పశ్చిమగోదావరి

వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించని పిల్లలపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 2 : వృద్ధులైన తల్లిదండ్రులను సంరక్షించని బిడ్డలపై కేసులు నమోదుచేయాలని వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావును జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన తీట్ల చంద్రలీల తన ఆస్తిని తన పెద్ద కుమారుడు మోసంచేసి రిజిస్ట్రేషన్ చేసుకుని తనను ఇంటి నుండి తరిమివేశాడని, తనకు నిలువ నీడ లేని పరిస్థితిలో ఉన్నానని తనకు న్యాయం చేయాలని కోరగా, కేసును విచారించి సదరు కుమారుడికి కౌనె్సలింగ్ చేయాలని, వినని పక్షంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు. టి నర్సాపురంనకుచెందిన పేరం పుల్లారావు తన భూమికి చెందిన రికార్డును వేరే వారి పేరుతో మార్పు చేశారని, గత మీ-కోసం కార్యక్రమంలో విన్నవించుకున్నానని, భూమి రికార్డును తన పేరుతో మార్పు చేశారని, కానీ డిజిటల్ సంతకం లేని ఉత్తర్వులను జారీచేశారని, తనకు డిజిటల్ సంతకంతో కూడిన ఉత్తర్వులను జారీచేయాలని కోరగా వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏలూరు ఆర్‌డివోను కలెక్టర్ ఆదేశించారు. పెదవేగి మండలం రాయన్నపాలెంనకు చెందిన పామర్తి నాగమణి తన దరఖాస్తులో తమ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి స్థలం మంజూరైందని, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసినదిగా కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పెదపాడు మండలం తాళ్లగూడెంలో సర్వే నెంబరు 29/2, 29/1 ఎ జిరాయితీ భూమి పొరపాటుగా రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిగా నమోదైందని, సదరు భూమిని జిరాయితీ భూమిగా డీనోటిఫికేషన్ జారీచేయాలని కోరగా దరఖాస్తు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పెదపాడు తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డిఆర్‌వో కె ప్రభాకరరావు, జడ్పీ సిఇవో డి సత్యనారాయణ, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసరావు, డిపివో సూర్యనారాయణ, దేవాదాయ శాఖ ఎసి సత్యనారాయణ, డిఎస్‌వో శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత
-సహకార బ్యాంకులు, సొసైటీల ఆవరణల్లో తవ్వకాలు
-డిసిసిబి ఛైర్మన్ రత్నం
ఏలూరు, మే 2: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని సహకార బ్యాంకుల ఆవరణలలోనూ, సొసైటీల ఆవరణలోనూ ఇంకుడుగుంతల తవ్వకానికి ప్రాధాన్యత ఇచ్చామని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) అన్నారు. ఆదివారం డిసిసిబి కార్యాలయ ఆవరణలో ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్రాంచీల లోనూ, సొసైటీల ఆవరణల్లోనూ, నీటి పరిరక్షణ కోసం ఇంకుడుగుంతల తవ్వకాలను జరుపుతున్నామన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నీటి బొట్టును కూడా వినియోగించుకోవాలనే ఆశయంతో ఇంకుడుగుంతల తవ్వకాలు ఎంతైనా అవసరమని అభిప్రాయపడ్డారు. ఆయన వెంట డిసిసిబి ఓఎస్‌డి వివిఎన్ ఫణికుమార్, ఆర్‌ఆర్ పేట బ్యాంక్ మేనేజర్ గుత్తా పిచ్చయ్య చౌదరి, సిఇవో డి రమణమ్మ, జనరల్ మేనేజర్ కె శ్రీనివాస్, డిజి ఎంలు కె కిరణ్మయి, వైవి రాఘవేంద్రరెడ్డి, ఎజి ఎంలు ఎం కృష్ణారావు, సుబ్బారావు, సత్యనారాయణ, రిటైర్డ్ ఎజి ఎం పృధ్విరాజ్ షాజా, మేనేజర్ ఎస్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇలా తవ్వితేనే ఉపయోగం
