పశ్చిమగోదావరి

పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, జూన్ 6: పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మండలంలోని విజ్జేశ్వరం హెడ్ స్లూయిస్ నుండి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రామాంజనేయరాజు, ఇరిగేషన్ ఎస్‌ఇ రమణ గోదావరి మాతకు పూజలు నిర్వహించి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ప్రధాన కాలువ నుండి నర్సాపురం, ఏలూరు, అత్తిలి, కాకరపర్రు ప్రధాన కాలువలకు నీరు చేరనుంది. దశలవారీగా నీటి విడుదల పెంచుతామని ఎస్‌ఇ రమణ తెలిపారు. కార్యక్రమంలో కానూరు నీటి సంఘం అధ్యక్షుడు జుజ్జవరపు భాస్కరరావు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సభ్యత, సంస్కారం లేని విపక్ష నేత:అయ్యన్న
లింగపాలెం, జూన్ 6: సభ్యత, సంస్కారం లేని ప్రతిపక్ష నాయకుడు జగన్ అని, ఆయనకు జనంతో పనిలేదని, అధికారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సోమవారం లింగపాలెం మండలం కలరాయనిగూడెం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్ష నేత జగన్ అడ్డుతగలడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతిపక్ష నాయకుడు హుందాగా వ్యవహరించాలని అయ్యన్న హితవు పలికారు. చెప్పులు, చీపుళ్లు వంటి పదాలు ఉపయోగించి అసభ్యంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు భూమిని రైతులు స్వచ్ఛందంగా బాబుపై నమ్మకంతో ఇస్తే దానికి జగన్ అడ్డుతగలడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పట్టిసీమ నిర్మాణాన్ని జగన్ వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదన్నారు.
డిమాండ్ల సాధనకు డెడ్‌లైన్ సరికాదు
ఏలూరు, జూన్ 6 : డిమాండ్ల సాధనకు కాలపరిమితి పెట్టడం సరికాదని, ఈ విషయంలో పెద్దలు పునరాలోచించుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు హితవు పలికారు. టిడిపిలో చేరిన కొత్తపల్లి తొలిసారిగా సోమవారం ఏలూరులోని పార్టీ జిల్లాకార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపుల విషయంలో ముద్రగడ పద్మనాభం డిమాండ్ల సాధనకు కాలపరిమితి విధించటం సరికాదని పరోక్షంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకుని డిమాండ్లు, కోర్కెల సాధనకు కాలపరిమితి పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు భాషాప్రయోగం సరిచూసుకోవాలని, ఇతరులను బాధపెట్టే విధంగా మాట్లాడే పద్దతి మంచిది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదాయం తక్కువగా వున్నప్పటికీ ప్రజాసంక్షేమానికి అధినేత చంద్రబాబు పెద్దపీట వేస్తున్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. ఆర్ధిక సమస్యలున్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నో పధకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారని, కొన్ని హామీలు నెరవేర్చడానికి కొద్దిగడువు పడుతుందని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నేతలు ఉప్పాల జగదీష్‌బాబు, పాలి ప్రసాద్ పాల్గొన్నారు.
అయిదువేల పంచాయితీల్లో కంప్యూటరీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూన్ 6 : రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో పారదర్శకమైన పరిపాలన అందించేందుకు తొలిదశలో అయిదు వేల పంచాయితీల్లో కంప్యూటరీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. చింతలపూడి లయన్స్ క్లబ్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి పీతల సుజాత అధ్యక్షతన జరిగిన నవ నిర్మాణ దీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. 13వేల గ్రామ పంచాయితీలకు గాను ముందుగా అయిదు వేల పంచాయితీల్లో కంప్యూటరీకరణ పూర్తి చేసి 12 రకాల ధృవపత్రాలను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని మేజర్ పంచాయితీల్లో వచ్చే నెల నుంచి ఎల్ ఇడి బల్బులు అందించే కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ బల్బుల వాడకం వలన 40 శాతం విద్యుత్ ఛార్జీలు ఆదా అవుతాయని మంత్రి చెప్పారు. సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించే గ్రామాలకు అయిదు లక్షల రూపాయల నజరానా అందిస్తామని పేర్కొన్నారు. సొంత భవనాలు లేని గ్రామ పంచాయితీలకు భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క పంచాయితీకి 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. జిల్లాను వ్యవసాయంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 16 వేల ఎకరాల అటవీ భూమిని డి నోటిఫై చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు. రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో 1250 ఇళ్లు ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణం కింద నిర్మిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు కుట్టు శిక్షణ పొందిన 72 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చదివిన చిన్నారులకు ప్రీ స్కూలు సర్ట్ఫికెట్లను పంపిణీచేశారు.

వచ్చే వేసవికి నీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక
ఏలూరు, జూన్ 6 : రాష్ట్రంలో వచ్చే వేసవి నాటికి ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రూ.750 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం - అప్పలరాజుగూడెంల మధ్య రూ. 116 లక్షలతో నిర్మించిన రోడ్డును సోమవారం ఆయన ప్రారంభించారు. అదే విధంగా ప్రగతిపురం వద్ద రూ.53 లక్షలతో నిర్మించిన జడ్పీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది 3500 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశామని, అయితే అనంతరం చేపట్టిన చర్యలు వలన ఈ వేసవిలో 850 గ్రామాలకు మాత్రమే తాగునీటిని సరఫరా చేశామన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అనే్వషించి రూ.750 కోట్ల నాబార్డు నిధులతో ప్రస్తుతం పనులు చేపడుతున్నామని, వచ్చే వేసవి నాటికి ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. అన్ని గ్రామాల్లోనూ సిసి రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, రానున్న మూడేళ్లలో అన్ని గ్రామాల్లోనూ సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పంచాయితీ భవనాల నిర్మాణానికి 15 లక్షల రూపాయల ఉపాధి నిధులను అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో శ్మశానాల అభివృద్ధికి 10 లక్షల రూపాయలను కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఈ నెల 8వ తేదీన కడపలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత మాట్లాడుతూ గత రెండేళ్లలోనూ 8 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. తొలుత మాజీ జడ్పీటిసి నందిగం నాగేశ్వరరావు విగ్రహానికి రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లింగపాలెం జడ్పీటిసి కె సాయి సత్య వరప్రసాద్, ఎంపిపి మారంపూడి మల్లిఖార్జునరావు, కలరాయనగూడెం సర్పంచ్ గెద్దల సాగర్, అయ్యప్పరాజుగూడెం సర్పంచ్ డి సురేఖ, కామవరపుకోట జడ్పీటిసి గంటా సుధీర్, ఎంపిటిసిలు ఎన్ స్వరూపారాణి, ఎస్ లావణ్య, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, తహశీల్దార్ సోమశేఖర్, ఎంపిడివో కృష్ణకుమారి, నాయకులు నందిగం సీతారామ్, జె ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.