పశ్చిమగోదావరి

మక్కాలా వాసవీక్షేత్రానికి ప్రపంచ ప్రసిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, ఫిబ్రవరి 15:ప్రపంచంలో ముస్లింలకు మక్కాలాంటి క్షేత్రం ఎంత ప్రసిద్ది గాంచిందో ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండలోని శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి క్షేత్రం అంతగొప్ప పేరుతో విరాజిల్లుతుందని జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం పెనుగొండలోని శ్రీవాసవీ శాంతిధాంలో అఖిలభారత వాసవీట్రస్ట్, పెనుగొండ వారి ఆధ్వర్యంలో నిర్మించిన 90 అడుగుల వాసవీమాత పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభకు అఖిలభారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పిఎన్ గోవిందరాజులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ వాసవీమాత ఆశీస్సులతో తాను ఇంతటి స్థాయికి ఎదిగానన్నారు. వాసవీమాతకు సేవచేసే భాగ్యం తనకు లభించిందని, దీనిని ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వ్యాపార రీత్యా కర్నాటక వెళ్లి స్థిరపడ్డానని, కర్నాటకలో 32 వాసవీ మాత దేవాలయాలు ఉన్నాయని, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులతోపాటు దేశంలోని ఆర్యవైశ్యులందరికీ ఈక్షేత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఆర్యవైశ్యులు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సేవాకార్యక్రమాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కొంతమంది ఆర్యవైశ్యులు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖామంత్రి సుధీర్ ముంగట్టివార్ మాట్లాడుతూ సమాజంలో మనుషులు చిన్నవారు, వారి హృదయాలు పెద్దవని ఆనందంగా చెబుతున్నానని అన్నారు. ఆర్యవైశ్యులు ఆర్ధికంగా బలపడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అనేక విమానాలు తిరుగుతున్నాయి. వాటిలో జీఎంఆర్ విమానాలు కూడా ఉండడం విశేషమని అన్నారు. ఈ సమాజంలో అందరూ వాసవీమాత శ్రీ చరణాలను ఆశ్రయించి ధన్యులు కావాలని కోరారు. కర్నాటక శాసనమండలి మాజీ ఛైర్మన్ డిహెచ్ శంకరమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలోనే 102 స్తంభాలతో 165 అడుగుల రుషిగోత్ర మందిరంతోపాటు 90 అడుగుల వాసవీమాత పంచలోహ విగ్రహం రూపుదిద్దుకోవడం కేవలం వాసవీమాత అనుగ్రహమేనని అన్నారు. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖామంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో ఇంతటి అధ్భుతమైన క్షేత్రం అభివృద్ధికావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పెనుగొండలో రూ. 100కోట్ల వ్యయంతో వాసవీ శాంతిధామం నిర్మించాలని అఖిలభారత వాసవీ వైభవ్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ రామ్మూర్తి అహర్నిశలు ఎంతగానో శ్రమించారని అన్నారు. ఆర్యవైశ్యులు దేశవ్యాపితంగా 165 వాసవీ దేవాలయాలు కట్టుకున్నారని వాటన్నిటిలో ఈక్షేత్రం అతి పెద్దదికావడం విశేషమన్నారు.
