పశ్చిమగోదావరి

ప్రత్యేక శ్రద్ధతో ఎన్నికల విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 13: రోటీన్ ఆఫీసు విధులుగా కాక ఎన్నికల విధులను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అందరూ నేరుగా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తారన్నారు. ఈ విధుల నిర్వహణలో ఎటువంటి చిన్న పొరపాటు చేసినా, చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని, కావున అధికారులు, సిబ్బంది అందరూ రోటీన్ విధులుగా ఎన్నికలు విధులు నిర్వర్తించ వద్దని, ఎన్నికల విధులను మరింత అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎన్నకల విధుల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధాకారుల దృష్టికి తీసుకువచ్చినట్టయితే, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా మరుగున పడవేస్తే అది మరిన్ని సమస్యలను ఎదుర్కొని శాఖాపరమైన చర్యలకు దారితీయవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణపై రోజువారీ నివేదికలు, ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సిన నివేదికలను నిర్దేశించిన సమయంలోనే సమర్పించాలన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల సమయంలో మరింత శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, గిరిజన సంక్షేమం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
టెక్నాలజీకి అనుగుణంగా సమాచారం సేకరించాలి
జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి
ఏలూరు, మార్చి 13: టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల నుండి సమాచారాన్ని వేగవంతంగా సేకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు వినియోగదార్లు సంఘం కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదార్ల హక్కుల దినోత్సవం 2019 సందర్భంగా ‘విశ్వసనీయ స్మార్ట్ ఉత్పత్తులు’ అంశంపై వినియోగదార్ల సంఘ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదార్లు ఎదుర్కొంటున్న సమస్య,లు వాటి పరిష్కారానికి సంఘ సభ్యులతో సాధ్యమైనంత వరకు ఎన్నికలు పూర్తయిన అనంతరం వర్క్‌షాపు నిర్వహిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, వినియోగదారుల సభ్యులు నీతివంతంగా ఓటు వేసేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఈ నెల 15వ తేదీలోగా ఓటులేని వారు వెంటనే ఓటు నమోదు చేసుకునేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని వినియోగదార్ల సంఘ సభ్యులతో చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉందని, ఈ విషయంపై వినియోగదార్ల సంఘ సభ్యులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జేసీ కోరారు. ఇంటర్నెట్‌తో అనుసంధానం అయిన వస్తువులను స్మార్ట్ ఉత్పత్తులుగా చెప్పవచ్చని, ఉదాహరణకు టీవీలు, కెమెరాలు, బ్యాంకు కార్డులు తదితరమైనవి ఉన్నాయని, ఇవి కాకుండా అంతర్జాలం ద్వారా మనం పొందే వివిధ సేవలు కూడా ఈ కోవకే చెందుతాయని అన్నారు. వస్తువు ఖరీదు నాణ్యతతోపాటు రక్షణ, గోప్యత వంటివి కూడా ముఖ్యంగా పరిశీలించాలన్నారు. స్మార్ట్ ఉత్పత్తుల వల్ల కలిగే వివిధ లాభాలను దృష్టిలో పెట్టుకుంటే వాటిని వినియోగించడం మేలు, కాని తగు జాగ్రత్తలు తీసుకుంటూ, వాటి సౌలభ్యాన్ని వినియోగించుకుంటూ స్మార్ట్స్ వినియోగదార్లుగా తీర్చిదిద్దాలని జేసీ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్‌బాబు, సివిల్ సప్లయిస్ జిఎం వరకుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, పొల్యుషన్ బోర్డు అధికారి విజయ సారథి, వినియోగదార్ల సంఘ సభ్యులు కె నిర్మల, ఎఆర్‌కె హనుమంతరావు, ఎం దుర్గాప్రసాద్, జిఎన్నార్ శంకర్, కె వెంకటరెడ్డి, పివి బంగారురాజు, టి విల్సన్‌బాబు, పి రామరాజు, ఇ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల మధ్య