ఆచంట, మే 2: ఇంకుడుగుంతల నిర్మాణంలో సాంకేతిక పద్ధతులు అనుసరించాలని, అప్పుడే అసలు ఉద్దేశం నెరవేరుతుందని ఆంధ్రా యూనివర్సిటీ జియోఫిజిక్స్ విశ్రాంత ఆచార్యుడు, అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజీ ఆఫ్ ఇండియా కోశాధికారి డాక్టర్ నెక్కంటి బిఎస్‌ఎస్ ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఇంకుడుగుంతల నిర్మాణం, ప్రాధాన్యతను గురించి వివరించారు. డెల్టా ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి నేలలుంటాయని, ఈ మట్టి పొరల్లో గుంతలు తవ్వితే ప్రయోజనం ఉండదన్నారు. ఇసుక పొరలు వచ్చేవరకు గుంతను తవ్వాలన్నారు. గ్రామాల్లో ఉండే బోర్లు, పాత బావులను వీటికోసం వినియోగించాలన్నారు. రోజుకు రెండు క్యూబిక్ మీటర్లు నీరు రీచార్జి చేసుకునే విధంగా రెండు మీటర్ల కైవారంతో తవ్వాలని సూచించారు. ఈ ఇంకుడుగుంతలో అడుగున ఇసుక వేసి దానిపై చిన్న సైజు గులకరాళ్ళు వేయాలని, ఆ పై బొమ్మరాళ్లు వేసి పైకి వచ్చేసరికి పెద్దసైజు గులకరాళ్ళు వేయాలన్నారు. వరలకు, వరలకు మధ్యన సిమెంటు చేయకుండా వాటి మధ్య చిన్న చిన్న రాళ్ళు ఎత్తుపెట్టాలన్నారు. పొలాల్లో అయితే మూడు మీటర్ల పొడవు, వెడల్పుతో గొయ్యి తవ్వాలని, బోరు వేసిన సమయంలో అమర్చిన ప్లాస్టిక్ కేసింగ్ పైపును అలాగే ఉంచి 4.6 మిల్లీమీటర్ల వ్యాసార్థంలో రంధ్రాలు వేయాలన్నారు. వీటి ద్వారా ఇసుక, మట్టి బోరులోకి వెళ్ళకుండా పైపుచుట్టూ నైలాన్ నెట్ చుట్టాలన్నారు. తరువాత అడుగు నుండి 6 అడుగుల ఎత్తు వరకు 3 నుండి 40 సెంటీ మీటర్ల వ్యాసార్థం కలిగిన రాళ్ళు వీటిపైనే 1 అడుగు మందాన 15-20 సెంటీమీటర్ల రాళ్ళు వేయాలన్నారు. తరువాత అడుగు మందాన 7.5 సెం.మీ 20 ఎంఎం రాళ్ళు మరో అడుగు మందాన 2-4 సెంటీమీటర్ల గులకరాళ్ళు పరవాలన్నారు. చుట్టుపక్కల పడిన వర్షపునీరు ఇంకుడు గుంతల్లోకి వచ్చేలా పైపులను నిర్మించుకుంటే మంచి ఫలితాలుంటాయని ప్రసాద్ వివరించారు. ప్రభుత్వం అంకెల గారడీ కోసం ఇంకుడుగుంతలు తవ్వకుండా పద్ధతి ప్రకారం తవ్వితే ఇది చాలా మంచి ప్రయత్నం కాగలదని ప్రసాద్ తెలిపారు.
ఇదొక జరిమానాల కథ
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మే 2 : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి చెబుతూనే వున్నారు. అయితే ఇలా చెబుతూనే వుండటం వలన పెద్దగా ఫలితం కనిపించడం లేదని గుర్తించిన కలెక్టర్ పంథా మార్చి ఫిర్యాదుల పరిష్కారంలోనిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించి మరీ జరిమానాలు వేయడం ప్రారంభించారు. ఈ విధంగా వేస్తామని ముందుగానే ప్రకటించి ఆ తరువాత నుంచి దాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. కాగా ఏప్రిల్‌లో జరిమానాల బారిన పడిన వారు చాలా మంది వాటిని చెల్లించకపోవడంతో మే నెలలో వారి జీతాలను నిలిపివేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విధంగా జరగడం ఆయా విభాగాల పరిధిలో సోమవారం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఈ కధాక్రమం ఇలా వుంది. ఏప్రిల్‌లో 59 శాఖల పరిధిలో పలువురు అధికారులకు నిర్లక్ష్యం స్థాయిని బట్టి జరిమానాలను విధించారు. ఈ జరిమానాలు చెల్లించిన తరువాతే వారికి జీతాలు ఇవ్వడం జరుగుతుందని కూడా అప్పట్లోనే ప్రకటించారు. అంతేకాకుండా ఆయా విభాగాల పద్దుల్లోంచి కాకుండా ఈ జరిమానాలను బాధ్యులైన వారు తమ సొంత నిధుల నుంచే చెల్లించాలని కూడా స్పష్టం చేశారు. అదలా ఉంటే ఈ విధంగా జరిమానాల బారిన పడిన వారిలో చాలా మంది వీటిని చెల్లించకుండా ఏమి జరుగుతుందో చూద్ధాం అన్న రీతిలో మిన్నకుండిపోయారు. మరోవైపు మే నెల ప్రారంభం కావడంతో యధాప్రకారం జీతాల బిల్లులు ట్రెజరీలో పరిష్కారమై బ్యాంకులకు కూడా వెళ్లిపోయాయి. ఇక అక్కడ కూడా జీతాలు ఆయా ఖాతాల్లో పడటమే తరువాయి. ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే స్పందించి ఆ బిల్లులను వెనక్కి రప్పించారు. తక్షణం ఆయా శాఖల పరిధిలో ఎవరెవరికి జరిమానాలు పడ్డాయి. ఎవరెవరు వాటిని చెల్లించారు, ఎవరెవరు వాటిని చెల్లించలేదు అన్న వివరాలు తీయించి జరిమానాలు చెల్లించని వారి జీతాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. సాధారణంగా అధికారులు, ఉద్యోగులు నెల ప్రారంభమైన వెంటనే జీతాలు పడ్డాయో లేదోనంటూ బ్యాంకుల చుట్టూ తిరగడం సర్వసాధారణం. అయితే సోమవారం నాటి పరిణామాల్లో దాదాపు 59 శాఖల పరిధిలో ఈ బిల్లులు నిలచిపోయాయన్న సమాచారం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఆ తరువాత నెమ్మదిగా అసలు విషయం బయటకు వచ్చింది. గత నెలలోనే స్పష్టంగా జరిమానాలుచెల్లిస్తేనే జీతాలు ఇవ్వడం జరుగుతుందని స్వయంగా కలెక్టర్ తేల్చి చెప్పినప్పటికీ పలు శాఖల పరిధిలో జరిమానాలు పడిన అధికారులు, ఉద్యోగులు ఈ జరిమానాలు చెల్లించడంలోనూ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారనే చెప్పుకోవాలి. ఏదో మాట చెప్పి ఊరుకోవడం కాకుండా కలెక్టర్ కూడా ఈ వ్యవహారంలో సీరియస్‌గానే స్పందించి తక్షణమే జీతాల బిల్లులు వెనక్కి రప్పించి జరిమానాలు చెల్లించని వారి బిల్లులను నిలిపివేయాలని ఆదేశించడం గమనార్హం. ఈ పరిణామాలు మీకోసం కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం విషయంలో అధికారులు అలక్ష్యాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న తీరును బహిర్గతం చేయగా చివరకు కలెక్టర్ ఆదేశాల అమలులోనూ వారి నిర్లక్ష్యం బయటపడిందనే చెప్పాలి. వాస్తవానికి మీ కోసం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్ధిష్ట కాల పరిమితిలోగా పరిష్కరించాలని కొంతకాలంగా కలెక్టర్ చెబుతూనే వున్నారు. అయితే ఈ విషయంలో కొన్ని శాఖల పరిధిలో, మరికొంతమంది అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంతో దీనికి పరిష్కారాన్ని అనే్వషించే క్రమంలో భాగంగా నిర్ధిష్ట కాలపరిమితి ముగిసిపోయినా ఆ తరువాత కూడా మరికొంత గడువు ఇచ్చి మరీ ఈ జరిమానాల వ్యవహారాన్ని కలెక్టర్ తెరపైకి తీసుకువచ్చారు. అయినప్పటికీ వాటిని చెల్లించడంలోనూ సంబంధిత అధికారులు, ఉద్యోగులు అదే స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో చివరకు జీతాలు నిలచిపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోమవారం ఉదయం ఈ పరిణామాన్ని తెలుసుకున్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు పరుగుపరుగున బ్యాంకులకు వెళ్లి తాము చెల్లించాల్సిన జరిమానాలను హడావిడిగా చెల్లించి జీతాల వేటు నుంచి తప్పించుకోవడం మరో విశేషం. ఏది ఏమైనా ఈ స్థాయి అధికార వ్యవస్థను కదిలించి ముందుకు నడిపించి ఉదాశీనంగా వ్యవహరించినప్పుడు దానికి తగ్గ ఫలితం ఇలా వుంటుందని కూడా చూపించడంలో కలెక్టర్ కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇక నుంచి ఫిర్యాదుల పరిష్కారం అంశం ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమో అన్నది అన్ని విభాగాలకు పూర్తిస్థాయిలో తేటతెల్లమవుతుందనే చెప్పాలి.