వాసవీ మాత జన్మస్థలమైన పెనుగొండలోని శ్రీనగరేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఆర్యవైశ్యులకే ఉండేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఎంతగానో కృషిచేశారని తెలిపారు. రాష్ట్రంలో పెనుగొండలు 7 ఉన్నాయని, కాబట్టి వాసవీ పెనుగొండగా ఉండేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పితానితోపాటు శిద్దా రాఘవరావులు ఆర్యవైశ్యులకు హామీ ఇచ్చారు. రాష్టప్రర్యావరణ, అటవీ, విజ్ఞాన సాంకేతిక మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవీమాత పుట్టిన స్థలంలో ఇంతటి అద్భుతమైన క్షేత్రం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వాసవీధాం ప్రపంచచరిత్రలో నిలిచి పోతుందన్నారు. ముఖ్యమంత్రి ఈప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ క్షేత్రానికి తీసుకువస్తానని అన్నారు. ఈ క్షేత్రం అభివృద్ధికి రూ.20లక్షలు విరాళం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కర్నాటక ఎంఎల్‌సిటిఎన్ శరవరణన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడకు వెళ్లినా పెనుగొండ వాసవీమాత గురించే చెప్పుకుంటున్నారని అన్నారు. ఆర్యవైశ్యులు లేకుంటే ప్రపంచమే లేదని, అన్నిరాష్ట్రాల్లో ఆర్యవైశ్యులతో కలిపి ఆర్యవైశ్య పొలిటికల్ ఫెడరేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. మహాత్మాగాంధీ సారధ్యంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది కాని ఆర్యవైశ్యులకు రాలేదన్నారు. సచ్చిదానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ వాసవీమాత గొప్పతనాన్ని వివరించారు.
రాజ్యసభ సభ్యులు టిజె వెంకటేష్ మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధికి రు.50లక్షలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.

వాసవీ దేవికి 450 కిలోల వెండి రథం
ఆచంట, ఫిబ్రవరి 15: వాసవీ శాంతిథాం ఆధ్వర్యంలో వాసవీ యువజన సంఘం, ఆర్యవైశ్య మిత్ర బృందం సభ్యులు, దాతల సహకారంతో సుమారు 450 కిలోల వెండితో తయారు చేయించిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి రథం ఎంతగానో అకట్టుకుంటోంది. వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ వెండి రథాన్ని ఆవిష్కరించి, అమ్మవారిని ఊరేగించారు. మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం శుక్రవారం రాత్రి శ్రీ వాసవీ మాత సన్నిధిలో మధురై నుంచి తీసుకువచ్చిన శ్రీ మీనాక్షి, సుందరేశ్వరుల ఉత్సవ మూర్తులకు కల్యాణం నిర్వహించారు.

నూరుశాతం పారిశుద్ధ్యానికి చర్యలు
జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఏలూరు, ఫిబ్రవరి 15: గ్రామాల్లోని రోడ్లపై ఎక్కడా చెత్త కనపడకుండా నూరుశాతం పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీల్లో పారిశుద్ధ్యం, బయోమెట్రిక్ హాజరు, మీకోసం విజ్ఞప్తుల పరిష్కారం, మినీ మీ సేవా కేంద్రాల పనితీరు, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్యంతో ఉంచడమే పంచాయతీల ప్రాథమిక బాధ్యతన్నారు. చెత్త నిల్వ ఉండటమే అనేక రోగాలు ప్రబలడానికి కారణమని, అందుకే గ్రామాల్లో చెత్త కేవలం డంపింగ్ యార్డుల్లో మాత్రమే ఉండాలని, రోడ్లపై ఎక్కడా కన్పించకూడదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతీరోజూ ఉదయం 5గంటలకే విధులకు హాజరై ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి ఉదయానికే చెత్త సేకరణను పూర్తిచేసి డంపింగ్ యార్డుకు తరలించి సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ కింద నిర్వహణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇంకా నిర్మాణం ప్రారంభించని 13 సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ షెడ్లను వెంటే నిర్మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మీ కోసం ద్వారా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను నిర్దేశించి సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం దాటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటానికి వీలులేదని, అలా పెండింగ్‌లో ఉంచిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీల్లోని మినీ మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు పౌరసేవలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం అందిస్తున్న సేవలతోపాటు మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పంచాయతీల్లో నూరుశాతం బయోమెట్రిక్ హాజరు అమలు కావలసిందేనని కలెక్టర్ చెప్పారు.
ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేయండి
జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి, ఇతర పన్నుల ద్వారా 134 కోట్ల రూపాయలు వసూలు లక్ష్యం కాగా, ఇంతవరకు కేవలం 19కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయని, పన్నుల వసూళ్లు మందగించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విఠల్, డివిజనల్ పంచాయతీ అదికారలు, ఈవోపీఆర్‌ఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పాకిస్థాన్‌పై సర్జికల్ వార్ చేయాలి
మృతి చెందిన సైనికులకు కొవ్వొత్తులతో నివాళి
భీమవరం, ఫిబ్రవరి 15: జమ్మూ కాశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై అత్మాహుతి దాడిలో మృతి చెందిన జవాన్లకు భీమవరంలో హిందూ మాతృసంస్థలు ఘనంగా నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి జాతీయ జెండాలను చేతపట్టి జవానులకు నివాళి అర్పిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్‌లో సుమారు గంట సమయంపాటు భారత్‌మాతాకీ జై, పాకిస్థాన్‌పై సర్జికల్ వార్ చేయాలి అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్‌ఎస్‌ఎస్), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఎబీవీపీ), హిందూ చైతన్య వేదిక, సామాజిక సమరసతావేదిక, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు జాతీయ జెండాలతో నినాదాలు చేసి దేశభక్తి స్ఫూర్తిని రగిలించారు. అనంతరం పాకిస్థాన్ దిష్టిబొమ్మను ప్రకాశం చౌక్ సెంటర్‌లో తగలపెట్టారు. దేశభక్తి నినాదాలు చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలపై వెళ్లే వారంతా ఎవరికి వారు స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకా సత్యనారాయణ జవానులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. గంటా హరి, గంటా కృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గరికిముక్కు సుబ్బయ్య, ఎబీవీపీ మహేష్, ఆదిత్య యడవల్లి, కాయిత సురేంద్ర, పెద్దేటి సుబ్బారావు, మర్రి సాంబశివ, బూసి సురేంద్రనాధ్ బెనర్జీ, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు అడబాల శివ, గోకవరపు శ్రీను, గిలకలశెట్టి రామారావు, శివాజీరాజు, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మహా శివరాత్రికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు
ఉత్సవ కమిటీ ఛైర్మన్, ఆర్డీవో మోహన్ కుమార్
పోలవరం, ఫిబ్రవరి 15: మహా శివరాత్రికి అన్ని శాఖలు భక్తుల సౌకర్యార్థం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్, ఆర్డీవో కె మోహన్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం భక్తుల కోసం చేసే ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆర్డీవో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవతలి వైపు మొత్తం లాంచీలన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా పట్టిసం తీసుకురావాలనే దానిపై ఏజీఆర్‌బీ డీఈ ప్రదీప్ కుమార్, బోట్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, పోర్టు అధికారి రామకృష్ణ, ఎస్‌బీ ఎస్సై కె శ్రీహరిరావులు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి ప్రాజెక్టు ఇంజినీర్లతో పరిశీలించి లాంచీలు ఇక్కడకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే గోదావరి నీటి మట్టం ప్రస్తుతం ఉన్న దాని కంటే మూడు అడుగులు పెరగటానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సాంకేతిక నివేదికను తయారుచేయాలని ఏజీఆర్‌బీ డీఈని ఆదేశించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు పంపిస్తానని ఆర్డీవో తెలిపారు. అధికారులు సమర్పించిన యాక్షన్ ప్లాన్‌కు తగ్గకుండా ఏర్పాట్లు చేస్తే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉంటుందన్నారు. ఏర్పాట్ల విషయంలో జిల్లాస్థాయి అనుమతులు ఏమైనా ఉంటే కలెక్టర్‌కు నివేదించి ఆయన ద్వారా అనుమతులు పొందేందుకు కృషి చేస్తానన్నారు. డీఎస్పీ ఎటివి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతోందని, అదీ కాకుండా మహా శివరాత్రి సోమవారం కావటంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల వారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి నదికి ఇరువైపులా నాలుగు చొప్పున ఫ్లాట్ ఫాంలు ఏర్పాటుచేస్తే భక్తులకు ఇబ్బందులు లేకుండా లాంచీలపై నది దాటించవచ్చున్నారు. మహా శివరాత్రిలో 1300 మంది వరకూ పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. అలాగే పోలీసులతోపాటు ఎన్‌సిసి వలంటీర్లు కూడా సేవలు వినియోగించుకుంటామన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ మాట్లాడుతూ భక్తులు సేద తీరేటందుకు ఇసుక తినె్నలపై 20 చలువ పందిర్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 40 గదులను నిర్మించటంతోపాటు తాత్కాలికంగా 20 చేతి పంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రాసాద్ మాట్లాడుతూ మహా శివరాత్రి తెల్లవారుఝామున ఆలయ ధర్మకర్తల తొలి పూజ, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దైవ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. వైద్యాధికారి నవీన్ మాట్లాడుతూ మహా శివరాత్రిలో మూడు పీహెచ్‌సీల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్నానమాచరించే భక్తులకు ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు స్నాన ఘట్టాలు, ఫ్లాట్ ఫాంల వద్ద గజ ఈతగాళ్లను, పడవలను ఏర్పాటు చేస్తామని మత్స్య శాఖ ఇన్స్‌పెక్టర్ అబ్బులు తెలిపారు. శివరాత్రిలో ప్రతి శాఖ నిర్వహించే డిటైల్ నివేదిక ప్రకారం ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆర్డీవో మోహన్ కుమార్ తెలిపారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వెంకట రమణ, తహసీల్దార్ చినబాబు, ఎస్సై రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా రూ.రూ.53.95 కోట్ల వ్యయం
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఏలూరు, ఫిబ్రవరి 15: జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా గత ఏప్రిల్ 2018 నుంచి ఇప్పటివరకూ 12,939 మందికి వైద్యసేవలందించడం ద్వారా రూ.53.95 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఐసీడీఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతినెలా సంబంధిత డాక్టర్లతో సమావేశాలు ఏర్పాటుచేసి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన వైద్యసేవలందించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ తరచూ తనిఖీలు నిర్వహించాలని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రత్నకుమారిలను కలెక్టర్ ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్యసేవలపై ప్రతి వారం ఫీడ్‌బ్యాక్ సేకరించి తనకు అందజేయాలని కలెక్టర్ చెప్పారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను, వారి అభిప్రాయాలను తెలుసుకుని నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా వైద్యం అందించడంలో సమస్యలు ఏర్పడితే తక్షణం స్పందించి పరిష్కరించాలని చెప్పారు. జిల్లా, డివిజన్ స్థాయి డాక్టర్లు, ఫీల్డ్ అధికారులతో వచ్చేవారం ఒక సమావేశం ఏర్పాటుచేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలందించే విషయంపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి బాల సురక్ష పథకం, చంద్రన్న సంచార చికిత్సలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 108 సేవలు, బైక్, అంబులెన్సుల ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలో 22 చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 9,880 గ్రామాల్లో 4,24,506 మంది రోగులకు వైద్యసేవలందించడం జరిగిందని, అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా 3,04,199 మందికి వైద్యసేవలు, 1,60,491 ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటా సర్వే చేసి జిల్లాలో ఉన్న గర్భిణుల వివరాలను నమోదు