పశ్చిమగోదావరి

తెలుగు భాషను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, డిసెంబర్ 9: తెలుగు భాషను కాపాడుకునే సమయం ఆసన్నమైందని ప్రముఖ జానపద కళాకారుడు, పాటల, నాటక రచయిత వంగపండు అన్నారు. ఆకివీడులో సరిగమ సంగీత పరిషత్ రాష్టస్థ్రాయి సినిమా పాటల పోటీల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన మాటల్లో తెలుగు భాష సంస్కృతిని కాపాడుకోవాలని, జానపదాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. తెలుగు భాషపై ఆదరణ తగ్గి ఇంగ్లీషు భాష పెత్తనం పెరిగిపోతోందన్నారు. జాతి వైభవాన్ని చాటిచెప్పే మాతృభాష తెలుగును కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుపండు పేరుతో ఉద్యమాన్ని తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. మన జాతి, పల్లెలు, పదాలు, బంధాలు, అనుబంధాలు, గౌరవ మర్యాదలు, సంగీతం, సాహిత్యం బతికించుకోవాలంటే తెలుగును కాపాడుకోవాలన్నారు. ఇప్పటివరకు 400 పాటలు తాను రాశానని ఆయన వివరించారు. సెలయేటి పరుగులు, నృత్యాలే జానపదాలు అని ఆయన అభివర్ణించారు. తాను పాటలు రాయడం మొదలుపెట్టి యాభై ఏళ్లు అయ్యిందన్నారు. నేడు జానపదాలకు ఆదరణ తగ్గిందన్నారు. దాన్ని బతికించే ప్రయత్నంగా తన శిష్య బృందాలను తయారు చేస్తున్నానన్నారు. కట్టిన పాట సినిమా పాట అని, పుట్టిన పాట జానపదాలని అన్నారు. హృదయం, ప్రకృతి, లయబద్ధమైన శబ్దాల నుండి పుట్టిన పాట జానపదం అన్నారు. అటువంటి పాటలు ఉద్యమాలకు ఊపిరి పోశాయన్నారు. రైతులు, కర్షకులు, మహిళలు అలవోకగా తమ జీవన విధానంలో పాడుకునే ఈ పాట ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. అటువంటి పాటను కాపాడుకుంటూ తెలుగు భాషను సంరక్షించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో శిష్య బృందం వై వెంకట నారాయణ, సీహెచ్ శివాజీ, సరిగమ పరిషత్ కార్యదర్శి కొల్లు వెంకన్నబాబు పాల్గొన్నారు.

14, 15న బాపు జయంతి వేడుకలు
నరసాపురం, డిసెంబర్ 9: పద్మశ్రీ బాపు జయంతి వేడుకలు ఈ నెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్టు నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక లలిత ఘాట్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన బాపు జయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు విలేకరులతో మాట్లాడుతూ నరసాపురం పట్టణంలో జన్మించిన పద్మశ్రీ బాపు తన ప్రతిభతో అంతర్జాతీయ ఖ్యాతి సాధించారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతియేటా బాపు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14న సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గులు, పడవల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. అలాగే బాపు జయంతి రోజైన 15న సినీ గాయకులు పద్మశ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా విచ్చేస్తారన్నారు. బాలసుబ్రహ్మణ్యంకు బాపు రమణ పురస్కారం అందించి సత్కరిస్తామన్నారు. అంతేకాక రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, శాసన మండలి ఛైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్‌లు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారని ఎమ్మెల్యే మాధవనాయుడు తెలిపారు.
15న బాపు కళాక్షేత్రం ప్రారంభం
పట్టణంలోని లలితా ఘాట్ వద్ద రూ.65 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పద్మశ్రీ బాపు కళాక్షేత్రాన్ని బాపు జయంతి రోజైన ఈ నెల 15న ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే మాధవనాయుడు చెప్పారు. కళాక్షేత్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.50 లక్షలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రూ.15 లక్షలు నిధులు సమకూర్చారన్నారు. ఈ కళాక్షేత్రం ద్వారా నియోజకవర్గంలో సాంస్కృతిక కార్యక్రమాలు విస్తరింపచేస్తామన్నారు. అలాగే కళాక్షేత్రం కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా బాపు రమణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కమిటీ అధ్యక్షులుగా అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఆత్మూరి వెంకట నరసయ్య, కన్వీనర్‌గా రెడ్డప్ప ధవేజీ, సభ్యులుగా కౌన్సిలర్ ఆరేటి వేణు, కడిమెళ్ల వరప్రసాద్, సుధీర్ మోహన్‌లను నియమించినట్టు ఎమ్మెల్యే మాధవనాయుడు వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలసాయి, వైస్ ఛైర్మన్ పొన్నాల నాగబాబు, అప్కాప్ ఛైర్మన్ అండ్రాజు చల్లారావు, ఏఎంసీ ఛైర్మన్ కొప్పాడ రవి, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు, కౌన్సిలర్లు ఆరేటి వేణు, పెదశింగు మణి, కోటిపల్లి ఆనందరావు తదితరులున్నారు.