మరింత పటిష్ఠంగా ఇ-్ఫలింగ్
ఏలూరు, మే 2: జిల్లాలో ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విధానాన్ని మరింత పటిష్ఠంచేసి రానున్న ఏడాది కాలంలో మూడు లక్షల ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 71 వేల ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపర్చారని, దీనివల్ల లక్షలాది రూపాయల విలువైన కాగితం ఆదా అయిందని, ఈవిధానాన్ని మండల స్ధాయి వరకు మరింత పటిష్టవంతంగా అమలుచేసి 2017 మార్చి నాటికి మూడులక్షల ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. తాను మరో ఏడాదిపాటు జిల్లా కలెక్టరుగా ఇ-ఫైలింగ్ విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తానని ఒకవేళ రాష్ట్రంలో ఏ స్ధాయిలో పనిచేస్తున్నా జిల్లాలో ఆన్‌లైన్ ఫైళ్ల విధానం ఎలాఉందో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటానన్నారు. భవిష్యత్‌లో సింగిల్ ఫైల్ విధానాన్ని అమలుచేయాలని, గ్రామస్ధాయి అధికారి ప్రతిపాదనలు దశలవారీగా జిల్లా స్ధాయికి చేరాలని ఎక్కడాకూడా మాన్యువల్ ఫైల్స్ కనిపించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో బయోమెట్రిక్ హాజరు విధానం కూడా పటిష్టవంతంగా అమలుచేస్తామని, ఏప్రిల్ నెలలో జిల్లాలో 52శాతం మంది మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేసారని, మిగిలిన 42 శాతం ఉద్యోగులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల వివరాలు, పంపిణి జరుగుతున్న తీరు తెలుసుకునేందుకు ఇ-ఔషధి ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని, కానీ ఎక్కడా కూడా 40 శాతం మించి ఆన్‌లైన్ కావటం లేదని, వారంరోజుల్లోగా 99 శాతం ఇ-ఔషధ ఆన్‌లైన్ విధానం అమలుకాకపోతే డిఎంహెచ్‌ఓ, డిసిహెచ్‌ఎస్‌లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముగ్గురు లింక్ ఆఫీసర్ల విధానాన్ని అమలుచేయాలని, జిల్లా అధికారి శెలవుపై వెళితే మరొక అధికారి ఫైల్స్‌పై సంతకం చేసేలా ఉండాలని ఆదేశించారు.
10నాటికి రుణ అర్హత కార్డులు
జిల్లాలో కౌలు రైతులకు 10వ తేదీ నాటికి రుణ అర్హత కార్డులు జారీచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తహశీల్దార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం ఎం ఆర్‌వో, ఎంపిడివోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించాలనే లక్ష్యానికి ఇంత వరకూ కేవలం 38 వేలు మాత్రమే జారీచేశారన్నారు. ఖరీఫ్ ప్రారంభం కానున్న దృష్ట్యా అర్హులైన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు.
జూన్ మొదటి వారంలో నాట్లు ప్రారంభం అవుతాయని అందుకు ఎరువులు, విత్తనాలు కౌలు రైతులు కొనుగోలుచేసుకోవాల్సి వుంటుందని, ఇందుకోసం బ్యాంకు రుణాలు పొందవలసిన దృష్ట్యా రుణ అర్హత కార్డులు జారీ ఎటువంటి జాప్యానికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు.
8 నుండి చైతన్యభారతి నాటకోత్సవాలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మే 2: భీమవరం చైతన్యభారతి నవమవత్సర సాంఘిక నాటకోత్సవాల తేదీలను ప్రకటించింది. . ఈ నెల 8వ తేదీ నుండి 11 వతేదీ వరకు నాలుగు రోజుల పాటు చైతన్యభారతి నాటక సంబరాలను నిర్వహిస్తుందని చైతన్యభారతి సారథ్య సంఘం అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. భీమవరంలోని డిఎన్నార్ కళాశాల క్రీడాప్రాంగణంలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయన్నారు. ఇప్పటికే రాట్నం పనులు కూడా పూర్తిచేశామన్నారు. పెనుబోతుల శేషగిరిరావు పేరుతో సాంఘిక నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భీమవరం పట్టణానికి చెందిన గోకవరపు శ్రీనివాస్ 4వ అడిషనల్ జిల్లా న్యాయమూర్తిగా గుంటూరులో పనిచేస్తున్నారని, ఆయనను చైతన్యభారతి ఆత్మీయ చైతన్య పురస్కారానికి ఎంపిక చేసిందన్నారు. నటుడు, దర్శకుడు, నాటిక రచయిత పి. శివప్రసాద్‌ను అభినందన చైతన్య పురస్కారానికి ఎంపిక చేసిందన్నారు. ఈ ఏడాది రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారానికి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీపాద కుమారశర్మను ఎంపిక చేశామన్నారు. జవ్వాది రామారావు రంగస్థల చైతన్య పురస్కారాన్ని హైదరాబాద్‌కు చెందిన యువకళావాహిని వైకె నాగేశ్వరరావుకు అందిస్తున్నామని తెలిపారు.
