పశ్చిమగోదావరి

ఆర్ధిక విషవలయంలో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : రోజులు గడుస్తున్న కొద్దీ, సీజన్లు ముగుస్తున్న కొద్దీ జిల్లా రైతులు క్రమంగా ఆర్ధిక విషవలయంలో చిక్కుకునే దిశగా పయనిస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకటొకటిగా సమస్యలు పేరుకుంటూ ఒకదాని వెంట ఒకటి జఠిలంగా మారుతూ వస్తుండటం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్‌లో యధాప్రకారం సాగునీటి సమస్య రైతాంగంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతుండగా మరోవైపు పెట్టుబడి ఖర్చుల నిమిత్తం సరిపడిన మొత్తం అందక వారు మరింత ఆవేదనకు గురవుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులకు రుణమాఫీ కార్యక్రమం అమలవుతూనే వుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, ఆ తర్వాత నెలకొన్న ఆర్ధిక సమస్యల నేపధ్యంలో ఈ మాఫీ హామీని వాయిదాల పద్దతిలో తీర్చేందుకు సిద్ధమైంది. దానికి తగ్గట్టుగానే వాయిదాల విధానంలో ఈ మాఫీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతోంది. అయితే గత డిసెంబరులో రైతుల ఖాతాలకు జమ కావాల్సిన మాఫీ మొత్తాలు ఇంకా వారి ఖాతాల్లోకి చేరకపోవడం ఇప్పుడొక సమస్యగా మారుతోంది. అక్కడక్కడ కొంతమందికి ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసినా అధిక శాతం రైతులకు మాత్రం ఈ వెసులుబాటు లేకుండా పోయింది. ఈ పరిణామం సహజంగానే రైతులను ఆందోళనకు గురిచేస్తుండగా మరోవైపు బ్యాంకర్ల నుంచి కూడా రైతులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సమస్య జిల్లా రైతును దాదాపుగా వచ్చే మూడేళ్లపాటు కూడా వెంటాడుతూనే వుంటుందన్న అనుమానం కూడా లేకపోలేదు. ఆ అంశాన్ని అలా ఉంచితే మరోవైపు మాఫీకి సంబంధించి బాండ్లు ఇస్తామని కూడా ప్రభుత్వం తొలిదశలోనే ప్రకటించింది. వాటిని ఈ క్రమంలో ఎలా వినియోగించుకోవచ్చునన్న అంశాలను కూడా స్పష్టం చేసింది. అయితే ఇంత వరకు దానికి సంబంధించి రైతులకు బాండ్లు ఇచ్చిన పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం. ఒకవైపు మాఫీ, వాయిదాలు ఖాతాల్లో జమ కాకపోవడం, ఇస్తానన్న బాండ్లు చేతికి అందకపోవడంతో రైతుల్లో ఈ పరిస్థితి కొంత అసంతృప్తికి కారణమవుతూ వస్తోంది. ఈ నేపధ్యం ఇలా ఉండగా ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో ఎప్పటిలానే సాగునీటి సమస్య తెరపైకి రావడం తెలిసిందే. దీనికి సంబంధించి అదనపు జలాలను ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి రప్పిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ దిశగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినా దానికి సానుకూలమైన స్పందన రాలేదన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు పూర్తి ఆయకట్టులో వరిసాగుకు రైతులు ఉపక్రమించారు. దానికి తగ్గట్టుగానే పెట్టుబడులు కూడా పెట్టారు. ఇప్పుడు ముందుగా తెలిసిన విధంగానే గోదావరి జలాలు మరింత అడుగంటుతూ అదనంగా తెస్తున్న సీలేరు జలాలు అవసరానికి సరిపోక ఒడిశా నుంచి సానుకూల స్పందన లేక ఈసారి పంట ఎలా గడుస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే పెట్టుబడుల కోసం రైతులు నానా అగచాట్లు పడాల్సి వస్తుందన్న ఆవేదనే వినిపిస్తోంది. ఇటీవలే ముగిసిన ధాన్యం సేకరణ కార్యక్రమంలో రైతులందరికీ పూర్తిస్థాయిలో సొమ్ములు ఖాతాలకు జమ కాకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సొమ్ములు ఏదో విధంగా అందివుంటే