తాళ్లపూడి, మార్చి 13: కొవ్వూరు సబ్ డివిజన్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆ రెండు శాఖలు వేర్వేరుగా ప్రకటించడం విశేషం. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ సమన్వయం లేకపోవడంతో పంచాయతీలకు రావలసిన లక్షలాది రూపాయల బిల్లులు నిలిచిపోయాయని పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. గత 15రోజుల క్రితం డివిజన్‌స్థాయిలో డీఎల్పీవో సమక్షంలో జరిగిన సమావేశంలో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల కార్యదర్శులు ఇదే విషయాన్ని ఆరోపించారని తాళ్లపూడి ఈవోపీఆర్డీ వెంకన్న తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు బిల్లులు చేయకపోవడం వల్ల పంచాయతీలకు ఇబ్బందిగా ఉందని ఆయన పేర్కొన్నారు. మండలంలో శానిటేషన్‌కు సంబంధించి బిల్లులు, వెయిట్ మేనేజ్‌మెంట్ షెడ్ నిర్మాణాల బిల్లులు, ఇవి కాక ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మొత్తంగా 25లక్షల రూపాయలకుపైనే తాళ్లపూడి మండలానికి రావాల్సి ఉందని, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అనుమతిస్తేనే బిల్లులు మంజూరవుతాయన్నారు. అయితే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ డీఈ, ఏఈలు ఇది తమ పనికాదని తప్పించుకుంటున్నారన్నారు. ఇదే పరిస్థితి చాగల్లు, కొవ్వూరు మండలాల్లో కూడా నెలకొందని తాళ్లపూడి ఈవోపీఆర్డీ తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి బిల్లులు మంజూరు చేయాలని తాను డీఈని కోరగా, సరిగా స్పందించలేదని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రమేష్‌తో మాట్లాడగా, ఈవోపీఆర్డీ మండల స్థాయి అధికారిగా ఆ ప్రాంత ఏఈలతో పనిచేయించుకోవాలని, నేరుగా తనను బిల్లులు చేయలేదని అడిగే అధికారం లేదని, డివిజన్‌లో ఉన్న పరిస్థితిని తాను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఏదేమైనా రెండు శాఖల సమన్వయం కొరవడటంతో బిల్లులు నిలిచిపోవడం పట్ల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘సి’ విజిల్ ఇన్విస్ట్‌గేటర్ మొబైల్ యాప్‌పై అవగాహన కల్పించాలి
ఎన్నికల అధికారులకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశం
ఏలూరు, మార్చి 13: సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ‘సి’ విజిల్ ఇన్విస్ట్‌గేటర్ మొబైల్ యాప్ జిల్లాలో కనీసం 50 వేల మంది డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం సాయంత్రం నియోజకవర్గ ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైనా, ఓటర్లను ప్రలోభపరచడం, ఇతర ఎన్నికల సమస్యలను ‘సి’ విజిల్ ఇన్విస్ట్‌గేటర్ మొబైల్ యాప్ ద్వారా తెలియజేసే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో ఉన్న అన్నిస్థాయి అధికారులు, సిబ్బందితోపాటు పౌరులను కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సమయంలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వీడియో సర్వేలైన్స్ టీమ్, వీడియో బృందాలు, అక్కౌంటిగ్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్‌లు చురుగ్గా సమర్ధవంతంగా పనిచేసి రోజువారీ నివేదికలను కచ్ఛితంగా సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. ప్రతీరోజూ ఆయా మండాలల్లో సీజ్ చేసిన నగదు, మద్యం తదితర వివరాలను వెంటనే నివేదించాలన్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి, ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైన కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ స్టేషన్లో 1200కు మించి, అర్బన్‌లో 1400కు మించి ఓటర్లు ఉంటే వాటికి అనుబంధంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు క్లెయిమ్‌ల పరిష్కారం, రూట్ ఆఫీసర్లు, ఎంసిసి టీమ్‌ల విధులు, అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అధికారుల నివేదికలు, ఓటరు ఫొటో గుర్తింపుకార్డుల పంపిణీ, ఈవీఎంలు ర్యాండమైజేషన్, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ ఎం వేణుకోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు.
