పశ్చిమగోదావరి

యోగా చేసే వారి సంఖ్య పెరగడం శుభ పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 21 : యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని గత ఏడాదితో పోలిస్తే నేడు యోగా చేసే వారి సంఖ్య పెరగడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వంగాయగూడెంలోని కమ్యూనిటీ హాలులో ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావులతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్దినీ విద్యార్ధులు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకూ యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడిల వలన మనిషి నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నాడని అటువంటి వాటి నుండి ఉపశమనం పొందాలంటే యోగా సాధన ఒక్కటే మార్గమని చెప్పారు. పని ఒత్తిడి ఎంత ఉన్నా ప్రతీ రోజూ ఉదయం ఒక గంట పాటు యోగా సాధనకు సమయం కేటాయిస్తే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించగలుగుతామనే వాస్తవాన్ని ప్రజలంతా గుర్తించాలని కోరారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ప్రతీ మనిషీ తన పరిధిలో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం యోగాసాధన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాలని కోరారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిల వలన మానవ జాతిని నేడు అనేక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని వాటి నుండి విముక్తులు కావాలంటే యోగా సాధన తప్పనిసరన్నారు. జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ శారీరక, మానసిక ధృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని ముఖ్యంగా పోలీసులు నిత్యం యోగా సాధన ఆచరించాలని కోరారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, ఆయుష్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శ్యామ్‌సుందర్, ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్, తహశీల్దార్ ప్రసాద్, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం నిర్వాహకురాలు లావణ్య, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు కె మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రియదర్శిని అందరి చేత యోగా సాధన చేయించారు.

ఆరోగ్య యోగం
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం మంగళవారం జిల్లా అంతటా ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు అంతా యోగా సాధనలో పాల్గొన్నారు. శరీరానికి వ్యాయామం, మనస్సుకు శుద్ధి ఏక కాలంలో సాధించేందుకు యోగాను మించిన ఔషధం లేదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మంగళవారం స్థానిక శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉంటే ఎలాంటి వ్యాధులు రావన్నారు. శరీరాన్ని, మనస్సును సమతుల్యంలోకి తెచ్చేది యోగా ఒక్కటేనన్నారు. యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో యోగాను చేస్తున్నారన్నారు. మన దేశంలో గత కొంతకాలంగా యోగాను మర్చిపోయారని, తిరిగి యోగా వైపు ప్రజలు వెళ్తున్నారన్నారు. వృద్ధాప్యం ప్రతీ ఒక్కరికీ తప్పదని, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. చదువుతో పాటు యోగాను కూడా విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. సిఎం చంద్రబాబు యోగాను, క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ అధ్యక్షులు సి హెచ్‌ఎఆర్‌కె వర్మ, బ్రహ్మకుమారి రమాదేవి, పతంజలి యోగా నిర్వాహకులు ఆదిత్య కృష్ణానంద, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాకా శ్రీనివాసరావు, యోగా గురువు మాధవరావు, ఎస్ రామకృష్ణ, ఎండిఒ మల్లికార్జునరావు, తహసీల్దారు పాశం నాగమణి పాల్గొన్నారు.
యోగాతోనే ఆరోగ్యవంతమైన జీవితం
జంగారెడ్డిగూడెం: యోగా చేయటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ, గనుల శాఖల మంత్రి పీతల సుజాత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా మంత్రి అధికారులు, నాయకులతో కలిసి కొద్దిసేపు యోగా చేశారు. అనంతరం మంత్రి సుజాతను, యోగా శిక్షకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నగర పంచాయత్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, జిల్లా తెలుగురైతు అధ్యక్షులు అబ్బిన దత్తాత్రేయ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు, రాజాన సత్యనారాయణ, కౌన్సిలర్లు, ఆర్డీవో ఎస్ లవన్న, తహసీల్దారు జివివి సత్యనారాయణ, నగర పంచాయత్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటరమణ బదిలీ
-కొత్త ఎస్‌ఇగా శ్రీనివాస్
ఏలూరు, జూన్ 21 : ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటరమణ బదిలీ అయ్యారు. ఆయన్ను హైదరాబాద్‌లోని హైడ్రాలజీ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో నంధ్యాల ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ శ్రీనివాస్‌ను నియమించారు. గత కొద్దికాలంగా వెంకటరమణ బదిలీపై ఊహాగానాలు కొనసాగుతూ వచ్చాయి. పనుల విషయంలో మందకొడిగా సాగుతున్నారంటూ పలుమార్లు జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక భీమవరం డ్రైనేజ్ ఇ ఇ వెంకటరమణ కూడా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కృష్ణాకెనాల్ ఇ ఇ సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏలూరు సర్కిల్ ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ ఇ కె వరహాలును కూడా బదిలీ చేస్తూ ఆయన్ను శ్రీశైలం డ్యామ్స్, బిల్డింగ్స్ డిప్యూటీ ఎస్ ఇగా నియమించారు. ఆయన స్థానంలో కృష్ణాకెనాల్ ఇ ఇగా పనిచేస్తున్న కె రవికి పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎస్ ఇగా నియమించారు.