వాటిని వినియోగించైనా పెట్టుబడి ఖర్చుల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ అది కూడా లేక పూర్తిస్థాయిలో కమీషన్‌దారులపై ఆధారపడాల్సిన పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నీ కలగలసి జిల్లా రైతులు క్రమంగా ఆర్ధిక విషవలయంలో చిక్కుకుంటున్నారా? అన్న అనుమానాలకు కారణమవుతోంది. ఒకవైపు మాఫీ వ్యవహారం సక్రమంగా ముందుకు సాగక, అందాల్సిన బాండ్లు చేతికి రాక, ధాన్యం మొత్తాలు సకాలంలో ఖాతాలకు జమ కాక, పెట్టుబడి కోసం అప్పుల మీద అప్పులు చేయాల్సి రావడం కలిసి రైతులు రానున్న రోజుల్లో ఈ విషవలయంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే నివురుగప్పిన నిప్పులా వున్న అసంతృప్తి బగ్గుమంటుందన్న ఆందోళన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.
పల్లెలకు నవోదయం
* గ్రామాల్లో సారా చిచ్చుకు ఇక చెక్ * నిషేధానికి బహృత్తర ప్రణాళిక * విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 2: సారా రాక్షసి సృష్టించే విలయం వర్ణనాతీతం. పచ్చని పల్లెలు, కుటుంబాల్లో సారాసురుడు చిచ్చు రేపుతాడు. ప్రశాంతంగా ఉన్న ఊరిని, ఇంటిని అల్లకల్లోలం చేసేస్తాడు. ఈ సారా మహమ్మారికి బానిసగా మారిన వారెందరో ఇల్లు, ఒళ్లును గుల్ల చేసుకుంటున్నారు. అనారోగ్యం బారిన పడి చికిత్సకు అప్పుల పాలవుతున్నారు. కొందరైతే ఆరోగ్యం మరింత క్షీణించి యవ్వన వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి కారణాలతో చిన్న వయస్సులోనే వితంతువులుగా మారిన అభాగ్య యువతులూ ఎందరో గ్రామగ్రామాన కనిపిస్తున్నారు. ఈ మహమ్మారి వికటాట్టహాసానికి ఇక తెరపడనుంది. దశాబ్దాల ఈ జాడ్యానికి చెక్ చెప్పేలా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికార యంత్రాంగం నడుం బిగించింది. నాటుసారా కట్టడికి రెవెన్యూ, పోలీస్, అటవీ అధికారుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. ప్రభుత్వం నవోదయం పేరుతో మూడు దశల్లో దీన్ని అమలు చేయనుంది. తొలిదశలో నాటుసారా తయారీచేసే గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. సారా తాగడం వల్లే కలిగే దుష్పపరిణామాలను వివరిస్తారు. ఇందులో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇక రెండోదశలో నేరం చేసిన వారిని గుర్తించి రెవెన్యూ అధికారుల వద్ద బైండోవర్ చేస్తారు. ఇక మూడవ దశలో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు చేసి నాటుసారా కాస్తుంటే దాడులు నిర్వహించి, బైండోవర్ చట్టం ప్రకారం వారి ఆస్తులు సీజ్ చేస్తారు. చివరిగా వారిపై పిడి చట్టం ప్రయోగిస్తారు. నాటుసారా తయారీని గుర్తిస్తే ఇక మీదట ఆ భూమి యాజమాన్యులను బాధ్యులను చేయనున్నారు. వారిపై కేసులు నమోదుచేస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేస్తోంది. వీరే ముందు సమాచారం ఇస్తే ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో నల్లబెల్లం, పటిక అమ్మకాలపై నిఘా మరింత పెంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. జిల్లాలో గడిచిన ఏడాది నాటుసారా తయారీ జోరుగా సాగింది. జిల్లాలోని తీరప్రాంతంలో ముఖ్యంగా భీమవరం మండలం, నరసాపురం రూరల్ మండలం, మొగల్తూరు తదితర సముద్ర ప్రాంతాల్లో ఈ తయారీ యదేచ్ఛగా సాగింది. అలాగే మెట్టప్రాంతాల్లో కూడా సారా తయారీ జోరుగా సాగుతోంది. మొత్తం జిల్లాలోని 101 గ్రామాల్లో ఎక్కువగా నాటుసారా తయారీ చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయి. గడిచిన ఏడాదికాలంగా భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలోని 1278 కేసులు నమోదుచేయగా, 359 మందిని అరెస్టు చేశారు. 