పశ్చిమగోదావరి

ఓటర్ల జాబితాలో నకిలీలు లేకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 18: ఓటర్ల జాబితాలో నకిలీలు లేకుండా ఒక మనిషికి ఒకే ఓటు విధానంలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఓటర్ల జాబితా సవరణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలనేది సిద్ధాంతమని, అందుకు అనుగుణంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పక్షాల ప్రతినిధులు సహకరించాలన్నారు. ఓటింగ్ సమయంలో ఓటు లేదు, ఓటు గల్లంతైంది అని ఏ ఒక్కరూ అనేందుకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. జిల్లాలోని ఓటర్ల జాబితాలో లక్షా 24 వేల ఓటర్ల పేర్లను సందేహస్పదమైనవిగా సాఫ్ట్‌వేర్ గుర్తించిందని, వీటిలో 1841 ఫోటో ఓటర్ల గుర్తింపు డూప్లికేట్ అయిన నకిలీ ఓట్లను రద్దు చేశామని, ఒకే పేరు, తండ్రి పేరు, డోర్ నంబరుతో ఉన్న 5 వేల 292 ఓట్లను పరిశీలించి విచారణ జరిపి రద్దు చేశామని చెప్పారు. వాటితోపాటు చనిపోయిన వారికి సంబంధించి 1048 ఓట్లను రద్దు చేశామన్నారు. 2 వేల 164 ఓట్లకు సంబంధించి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి దరఖాస్తులు పరిశీలించి రద్దు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒకే పేరు, తండ్రి పేరు, డోర్ నంబరు ఉన్న వాటిని పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారిస్తున్నామని, ఇందుకు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు పోలింగ్ బూత్ స్థాయిలో ఏజెంట్లను నియమించి, నకిలీ ఓట్లను తొలగించేందుకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నూరుశాతం పొరపాట్లు లేని ఓటర్ల జాబితా ఉన్నపుడు ఎన్నికల నిర్వహణ సజావుగా జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు ఉన్నదీ, లేనిదీ తప్పనిసరిగా జాబితాలో సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల నామినేషన్ల చివరి రోజు వరకు కూడా కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. పోలింగ్ బూత్ పరిధిలో జనాభా నిష్పత్తిని అనుసరించి అధికంగా ఓటర్ల నమోదు పెరిగినా లేదా తగ్గినా జాబితాను పరిశీలిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో సవరణకు వచ్చిన 611 అభ్యంతరాలను త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజనాల రామ్మోహనరావు, ఉప్పాల జగదీష్‌బాబు, సహదేవ అచ్యుత్, నేతల రమేష్‌బాబు, నెరుసు నెలరాజు, కర్రి వేణుగోపాలరావు, పి తంబి, జి సుగుణాకరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్నదొర తదితరులు పాల్గొన్నారు.

తుపాను బాధిత ప్రాంతాల్లో మంత్రుల సుడిగాలి పర్యటన
నరసాపురం, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డిలు మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. అడుగడుగునా బాధితులను ఓదారుస్తూ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. మండలంలోని కొప్పర్రు, లిఖితపూడి, పెదమైనవాని లంక, చినమైనవాని లంక గ్రామాల్లో సంభవించిన పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దెబ్బతిన్న మత్స్యకారుల వలలు, బోట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పెథాయ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను మంగళవారం నుంచే సిబ్బందితో సర్వే చేయించి త్వరితగతిన నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పంట నష్టం వివరాలు అందిన వెంటనే రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అమరావతిలోని రియర్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా తుపాను దిశను తెలియజేసి తగు సూచనలు అందించడంతో నష్టాలను నివారించగలిగామన్నారు. భవిష్యత్తులో తుపాన్ల వల్ల అధిక నష్టం వాటిల్లకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. ఏటా సంభవించే తుపాను బీభత్సాన్ని నిరోధించి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా సముద్ర తీరప్రాంతంలో ప్రత్యేక రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఎటువంటి తుపాను ప్రభావాన్నైనా తట్టుకునే విద్యుత్ వ్యవస్థను తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. అలాగే మండలంలోని పెదమైనవాని లంక గ్రామంలో సముద్ర కోత ప్రాంతాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో తాటాకిళ్లు కనిపించకుండా పక్కా గృహాల నిర్మాణం చేపడతామన్నారు. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించనప్పుడు ప్రజలు గ్రామాన్ని విడిచి రక్షిత ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదన్నారు. రవాణా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కూలిన చెట్లను తొలగించే ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. దీనివల్ల ఐదు నుంచి పది నిమషాల వ్యవధిలో చెట్లను తొలగించి ప్రజల ఇబ్బందులను తొలగించగలిగామన్నారు. మంత్రుల వెంట ఇన్‌ఛార్జి ఆర్డీవో వైఎస్‌వికె సత్యనారాయణ, ఎంపీపీ వాతాడి కనకరాజు, ఏఎంసీ ఛైర్మన్ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, జడ్పీటీసీ గుబ్బల నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, వైస్ ఎంపీపీ అందే రామన్న తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహ సమాచారంపై అధికారుల ఆరా
తాళ్లపూడి, డిసెంబర్ 18: బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదుతో తాళ్లపూడి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు మంగళవారం సాయంత్రం మలకపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో 12 సంవత్సరాల వయస్సుగల బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో తామిక్కడకు వచ్చినట్టు చెప్పారు. అయితే వివాహం కాదని, కేవలం నిశ్చతార్థమేనని ఇరువురి బంధువులు చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యుక్త వయస్సు వచ్చేంత వరకూ వివాహం చేయకూదని ఇరు కుటుంబాలకు అవగాహన కల్పించి, వారి వద్దనుంచి హామీ పత్రం తీసుకున్నారు. తాళ్లపూడి ఎస్సై దాసు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆషారోహినీ, స్థానిక అంగన్‌వాడీ టీచర్లు మలకపల్లి వచ్చిన వారిలో ఉన్నారు.