మంత్రి పితానికి ఎమ్మెల్యే బండారు జన్మదిన శుభాకాంక్షలు
నరసాపురం, డిసెంబర్ 9: రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కొమ్ముచిక్కాల గ్రామంలో ఎమ్మెల్యే బండారు మంత్రి పితాని సత్యనారాయణను కలిశారు. ఎమ్మెల్యే వెంట ఆప్కాప్ ఛైర్మన్ అండ్రాజు చల్లారావు, మొగల్తూరు జడ్పీటీసీ గుబ్బల నాగరాజు, టీడీపీ నాయకులు రాయుడు శ్రీరాములు, మామిడిశెట్టి సత్యనారాయణ, పాలా రాంబాబు తదితరులున్నారు.

మద్యం అధిక ధరలకు విక్రయస్తే కఠిన చర్యలు
*కలెక్టర్ భాస్కర్
ఏలూరు, డిసెంబర్ 9: జిల్లాని బ్రాందీ షాపుల్లో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదివారం ఒకప్రకటనలో హెచ్చరించారు. మద్యాన్ని ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు విక్రయించినా, కొనుదారునికి బిల్లు జారీ చేయకపోయినా తమ కార్యాలయంలోని టోల్‌ఫ్రీ నెంబర్ 9490972425కు మిస్డ్‌కాల్ ఇవ్వాలన్నారు. ఎక్సైజ్ వాఖ ద్వారా సంబంధిత షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ముక్కోటికి ముస్తాబవుతున్న శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 18న ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు ఉత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే ఈఈలు, ఏఈవోలు, సూపరింటెండెంట్లతో చర్చించారు. శ్రీవారి ఉత్తర ద్వారదర్శనానికి సుమారు యాభై వేల మందికిపైగా భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అన్నమాచార్యుని విగ్రహ కూడలిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 18వ తేదీ తెల్లవారుజామున 4గంటలకు ఉత్తర ద్వారాలను తెరిచి స్వామివారి దర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామివారి దర్శనం ఉంటుందని ఆయన వివరించారు. ప్రతియేటా ముక్కోటి పర్వదినం నాడు తెల్లవారుజామున జరిగే గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈసారి ముందురోజు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే గిరిప్రదక్షణ వేడుకల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొనాలని ఈవో కోరారు.

జనసేన విధి విధానాల ప్రచారానికి జన తరంగం దోహదం
*పార్టీ నేత కందుల దుర్గేష్
ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: జనసేన పార్టీ విధి విధానాలు, ప్రీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజలకు వివరించేందుకు జనతరంగం కార్యక్రమం ఉపయోగపడుతుందని జనసేన పార్టీ జిల్లా నేత దుర్గేష్ అన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనతరంగం కార్యక్రమాన్ని ఆదివారం ద్వారకాతిరుమలలో పార్టీ నేతలు దుర్గేష్, యర్రా నవీన్‌ల నేతృత్వంలో నిర్వహించారు. ఈసందర్భంగా వారు గ్రామంలోని పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగి తమ పార్టీ విధి విధానాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటువేయాలని మహిళలను అభ్యర్థించారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఉత్తేజాన్ని, ఆసక్తిని కొనసాగించే నేపథ్యంలో జనతరంగం కార్యక్రమాన్ని జిల్లాలో ఐదురోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. చివరిరోజైన ఆదివారం ఈ కార్యక్రమం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో జరపడం ఆనందదాయకమన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్‌కళ్యాణ్ మార్పు తీసుకువచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చారని ప్రజలే తమకు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. పవన్‌కళ్యాణ్ విధి విధానాల పట్ల ఆకర్షితులై తాము తప్పకుండా జనసేన పార్టీని బలపరుస్తామని పలువురు మహిళలు తమకు హామీ ఇస్తున్నట్టు దుర్గేష్ వివరించారు. అనంతరం జ్యోతీరావుపూలే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

