పశ్చిమగోదావరి

నిఘా పెంచిన విజిలెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: చాలాకాలం తర్వాత విజిలెన్స్ విభాగం పూర్తిస్ధాయిలో జవసత్వాలను పుంజుకుని రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. దాదాపుగా ఒకటి,రెండు సంవత్సరాల నుంచి వివిధ వ్యవస్ధల తీరుపై ఫిర్యాదుల వర్షం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా రైతుబజార్లు, వసతిగృహాలు ఇలా అధికశాతం లబ్దిదారులకు మేలు చేకూర్చే వ్యవస్ధలు క్రమంగా పక్కదారి పడుతున్నాయని, దీనిపై కొంతమంది లక్షలు ఆర్జిస్తున్నారని అసంతృప్తి పలు సందర్భాల్లో వ్యక్తమవుతూనే వస్తోంది. దీనిపై ప్రతి సోమవారం స్వయంగా జిల్లా కలెక్టరు నిర్వహించి మీకోసం కార్యక్రమానికి పెద్దఎత్తున ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఫిర్యాదులు వచ్చినా, స్ధానికంగా అసంతృప్తులు పెల్లుబికినా ఆసందర్భాల్లో అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి మొక్కుబడిగా కేసులు నమోదు చేసి ఆమేరకు వాటిని చల్లార్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఇంతకుముందు విజిలెన్స్ విభాగం చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి తేడా ఉంటే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయటమే కాకుండా ఆ వ్యవహారాలు మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేది. కొద్దికాలంగా ఈ వ్యవహారం కొంత చతికిలపడిందనే చెప్పాలి. తాజాగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంగా మరోసారి రంగంలోకి దిగి తన సత్తా ఏమిటో చూపేందుకు అన్నివిధాలా సిద్ధమైనట్లు కన్పిస్తోంది. గత కొన్నిరోజులుగా వివిధ ప్రాంతాల్లో విజిలెన్స్ దాడులు జరగడం, వాటిపై అంతకుముందు పెద్దఎత్తున విమర్శలు వచ్చి ఉండటం, ఈదాడుల్లో పలు అవకతవకలు గుర్తించి విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేయటం జరిగిపోయింది. మరోవైపు గత కొంతకాలంగా ఏలూరులోని పత్తేబాద రైతుబజారుతో సహా జిల్లాలో పలుచోట్ల ఉన్న రైతుబజార్ల తీరుపై తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే వస్తున్నాయి. రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేసిన రైతుబజార్లు చివరకు కొంతమంది అధికారులు, సిబ్బందికి వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయన్న ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. దానికితగ్గట్టుగానే ఏలూరులోని రైతుబజారుపై విమర్శలు, ఆరోపణలే కాకుండా పలు సందర్భాల్లో వ్యాపారస్తులు, అధికారులతో కొనుగోలుదారులు వివాదాలు దిగిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మరోవైపు దాదాపుగా ఏ రైతుబజారులోనూ రైతుల ప్రమేయం నామమాత్రంగా ఉందంటే ఆతిశయోక్తి కాదు. ఏలూరులోనే రెండు రైతుబజార్లు ఉన్నప్పటికీ వారి జాడ తక్కువుగానే ఉంటుందని చెప్పాలి. ఇలాంటి నేపధ్యంలో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగటమే కాకుండా ఏలూరులోని పత్తేబాద రైతుబజారుతోపాటు పాలకొల్లు రైతుబజారును కూడా శనివారం విస్తృతంగా తనిఖీ చేశారు. అయితే ఇది అంతా మొక్కుబడిగా అధికారులు భారీసంఖ్యలో అక్కడకు వెళ్లి ముందస్తు సమాచారాలు ఇచ్చి వ్యాపారస్తులు జాగ్రత్తపడే పరిస్దితి లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని విజిలెన్స్ ఎస్పీ బి అచ్యుతరావు స్వయంగా కూరలు కొనుక్కునేందుకు వచ్చిన సాధారణ కొనుగోలుదారునిగా లోనికి ప్రవేశించి అక్కడున్న పరిస్దితిని అధ్యయనం చేసి ఆతర్వాత అధికారిక దాడి ప్రారంభించటంతో రైతుబజారు అధికారులతో పాటు వ్యాపారస్తులు కూడా నివ్వెరపోయారు. ఏదీఏమైనా ఈవిధంగా కొనుగోలుదారునికి స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగటంతో ఇక్కడి రైతుబజారులో పలు అవకతవకలు వెలుగుచూశాయనే చెప్పాలి. వీటిపై మూడు