూట ప్రయాణాలు మానుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాగా ఇంతకుముందు వేసవికాలంలో ఉష్ణోగ్రతల ధాటికి జనం విలవిలలాడుతున్న పరిస్దితుల్లో ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయటంతో ఊరువాడా చలివేంద్రాల నిర్వహణ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. స్ధానిక రాజకీయనాయకులు, వివిధ ప్రజాసంఘాలు, దాతలు చలివేంద్రాలు ఏర్పాటుచేయటంలో ఉత్సాహంగా ముందుకొచ్చారు. అయితే అవన్నీ తొలకరి పలకరింపుతో దాదాపుగా మూతపడ్డాయనే చెప్పుకోవాలి. కానీ పరిస్దితి మళ్లీ తిరగబెట్టడంతో పగటిపూట చలివేంద్రాల కోసం జనం ఎదురుచూసే పరిస్దితి మళ్లీ వచ్చేసింది. గతంలో చలివేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఆ నిధులు ఖర్చు పెట్టకుండానే పలుచోట్ల స్వచ్చందసంస్ధల ఆధ్వర్యంలో పెద్దఎత్తున వీటి ఏర్పాటు జరిగింది. తిరిగి ఇప్పుడు ఎండలు పెరిగిన దృష్ట్యా ప్రభుత్వ నిధులతో చలివేంద్రాలు ఏర్పాటుచేసి మరికొన్ని రోజులపాటు నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.