చినతిరుమల దేవస్థానం ఉద్యోగులకు పదోన్నతి
ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: శ్రీవారి దేవస్థానంలో పనిచేసే నలుగురు ఉద్యోగులకు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు వారికి ఆర్డర్ కాపీలను అందజేశారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన చిలుకూరి సూర్యనారాయణకు ఏఈవోగా పదోన్నతి లభించింది. అలాగే సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోవాడ సుబ్రహ్మణ్యం సూపరింటెండెంట్‌గాను, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేవీ నరసింహారావు, అలాగే ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న బి బాబ్జిలు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. వీరికి ఆలయ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

పీహెచ్‌సీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి
*మంత్రి పితాని
పెనుమంట్ర, డిసెంబర్ 9: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. మార్టేరు పీహెచ్‌సీలో ఆదివారం మంత్రి పితాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి పితాని పాల్గొని గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. తొలుత మార్టేరు పీహెచ్‌సీలో ఐదులక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పితాని మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో పరికరాలు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. పోటీ వాతావరణంలో సాధారణ ప్రసవాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యులపై ఉన్న చులకన భావాన్ని ప్రజలు విడిచి పెట్టాలన్నారు. ఆచంట నియోజకవర్గంలోనే మార్టేరు పీహెచ్‌సీ అన్ని విధాలా అగ్రగామిలో ఉందని ఆయన కొనియాడారు. ఆసుపత్రి కమిటీ సభ్యులకు, వైద్యులకు, ఏఎన్‌ఎంలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు, ఆశ వర్కర్లకు ప్రభుత్వం తరపున ఆయన అభినందించారు. అనంతరం గతంలో మార్టేరు పీహెచ్‌సీలో మెరుగైన సేవలందించిన డాక్టర్ ప్రశాంతికి ఆయన శాలువా కప్పి సన్మానించారు. తదుపరి కేక్ కట్ చేసి పురోహితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 135మందికి పైగా గర్భిణులకు సీమంతాలు చేశారు. 34 మంది బాలింతలకు పౌష్టికాహారం, 169 మందికి చీరలను మంత్రి చేతులమీదుగా అందించారు. వారి పట్ల డాక్టర్లు వ్యవహరించే తీరును ఈసందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, జడ్పీటీసీ సత్యసాయి ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ కలవపూడి సరోజిని, వస్ ఎంపీపీ కట్టా బాల జీవన్‌కుమార్, బుల్లి రామిరెడ్డి, వివేకానందరెడ్డి, ఆచారి, రాజారెడ్డి, మీరారెడ్డి, మీనాకుమారి, పరమేశ్వరి, సుజహాన్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎస్సై బాలాజీ సుందరరావు, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ప్రశాంతి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

