పశ్చిమగోదావరి

ఏజన్సీలో అత్యవసర సేవలకు 12 జియో టవర్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, జులై 17: పశ్చిమ ఏజన్సీలో అత్యవసర సేవలకు వీలుగా సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు వివిధ గ్రామాల్లో 12సెల్ టవర్లను నిర్మించడానికి జియో నెట్‌వర్క్‌తో ఎంవోయు కుదుర్చుకున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి హరేంద్రియప్రసాద్ తెలిపారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏజన్సీలో సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. బయోమెట్రిక్, డేటా సర్వీస్, కనెక్టివిటీ, ఎమర్జన్సీసేవలు, ఇతర వ్యవస్థలలో మెరుగైన పనితీరుకు సమాచారవ్యవస్థను అభివృద్ధి చేసేపనిలో భాగంగా సెల్‌టవర్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టవర్లను బుట్టాయగూడెం, పులిరాముడుగూడెం, వింజరం, సీతారామనగరం, ప్రగడపల్లి, తొండిపాక, రెడ్డిగణపవరం, నాగంపాలెం, చీమలవారిగూడెం, కుర్సకన్నప్పగూడెం, దామరచర్ల, పైడిపాకలలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి క్రింద ఇచ్చిన భూములకు ఫెన్సింగ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పివో హరేంద్రియప్రసాద్ పేర్కొన్నారు. ఈఏడాది 500 ఎకరాల నిర్వాసితుల భూములకు ఫెన్సింగ్‌ను నిర్మించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ భూముల్లో పామాయిల్ సాగుచేయడంతో జంగారెడ్డిగూడెంకు చెందిన నవభారత్ పామాయిల్ కంపెనీ ఫెన్సింగ్ నిర్మాణంలో 50శాతం ఖర్చు భరిస్తుందని, మిగిలిన 50శాతం ఐటిడిఎ మంజూరు చేస్తుందని అన్నారు. నవభారత్ కంపెనీ రైతులకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు భరించి పామాయిల్ మొక్కలు ఇచ్చి, మొక్కలు పాతడానికి కూడ సొమ్ములు చెల్లింస్తుందని తెలిపారు. ఇందుకుగాను ప్లాంటేషన్‌పై రైతుకు వచ్చే సబ్సిడీ మొత్తాన్ని నవభారత్ కంపెనీ తీసుకుంటుందని వివరించారు. నవభారత్ రైతుకు పెట్టిన ఖర్చులో 50శాతం మాత్రం ఐదేళ్ళ తరువాత పంటకాలంలోవడ్డీ లేకుండా ఐదు నుండి పదేళ్ళ కాలవ్యవధితో తిరిగి తీసుకుంటుందని అన్నారు. ఐటిడిఎ నుండి ప్లాంటేషన్‌కు పెట్టిన 50శాతం మాత్రం రికవరీ ఉండదని చెప్పారు. పామాయిల్ వేసిన మొదటి, రెండవ సంవత్సరాలలో అంతరపంటలుగా అల్లం, మిరియాలు, అనాసపండ్లు, కోకో సాగుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈఏడాది అనాస, మిరియాలు పంటలను 20 నుండి 50 ఎకరాలలో సాగుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మొక్కల పెంపకానికి ఒక ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటుచేసే గ్రీన్‌హౌస్‌లు ఒక్కొక్కటి సుమారు రూ.17లక్షల ఖర్చు కాగల ఐదు యూనిట్లు 75శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. రైతువాటా సొమ్ము సుమారు రూ.4లక్షలకు బ్యాంకు నుండి సహాయం కోసం సిఫారసు చేస్తామని అన్నారు. పామాయిల్ సాగుచేసే నిర్వాసితుల భూముల్లో మొక్కలు విస్తరించి అంతరపంటల వలన ఆదాయం ఉండని మూడవ, నాల్గవ సంవత్సరాలలో ఎకరానికి రూ.12వేల చొప్పున తిరిగి చెల్లించని విధంగా ఆర్ధికసహాయం కంపెనీ అందిస్తుందని తెలిపారు. నిర్వాసితులకు నిర్మించే ఇళ్ళను మరింత సౌకర్యవంతంగా నిర్మించేందుకు వీలుగా నిర్మాణ వ్యయాన్ని పెంచేందుకు సమీక్ష చేస్తున్నట్లు పివో చెప్పారు.
