పశ్చిమగోదావరి

మళ్లీ పట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 5: అదే కథ...అదే ఉద్రిక్తత... పాత్రధారులూ వారే... ఇలా సేమ్ సీన్... ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలియదుగాని తాజాగా గురువారం ప్రత్తికోళ్లలంక గ్రామం ఉద్రిక్తతల మధ్య రగిలిపోయింది. ఈ పరిస్ధితి ఇక్కడవరకు రావడానికి కారణాలు అనేకం ఉన్నా, బాధ్యులు ఎంతోమంది ఉన్నా వారివైపు నుంచి పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నం లేకపోగా ఎప్పటికప్పుడు గ్రామస్థులు తమ కడుపుకొట్టవద్దంటూ రోడ్డెక్కటం, దాన్ని అధికారులు అడ్డుకోవటం చివరకు ఉద్రిక్తతలు తప్పటం లేదు. గురువారం కూడా అదే పరిస్ధితి. వివాదాస్పద చెరువులుగా ముద్రపడిన వాటిలో చేపల పట్టుబడికి గ్రామస్థులు ఉద్యుక్తులయ్యారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనించిన అటవీశాఖ గురువారం అక్కడ భారీఎత్తున మోహరించటంతోపాటు ముందుగానే పోలీసు సహకారం తీసుకుని గ్రామస్థుల యత్నాన్ని అడ్డుకుంది. మొత్తంమీద ఈ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొంది. వాదోపవాదాలు, ఆవేశాలు తప్పలేదు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన తన సహజశైలిలో అటవీ, పోలీసుశాఖల అధికారులపై విరుచుకుపడ్డారు. గ్రామస్థులను బతకనివ్వరా అంటూ నిలదీశారు. చివరకు కలెక్టరు వద్దే ఈ పంచాయతీ తేల్చుకుందామని గ్రామస్థులు నిర్ణయించటంతో పరిస్ధితి సర్దుమణిగింది. అయితే ఎలాగోలా పట్టుబడి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు గ్రామస్థులు సన్నద్ధులయ్యారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నాటికే చేపల పట్టుబడి పూర్తి చేసి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే... ప్రత్తికోళ్లలంక గ్రామం రెండు, మూడేళ్లుగా వరుస వివాదాల్లో కొనసాగుతున్న విషయం తెల్సిందే. గత సర్పంచ్ ఘంటశాల మహాలక్ష్మిరాజు, ఆయన అనుచరులు ఒక వర్గంగాను, గ్రామం మరో వర్గంగాను మారిపోవటంతో ఇక్కడ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఈవిషయంలో రాజకీయ కారణాలు కూడా బలంగా ఉండటంతో ఈవివాదాలు సర్దుమణగకుండా మరిన్ని చిక్కుముడులు పడుతూ కొనసాగిపోతున్నాయి. అ అంశాన్ని అలాఉంచితే వీరి వివాదాల్లో భాగంగా గ్రామానికి చెందిన చెరువుల విషయంలో అభయారణ్యం భూములున్నాయంటూ ఫిర్యాదులు వెళ్లటం, కొంతమంది న్యాయస్ధానాన్ని ఆశ్రయించటంతో దాదాపు 260 ఎకరాల విస్తీర్ణంలోని 12 చెరువుల్లో చేపల పట్టుబడి జరపరాదని న్యాయస్ధానం స్టే మంజూరు చేసింది. దీంతో అప్పటికే ఈ చెరువుల్లో చేపల పిల్లలను వేసిన గ్రామస్థులు ఎలాగోలా వాటిని పట్టుబడి పట్టాలని గత కొద్దికాలం నుంచి ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఇదే అంశంపై కొద్దికాలం క్రితం దాదాపు
మూడు నెలల పాటు నిరాహారదీక్షలు చేసిన విషయం తెల్సిందే. అనంతర పరిణామాల్లో గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకోవటం, ఒక వ్యక్తి హత్యకు గురికావటం తెల్సిందే. దీంతో పలువురు గ్రామస్థులు, పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది అలాకొనసాగుతుండగా ఈ వివాదాస్పద చెర్వుల్లో తాజాగా పట్టుబడి పట్టేందుకు రెండు రోజులుగా గ్రామస్థులు సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. దీనిని గమనించిన అటవీశాఖాధికారులు కూడా అడ్డుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకున్నారు. మొత్తంమీద గురువారం ఈవ్యవహారాలన్ని చివరకు వచ్చి రెండు వర్గాలు ఎదురుపడే పరిస్ధితి తలెత్తింది. ఉదయం