పశ్చిమగోదావరి

దొరికిన అమ్మవారి ఆభరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, డిసెంబర్ 6: ఆకివీడు గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో దొంగిలించబడిన వస్తువులు గురువారం లభ్యమయ్యాయి. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా ఆలయంలోని అంతరాలయం తలుపులు పగలగొట్టి బీరువా తెరిచి వస్తువులు దొంగిలించారు. హుండీలోని నగదు తస్కరించారు. గర్భగుడిలోని తలుపులు కూడా తెరిచేందుకు ప్రయత్నించి విలువైన వెండి వస్తువులు దొంగిలించిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో ఆకివీడు ఎస్సై కె సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. కాగా దేవాలయానికి సమీపంలో గురువారం మధ్యాహ్నం అమ్మవారి వస్తువులు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో ప్రతీ ఏటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కార్యదర్శి నందేటి ఠాగూర్ పారిశుధ్య సిబ్బందిని ఈ ప్రాంతంలోని చెత్తాచెదారాన్ని తొలగించాలని సూచించారు. దీంతో పారిశుధ్య పనుల ఇన్‌ఛార్జి కేతా శ్రీను ఆధ్వర్యంలో ఆనాల చెరువు వద్ద పాడుపడిన మంచినీటి ట్యాంకు సమీపాన ఉన్న ముళ్లపొదలను పారిశుధ్య సిబ్బంది తొలగిస్తుండగా గోనె సంచిలో కట్టిన వస్తువుల మూట బయిటపడింది. వెంటనే విషయాన్ని ఈవో నందేటి ఠాగూర్‌తో పాటు ఈ ప్రాంత తెలుగుదేశం నాయకులు కిమిడి నాగరాజుకు విషయాన్ని తెలిపారు. వెంటనే సమాచారాన్ని ఆకివీడు ఎస్సై కె సుధాకర్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్‌పిఆర్ కిషోర్‌కు అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్మవారి వస్తువులు లభించాయన్న వార్త ఆకివీడులో దావానలంలా వ్యాపించింది. దీంతో ప్రజలు అక్కడికి తండోపతండాలుగా చేరుకున్నారు. అమ్మవారి వస్తువులను దర్శించుకుని వెళ్లారు. అనంతరం వాటిని ఆకివీడు పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఏసుపాదంకు అందించారు. అమ్మవారి మహిమ వల్లే ఆగంతకులు ఇక్కడే వస్తువులను వదిలి వెళ్లారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

మన రాజ్యాంగం ప్రపంచానికి వెలుగురేఖ
*ప్రభుత్వ విప్ చింతమనేని
ఏలూరు, డిసెంబర్ 6: భారత రత్న బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఒక వెలుగు వంటిదని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు సమీపంలోని దుగ్గిరాల గ్రామంలో గురువారం ఉదయం అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతివొక్కరూ ఆచరించి తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలన్నారు. సమాజంలో అన్ని వర్గాలూ సమానమేనని, అయితే ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ ఛైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, దళిత నేత నేతల రవి, పెదవేగి మండల టీడీపీ అధ్యక్షుడు మేడిశెట్టి కొండయ్య, దుగ్గిరాల గ్రామ నాయకులు చింతమనేని సతీష్‌కుమార్, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.