8,469 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, 3,43,790 లీటర్ల బెల్లపుఊటను కూడా ధ్వంసం చేశారు. 2015 డిసెంబర్ నెలాఖరు నాటికి అందించిన సమాచారం మేరకు ఇంత పెద్దఎత్తున నాటుసారా తీర ప్రాంతంలో ఏరులై పారుతోంది. దీన్ని బట్టి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 101 గ్రామాల్లో ఎంత మేర నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం నవోదయం పేరుతో గ్రామాల్లోని నాటుసారా కాసే కుటుంబాల్లో చైతన్యం తీసుకువచ్చి వారికి కొత్త జీవితాన్ని అందించాలని ఎక్సైజ్‌శాఖ ప్రయత్నిస్తోంది. మార్చి నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా తయారుచేయాలన్న సంకల్పంతో ఆ శాఖ ముందుకు వెళుతోంది.
ఏడు ఇసుక రీచ్‌ల్లో ఇసుక సరఫరాకు చర్యలు
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 3 : జిల్లాలో ఇసుక కొరత లేకుండా నూతన ఇసుక విధానం ప్రకారం కొత్త వేలం పాట దారులు వచ్చే వరకూ ఏడు ఇసుక రీచ్‌లలో ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం గోంగూరతిప్ప -1,2, సిద్ధాంతం, తాడిపూడిలతోపాటు వేలేరుపాడు, కుకునూరు పరిధిలో మూడు రీచ్‌లలో ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. నూతన ఇసుక విధానం ద్వారా ఇ-వేలం అనంతరం వేలంపాటదారుడు ఇసుక రీచ్‌లను అప్పగించే వరకూ వీటిని కొనసాగించాలన్నారు. గతంలో అపరాధరుసుం విధించిన పందలపర్రు, సిద్ధాంతం, ఈపర్రు, కరుగోరుమిల్లి, తదితర అయిదు సంఘాల నుండి అపరాధ రుసుం వసూలయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్, డి ఆర్‌డి ఎ పిడి కె శ్రీనివాసులు, డ్వామా పిడి డి వెంకటరమణారెడ్డి, రవాణా శాఖ ఉపకమిషనర్ ఎం ప్రభురాజు, జిల్లా పరిషత్తు సి ఇవో డి సత్యనారాయణ, భూగర్భ జల శాఖ డిడి ఎన్ రంగారావు, గనులు శాఖ ఎడి సి మోహనరావు, డిపివో జి రాజ్యలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై సాయి శ్రీకాంత్, తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపల్ కమిషనర్లు నిరంజన్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పట్టిసీమలో భద్రతాచర్యలు
శివరాత్రి ఉత్సవాల సమీక్షా సమావేశంలో జెసి కోటేశ్వరరావు
పోలవరం, ఫిబ్రవరి 3: మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. కోటేశ్వరరావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టిసీమ తీర్థం రేవులో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఛైర్మన్ ఆర్డీవో ఎస్. లవన్న అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారని, వారికి ఆలయ దర్శనం అయి తిరిగి వెళ్లేంత వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు తాగునీరు, వసతి, మరుగుదొడ్లు, రవాణా సదుపాయం, భద్రతాచర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం శివరాత్రి రావడంతో గత సంవత్సరం కంటె అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లకోసం బారీకేడ్లు నిర్మించాలని, చలువ పందిర్లు ఏర్పాటుచేయాలని దేవాలయ ఇన్‌చార్జి ఇఒ కె. విశ్వనాధరాజును ఆదేశించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోను, పరిసరాల్లోను శుభ్రంగా వుంచడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ఉత్సవాల మూడురోజులు విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎడి సిహెచ్ నరసింహమూర్తిని ఆదేశించారు. పట్టిసీమకు వచ్చే రోడ్డు మార్గంలో మలుపుల్లో హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటుచేయాలని ఆర్‌అండ్‌బి డిఇ ఇఎస్ అనిల్‌కుమార్‌కు సూచించారు. భక్తుల సౌకర్యార్ధం 120 బస్సులు వివిధ డిపోల నుంచి నడపనున్నట్టు ఆర్టీసి రీజినల్ మేనేజర్ ధనుంజయరావు తెలిపారు. తొమ్మిది వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె. వెంకటరావు తెలిపారు. భక్తులు నది దాటేందుకు 15 లాంచీలు, ఎక్కే ప్రదేశాల్లో నాలుగు పంటిలతో పాటు జెట్టీలు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎజిఆర్‌బి డిఇ రత్నరాజు తెలిపారు. అలాగే మంచినీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ రాజన్‌ను జెసి ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన 2వ సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి అధికారులందరూ యాక్షన్ ప్లాన్‌తో రావాలని జెసి కోటేశ్వరరావు ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఒ షాన్ మోహన్, డిఎల్‌పిఒ కె. అమ్మాజీ, బ్రేక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎక్సైజ్ సిఐ పి. భార్గవ్, ఎంపిడిఒ నిర్మలాదేవి, ఎంపిటిసి రెడ్డి సీతారాం, పోలవరం సర్పంచ్ సంకురు వెంకాయమ్మ, అధికారులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఏలూరు, ఫిబ్రవరి 3: జిల్లాలో యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్ధల బంద్ బుధవారం విజయవంతంగా సాగింది. అన్నిప్రాంతాల్లోనూ ప్రైవేటు విద్యాసంస్ధలన్నీ పూర్తిగా మూతపడ్డాయి. అక్కడక్కడ ప్రభుత్వ విద్యాసంస్ధలు పనిచేసినా వాటిని కూడా సంఘాల నాయకులు, కార్యకర్తలు మూయించివేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్ధల బంద్ ప్రశాంతంగా సాగింది. ఏలూరులో ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆగ్రహారంలోని బాలికల హైస్కూల్ వద్ద విద్యార్ధినీవిద్యార్ధులతో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి మాట్లాడుతూ విద్యారంగాన్ని మతతత్వంతో నింపాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి బిజెపి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. సంస్ధ నగర కార్యదర్శి కె మహేంద్ర మాట్లాడుతూ రోహిత్ అత్మహత్యకు కారకులైనవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో సంస్ధ నాయకులు బి రాజేష్, పి మణికంఠ, మత్తా పవన్‌కుమార్, వి మణికంఠ, కె నూకరాజు, వి శాంతి, వి గాయత్రి, ఎం నిరీషా తదితరులు పాల్గొన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే అభివృద్ధి
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 3 : కుర్చీలో కూర్చుంటే పరిపాలన సాగదని జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనులుచేస్తేనే అనుకున్న లక్ష్యాలు, అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధాన్యతారంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, ఫిషరీస్, ఎపి డెయిరీ తదితర శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవన శాఖాధికారులు వారికి కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా ప్రతీ వారం కుంఠిసాకులు చెప్పడంపై తీవ్రంగా తప్పుపట్టారు. మీరు చెప్పే అబద్ధాలు, కుంఠిసాకులు చందమామ కధల్లా సుఖాంతం కావని దుఃఖాంతం అవుతాయని పనిచేయని అధికారులపై ఏ మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రొటీన్ కస్టమర్లు లాగా కొంతమంది రైతులతోనే సత్సంబంధాలు ఏర్పరచుకుని వారికే ప్రభుత్వం అందించే రాయితీలు, పరికరాలు అందించడం కాదని జిల్లాలో పేద రైతులందరికీ న్యాయం జరిగేలా అధికారులు వారికి అవసరమైన సహాయ సహకారాలు, అవగాహన కల్పించి అధికోత్పత్తులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖలు లబ్ధిదారులకు అందించిన ఉపకరణాలు, సబ్సిడీలు సక్రమంగా వారికి అందిందీ లేనిదీ ఆ శాఖలకు సంబంధం లేని వేరే శాఖలతో విచారణ చేయిస్తానని ఏమైనా అవకతవకలు జరిగినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ అంశాలకు బడ్జెట్ వచ్చిందో అదే అంశానికి బడ్జెట్ నిధులు ఖర్చు చేయాలని తమకు నచ్చిన రీతిలో ఇతర అంశాలకు ఖర్చు చేయవద్దని అన్నారు. ఏలూరు, ఆకివీడుల్లో ఆక్వా ల్యాబ్‌కు సంబంధించి పనులను ఈ సాయంత్రం లోగా మొదలుపెట్టి సంబంధిత ఫొటోలను వాట్సాప్ ద్వారా తనకు పంపించాలని ఫిషరీష్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెసి-2 ఎంహెచ్ షరీఫ్, వ్యవసాయ శాఖ జెడి వై సాయిలక్ష్మీశ్వరి, ఉద్యానవన శాఖ ఎడిలు విజయలక్ష్మి, దుర్గేష్, పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వరరావు, ఎల్‌డి ఎం ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, మార్క్‌ఫెడ్ డి ఎం నాగమల్లిక, ప్రణాళికా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత గడువులోగా చేపల చెరువులకు అనుమతివ్వాలి:కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 3 : చేపల చెరువులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై నిర్ణీత గడువులోగా సంబంధితాధికారులు నిర్ణయం తీసుకుని సక్రమంగా ఉన్న వాటికి అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేపల చెరువుల అనుమతులుకోసం వచ్చే దరఖాస్తులను అధికారులు వారి వద్ద పెండింగ్ ఉంచుకోవద్దని ఎప్పటికప్పుడు వాటిపై తగు నిర్ణయం తీసుకుని సక్రమంగా ఉంటే అనుమతులు మంజూరు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని తిరస్కరించడం గానీ చేయాలని చెప్పారు.. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖాధికారుల దగ్గర వున్న పెండింగ్ దరఖాస్తులను ఈ సాయంత్రం లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెసి-2 ఎంహెచ్ షరీఫ్, ఫిషరీస్ డిడి లాల్ జాన్ అహ్మద్, వ్యవసాయ శాఖ జెడి వై సాయి లక్ష్మీశ్వరి, భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ గైర్హాజర్‌పై జెసి ఆగ్రహం
పోలవరం, ఫిబ్రవరి 3: మహాశివరాత్రి ఉత్సవాల్లో ఫెర్రీ పాయింట్ల ఏర్పాట్లు కాంట్రాక్టరే చేయాల్సి వుండగా సమావేశానికి ఎందుకు రాలేదని జాయింట్ కలెక్టర్ పి. కోటేశ్వరరావు ప్రశ్నించారు. శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు గోదావరి నది దాటేందుకు లాంచీలు, పంట్ల ఏర్పాట్లు, బారికేడ్లు, జెట్టీల నిర్మాణం ఫెర్రీ కాంట్రాక్టరే చేయాల్సి వుండగా కాంట్రాక్టరు సమావేశానికి గైర్హాజరు కావడంతో జెసి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహాశివరాత్రి ఏర్పాట్ల బాధ్యత నుండి తప్పుకునే విధంగా ఫెర్రీ కాంట్రాక్టర్ ప్రవర్తిస్తున్నాడని పంచాయతీ సిబ్బంది తెలపడంతో ఉత్సవాల ఏర్పాట్లు చేయకపోతే ఊరుకునేది లేదని, పుష్కరాల్లో ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో అధిక లాభాలు పొంది, శివరాత్రి ఏర్పాట్ల బాధ్యత నుండి తప్పుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జెసి హెచ్చరించారు.