చేయాలని, అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 80శాతం సిజేరియన్ జరగడం పట్ల కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సాధారణ ప్రసవాల ద్వారా తల్లీబిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ చెప్పారు. రోగులకు సరైన సూచనలు, అవగాహన కల్పించేందుకు వీలుగా ఆసుపత్రిలో హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేయాలని, వైద్య అధికారులు రోగులకు అందుబాటులో ఉండి సక్రమమైన సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రత్నకుమారి, ఐసీడీఎస్ పీడీ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
దళిత గిరిజనుల అభివృద్ధికి చంద్రబాబు నిరంతర కృషి
- ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి ప్రసాద్
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 15: దళిత గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర కృషి చేస్తున్నారని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ నరహరి వరప్రసాద్ అన్నారు. స్థానిక ప్రియదర్శిని కళాశాలలో శుక్రవారం జరిగిన దళిత, గిరిజన సంఘాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 13 జిల్లాల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. రాష్ట్రంలో దళితుల కోసం రూ. 11 వేల కోట్లు, గిరిజనుల కోసం రు.6వేల కోట్లు సబ్‌ప్లాన్ నిధులు ప్రభుత్వం ఖర్చు చేసినట్టు చెప్పారు. దళిత, గిరిజన మహిళలతోపాటు రైతులకు రూ.10 వేల ఆర్థిక సాయం సీఎం అందించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లకే గిరిజనులకు ప్రత్యేకంగా పెన్షన్లు అందిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ మాట్లాడూతూ రాష్ట్రంలో అనేక దళిత గిరిజన ఉద్యమాలు జరిపిన నరహరి ఎస్సీ, ఎస్టీ కమిషనర్ డైరెక్టర్‌గా ఈ ప్రాంతానికి రావడం దళిత, గిరిజన వర్గాలకు శుభపరిణామమని చెప్పారు. ఈ సమావేశంలో దళిత, గిరిజన సంఘాల నాయకులు కంపా రాజేంద్రప్రసాద్, వెంపా ఐజక్, కాటం ప్రసాద్, మానుకొండ కిషోర్, గొల్లమందల శ్రీనివాస్, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తహశీల్థార్ ఎం.సుజాత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సునీత, ఎఎస్‌ఐ భూపతిదేవ్ తదితరులు పాల్గొన్నారు.
పొగాకు నమూనాల సేకరణ
దేవరపల్లి, ఫిబ్రవరి 15: దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం అధికారులు ఐపీసీ, పీఎస్‌ఎస్, డెక్కన్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం పొగాకు నమూనాలను సేకరించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పొగాకు నాణ్యత, పొగాకులో పురుగు మందుల అవశేషాలు ఏ విధంగా ఉన్నాయి, పొగాకులో నికోటిన్, క్లోరైడ్ శాతం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా నమూనాలు సేకరణ ప్రారంభించామని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి హనుమంతురావు తెలిపారు. శుక్రవారం దేవరపల్లికి చెందిన రైతులు యాగంటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసు, సాయిబాబులకు చెందిన గ్రేడింగ్ చేసే టెండర్స్ వద్దకు వెళ్లి నమూనాలు సేకరించారు. పొగాకు గ్రేడింగ్ ప్రారంభం నుంచి నాల్గవ రెలుపు, ఆరవ రెలుపు నమూనాలు సేకరిస్తామని హనుమంతురావు తెలిపారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 1890 మంది రైతుల వద్ద ఈ నమూనాలు సేకరించి, పరిశీలనకు పంపిస్తామని, ఆ నివేదిక ఆధారంగా పొగాకు వేలం ప్రక్రియలో ఆయా గ్రామాల పొగాకు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయం ప్రకటిస్తామని హనుమంతురావు తెలిపారు. తొలి దశ నాల్గవ రెలుపు నమూనాలు సేకరణ ప్రారంభించామని, మరో 15 రోజుల్లో ఆరవ రెలుపులో నమూనాలు సేకరిస్తామని హనుమంతురావు తెలిపారు. ఈ రెలుపులో ఐటీసీ బయ్యర్ ప్రశాంత్ కుమార్ జోషి, పీఎస్‌ఎస్ కంపెనీ ప్రతినిధి టి సీతారామరాజు, డెక్కన్ కంపెనీ ప్రతినిధి దుర్గాసాయి, ఎస్‌జీవో జిఎల్‌కె ప్రసాద్, ఐటీసీ సిబ్బంది ఉన్నారు.