చపక్ తక్రాలో మొదటి రోజు విజేతలు
ఉంగుటూరు, డిసెంబర్ 9: మండలంలోని నారాయణపురంలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అండర్-19 క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు ఆదివారం విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. బాలుర చపక్ తక్రాలో గుజరాత్‌పై ఢిల్లీ జట్టు, మహారాష్టప్రై మణిపూర్, నాగాలాండ్‌పై ఆంధ్రప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. విద్యాభారతిపై తెలంగాణ, కేరళపై మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌పై రాజస్థాన్, తెలంగాణపై ఒరిస్సా, ఢిల్లీపై గోవా, సిబిఎస్‌ఇడబ్ల్యుఎస్‌వొపై తెలంగాణా విజయం సాధించాయి. చపక్ తక్రా బాలికల విభాగంలో ఢిల్లీపై మణిపూర్, గుజరాత్‌పై ఒరిస్సా, విద్యాభారతిపై మణిపూర్, తెలంగాణపై మణిపూర్, కేరళపై ఒడిస్సా, గోవాపై ఒడిస్సా జట్లు విజయం సాధించాయి. అండర్-14 చపక్ తక్రా బాలికల విభాగంలో మహారాష్టప్రై గోవా, ఢిల్లీపై గుజరాత్ జట్లు విజయం సాధించాయి. అండర్=14 చపక్ తక్రా బాలుర విభాగంలో విద్యాభారతిపై గుజరాత్, మహారాష్టప్రై ఢిల్లీ, విద్యాభారతిపై గోవా, మహారాష్టప్రై తెలంగాణ, విద్యాభారతిపై ఆంధ్రప్రదేశ్, ఢిల్లీపై తెలంగాణ, గుజరాత్‌పై ఆంధ్రప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ పర్యవేక్షణనలో పోటీలు జరుగుతున్నాయి.

రబీకి నీటి ఎద్దడి లేకుండా ఇప్పటి నుంచే చర్యలు
*ఎమ్మెల్యే వేటుకూరి
ఉండి, డిసెంబర్ 9: రబీ సాగుకు నీటి ఎద్దడి రాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకొంటున్నట్టు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు చెప్పారు. ఆదివారం ఉండి అక్విడెక్ట్ వద్ద నీటి లెవిల్స్ పరిశీలించేందుకు ఆయన వచ్చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నీటి లెవిల్స్ పెరిగే విధంగా నిరంతరం అధికారులతో మాట్లాడుతుంటానని రైతులకు హామీ ఇచ్చారు. సకాలంలో రబీ సాగు రైతులు పూర్తిచేయాలని సూచించారు. నీటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ తోట ఫణిబాబు మాట్లాడుతూ రైతులకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎస్.సాంబశివరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, పొత్తూరి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు గాలికబుర్లు కట్టిబెట్టాలి
*సీపీఎం నేత మంతెన
ఉండి, డిసెంబర్ 9: అది అమరావతి కాదు.. భ్రమరావతి, గాలి మాటలు, గాలి కబుర్లు చంద్రబాబునాయుడు కట్ట్టిబెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారామ్ టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఉండిలో సీపీఎం, సీపీఐ, జనసేన ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. సీపీఎం నాయకులు జేఎన్వీ గోపాలన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీతారామ్ చంద్రబాబునాయుడు విధానాలపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడకు వెళ్ళినా హైద్రాబాద్ నేనే అభివృద్ధి చేశాను. ఈ రోడ్డు నేనే వేశాను.. ఇలా గాలి కబుర్లతో కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడదీసి ఉద్యోగులను నిరుద్యోగులుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా వెళ్ళి ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు చేస్తానంటున్న సీఎం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సీపీఎస్ సమస్య ఎందుకు పరిష్కరించరని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో ఈనాటికీ శాశ్వత నిర్మాణాలు లేవు, చివరకు పోలవరంలో కూడా భారీ అవినీతి చోటు చేసుకొందని ఆరోపించారు. అక్కడ పనులు ముందుకు చేయకుండా అదుగో నీరు అంటున్న చంద్రబాబునాయుడు మరో పదేళ్లయినా పోలవరం పూర్తిచేస్తారా! అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
అసెంబ్లీ మాని పాదయాత్ర!
ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతిని అసెంబ్లీలో ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చేయటం మాని అసెంబ్లీని విస్మరించి పాదయాత్ర చేయటం కేవలం ఆయన తన బాధ్యతను విస్మరించడమేనని విమర్శించారు. అందుకే తమ మూడు పార్టీలు జనసేన, సీపీఐ, సీపీఎంలో మరో ప్రత్యామ్నాయంతో మీ ముందుకు వస్తున్నామని, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
శివ..శివా.. ఉండి అంతా మురుగునీరే కదా..
సభలో పాల్గొన్న పలువురు వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో వరి లేకుండా మొత్తం ఆక్వా చేయటంలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ముందుండటంతో మొత్తం నీరు కాలుష్యంగా మారుతోందని ఆరోపించారు. ఉండి నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కళాశాల ఏది! డిగ్రీ కళాశాల ఏది! పేద ప్రజలకు భూములు పంపిణీకి సేకరించిన భూమిని కూడా ఎందుకు పంచలేకపోయారని తీవ్రంగా విమర్శించారు. సమావేశంలో జనసేన నాయకులు కామన రామకృష్ణ మాట్లాడుతూ ఇసుక, మట్టి దోపిడీ టీడీపీ హయాంలో బాగా పెరిగిపోయిందని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం డ్వాక్రా రుణాలు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ప్రత్యేక హోదా అంటే అరెస్టుచేసి ఇప్పుడు తాను ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నానని చెబితే ఎవరు నమ్ముతారని నిలదీశారు. కార్యక్రమంలో సీపీఎం డెల్టా కార్యదర్శి బి.బలరామ్, జనసేన నాయకులు ఉండపల్లి రమేష్‌నాయుడు, సుబ్బరాజు, సీపీఎం నాయకులు డి.కళ్యాణి, రామకృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వామపక్షాలు, జనసేన భారీ ర్యాలీ
ఉండి, డిసెంబర్ 9: వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో ఉండిలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఉండి పార్కు నుండి వామపక్షాల నేతలు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల జెండాలు పట్టుకొని వామపక్షాలు, జనసేన మైత్రి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రదర్శనకు అగ్ర భాగాన ప్రజానాట్యమండలి కళాకారుల నాట్య ప్రదర్శనలు, నృత్యాలు, గీతాలు ప్రజలును ఆకట్టుకున్నాయి. ప్రజానాట్యమండలి కళాకారులు షేక్ వల్లి, ప్రసాద్, నారాయణలతో పాటు చిన్నారులు కళారూపాలతో ప్రస్తుత సమస్యలపై చక్కగా ప్రదర్శించారు. ప్రదర్శనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారామ్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

175 నియోజకవర్గ కేంద్రాల్లో నూతన కూటమి సమావేశాలు
ఉండి, డిసెంబర్ 9: రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీపీఎం, జనసేన, సీపీఐల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడనున్న కూటమి రాష్టవ్య్రాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారామ్ వెల్లడించారు. ఆదివారం ఉండిలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే విజయవాడలో తమ పార్టీల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై ఒక అంగీకారానికి కూడా వచ్చామని చెప్పారు. తమ ప్రణాళిక, జనసేన, సీపీఐ ప్రణాళికలు దగ్గరగా ఉన్నాయని వివరించారు. ప్రధాన అజెండా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, మహిళలు, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, పేదలకు భూములు పంచాలనే నినాదాలతో ముందుకు సాగనున్నట్టు వెల్లడించారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబు
*బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్
తాడేపల్లిగూడెం, డిసెంబర్ 9: స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న చంద్రబాబు వెన్నుపోటుదారు, గజదొంగ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోదర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ బాహుబలిగా, చంద్రబాబును కట్టప్పగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తోందని ఆరోపించారు. 2019వ సంవత్సరంలో రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తుల కోసం ఏ పార్టీలను సంప్రదించమని, ఆయా పార్టీలు ముందుకొస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. స్వార్థ రాజకీయాలు, అధికారం కోసం తెలుగుదేశం అధినేత అనైతిక పొత్తులకు సైతం ముందుంటారని విమర్శించారు.
ఏపీలో బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు...
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని దియోదర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ కాబోదన్నారు. అవినీతి అక్రమాల్లో వైఎస్ జగన్ కూరుకుపోయారన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీదే అధికారమన్నారు. రాజధాని పేరుతో సామాన్య రైతులు, పేద, దళితుల భూములను చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుని అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు చందాబాబు అని, డబ్బు సంపాదన, అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఊసరవెల్లిలా రంగులు మార్చడం, అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం తమదిగా ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ, పోతుల అన్నవరం, యెగ్గిన నాగబాబు, అయినపర్తి శ్రీదేవి, నరిశే సోమేశ్వరరావు, కోట రాంబాబు, అడపా రమేష్, ధనలక్ష్మీరెడ్డి, ఉండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు శ్రావ్యతను చాటిన మహనీయుడు ఘంటసాల
*మండలి బుద్ధప్రసాద్
ఆకివీడు, డిసెంబర్ 9: తెలుగు శ్రావ్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఘంటసాల అని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఆకివీడులోని సరిగమ సంగీత పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన 18వ రాష్టస్థ్రాయి సినిమా పాటల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో తెలుగుజాతి ఉన్నంతవరకు ఘంటసాల చిరస్థాయిగా అందరి మదిలో నిలిచే మహోన్నత వ్యక్తి అన్నారు. త్యాగరాజు, అన్నమయ్య గొంతులు ఎలా ఉంటాయన్నది ఎవరికీ తెలియక పోయినా వారి కృతులను తన గొంతు ద్వారా ప్రపంచానికి తెలిపిన మహనీయుడన్నారు. ఘంటసాల గొప్ప గాయకుడే కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడన్నారు. తెలుగు గొప్పదనాన్ని, మాధుర్యాన్ని ప్రతీ వ్యక్తి తెలుసుకోవాలని, పర భాషలపై మోజు తగ్గించుకుని మెలగాలన్నారు. మమీ, డాడి సంస్కృతికి స్వస్తి పలకాలన్నారు. మనకు లభించిన గొప్ప వ్యక్తులలో ఘంటసాల ఒకరని అన్నారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ కళలను పోషించడం కష్టతరమైన ఈ రోజుల్లో 18 సంవత్సరాలుగా సంగీత పరిషత్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి పాటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ కష్టపడితే ఫలితం పొందవచ్చన్నదానికి తానే నిదర్శనమన్నారు. చిన్నపాటి ఆర్టిస్టుగా వెళ్లి మా అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తన అదృష్టమన్నారు. చిత్రసీమలో ఎన్నో రాజకీయాలున్నా తనకు ఆ స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే శివరామరాజు, శివాజీరాజా, వంగపండు, ప్రముఖ జర్నలిస్టు వినాయకరావు, ఆకివీడుకు చెందిన ప్రముఖులు ఓలేటి వెంకట నారాయణ, నీతూ శ్రీరామ్‌తోపాటు పలువురిని పరిషత్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో చుండూరి వెంకట్రావు, మహ్మద్ మదని, శింగవరపు కోటేశ్వరరావు, కొల్లి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