కేసులు కూడా నమోదు చేశారు. ఈ దాడిలో ఎస్పీతో పాటు సిఐ ఎన్‌వి భాస్కరరావు, ఎఓ ఎం శ్రీనివాసకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇక పాలకొల్లులోని రైతుబజారులో శనివారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా అక్కడ చాలామంది అనధికారికంగా దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. వీరికి ఎటువంటి గుర్తింపుకార్డులు లేకపోవటం, అసలు రైతులో, కాదో కూడా తెలియని పరిస్దితి ఉండటంతో దాదాపు నాలుగు షాపులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐ జివివి నాగేశ్వరరావు, ఎస్సై కె సీతారాము, ఎజి జి జయప్రసాద్, భీమవరం తూనికలు, కొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

పేదవాని అక్షయ పాత్ర అన్న క్యాంటిన్
* జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి
కొవ్వూరు, సెప్టెంబర్ 22: పేదవాని కడుపునింపే అక్షయ పాత్ర ‘అన్న క్యాంటిన్’ అని, అన్న క్యాంటిన్‌ను అందరూ వినియోగించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక బస్టాండు వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటిన్‌ను మంత్రి ప్రత్తిపాటి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్‌లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ తొలి విడతగా రాష్ట్రంలో 300 అన్న క్యాంటిన్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటి వరకూ 108 క్యాంటిన్లు ప్రారంభించగా, కొవ్వూరు పట్టణంలో 109వ క్యాంటిన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. తాడేపల్లిగూడెంలో 110వ అన్న క్యాంటిన్‌ను ప్రారంభిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ క్యాంటిన్లను మండలాల పరిధిలో కూడా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారని, దశల వారీగా ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. అహర్నిశలూ కష్టపడి పనిచేస్తున్న నేత సీఎం చంద్రబాబునాయుడని, ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళుతున్న చంద్రబాబునాయుడిని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్వలేక ప్రధాని మంత్రి మోదీ, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు చంద్రబాబు నాయుడేనని, ప్రజలను కష్టాలు పాల్జేసే ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. కావున ప్రజలు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించి తిరిగి ఆయనను సీఎంగా గెలిపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మంత్రి జవహర్‌ను, అదే విధంగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి, జెవిఎస్ చౌదరిలను మంత్రి పుల్లారావు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ పేదలు భోజనానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబునాయుడు అన్న క్యాంటిన్లను ప్రారంభిస్తున్నారన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కిలో బియ్యం రూ.1కే అందించారని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు అన్న క్యాంటిన్ల ద్వారా పేదలను ఆదుకుంటున్నారన్నారు. అనంతరం అన్న క్యాంటిన్‌లో తయారుచేసిన టిఫిన్లను మంత్రులు పుల్లారావు, జవహర్‌లు రుచి చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మెప్మా ఆధ్వర్యంలో రూ.4.26 లక్షలు విలువైన కుట్టు మిషన్లను 71మందికి మంత్రులు ప్రత్తిపాటి, జవహర్‌లు అందజేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.40లక్షలు విలువైన నాలుగు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి, కమిషనర్ టి నాగేంద్రకుమార్, టీడీపీ నేతలు జెవిఎస్ చౌదరి, కెవికె రంగారావు, వైస్ ఛైర్మన్ డి రాజారమేష్, కౌన్సిలర్ కొట్రు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.