కోటి మొక్కల ప్రణాళిక
ఏలూరు, జూన్ 21 : జిల్లాలో జూలై నాటికి కోటి మొక్కలు నాటేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అటవీ శాఖాధికారులతో మొక్కల పెంపకం, అటవీ సంరక్షణ, తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. జిల్లాలో ఉన్న నర్సరీల్లో అయిదు కోట్ల రూపాయల వ్యయంతో కోటి రెండు లక్షల మొక్కలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వర్షాకాలంలో పెద్ద ఎత్తున వీటిని జూలై నాటికి నాటేందుకు ఇప్పటికే అయిదు లక్షల మొక్కలను ఉచితంగా అందించడం జరిగిందన్నారు. జిల్లాలో పాఠశాలల్లో 63 కిలోమీటర్లు బయోఫెన్సింగ్ కోసం 8 లక్షల 19 వేల మొక్కలను నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసారన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ఈ వర్షాకాలంలో రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని వాటి సంరక్షణ కోసం విద్యార్ధినీ విద్యార్ధులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రకృతితో మమేకం కావాలన్నారు. చిన్ననాటి నుండే మొక్కలు పెంచే సంస్కృతిని పిల్లల్లో ఒక అలవాటుగా తీసుకురావాలన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చన్నారు. జిల్లాలో అటవీ ప్రాంతంలో వర్షపునీరు నిల్వ ఉండటానికి లక్ష క్యూబిక్ మీటర్ల పొడవునా కాంటూరు కందకాల త్రవ్వకానికి 4.65 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లాలో వెదురు విక్రయాల ద్వారా ఆరు కోట్ల రూపాయలు అటవీ శాఖకు ఆదాయం లభించిందని చెప్పారు. జిల్లాలో 12 వేల ఎకరాల అటవీ భూమిలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని దీనికి ప్రత్యామ్నాయంగా అనంతపురం జిల్లాలో 12 వేల ఎకరాలను అటవీ శాఖకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుండి డీనోటిఫైడ్ అనుమతి లభిస్తే జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. సామాజిక వన విభాగం అటవీ శాఖ డిఎఫ్‌వో వై ఎస్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 356 నర్సరీల ద్వారా మొక్కల పెంపకాన్ని చేపట్టామని ఇటీవల ఎర్రచందనం మొక్కల పెంపకానికి పశ్చిమలో కూడా ఆసక్తి పెరుగుతోందని అయితే శేషాచలం అడవుల్లో లభించే ఎర్ర చందనం మొక్కల నాణ్యత ఈ ప్రాంతంలోని మొక్కలకు ఉండడం లేదని చెప్పారను. జిల్లా అటవీ శాఖాధికారి శాస్ర్తీ మాట్లాడుతూ ఈమ శాఖ పరిధిలో 159 ఉద్యోగాలు ఉండగా ప్రస్తుతం 50 ఖాళీలున్నాయని, వాటి భర్తీ కోసం ప్రభుత్వానికి లేఖ వ్రాస్తామని త్వరలోనే భర్తీ చేయడానికి తగు నోటిఫికేషన్ విడుదల కానున్నదని చెప్పారు. సమావేశంలో అటవీ శాఖా రేంజ్ అధికారులు ఎల్ ధనరాజ్, డేవిడ్‌రాజు, నరసింహారావు, సూర్యప్రకాశరావు, ఎన్ శ్రావన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు బైకు చోరులు అరెస్టు
కొవ్వూరు, జూన్ 21: ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడిన ముగ్గుర్ని అరెస్టుచేసి వారి వద్దనుండి రూ.13లక్షలు విలువైన 34 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు టోల్ గేట్ వద్దనున్న క్రైమ్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ బైకుల చోరీకి పాల్పడిన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన గూటాల చిన్నబ్బాయి అనే నాయుడు, రాజమహేంద్రవరానికి చెందిన పల్లె మోహనరావు అనే మెకానిక్ బుజ్జి, ఉసురుమర్తి మోషీ దయానందలను సోమవారం కొవ్వూరు టోల్‌గేటు వద్ద అరెస్టుచేసినట్టు తెలిపారు. డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణ సిఐ పి ప్రసాదరావు, పట్టణ ఎస్సైలు ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, డి గంగాభవాని, క్రైం ఎస్సైలు కెవి రమణ, బి శ్రీనివాస్ సింగ్, ఎఎస్సై ఎస్ శ్రీనివాసరావు, హెచ్‌సిలు బిఎన్‌వి శ్రీనివాసరావు, ఎన్ నాగేశ్వరరావు, కె నాగభూషణం, కానిస్టేబుల్స్ డి ప్రసాదబాబు, ఎస్‌వి రమణ, ఒ నరేష్, బి రామారావు, బి శ్రీను, ఎం వినయ్‌కుమార్ ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు. వీరందరికీ రివార్డుల నిమిత్తం జిల్లా ఎస్పీకి సిఫార్సుచేసినట్టు డిఎస్పీ తెలిపారు. వాహనాలను పొగొట్టుకున్న వాహన యజమానులు కొవ్వూరు పట్టణ స్టేషన్లో సంప్రదించాలని డిఎస్పీ కోరారు.