అంతర్వేది యాత్రీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: ఆర్డీవో
నరసాపురం, ఫిబ్రవరి 15: అంతర్వేది తిరునాళ్లకు తరలివచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఎఎన్ సలీంఖాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అంతర్వేది యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన మాధవాయిపాలెం ఫెర్రీ, స్టీమర్ రోడ్డులో వైద్య శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సలీంఖాన్ మాట్లాడుతూ స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, రథోత్సవం, పౌర్ణమి వేడుకలు సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వర్తించి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికులకు మంచినీరు, పాలు అందించాలన్నారు. ఫెర్రీ పాయింట్ వద్ద పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, 24 గంటలు విద్యుత్తు సరఫరా కొనసాగించాలని, అనాధికార బోట్లు గోదావరి నదిలో నడపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంటు సామర్థ్యానికి మంచి యాత్రికులను అనుమతించకూడదన్నారు. రాత్రి సమయంలో పంటు రాకపోకలు నిలుపుదల చేయాలని ఆర్డీవో సలీంఖాన్ సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ షేక్ ఇంతియాజ్ పాషా, డిటి కె సూర్యనారాయణ, ఆర్‌ఐలు కె సురేష్, లక్ష్మీనారాయణ, మల్లాడి మూర్తి, భూపతి మంగయ్య నాయుడు, భూపతి నరేష్, పప్పుల గవర్రాజు తదితరులు ఉన్నారు.
వైభవంగా ముగిసిన మావుళ్లమ్మవారి వార్షికోత్సవాలు
సుమారు లక్ష మంది భక్తులకు అన్నదానం
భీమవరం, ఫిబ్రవరి 15: నమ్మిన భక్తులకు వరాల తల్లయిన మావుళ్లమ్మ ఆలయ 55వ వార్షిక మహోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించారు. సినీ సంగీత కళాకారులు, సాంప్రదాయ నృత్యాలు, నాటికలు, నాటకాలు, మిమిక్రీ, ఆర్కెస్ట్రా సాంస్కృతిక కార్యక్రమాలు కొటికలపూడి గోవిందరావు కళావేదికపై నిర్వహించారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారి అన్న సమారాధన శుక్రవారం ఏర్పాటుచేశారు. అన్నదానానికి ముందు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున కుంభాన్ని ఏర్పాటుచేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణేశ్వర శర్మ ముందుగా అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణకుంభానికి ప్రత్యేక పూజలు చేశారు. భీమవరం మున్సిపల్ ఛైర్మన్, ప్రథమ పౌరుడు కొటికలపూడి గోవిందరావు పూర్ణకుంభానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా ఈ హారతుల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని కొటికలపూడి గోవిందరావు భక్తులకు అందజేశారు. మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు అడ్డాల రంగారావు, అధ్యక్షుడు మానే పేరయ్య, కార్యదర్శి కొప్పుల సత్తిబాబు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ అమ్మవారి హారతిలో పాల్గొన్నారు.
అమ్మవారి ప్రసాద లడ్డూ రూ.2.2 లక్షలకు వేలం
మావుళ్లమ్మకు నైవేద్యంగా సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో వేలం వేశారు. మున్సిపల్ కౌన్సిలర్, వైసీపీ సీనియర్ నేత కొల్లి రవి వరప్రసాద్ రూ.2.2 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూని ప్రసాద్ తరపున మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు అందుకున్నారు. గతేడాది కూడా అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని రవివరప్రసాదే దక్కించుకున్నారు.
అమరజవాన్లకు ఘనినవాళి
కొవ్వూరు, ఫిబ్రవరి 15: పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక విజయ విహార్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. అనంతరం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు బివి ముత్యాలరావు, పరిమి రాధ, పిల్లలమర్రి మురళీ కృష్ణ, తాడిమళ్ల విజయవాణి తదితరులు పాల్గొన్నారు.