వేపచెట్టు నుంచి పాలు
ఆకివీడు, డిసెంబర్ 9: మండలంలోని సిద్దాపురం శివారు కురుపాక గ్రామంలో వేపచెట్టు నుంచి పాలు కారుతున్నాయి. గ్రామానికి చెందిన బలే కార్తీకరాజుకు చెందిన ఇంటి ఆవరణలో సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం నాటిన వేపచెట్టు నుంచి ఆదివారం సాయంత్రం పాలవలె ఉన్న ద్రవ పదార్థం కారడం ప్రారంభించింది. తొలుత దీన్ని పెద్ద వింతగా భావించలేదు. అయితే విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో వేపచెట్టును చూసేందుకు తండోపతండాలుగా జనం వచ్చారు. దీంతో పాలు కారే చెట్టును ప్రజలు వింతగా చూడటం ప్రారంభించారు. ఈ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకుడు భూపతిరాజు తిమ్మరాజుతో పాటు పలువురు యువకులు, మహిళలు అక్కడికి చేరుకుని చెట్టునుంచి పాలు రావడాన్ని గ్రహించి ధ్రువీకరించారు. అయితే వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా వేపచెట్టు నుంచి పాలు కారుతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ వార్త చుట్టు పక్కలవారికి కూడా తెలియడంతో రాత్రి పది గంటలకు కూడా ఈ వింతను చూసేందుకు జనం ఎగబడ్డారు.