పశ్చిమగోదావరి

‘మండే’కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 23 : తుపాను పుణ్యమా అని ఒక రెండు రోజులు వాతావరణం చల్లబడినా మళ్లీ ఇప్పుడు మాడు మాడ్చేసే రేంజికి ఎండలు చేరిపోయాయి. ఇంతకుముందుతో పోలిస్తే ఈసారి భారీ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ నెలంతా ఈ ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన జనం మే ఎండలను తలచుకుని భీతిల్లిపోయారు. అయితే మే నెలలో కొంత వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా రెండ్రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరిపోవడంతో జనమంతా విలవిల్లాడిపోతున్నారు. సోమవారం అత్యధికంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరులలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాలు కూడా దాదాపు దీనికి సమానంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పాలి. పాలకొల్లు, భీమవరం, నర్సాపురం, తణుకు, జంగారెడ్డిగూడెంలలో కూడా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం కూడా దాదాపు ఇలాంటి ఉష్ణోగ్రతలే నమోదు కావడం గమనార్హం. ఒక్కసారిగా పెరిగిపోయిన ఎండ వేడితోపాటు వీస్తున్న వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. రోను తుఫాను కారణంగా రెండ్రోజుల క్రితం వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కూడా కురవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలాంటి తుపాను కూడా దిశ మార్చుకుని వేరే వైపు వెళ్లిపోవడంతో వర్షాల ముచ్చట రోజుల వ్యవధిలోనే తీరిపోయింది. అప్పటి నుంచి ఇక ఎండలు ఏ స్థాయిలో వుంటాయోనన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే తుఫాన్ వర్షాలు, ఆ వాతావరణం కనుమరుగు కాగానే ఎండవేడిమి తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టింది. ఆదివారం నాటి ఎండలతో జనం నానా కంగాళి అయిపోగా సోమవారం నాటి ఎండకు దాదాపు కుదేలయ్యారనే చెప్పాలి. జిల్లాలో ఎక్కడ చూసినా అటు డెల్టా, ఇటు మెట్ట అన్న తేడా లేకుండా మండే ఎండలు జనం మాడు మాడ్చేసేలా తయారయ్యాయి. తెల్లవారే సమయానికే ఎండల వాతావరణం పూర్తిస్థాయిలో కనిపిస్తుండగా గంటలు గడుస్తున్న కొద్దీ ఈ వేడిమీ అంతకంతకు పెరిగిపోతూ వస్తోంది. ఇక మధ్యాహ్నం సమయానికి పూర్తి ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. దీంతో ఉదయం 10 గంటల తరువాత జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసరమైన పనులు వుంటే తప్ప అధిక శాతం మంది రోడ్డు ముఖం చూడటం మానేశారంటే అతిశయోక్తి కాదు. దీనితో పలు పట్టణాలు, గ్రామాల్లో రోడ్డులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. సాయంత్రం వేళ కొంత చల్లబడిన తరువాత తప్ప జనం బయటకు రావడం చాలా వరకు తగ్గించేశారు. అయితే సాయంత్రం వేళకు చల్లబడే పరిస్థితి కూడా దాదాపు లేదనే చెప్పాలి. ఆది, సోమవారాల్లో రాత్రి వరకు కూడా ఉక్కపోత, వేడిగాలుల ప్రభావం కొనసాగుతూనే వచ్చింది. ఇంత వరకు ఇలా ఉంటే 25వ తేదీ నుంచి రోహిణీ కార్తె ప్రవేశించనుంది. సాధారణంగా రోహిణీ కార్తెలో వచ్చే ఎండలకు రోళ్లు కూడా పగిలిపోతాయనే నానుడి లేకపోలేదు. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి కొనసాగుతున్న ఎండల వేడిమి పరిశీలిస్తే ఈసారి రోహిణీ కార్తెలో ఈ ఎండలు ఏ రేంజ్‌లో వుంటాయోనన్న భయాందోళన కూడా జనంలో లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తయతే మాడిపోతున్న ఎండలకు వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారనే చెప్పాలి. అధిక శాతం మంది అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. చిన్నారుల్లో ఎక్కువగా ఈ ఎండల వేడికి జ్వరం రావడం, వాంతులు, విరోచనాలు వంటివి అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు ఆసుపత్రులన్నీ ఈ విధంగా అనారోగ్యం బారిన పడిన వారితో కిటకిటలాడిపోతున్నాయనే చెప్పాలి.

