పశ్చిమగోదావరి

జోరుగా చేపలు చెరువుల తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు,జూన్ 21: ఆకివీడు మండలంలో చేపల చెరువుల తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. పంట పండని చేలను చేపల చెరువుల అనుమతులుకోసం కొంతమంది రైతులు అధికారులను ఆశ్రయిస్తుంటే ఇదే అదునుగా కొంతమంది రైతులు అనుమతులు లేకుండానే చేపలు చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు. దీంతో ఈ విషయం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఆకివీడు మండలంలో కుప్పనపూడి గ్రామంలో ఇదే తరహాలో గ్రామంలోని తోటవీధిలో సుమారు ఎకరా 44సెంట్ల విస్తీర్ణంలో నంద్యాల వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి చేపల చెరువుల తవ్వకాన్ని జరిపాడు. అయితే ఇదే ప్రాంతంలో మంచినీటి చెరువు, పాఠశాల, జనావాసాలు ఉన్నాయంటూ ఈ ప్రాంతానికి చెందిన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. చేపల చెరువుల తవ్వకాల వల్ల తమ ప్రాంతానికి మంచినీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆరోపించారు. బుధవారం నిర్వహించిన రెవెన్యూ సమావేశంలో ఈ ప్రాంతానికి చెందిన మహిళలు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము మంచినీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కరించలేదంటూ మరోసారి ఆందోళనకు దిగారు. అయితే విషయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎఫ్‌డిఒ వానపల్లి సత్యనారాయణను మహిళలు సమస్య తేల్చేవరకు కదలనిచ్చేది లేదని నిర్బంధించారు. చేపల చెరువు పరిసర ప్రాంతంలోనే మహిళలు ఎఫ్‌డిఒ సత్యనారాయణతోపాటు ఆకివీడు వీఆర్వో రత్నరాజును ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. అయితే అక్కడే పలు చెరువులు తవ్వారని అనుమతులు నివాసాల మధ్య ఎలా ఇచ్చారంటూ అధికారులను కుప్పనపూడికి చెందిన మహిళలు నిలదీసారు. దీనికి సీపీఎం నాయకులు బైరి ఆంజనేయులు, గేదెల అప్పారావులు సంఘీభావం తెలిపారు. అనుమతులు లేని చేపలచెరువు గట్లను ఎఫ్‌డిఒ సత్యనారాయణ పొక్లెయినర్‌తో ధ్వంసం చేయించారు. అయినా మహిళలు శాంతించలేదు. దాదాపు 3గంటల పాటు అధికారులను వెళ్లనివ్వలేదు. అనుమతులు ఇచ్చిన వీఆర్వోను దానికి సహకరించిన అధికారులెవరో తమకు తెలపాలంటూ గ్రామానికి చెందిన మెంటే లక్ష్మణ్‌తోపాటు పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రజలు ఎంతోకాలంగా మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నా అధికారులు సమస్య పరిష్కరించలేదని ఈలోపు చేపలచెరువులకు అధికారులు అనుమతులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. దీనిపై ఎఫ్‌డిఒ సత్యనారాయణ వివరణ ఇస్తూ ఆ సమీప ప్రాంతంలోని అనుమతులు పొందిన పాండురంగారావు తన పొలం పంట పండకపోవడంతో చేపలచెరువుగా అనుమతి పొందారని అన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇరిగేషన్ ఎఈ, అగ్రికల్చరల్ ఏవో, తహసీల్దారు, గ్రౌండ్ వాటర్ ఎఫ్‌డిఒ ద్వారా కలెక్టర్ అనుమతులు పొందుతారని వివరించారు. అనుమతులు పొందిన చేపలచెరువులవల్ల అభ్యంతరాలను ఉన్నతాధికారులకు వివరిస్తానని ఆయన మహిళలకు వివరించారు. తక్షణమే ఆందోళన విరమించాలని కోరారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. దీంతో ధ్వంసం చేసిన చేపల చెరువు యజమాని సత్యనారాయణ మాట్లాడుతూ తన చెరువుతోపాటు అన్ని చెరువులు ధ్వంసం చేయాలంటూ ప్రొక్లైనర్‌కు అడ్డుగా నిలబడి ఆందోళన జరిపారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. అయితే కుప్పనపూడిలో కొంతకాలంగా గుంబనంగా సాగుతున్న రాజకీయం మరోసారి తెరమీదకు వచ్చింది. తెర వెనక రాజకీయం చేస్తున్న నాయకుల వల్లే గ్రామంలో ఈ ఆందోళనకు ప్రధానకారణంగా గుసగుసలు వినపడుతున్నాయి.