నంది నాటకోత్సవాల్లో ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక
ఈ ఏడాది చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్ నంది నాటకోత్సవాల్లోని ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి 4 రోజుల పాటు భీమవరంలో జరిగే ఈ నాటక సంబరాల్లో ప్రదర్శించనున్నారు. 8వ తేదీన పండు క్రియేషన్స్ వారి అమ్మసొత్తు, కళావాణి ఉభయ గోదావరులు ఆశ్రమం, 9వ తేదీన కళాంజలి హైదరాబాద్ వారి ఇల్లాలి ముచ్చట్లు, కరీంనగర్ చైతన్య కళాభారతి వారి ఈ లెక్కింతే, గుడివాడ కృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వారి పితృదేవోభవ సాంఘిక నాటికలు ప్రదర్శించనున్నారు. 10వ తేదీ మంగళవారం కొలకలూరు సాయి ఆర్ట్స్ వారి బైపాస్, పెదకాకాని గంగోత్రి వారి వై నాట్, గోవాడ లిఖిత సాయిశ్రీ క్రియేషన్స్ వారి పంపకాలు, 11వ తేదీ బుధవారం తాడేపల్లి అరవిందా ఆర్ట్స్ వారి రంకే, చెన్నూరు శాలివాహన కళామందిర్ వారి మనిషి కాటు సాంఘిక నాటికలు ప్రదర్శించనున్నారు.

మండుటెండలో పసికందు
ఉండి, మే 2: మండుటెండలో బాలుడిని వదిలేసి మద్యం మత్తులో ఉన్న ఒక బిచ్చగాడి నుండి స్థానికులు ఒక పసికందును రక్షించి ఏలూరులోని చిన్న పిల్లల సంరక్షణా కేంద్రానికి తరలించారు. స్థానికులు అందించిన వివరాలు ప్రకారం ఉండి కాపులపేట చెట్టుకింద ఒక బిచ్చగాడు కేవలం 20 రోజుల పసికందును నేలపై పడుకోబెట్టి వళ్లుతెలియని స్థితిలో నిదురపోతున్నాడు. దీంతో అక్కడున్న స్థానికులు ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఉండి పిహెచ్‌సికి చెందిన ఎఎన్‌ఎం లలిత, గౌరి వచ్చి ఆ పిల్లవాడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ డా. సౌమ్యసుధ కూడా వచ్చి ఆ బాలునికి వైద్యసేవలు అందించారు. ఈ విషయాన్ని అంగన్‌వాడీ వారికి తెలియజేయటంతో అంగన్‌వాడీ కార్యకర్త వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి భీమవరం నుండి ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ తీసుకొచ్చి ఆ బాలుడిని ఏలూరు తీసుకెళ్ళారు. కాగా బిచ్చగాళ్ళకు చెందిన ఒక మహిళ అదే ప్రాంతంలో 20 రోజుల క్రితం ఒక మగబిడ్డను ప్రసవించింది. అయితే తాగుబోతు బిచ్చగాడు ఆ మహిళను పిల్లవాడిని తీసుకొని బలవంతంగా రైలు ఎక్కించి పంపించివేశాడని స్థానికులు అంటున్నారు. సోమవారం పసికందును తీసుకొస్తుంటే బిచ్చగాడు కొంత హడావిడి చేశాడు. దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. వాడిని మందలించి ఆ బిడ్డను సంరక్షణాలయానికి పంపించేందుకు సహకరించారు.