విమర్శలకు తావిచ్చిన సైకిళ్ల పంపిణీ
తాళ్లపూడి, మార్చి 13: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మండలంలో జరిగిన సైకిళ్ల పంపిణీ విమర్శలకు తావిచ్చింది. డీఈవో పంపిణీ చేసేయమన్నారంటూ కొన్ని పాఠశాలల్లో జరిగిన పంపిణీపై ఎంపీడీవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదివే విద్యార్థినులకు తాళ్లపూడి మండలంలో 485 సైకిళ్లు మంజూరయ్యాయి. వీటిని కొన్ని పాఠశాలల్లో 11, 12 తేదీల వరకు పంపిణీ చేస్తూనే ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో అయితే పంపిణీ చేయకుండా స్కూల్లోనే ఉంచేశారు. పంపిణీ కాని సైకిళ్ల పట్ల గ్రహణం పట్టినట్టేనా అని కొంతమంది భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు పంపిణీ అయిన సైకిళ్ల బుట్టలపై ఉండటం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే అవుతుందని సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో శ్రీనివాసరావు విద్యాశాఖాధికారికి వెంటనే ఆదేశాలు జారీచేశారు. పంపిణీ అయిపోయిన సైకిళ్ల మాటెలా ఉన్నప్పటికీ ఆ బుట్టలను తీసి భద్రపర్చాలని, వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పడంతో సైకిళ్లు పట్టుకెళ్లిన విద్యార్థినులు ఆ బుట్టలను తీసుకువచ్చి రహస్యంగా స్కూలుకు అందజేశారు. సైకిళ్లు పంపిణీ చేసిన పాఠశాలల్లో రికార్డుల్లో గతంలోనే పంపిణీ చేసినట్టు నమోదు చేసుకుంటామని కొంతమంది ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం విశేషం. 485 సైకిళ్లకుగాను 200కు పైగా సైకిళ్లు ఇంకా పాఠశాలల్లోనే ఉన్నాయి.
ప్రకటన ఖర్చులను నిష్పక్షపాతంగా లెక్కించాలి
అధికారులకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశం
ఏలూరు, మార్చి 13: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటన ఖర్చులను నిష్పక్షపాతంగా లెక్కించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక గిరిజన భవన్‌లో ఎన్నికల మీడియా సర్ట్ఫికేషన్ మరియు మోనటరింగ్ సెల్‌ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసే ప్రకటనలను మీడియా సర్ట్ఫికేషన్ మరియు మోనటరింగ్ కమిటీ ధ్రువీకరించాలన్నారు. చెల్లింపు వార్తలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు లెక్కించి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ప్రతీరోజూ నివేదికలను సమర్పించాలన్నారు. ప్రతీరోజూ దినపత్రికల్లో ప్రచురించిన చెల్లింపు వార్తలను పరిశీలించి సంబంధిత ప్రెస్ క్లిప్పింగ్‌లను అనుసరించి చెల్లింపు వార్తల లెక్కింపు కమిటీ సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల మీడియా సర్ట్ఫికేషన్ మరియు మోనటరింగ్ సెల్‌నందు కంప్యూటర్లు, ఎల్‌సిడి టెలివిజన్లు ఏర్పాటు చేసి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ నందు పరిశీలించి రికార్డు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, ఎన్నికల మీడియా సర్ట్ఫికేషన్ మరియు మోనటరింగ్ కమిటీ సభ్యులు ఐ సుబ్బారావు, కె బాలశౌరి, ఎల్ వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, అదనపు పౌర సంబంధాల అధికారి ఆర్‌విఎస్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

చినవెంకన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ద్వారకాతిరుమల, మార్చి 13:ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ బుధవారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఈవో పెద్దిరాజు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఉండి నుండి సీపీఎం అభ్యర్థి పోటీ?
