పశ్చిమగోదావరి

ఇకపై చిన తిరుపతిలో వడ ప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూలై 17: శ్రీవారి భక్తులకు అతి త్వరలో మరో మధురమైన ప్రసాదం అందనుంది. తిరుమల తిరుపతిలో మాత్రమే లభించే వడ ప్రసాదం ఇకపై చిన్నతిరుపతిలో కూడా దొరకనుంది. వాటి తయారీ విధానం, విక్రయాలు వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన శ్రీవారి దేవస్థానం ఈవో దంతులూరి పెద్దిరాజు అక్కడ ప్రసాదాల తయారీ విధానాన్ని, అలాగే అన్నదాన సదన నిర్వహణ, పలు విభాగాలతోపాటు అధునాతన యంత్రాల పనితీరును పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ తయారయ్యే ఎంతో రుచికరమైన వడ ప్రసాదాన్ని చినవెంకన్న భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇక్కడి ఆలయంలో పనిచేసే ఇద్దరు వంట స్వాములను తిరుమల తిరుపతికి పంపి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని యోచిస్తున్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న చినవెంకన్నకు అర్చక స్వాములు ప్రతినిత్యం 11రకాల ప్రసాదాలను నివేదిస్తున్నారు.
అదేమిటంటే: ఉదయం 5.30గంటలకు దద్దోజనం, కట్టుపొంగలి, పులిహోర, చక్కెర పొంగలి, మధ్యాహ్నం 1గంటకు అన్నం, కదంబం, మధ్యాహ్నం 3.30 గంటలకు వడ పప్పు, సాయంత్రం 4.30 గంటలకు అప్పాలు, చిట్టిగారెలు, రాత్రి 9గంటలకు క్షీరాన్నం, ప్రతీ శుక్రవారం అమ్మవార్లకు పులిహోర. ఇందులో భక్తులకు తెలిసినవి, అందేవి మూడు రకాలే. లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి మాత్రమే. ఇందులో లడ్డూ అంటే భక్తులకు ఎంతో ప్రీతికరం. త్వరలో చేరనున్న వడ ప్రసాదం విక్రయాలు జరిగితే లడ్డూతో సమానంగా వాటిని కూడా భక్తులు కొనుగోలు చేస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా ఎంతో భక్తిప్రపత్తులతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాల్లో వడ ప్రసాదం చేరబోతోందని తెలిసిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు పూరిళ్లు ధ్వంసం
వేలేరుపాడు, జూలై 17: వేలేరుపాడు మండలంలో గత 15రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంగళవారం వివిధ గ్రామాల్లో నాలుగు పూరిళ్లు కూలాయి. ఇందులో గుంపెనగూడెం గ్రామానికి చెందిన మడకం భద్రం, శివకాశీపురానికి చెందిన పొనుగుపాటి భవానీ, రుద్రంకోటకు చెందిన సామా వెంకటేశ్వర్లు, గోపు జగ్గారావు గృహాలు నేలకూలాయి. దీనితో ఈకుటుంబీకులంతా తమ గృహాల్లోని సామాగ్రిని పైనున్న తాటాకులు తొలగించి చుట్టుపక్కల గృహాల్లో కొంతమేర భద్రపర్చుకున్నప్పటికీ మరెంతో సామాగ్రి వర్షంలో తడిచి పాడవ్వడం జరిగింది. అసలే పనులు దొరకని ఈ రోజుల్లో డెక్కాడితేనేగానీ డొక్కాడని తాము గృహాలు నిర్మించుకునేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేయడం బాధితుల వంతయ్యింది. ఎంతోకొంత ఆర్థిక సహాయం అందించి గృహాలు నిర్మించుకునేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
వివాదాస్పదంగా మారిన కైలాస నిలయం భవనం
ఆకివీడు, జూలై 17: ఆకివీడులోని కైలాస భవనంలో మృతదేహాన్ని పూడుస్తామంటూ సాలిపేట ప్రాంతానికి చెందిన ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతానికి చెందిన బైసా రంగనాయకులు (59) మృతిచెందాడు. అయితే అమృతరావుకాలనీలోని శ్మశాన వాటికలో వర్షపునీరు నిలిచి ఉందని మృతదేహాన్ని పూడ్చడానికి వీలు పడలేదంటూ ఈ ప్రాంతవాసుల వాదన. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతానికి చెందిన వాసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లయన్‌క్లబ్‌కు కైలాసనిలయం కోసం 5 సెంట్ల స్థలాన్ని పంచాయితీ ఇస్తూ తీర్మానం చేస్తే దానిని 20 సెంట్లకు పైగా ఆక్రమించి భవనాన్ని నిర్మించారని సాలిపేట వాసులు ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై వీరవాసరం తహసీల్దార్ ముక్కంటి విచారణ జరిపారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. అయితే మళ్లీ మంగళవారం ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రంగనాయకులు మృతదేహాన్ని పూడ్చడానికి ప్రదేశం లేదని ఈ ప్రాంతవాసులు మృతదేహంతో కైలాస నిలయంకు చేరుకుని ఆందోళన చేశారు. ఆక్రమించిన ప్రాంతంలో గోతులు తవ్వి పూడుస్తామంటూ గోతులు తవ్వడం ప్రారంభించారు. ఈ విషయంపై లయన్స్ ప్రతినిధులు చెబుతున్నా వారు వినకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తమ కులానికి చెందిన వారు తమ పూర్వీకులను సైతం ఇక్కడే పూడ్చిపెట్టారంటూ వాదనలకు దిగారు. కేవలం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లయన్స్‌క్లబ్ ఈ తరహా ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపించారు. లయన్స్ ప్రతినిధులు జేఎస్సార్, సిరాజుద్దీన్, నేరెళ్ల రామచెంచయ్య, నందిగామ ఫణి, రాకుర్తి హరనాథరావులు ఆందోళనకారులకు నచ్చచెప్పినా ఫలితం కన్పించలేదు. పలుమార్లు ఎస్సై సుధాకర్‌రెడ్డి ఆందోళనకారులతో చర్చించారు. విషయం విచారణలో ఉన్నందున తదుపరి నివేదిక వచ్చాక చర్యలు చేపడతామని వారికి నచ్చచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి బయటకు తరలించారు.