పెథాయ్ కారణంగా పంటలకు తీవ్ర నష్టం
- రైతుల గగ్గోలు
గోపాలపురం, డిసెంబర్ 18: పెథాయి తుపాను కారణంగా వీచిన ఈదురుగాలులకు, కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు గగ్గోలుపెడుతున్నారు. మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు ఏపుగా పెరుగుతున్న దశలో కురిసిన ఈ వర్షాల వల్ల పంట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. తోటల్లో వర్షపు నీరు చేరడం, గాలులకు పొగాకు మొక్కలు నేలనంటడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేగాక వాతావరణం చల్లగా ఉండటం వల్ల పంట తెగుళ్ల బారిన పడే అవకాశముందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలావుండగా అరటి, ప్రత్తి, మినుము, పెసర, వేరుశనగ పంటలు సైతం పాడయ్యాయి. కొన్ని గ్రామాల్లో వరి పనలు ముంపు బారిన పడ్డాయి. గోపాలపురం, వాదాలకుంట, వేళ్లచింతలగూడెం, చిట్యాల, రాజంపాలెం గ్రామాల్లో వర్జీనియా పొగాకు తోటలు దెబ్బతినగా చెరుకుమిల్లి, భీమోలు గ్రామాల్లో వరి, అరటి, మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. తుపాను కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

ప్రజాకూటమికి పట్టిన గతే టీడీపీకీ..
నరసాపురం, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా కూటమికి పట్టిన గతే రాష్ట్రంలో టీడీపీకి పట్టనుందని బీజేపీ రాష్ట్ర, కేంద్ర సమన్వయకర్త పి రఘురామ్ జోస్యం చెప్పారు. మంగళవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగున్నరేళ్ల కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్టానికి మంజూరుచేసిన నిధులు, కేటాయించిన కేంద్ర సంస్థల వివరాలు వివరిస్తూ ప్రజలకు కరప్రతాలు పంపిణీ చేశారు. అనంతరం రఘురామ్ మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిమళ్లిస్తున్నారని విమర్శించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును ప్రజలు సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చూపడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దారుణాలను ప్రజలు గమినిస్తున్నారని, 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రఘురామ్ ఏర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ కోకన్వీనర్ రావూరి సుధ, నియోజకవర్గ కన్వీనర్ గునిశెట్టి శ్రీనివాసు, మండల జనరల్ కార్యదర్శి ఎన్ పెద్దిరాజు (పండు), టి ధర్మారావు, సురేష్‌కుమార్, వి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

చలి గాలులకు 285 గొర్రెలు మృతి
- రూ.25లక్షలు నష్టం
భీమడోలు, డిసెంబర్ 18: తుపాను తీరం దాటిన తర్వాత వీచిన చలి గాలులకు మండలంలోని చెట్టున్నపాడు గ్రామ పరిధిలో 285 గొర్రెలు మృతి చెందగా, సుమారు రూ.20 లక్షలు నష్టం వాటిల్లింది. ఏలూరు ఆర్డీవో చక్రధరరావు, పశు సంవర్థక శాఖ సిబ్బంది, భీమడోలు తహసీల్దార్ ఎం గంగరాజులు చెట్టున్నపాడు గ్రామానికి చేరుకుని మృతిచెందిన గొర్రెలను పరిశీలించారు. ఉంగుటూరు మండలానికి చెందిన గొర్రెల కాపర్లు మేత నిమిత్తం చెట్టున్నపాడు గ్రామానికి తీసుకువచ్చారని తహసీల్దార్ తెలిపారు. చలి గాలులు తీవ్రంగా ఉండటంతో గొర్రెలు మృతిచెందినట్టు చెప్పారు. వీటిలో 36 చిన్న గొర్రెలు ఉన్నట్టు తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో మృతిచెందిన గొర్రెలను గొయ్యితీసి ఖననం చేశారు.

