పశ్చిమగోదావరి

కబ్జాలరాయుళ్లుగా టీడీపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 13: అవినీతి పాలనను అడ్డుకోవాలని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, తెలుగుదేశం నాయకులు తాడేపల్లిగూడెంను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ప్రభాత్ సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై పవన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంకు తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన, మాట తప్పిన ప్రభుత్వాలు అవసరం లేదని, బాధ్యతతో కూడుకున్న ప్రభుత్వాలు రావాలన్నారు. పదవులు ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సినిమాల్లో కోట్లు వస్తున్నా వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పాలన అధ్వాన్నంగా ఉందని, చెరువులు పూడ్చేసి ప్లాట్లుగా అమ్మేసుకుంటున్నారని విమర్శించారు. స్వర్ణాంధ్ర కాదని, దోపిడీ ఆంధ్రాగా తెలుగుదేశం పాలన ఉందన్నారు. రాజకీయ జవాబుదారీతనమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందన్నారు. జనసేనకు అజెండా లేదని విమర్శిస్తున్నారని, అజెండా లేకపోతే ఇంత మంది ఎందుకు వస్తున్నారన్నారు. వెన్నుపోటు పొడిపించుకోడానికి ఎన్టీఆర్‌లా తాను అమాయకుడిని కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను క్షమించేది లేదని, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తన తల్లిని, ఆడపడుచులను దూషించిన వారిని క్షమించేది లేదన్నారు. జగన్‌కు కూడా ఇదే సమాధానమన్నారు. జనసైనికులు వారిని వారు రక్షించుకోవడమే కాకుండా వీధి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు సమానమనే సంకేతంగా జనసేనకు పిడికిలి గుర్తును ఏర్పాటు చేశామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం జనసేన లక్ష్యమన్నారు. ముస్లిం, మైనార్టీలకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి తప్పకుండా చూస్తామన్నారు. కులాన్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని సీఎం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కులాన్ని నమ్ముకుంటే చంద్రబాబుకు ఎందుకు మద్దతునిస్తానని ప్రశ్నించారు. రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ సవరణ ప్రకారం కాపు రిజర్వేషన్లకు అండగా ఉంటామన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. మానసిక వికలాంగులకు, దివ్యాంగులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జనసేన నేత యర్రా నవీన్, వట్టి సత్య, సోమలంక శేషు, పుల్లా బాబి తదితరులు పాల్గొన్నారు.
ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జి తేలేరా
అంతకు ముందు నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఎలాగూ సాధించలేకపోయన తెలుగుదేశం ప్రభుత్వం కనీసం నిడదవోలు పట్టణానికి నాలుగేళ్లలో ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జి తేలేకపోయందని ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీ మురళీమోహన్ ఈ విషయంలో ఏం చేస్తున్నారని నిలదీశారు.
బహిరంగ సభలో యువకులు చేసిన రెడ్ రెవెల్యూషన్ నినాదం తనకు బాగా నచ్చిందని, ప్రతీ గ్రామంలో, మండలంలో యువకులు సమస్యలను గుర్తించి, ఎరుపు రంగుతో రాసిపెట్టాలని సూచించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
కాగా బహిరంగ సభలో వృద్ధురాలు ఇబ్బందికి గురవుతుండటాన్ని గమనించిన పవన్ ఆమెను వేదికపైకి పిలిపించి, అక్కున చేర్చుకున్నారు. చలికి వణికిపోతున్న ఆమెకు తన మెడలోని ఎరుపు తుండును కప్పారు. ఆమె అక్కడే ఉంటానని చెప్పడంతో కుర్చీ వేయంచి, గొడుగు పట్టించారు.