భవిష్యత్తు అవసరాలకు వీలుగా స్టేడియంల నిర్మాణం
భీమడోలు, మే 2 : రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భీమడోలులో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం నిర్మించనున్నట్లు ఎపి స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ఛైర్‌పర్సన్ జి ఉషారాణి తెలిపారు. దేశ స్థాయిలో రాజీవ్ ఖేల్ అభియాన్ పధకంలో భాగంగా మంజూరైన రెండు ఇండోర్ స్టేడియంలలో ఒకదాన్ని భీమడోలులో నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్టేడియం నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వైస్ ఛైర్మన్ ఉషారాణిని కలిసి స్థానికంగా స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 170 ఇండోర్ స్టేడియాల నిర్మాణాలకు ప్రతిపాదనలు రాగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌ల కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు రెండు కేటాయించారన్నారు. ఒకటి ఉదయగిరిలో కాగా రెండవది భీమడోలులోనన్నారు. ఒక్కొక్క స్టేడియం నిర్మాణానికి కోటీ 60 లక్షల రూపాయలు కేటాయించారని, ఎనిమిది నెలల్లోగా నిర్మాణాలను పూర్తి చేస్తారని తెలిపారు. స్టేడియానికి అనుబంధంగా వాణిజ్య సముదయాలు వుండే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే నిర్వహణకు నిధుల కొరత వుండదని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే, పాఠశాల అభివృద్ధి కమిటీలు నిర్మాణాల డిజైన్లను ఖరారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పైకా రాష్ట్ర మేనేజర్ ఎ శ్రీనివాస్, డి ఎస్‌పివో బి శ్రీనివాసరావు, జడ్పీటిసి కె పెద్దిరాజు, సిహెచ్ వాసు, గ్రామ ఉపసర్పంచ్ యలమర్తి నాని, ఎంపిటిసి ఎస్ ఎస్ గిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ప్రకాష్ పాల్గొన్నారు.
వారంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో
మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలి
ఏలూరు, మే 2 : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో వున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు వారం లోగా చేపట్టనిపక్షంలో అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం స్ర్తి శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 517 మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా 221 మరుగుదొడ్ల పనులు మాత్రమే చేపట్టారని, మిగిలినవివచ్చే వారం నిర్వహించే సమావేశానికి చేపట్టాలని సిడిపివోలను ఆదేశించారు. పిల్లలకు ఇ-పాస్ ద్వారా పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పింఛన్ కోసం వచ్చి వడగాల్పుతో వృద్ధుడు మృతి
మొగల్తూరు, మే 2: ప్రభుత్వం వృద్ధులకు ప్రతినెల ఇచ్చే పింఛన్ తీసుకోవటానికి వచ్చి ఒక వృద్ధుడు వడగాల్పులకు రహదారిపై పడి మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో ముచ్చెర్ల చిన్న నరసింహం(67) అనే వృద్ధుడు తన నెల వారీ పింఛన్ తీసుకునేందుకు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు బయలుదేరి కాలినడకన వస్తూ ఎండవేడిమికి తట్టుకోలేక రహదారిపై కుప్పకూలి మృతిచెందాడని ఆ గ్రామ విఆర్వో ప్రభాకరరావు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి సమాచారం అందించారు. పింఛన్‌కోసం వస్తూ దారి మధ్యలో నరసింహం పడిపోయి మృతిచెందటం పట్ల ఆ గ్రామ సర్పంచ్, గ్రామస్థులు సానుభూతి వ్యక్తం చేశారు.
వృద్ధుల పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యమా
ఏలూరు, మే 2 : ప్రభుత్వం ఎంతో ఆశయంతో కష్టాల్లో వున్నప్పటికీ పింఛనుదారులకు ప్రతీ నెలా సక్రమంగా నిధులు చేర్చాలనే లక్ష్యంతో విడుదల చేస్తునప్పటికీ వాటి పంపిణీలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం ఏలూరు మండలం శనివారపుపేట పంచాయతీ కార్యాలయం వద్ద పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పింఛనుదారులు మాట్లాడుతూ శనివారంనాడు తాము కార్యాలయానికి వచ్చామని, సర్వర్లు పనిచేయలేదని, నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదని తెలిపారన్నారు. దీనిపై చింతమనేని పంచాయితీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వర్లు పనిచేయకపోతే సంబంధిత ఉద్యోగులకు ఫోన్లు చేయించుకుని పనిచేసేలా చూసుకోవాలన్నారు. నిధుల కొరత వుంటే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేవారమన్నారు. గ్రీష్మతాపం వున్న తరుణంలో పింఛనుదారులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు అన్నవరం, ఎంపిటిసిలు, గ్రామ కార్యదర్శి నిట్టా రవికిషోర్, పంచాయితీ సిబ్బంది వున్నారు.