నుంచి గ్రామస్థులు భారీ సంఖ్యలో వివాదాస్పద చెరువుల వద్దకు చేరుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే పోలీసుల సహాయంతో అటవీశాఖాధికారులు కూడా పెద్ద సంఖ్యలోనే అక్కడ మోహరించారు. ఆసమయంలో పట్టుబడి పట్టే ముందు చేపట్టే తిరగేత పనిని గ్రామస్థులు చేపట్టబోయేలోగా అటవీశాఖాధికారులు అడ్డుకున్నారు. ఇక అక్కడనుంచి వారి మధ్య వాదోపవాదాలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హుటాహుటిన ఘటనాస్ధలానికి చేరుకున్నారు. ముందుగా పోలీసులపై ఆయన విరుచుకుపడ్డారు. ‘మీకు చట్టం ఎంత ఉందో, మాకు అంతే చట్టం ఉంది, చట్టాలు చేసేది మేమే, మీ ఇష్టానుసారం చేద్దామంటే సహించేది లేదు, ఇదేం పద్దతి’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బందిపై కూడా విరుచుకుపడ్డారు. ఎసిల్లో కూర్చొనే జిల్లా ఉన్నతాధికారులకు పేదల సమస్యలు ఏం తెలుస్తాయంటూ ప్రశ్నించారు. చేప పిల్లలు వేసే సమయంలో అభ్యంతరం తెలపనివారు ఇప్పుడు వాటిని పట్టుబడి పట్టేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకోవటంలో అంతర్యం ఏమిటని నిలదీశారు. ఈవిధంగా ఆయన అటు పోలీసు, ఇటు అటవీ శాఖాధికారులపై తీవ్రస్దాయిలోనే విరుచుకుపడ్డారు. ఒకదశలో పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. అయినప్పటికీ అటవీశాఖాధికారులు వ్యవహారం న్యాయస్దానం పరిధిలో ఉందని, తమ చేతుల్లో ఏమి లేదని స్పష్టంచేశారు. ఈలోగా అక్కడకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడారు. వ్యవహారాన్ని కలెక్టరు వద్దే తేల్చుకుంటామని పేర్కొంటూ ప్రత్తికోళ్లలంక గ్రామస్థులందరూ ఏలూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ప్రజాప్రతినిధులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే అనంతరం గ్రామస్తులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఏలూరు డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు సిఐలు, ఎస్సైలు పోలీసుబందోబస్తు నిర్వహించగా ఆటవీశాఖకు చెందిన ఎఎఫ్‌ఓ శ్రావణ్‌కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు, పెదపాడు తహసిల్దార్లు ప్రసాద్, కుమార్‌లు గ్రామంలోనే ఉండి పరిస్దితిని సమీక్షించారు.
ఇదిఇలాఉండగా ఎలాగోలా పట్టుబడి పని పూర్తి చేయాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెలల తరబడి చేపలు ఉండిపోవటం వల్ల కేజీల కొద్ది పెరిగిపోయాయని, ఇదే పరిస్దితి కొనసాగితే ఆ చేపలు దక్కే అవకాశం చాలా తక్కువన్న అభిప్రాయం గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. అందువల్ల ఏవిధంగానైనా పట్టుబడి పూర్తి చేయాలన్న పట్టుతో గ్రామస్తులున్నట్లు తెలుస్తోంది. లేకుంటే కోట్ల రూపాయల్లోనే గ్రామస్తులు నష్టపోయే ప్రమాదం ఉందని చెపుతున్నారు.
16మందిపై కేసు నమోదు
చేపల చెర్వుల్లో పట్టుబడి పట్టేందుకు ప్రయత్నించిన గ్రామస్తులను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు, ఉద్యోగుల విధులకు అటంకం కలిగించారన్న ఫిర్యాదుపై ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన 16మంది ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసరు వెలగల వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఘంటశాల రాంపండు, భలే గంగరాజు, సైదు అనందరావు, భలే దుర్గారావు, భలే మోహనరావు, సైదు కోటేశ్వరరావు, ఘంటశాల అంజిలి, సైదు మంగాయమ్మ, ముంగర ధర్మావతి, సైదు రత్నం, ఘంటశాల లక్ష్మి, భలే బుల్లెమ్మ, ముంగర వరలక్ష్మి, సైదు నాగమణి, సైదు శేషారత్నం, సైదు వెంకటనర్సమ్మలపై పోలీసులు కేసు నమోదు చేశారు.