బకాయిల కోసం చెరకు రైతుల ధర్నా
కొవ్వూరు, ఫిబ్రవరి 3: చాగల్లు సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై బుధవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో చెరకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బుధవారం చెరకు రైతులు బకాయిలపై యాజమాన్యంతో చర్చించటానికి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అయితే యాజమాన్యానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ భాస్కరరావు ఆర్డీవో కార్యాలయానికి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు వచ్చిన ఫ్యాక్టరీ ఉద్యోగులు పి గాంధీ, కె ప్రసాద్, ఎస్ శివనాగేశ్వరరావును నిలదీశారు. సాయంత్రం నాలుగు గంటల వరకు భాస్కరరావు వస్తారని భావించిన రైతులు రాకపోవడంతో ఫ్యాక్టరీ ఉద్యోగులతో కలిసి చాగల్లు ఫ్యాక్టరీకి తరలివెళ్లారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బి శ్రీనివాసరావు, సుగర్‌కేన్ అసిస్టెంట్ కమిషనర్ ఎ ప్రతాపరావు, రైతు నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్సార్‌సిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, పరిపి హరిచరణ్, రైతు సంఘం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, సిపియం నాయకులు దగ్గు రాథాకృష్ణ రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నరసాపురం వైసిపి కౌన్సిలర్ కొత్తపల్లి సస్పెన్షన్
నరసాపురం, ఫిబ్రవరి 3: వైసిపి కౌన్సిలర్ కొత్తపల్లి భుజంగరాయులు (నాని)ను సస్పెండ్ చేస్తూ నరసాపురం మున్సిపల్ కౌన్సిలు అత్యవసర సమావేశం తీర్మానించింది. జనవరిలో జరిగిన సాధారణ సమావేశంలో చైర్‌పర్సన్‌పై అప్రజాస్వామ్యిక భాషను ఉపయోగించారని పేర్కొంటూ నానిని మూడు కౌన్సిలు సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారు. దీనిపై కౌన్సిలు భగ్గుమంది. రాజకీయంగా ఎదుగుతున్న నానిని అడ్డుకోవాలనే టిడిపి ఈ చర్యకు పాల్పడిందంటూ విపక్ష కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన కౌన్సిలు అత్యవసర సమావేశానికి చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఎంఎ షరీఫ్, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సమావేశానికి హాజరయ్యారు. జనవరి 30న జరిగిన కౌన్సిలు సాధారణ సమావేశంలో చైర్‌పర్సన్ రత్నమాలపై వైసిపి సభ్యుడు కొత్తపల్లి నాని నిబంధనలు ఉల్లంఘించి సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఆటంకం కల్పించారని, చైర్‌పర్సన్‌పై అప్రజాస్వామిక భాషను ఉపయోగించారని దీనిపై చర్యలు తీసుకోవాలని అజెండాలోని రెండవ అంశంగా పొందుపరిచారు. ఈ అంశంపై సమావేశం వాడీవేడిగా జరిగింది. డిటిడి కౌన్సిలర్ సరిదే నాగజ్వోతి మాట్లాడుతూ సమావేశ నిబంధనలను ఉల్లంఘించిన నానిపై మూడు కౌన్సిలు సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనిపై ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ సమావేశంలో ప్రజా సమస్యలను చర్చించాలే తప్ప ఆవేశాలకు చోటివ్వకూడదన్నారు. జరిగిన సంఘటనపై నాని క్షమాపన చెపితే వివాదం ఇక్కడితో సమసిపోతుందన్నారు. ఈ అంశాన్ని