ఉండి, మార్చి 13: ఉండి నియోజకవర్గానికి సంబంధించి వామపక్షాలు, జనసేన పార్టీ మధ్య కుదిరిన అవగాహనలో భాగంగా ఉండి నియోజకవర్గాన్ని సీపీఎంకు కేటాయించినట్లు వామపక్ష వర్గాలు ధ్రువీకరించాయి. ఉండి నియోజకవర్గంలో గతంలో సీపీయం మద్దతుతో కట్రెడ్డి కుసుమేశ్వరరావు గెలుపొందారు. దీంతోపాటు జిల్లాలో పార్టీ ఉద్యమాలు కూడ ఉండి నియోజకవర్గంలోనే ఎక్కువగా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సీపీయం ఆవిర్భావం మొదటిగా పాలకొల్లు మండలం వాలమర్రు కాగా రెండోది ఉండి మండలం యండగండి కావటం విశేషం. దీంతో సీపీయంకు బలమైన పునాది ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలు, జనసేన మధ్య జరిగిన ఒప్పందంలో సీపీయం ఉండి నియోజకవర్గాన్ని కోరినట్టు చెబుతున్నారు. ఇప్పటికే సీపీయం అధిష్టానం తన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించిందని రాజకీయ వర్గాల కథనం. ఈప్రాంతంలో పలు ఉద్యమాల్లో చరుకుగా పాల్గొంటున్న బీసీ వర్గానికి చెందిన జెయన్‌వి గోపాలన్ విద్యార్థి, యువజన, కార్మికవర్గ నాయకులుగా పనిచేసి ప్రస్తుతం పార్టీలో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపాలన్‌కు అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా సీపీయం జిల్లా కార్యదర్శి బి బలరామ్‌ది ఉండి నియోజకవర్గంలోని మోగొల్లు కావడంతో ఆయనకు కూడ అవకాశం కల్పించవచ్చని రాజకీయ వర్గాల కథనం. దీంతో సీపీయం తన సత్తా చాటుకునేందుకు మరోసారి రంగంలోకి దిగనుంది . అయితే ఈ నియోజకవర్గంలో సీపీయం, సీపీఐ మధ్య పెద్దగా సఖ్యత లేదు. గతంలో వామపక్షాలు, జనసేన,సంయుక్తంగా ఉండిలో బహిరంగ సభ ఏర్పాటు చేసినపుడు సీపీఐ ప్రధాన నాయకులు పాల్గొన లేదు. కేవలం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ఒక్కరే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీపీయం అభ్యర్థికి సీపీఐ ఎటువంటి మద్దతు ఇస్తుందో వేసి చూడాల్సిందే.
సెక్టోరల్ అధికారుల విధులు కీలకం
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఏలూరు, మార్చి 13: ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు విధులు ఎంతో కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక గోదావరి సమావేశ మందిరంలో బుధవారం రాత్రి ఎన్నికల సెక్టార్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణా ప్రక్రియను పర్యవేక్షించే సెక్టారల్ అధికరులు తమ విధులను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. వారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎన్నికల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా అర్ధం చేసుకుని, ఒకటికి రెండుసార్లు అనుమానాలను నివృత్తి చేసుకోవడం ద్వారా వారికి నిర్దేశించిన పనులు సజావుగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో అందించిన ప్రతి అంశాన్ని బాధ్యతగా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జేసీ ఎం వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పితానిపై పుకార్లు
ఆచంట, మార్చి 13: రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖామంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారని బుధవారం తీవ్రస్థాయిలో పుకార్లు చెలరేగాయి. పెనుగొండ మండలం రామన్నపాలెం, వడలిలో జరిగిన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న మంత్రి పితాని బంధువుల కుమార్తె వివాహం కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. దీంతో ఒక మీడియాలో పితాని పార్టీ మారుతున్నారని ప్రచారం జరగడంతో నియోజకవర్గమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మంత్రి పితాని ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులు సమావేశం ఏర్పాటు చేసి మంత్రి పితాని పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. మంత్రి పితాని పార్టీ పారడం లేదని, కావాలని కొందరు పనిగట్టుకుని మంత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత 11 రోజుల నుండి నిర్విరామంగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వ హిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంటే తట్టుకోలేక ఇటువంటి పుకార్లు చేస్తుండడం దురదృష్టకరమన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ త్వరలో జరుగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. సమావేశంలో ఆచంట, పెనుగొండ ఏఎంసీ చైర్మన్లు ఉప్పలపాటి సురేష్‌బాబు, సానబోయిన గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.