పశ్చిమగోదావరి

తుపాను ప్రత్యేకాధికారులను నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 14: తుపాను హెచ్చరికల దృష్ట్యా జిల్లాలోని మొగల్తూరు, నర్సాపురం, భీమవరం, కాళ్ల మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో తుపాను ప్రభావంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మొగల్తూరు, నర్సాపురం, భీమవరం, కాళ్ల సముద్రతీర ప్రాంతాల మండలాలతోపాటు యలమంచిలి, ఆచంట మండలాల్లో పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొగల్తూరు మండలానికి జిల్లా పరిషత్ సీఈవో వి నాగార్జునసాగర్, నర్సాపురం మండలానికి గిరిజన సంక్షేమం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, భీమవరం మండలానికి డ్వామా పీడీ ఎం వెంకటరమణ, కాళ్ల మండలానికి ఇందిరా సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ కరుణ కుమారిలను నియమించినట్టు చెప్పారు. వీరు తక్షణమే ఆయా మండలాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా పైన పేర్కొన్న మండలాల్లో పూరిపాకలు, శిథిలావస్థ భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మండలాల్లో అన్ని గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సజావుగా ఉండేందుకు ముందుస్తుగానే ఆయా మండలాల్లో సెల్ టవర్లను గుర్తించి సంబంధిత నిర్వాహకులతో జనరేటర్లు అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో మంచినీటి పథకాల వద్ద అవసరమైన జనరేటర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ రెండు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే మిగిలిన పనులు సజావుగా నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగ్గా ఉంచి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలను గ్రామ కార్యదర్శులు, ఈవోఆర్డీలు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో వి నాగార్జున సాగర్ తదితరులు పాల్గొన్నారు.

19న బ్యాంకర్ల సమావేశం
ఏలూరు, డిసెంబర్ 14: జిల్లా సంప్రదింపుల కమిటీ (బ్యాంకర్ల) సమావేశం ఈ నెల 19వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏలూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు ఆంధ్రాబ్యాంకు ఎజిఎం డీసీసీ కన్వీనర్ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికల అమలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న పథకాల ప్రగతితీరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.
తాగునీటి కొరత లేకుండా చర్యలు
కొవ్వూరు, డిసెంబర్ 14: కొవ్వూరు నియోజకవర్గంలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మండలంలోని ఐ పంగిడి గ్రామంలో రూ.72 కోట్లతో నిర్మించబోయే సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొవ్వూరు, చాగల్లు మండలాల్లో 43 ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన గోదావరి జలాలను సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దేచర్ల గ్రామాన్ని కరవురహిత గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి వ్యక్తికి 72 లీటర్ల శుద్ధిచేసిన గోదావరి నీటిని ఈ పథకం ద్వారా అందజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, జడ్పీటీసీ సభ్యురాలు గారపాటి శ్రీదేవి, ఎంపీపీ వి రాజ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ కె సుజాత, టీడీపీ నాయకులు జెవిఎస్ చౌదరి, పి సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ
రాష్ట్ర అధికార ప్రతినిధి పురిఘెళ్ళ రఘురాం
ఆచంట, డిసెంబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిఘెళ్ళ రఘురాం చెప్పారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆచంటలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేస్తున్నామన్నారు. జనవరి 6న ప్రధాని మోదీ జిల్లాకు రానున్నారని ఆయన చెప్పారు. మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టకపోయినా గణనీయంగా ఓట్ల శాతం పెరిగిందన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఓట్ల శాతం ఎక్కువగా వచ్చిందన్నారు. ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెప్పాయని, అయినా బిజెపి, కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం 0.5శాతం మాత్రమే అన్నారు. తెలంగాణాలో 7 శాతం ఓట్లు సాధించిందన్నారు. మహాకూటమిని మాయాకూటమిగా తిప్పికొట్టారన్నారు. కేసీఆర్ ఒంటరి విజయం సాధించడానికి చంద్రబాబు పరోక్ష సహకారం ఉపయోగపడిందన్నారు. జగన్, పవన్, బీజేపీ కలిసి ఉన్నారని ప్రజలకు టీడీపీ బూచి చూపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1.85 లక్షల కోట్లు అప్పుల్లో ఉందని, పుట్టబోయే పిల్లవాడికి కూడా రు.50వేలు అప్పు ఉందన్నారు. రాష్ట్రంలో భయంకరమైన అవినీతి ఉందని స్వయంగా కొంతమంది ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. లీటరుకు 37.50పైసలు పెంచిందని, అమరావతి పేరుతో సెస్ వసూలు చేస్తున్నారన్నారు. నర్సాపురం పార్లమెంటు కోకన్వీనర్ రావూరి సుధ మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ సభ్యత్వం 3,14,000 కాగా క్రియాశీలక సభ్యత్వం 3,600 వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆచంట యోజకవర్గ కన్వీనర్ వేండ్ర కొండలరావు, మాజీ సర్పంచ్ చేగొండి సూరిబాబు, మండల అధ్యక్షులు ముచ్చర్ల వెంకట నాగ సుబ్బారావు, జిల్లా మహిళామోర్చా కార్యదర్శి బలసు మాధవీలత, గొడవర్తి రామచంద్రరావు, నేదునూరి శ్రీనుబాబు, అందే బసవ గణపతి, పంచదార రమేష్ తదితరులు పాల్గొన్నారు.