‘పెథాయ్’ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
- మంత్రి పితాని - తీర ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు జవహర్, పితాని
మొగల్తూరు, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. మొగల్తూరు మండలంలో పెథాయ్ తుపాను ప్రభావం వలన నష్టపోయిన ప్రాంతాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లడుతూ జిల్లాలో పెథాయ్ తుపాను వలన దెబ్బతిన్న పంట పొలాల వివరాలను మంగళవారం సాయంత్రం నుంచి సిబ్బందితో కలసి సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ శాఖాధికారులు వేగంగా సర్వే పూర్తిచేసేలా ప్రభుత్వ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి అందిన వెంటనే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పితాని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి పెథాయ్ తుపాను ఎటువైపు మరలుతుందో తుపాను దిశ తెలియజేయటంతో అందుకు తగ్గట్టు ముందస్తు చర్యలు తీసుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా నివారించ గలిగామన్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించటంలో రియల్ టైం గవర్నెన్స్ కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏటా సంభవించే తుపాను భీభత్సాన్ని నిరోధించటానికి, తీరప్రాంత గ్రామాలలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు సముద్ర తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలను, రైతులను తక్షణం ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తుపానును పురస్కరించుకుని అధికారులు మోళ్లపర్రులో తుపాను షెల్టర్‌లో మంత్రి పితాని సత్యనారాయణ పెథాయ్ తుపాను కారణంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. మంత్రులు వెంట ఎం వేణుగోపాలరెడ్డి, నరసాపురం ఇన్‌ఛార్జి ఆర్డీవో వైఎస్‌వి సత్యనారాయణ, ఆప్కాబ్ ఛైర్మన్ అండ్రాజ్ చల్లారావు, ఏఎంసీ ఛైర్మన్ ఠాగూర్, జడ్పీటీసీ సభ్యుడు జి నాగరాజు, వైస్ ఎంపీపీ అండ్రాజ్ రామన్న తదితరులు ఉన్నారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కాగితాలకే పరిమితం!
ఉండి, డిసెంబర్ 18: ఉండిలో నిర్మించబోయే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవార్డులు కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఉండి ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి గత మూడు నెలలుగా జాతీయ రహదారుల శాఖ టెండర్లు పిలుస్తోంది. తిరిగి వాటిని వాయిదా వేస్తూ వస్తోంది. జిల్లా అధికారులు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం భూ సేకరణకు సంబంధించి నిధులు విడుదల చేయకపోవటం వలన ఆర్వోబీ అసలు నిర్మాస్తారో లేదోననే అనుమానం కలుగుతోంది. ఆర్వోబీ నిర్మాణం ప్రతిపాదిత స్థలానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే నిర్వాసితులకు నగదు విడుదల చేయాల్సి ఉంది. అది ఇంతవరకు ఇవ్వకపోవటంతో నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. ఇటీవల రైల్వే అధికారులు జిల్లా పర్యటన సందర్భంగా వచ్చే మార్చి నాటికి డబ్లింగ్‌లో కొంత మేర పనులు పూర్తిచేయాలని ఆదేశించి, అక్కడ వరకు రైళ్లు నడుపుతామని అంటున్నారు. జాతీయ రహదారి 165 ఏర్పడి దశాబ్దం కాలమైనా ఇంత వరకూ విస్తరణ, అభివృద్ధి మాత్రం అమలుకు నోచుకోలేదు. అయితే ట్రాఫిక్ మాత్రం భారీగా పెరిగింది. ఇప్పటికే రైల్వే అధికారులు డబ్లింగ్ పనులు పూర్తయితే విజయవాడ - ఏలూరు మీదుగా వెళ్లే రైళ్లు కొన్నింటిని భీమవరం మీదుగా మళ్లించే అవకాశాలు ఉన్నట్లు గతంలోనే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే మరో సంవత్సరం జాప్యం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
జాతీయ రహదారులు విస్తరణ, రైల్వే డబ్లింగ్ పనులు తీవ్ర జాప్యం జరుగుతున్నా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ నకళ్లు చూపించటానికే పరిమితం అవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నందున ఈలోగా పనులు ప్రారంభం కాకపోతే..తిరిగి వీటికి గ్రహణం పట్టినట్లేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి నిధులు విడుదల చేయించాలని ప్రజలు కోరుతున్నారు.