అదృశ్యమైన యువకుడి హత్య
చాగల్లు, మే 23: వరుసకు సోదరుడయ్యే యువకుడితో కలిసి వెళ్లి, అదృశ్యమైన చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆత్కూరి రాజేష్ (16) హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహం సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలోని రేగుల్లంకవద్ద చెట్టుకు వేలాడుతుండగా గుర్తించారు. నందిగంపాడు గ్రామానికి చెందిన బాధితుడు ఆత్కూరి పెద్ద శ్రీను కుమారుడు మణికంఠపై శనివారం రాత్రి హత్యాయత్నం జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన మణికంఠ కొద్దిసేపటి అనంతరం తేరుకుని, ఇంటికి చేరుకోగా, అతని వెంట వెళ్లిన పెద్దశ్రీను సోదరుడు చిన్నశ్రీను కుమారుడు రాజేష్ అదృశ్యమైన సంగతి విదితమే. ఈ ఘటనపై పెద్దశ్రీను ఇచ్చిన ఫిర్యాదుమేరకు చాగల్లు పోలీసులు ఆదివారం కేసు నమోదుచేశారు. కాగా సోమవారం రాజేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్కూరి పెద్దశ్రీను కుమార్తెకు కొద్ది నెలల క్రితం వివాహమయ్యింది. అయితే పెద్దశ్రీను అల్లుడి సోదరుడు ఫోన్ చేయడంతో మణికంఠ, రాజేష్ శనివారం రాత్రి బైక్‌పై అతడిని కలవడానికి వెళ్లినపుడు ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో ఆత్కూరి పెద్దశ్రీను అల్లుడు కూడా పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన
కాగా ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను తక్షణం అరెస్టుచేయాలని డిమాండుచేస్తూ నందిగంపాడు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సోమవారం చాగల్లు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా గ్రామానికి చెందిన సుమారు 300 మంది చాగల్లు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని స్టేషన్‌కు వచ్చిన కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావును కోరారు. ఒక దశలో పోలీసులు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేసు దర్యాప్తు జరుగుతోంది, విచారణ పూరైన తరువాత వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగంపాడు, ఊనగట్లలో పోలీసు పికెట్లు ఏర్పాటుచేశారు. నిడదవోలు సిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పోలవరం, మే 23: పోలవరం మండలం మూలలంక భూములను ప్రభుత్వానికి అప్పగించేది లేదని రైతులు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డంపింగ్ యార్డు కోసం సేకరించేందుకు మూలలంకలోని రైతులతో సోమవారం ఆర్డీవో ఎస్ లవన్న సమావేశం ఏర్పాటు చేసినట్టు స్థానిక తహసీల్దారు ఎం ముక్కంటి గత శనివారం విస్తృత ప్రచారం చేశారు. సుమారు 181 మంది రైతులకు సంబంధించిన 207 ఎకరాల భూసేకరణకు అధికారులు ప్రకటన ఇచ్చారు. ఆర్డీవో లవన్న ఆధ్వర్యంలో అవార్డు ఎంక్వయిరీ చేస్తారని, సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుజల అతిథిగృహానికి రావాలని ప్రచారంచేశారు. దాంతో సుమారు 60 మంది రైతులు సమావేశానికి హాజరుగాకా ఆర్డీవో వచ్చి పక్క గదిలో కాసేపు సేదతీరి రైతులతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. సాయంత్రం నాలుగు గంటలైనా ఆర్డీవో రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు సమావేశం నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ మూలలంక రైతులైన తమను ఆర్డీవో అడుగడుగునా అవమానిస్తున్నారని, గతంలో ఆర్డీవో రమ్మన్నారని కబురందితే వెళ్లగా ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారన్నారు. అలాగే సోమవారం కూడా ఆర్డీవో తమను పట్టించుకోలేదన్నారు. తామంతా పోలవరం ప్రాజెక్టు రైతు సంఘంగా ఏర్పడి సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. సాయంత్రం అయిదు గంటలకు అతిథిగృహం వద్దకు చేరుకున్న ఆర్డీవో లవన్న అందుబాటులో ఉన్న రైతులను పిలిచి మాట్లాడారు. ప్రాజెక్టు డంపింగ్‌యార్డు భూములపై అవార్డు ఎంక్వయిరీ చేస్తానని, భూములకు పరిహారం విషయమై కలెక్టరుతో మాట్లాడాలని రైతులకు సూచించారు.