నాని విజ్ఞతకే వదులుతున్నామని షరీఫ్ అన్నారు. దీనిపై కౌన్సిలర్ నాని తన వివరణను వినిపించారు. తాను ఉన్నత విలువలున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, మహిళలపై గౌరవం ఉందన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు మునిసిపాలిటీకి ఎందుకు రాలేదని ప్రశ్నించే సమయంలో చెయ్యి గ్లాసుకు తగిలి నీరు ఛైర్‌పర్సన్ టేబులుపై పడ్డాయన్నారు. ఇది కావాలని చేసిందికాదన్నారు. ఈ సమయంలో తాను అప్రజాస్వామిక పదజాలాన్ని వాడలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తిలేని స్పష్టం చేశారు. అనంతరం నానిని మూడు సమావేశాల వరకు సస్పెండ్ చేసినట్టు చైర్‌పర్సన్ రత్నమాల ప్రకటించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికార బలం ఉందని టిడిపి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సభ్యులు బళ్ళ వెంకటేశ్వర రావు, కామన బాల సత్యనారాయణ, డిఎస్‌ఎస్ ప్రసాదరావు, సందక సురేష్ ధ్వజమెత్తారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మున్సిపల్ అత్యవసర సమావేశం సందర్భంగా పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి కౌన్సిలర్ కొత్తపల్లి భుజంగరాయులుని కౌన్సిలు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తారనే సమాచారంతో కార్యకర్తలు బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయిత్నం చేసారు. దీంతో వీరిని కార్యాలయంలోనికి చొరబడకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయానికి 500 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించలేదు. అలాగే కార్యాలయం వద్ద కూడ పోలీసులు మొహరించారు.

ఎమ్మెల్యే రామానాయుడుతో మహిళ వాగ్వాదం
యలమంచిలి, ఫిబ్రవరి 3: యలమంచిలి మండలం ఏనుగువాని లంక గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆ గ్రామానికి చెందిన వినుకొండ లక్ష్మి (సూర్యకుమారి) మధ్య వివాదం ఏర్పడింది. వివరాలిలా వున్నాయి. వైవి లంక గ్రామంలో 13, 14 ఆర్థిక సంఘం నిధులతో రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం ఒఎన్‌జిసి కాలనీలో వున్న రోడ్డును పరిశీలించడానికి కార్యకర్తలు తీసుకువెళ్లగా ఆ ప్రాంతంలో నివాసముంటున్న లక్ష్మి ఎమ్మెల్యే వెంట వున్నవారిని చూసి, ఏ ప్రభుత్వం వచ్చినా చేసేదేమీ వుండదని, ఓట్లు సమయంలో తప్ప, మిగతా సమయంలో ఎవరూ కనిపించరని వ్యాఖ్యానించింది. దీంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కలుగజేసుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అన్నీ ఒక్కసారి పూర్తయిపోతాయా... అని ఇంటి పై కొప్పుకు శ్లాబ్ వేయకుండా రేకు ఎందుకు వేశావని ఆయన ప్రశ్నించారు. డబ్బు చూసుకుని వేయిస్తామని ఆమె అనడంతో ఇది కూడా అంతే.. డబ్బులు వున్నపుడే రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే అనడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరినొకరు కేకలు వేసుకోవడంతో స్థానిక నాయకులు చూస్తూ వుండిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన అనంతరం ఆ మహిళను జడ్పీటీసీ బోనం నాని సముదాయించే ప్రయత్నం చేశారు.