త్వరితగతిన నిర్వాసితుల గృహాల నిర్మాణం
బుట్టాయగూడెం, జులై 17: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఎజన్సీలో 5300గృహాలను నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. నిర్మాణదశలో ఉన్న గృహాలను పరిశీలించడానికి మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దారు కార్యాలయంలో విలేకరులతో పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం, దొరమామిడి, జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం, దర్భగూడెం, స్వర్ణవారిగూడెంలలో నిర్వాసితులకు గృహనిర్మాణాలు జరుగనున్నట్లు చెప్పారు. ఈ గృహాలను రెండు పడకగదులు, ఒక వంటగది, ఒకహాలుతో నిర్మంచడానికి నమూనాలను ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు, అనుమతులు రాగానే గృహనిర్మాణ పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ఎన్‌టిఆర్ గృహనిర్మాణపథకంలో జిల్లావ్యాప్తంగా 201819 సంవత్సరానికి నిర్మిస్తున్న 22,100 గృహాలలో 7,600పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ నిర్మాణదశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. 201617కు సంబంధించి 18,504 ఇళ్ళ నిర్మాణంలో 342 పెండింగ్‌లో ఉన్నట్లు, 201718 సంవత్సరానికి 17,703కు గాను 9,800 పూర్తయినట్లు స్పష్టంచేశారు. పిఎంఇవై పథకంలో 7,430కు గాను 2700 పూర్తయ్యాయని మిగిలినవి పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇంటిపథకంలో జిల్లాలో 13వేల గృహాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికి వాటిలో ఏడువేల ఇళ్ళు నిర్మాణం పూర్తిచేశామని తెలిపారు. ఈయన వెంట డిఇ శ్రీనివాస్, ఎఇ కుమార్, ఇన్‌ఛార్జి డిఇ రత్నరాజు, తదితరులు ఉన్నారు.

నిర్వాసితుల భూములు నిర్వాసితులే సాగు చేసుకోవాలి
జీలుగుమిల్లి, జులై 17: పోలవరం నిర్వాసితులకు కేటాయించిన భూములను నిర్వాసితులే సాగు చేసుకోవాలని, ఇతరులకు కౌలుకు ఇవ్వడం కుదరదని రెవెన్యూ, పోలీసు అధికారులు స్పష్టంచేశారు. మండలంలోని పాకలగూడెంలో మంగళవారం నిర్వాసితుల భూముల వద్ద నిర్వాసితులకు, స్థానిక గిరిజనులకు మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు చోటుచేసుకున్నాయి. పాకలగూడెం సంబంధించిన 400 ఎకరాలను వేలేరుపాడు మండలం కన్నాయిగూడెం, సాగరపల్లి, రుద్రంకోట, మెట్టగూడెంకు చెందిన నిర్వాసితులకు కేటాయించారు. వారికి కేటాయించిన భూములను నిర్వాసితులు సాగుచేయకుండా గిరిజనేతరులకు కౌలుకు ఇస్తున్నారని స్థానిక గిరిజనులకు, నిర్వాసితులకు మధ్య కొన్నిరోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాలు మంగళవారం తీవ్రస్థాయికి చేరడంతో పోలవరం సిఐ రమేష్‌బాబు, స్థానిక ఎస్సై చెన్నారావు పాకలగూడెం సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో, రెవెన్యూ అధికారులతో చర్చలు జరిపారు. నిర్వాసితుల భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని, ఎవరి భూముల్లో వారే స్వయంగా సాగు చేసుకోవాలని స్పష్టం చేశారు. హద్దులు మీరి ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఐ లావణ్య, విఆర్వో నాగేశ్వరరావు, ఎఎస్సై జయరాజు, వేలేరుపాడు మండల టీడీపీ అధ్యక్షుడు చీమల వెంకటేశ్వరరావు, సర్పంచ్ సపోటా సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.