క్షేత్రస్థాయ సమస్యలు నా వరకు వస్తే అధికార్లకు షోకాజ్
*కలెక్టర్ భాస్కర్ హెచ్చరిక
ఏలూరు, ఆగస్టు 13 : క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్ వరకు వస్తే అది క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంగా భావించి వారికి షోకాజ్ నోటీసును జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డ్రైన్, పారిశుద్ధ్యం వంటి చిన్న సమస్యలు సైతం పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మీకోసం కార్యక్రమానికి వస్తున్నారన్నారు. తమ సమస్యలు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని మీకోసం కార్యక్రమంలో ప్రజలు తన వద్దకు రావడం జరుగుతోందని చెప్పారు. దీనిని బట్టి క్షేత్రస్తాయిలో అధికారులు ప్రజా సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నట్లు అవగతమవుతోందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు తన వద్దకు వస్తే ముందుగా వాటిని పరిష్కరించనందుకు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తదుపరి ఇంకా నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయడానికి కూడా తాను వెనుకాడబోనని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను, ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ తమ గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, పందులు దర్శనమిస్తున్నాయని, వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరారు. వీరవాసరం నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ తమ గ్రామంలో పశువుల డాక్టర్ భీమవరంలో నివాసముంటూ సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ విచారణ చేసి రుజువైతే సదరు డాక్టర్‌కు షోకాజు నోటీసు జారీ చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. నర్సాపురం నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ నర్సాపురం ఆసుపత్రిలో తన సోదరిని కాన్పు కోసం జాయిన్ చేశామని, అయితే వార్డులోని ప్రతీ వారికి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్వయంగా పరిశీలన జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని డి ఎంహెచ్ ఓను ఆదేశించారు. లింగపాలెం మండలం టిపిహెచ్ ఆర్ పాలెం నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ గ్రామంలోని చెరువు మధ్యలో అక్రమంగా బోరు వేశారని, అంతేకాకుండా కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చారని చెప్పారు. దీనిపై కలెక్టర్‌స్పందిస్తూ చట్ట విరుద్ధంగా బోరు వేయడమే కాకుండా దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమేమిటంటూ ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి సంబందిత వి ఆర్‌వో, ఆర్ ఐ, తహశీల్దార్లకు షోకాజు నోటీసులు జారీ చేయాలని డి ఆర్‌వోను ఆదేశించారు. వచ్చే వారంలోగా చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, డిఆర్‌వో సత్యనారాయణ, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

టెండరు దశకు ఆర్వోబీలు
ఉండి, ఆగస్టు 13: జాతీయ రహదారిపై నిర్మించబోయె ఆర్వోబీలు టెండరు దశకు చేరుకున్నాయని జాతీయ రహదారుల శాఖాధికారి ఒకరు తెలిపారు. జాతీయ రహదారిపై ఉండి వద్ద నిర్మించబోయే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఒబి)కి సంబంధించి ఇప్పటికే భూసేకరణకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. ఇక స్థలం కోల్పోతున్న వారికి నగదు ఇవ్వవలసి ఉంది. ఇచ్చిన తరువాత నిర్మాణ ప్రకియ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఇందుకు సంబంధించి నగదు కూడా మరో రెండు వారాల్లో ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ అధికారులతో రాష్ట్రానికి సంబంధించిన జాతీయ రహదారుల శాఖ అధికారులు కూడా సోమవారం జరిగే చర్చల్లో పాల్గొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భేటీలో రహదారి విస్తరణకు సంబంధించి కూడా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా విజయవాడ - భీమవరం రైల్వే డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గుడివాడ - భీమవరం మధ్య ఒక్క ఉప్పుటేరు వంతెన తప్ప మిగిలినవన్నీ పూర్తయ్యాయి. భీమవరం - గుడివాడ మధ్య 2019 మార్చిలో ట్రయల్ రన్ జరపాలని అధికారులు పట్టుబడుతున్నారు. విజయవాడ, ఏలూరు, నిడదవోలు మీదుగా నడిచే కొన్ని రైళ్లను గుడివాడ మీదుగా మళ్ళించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు గత కొంత కాలం నుండి చెబుతున్నారు. ఇప్పటికే గూడ్స్ సర్వీస్ ఈ రూట్‌లో కొద్దిగా పెంచారు. ఏలూరు రూట్‌లో రైళ్ల రద్దీ పెరిగినందున గుడివాడ లైను తప్పని పరిస్థితుల్లో ఉపయోగించవలసి ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. జాతీయ రహదారిపై ఉండి, భీమవరం, శృంగవృక్షం గ్రామాల పరిధిలో ఆర్వోబీలు నిర్మాణం జరపాల్సి ఉంది. ఇప్పటికే జాతీయ రహదారిపై విజయవాడ వెళ్లాలంటే రోడ్డు మార్గంలో కనీసం నాలుగు గంటలు పడుతుంది. డబుల్ లైన్ నిర్మాణం పూర్తయ్యేలోగా ఆర్వోబీల నిర్మాణం పూర్తికాకపోతే రోడ్డు ప్రయాణం చాలా కష్టతరంగా మారుతుందని ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.