బ్యాక్‌లాగ్ పోస్టులపై దృష్టి పెట్టాలి
దేవరపల్లి, జూన్ 21: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న కారెం శివాజీకి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇవ్వటం దళితులను గౌరవించినట్టేనని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. దేవరపల్లిలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎఎంసి మాజీ ఛైర్మన్ గెడా మురళీ అజిత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ శివాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా దళిత, గిరిజనులకు మరిన్ని సేవలందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, గిరిజన బ్యాక్‌లాగ్ పోస్టులను దళిత గిరిజనులకు అందేవిధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోది, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. సన్మాన గ్రహీత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఎంతో నమ్మకంతో పదవి ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి తమ సామాజిక వర్గాన్ని గుర్తించినందుకు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. గోపాలపురం ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, జడ్పీటీసీ కొయ్యలమూడి సుధారాణి, సర్పంచ్ సుంకర యామిని, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొయ్యలమూడి చినబాబు, మండల టిడిపి అధ్యక్షుడు సుంకర దుర్గారావు, విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, డి సువర్ణరాజు, ఎండివి ప్రసాద్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు డి శ్యామ్‌సుందర్, జాతీయ ఉపాధ్యక్షుడు కర్రి భీమేశ్వరరావు, స్థానిక నాయకులు కె సౌదామణి, టేకుమూడి చక్రయ్య, అంబటి శ్రీనివాసరావు, మాలమహానాడు నాయకులు ఎస్ బాలకృష్ణ, తీగల ప్రభ, వై నిరంజనీదేవి, కాశీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి జడ్పీటీసీ జ్యోతిప్రజ్వలన చేయగా, మంత్రి మాణిక్యాలరావు, కారెం శివాజీలు పూలమాలలువేసి నివాళులర్పించారు. శివాజీని మంత్రి మాణిక్యాలరావు తదితరులు ఘనంగా సన్మానించారు.
త్వరలోనే నిందితులను పట్టుకుంటాం
ఆకివీడు, జూన్ 21: ఆకివీడు కార్పొరేషన్ బ్యాంకులో బంగారం మాయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నరసాపురం డిఎస్పీ జి పూర్ణచంద్రరావు, భీమవరం రూరల్ సిఐ ఆర్‌జి జయసూర్య ఆధ్వర్యంలో దర్యాప్తువేగవంతం చేశారు. బ్యాంకుకు సంబంధించి మేనేజర్‌తో పాటు ఏడుగురు ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బంగారు నగలు మాయంపై ప్రస్తుతం విచారణ చేపట్టామని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామన్నారు. ఇదిలా ఉండగా బ్యాంకు లావాదేవీలు విజయవాడ, ఏలూరు సిబ్బందిచేత మంగళవారం నిర్వహించారు. బ్యాంకులో బంగారు నగలు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు మంగళవారం పెద్దఎత్తున బ్యాంకుకు చేరుకుని వారి బంగారాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అలాగే లాకర్లలో భద్రపరుచుకున్న ఇతరత్రా సామాగ్రిని ఖాతాదారులు తీసుకువెళ్ళినట్లు సమాచారం.
24,25 తేదీల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
ఏలూరు, జూన్ 21 : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 24, 25 తేదీల్లో భీమవరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసే అంశంపై చర్చ జరుగుతోందని తెలిపారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని, అయినప్పటికీ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంతకుముందు రాష్ట్రాలకు 32 శాతం ఇచ్చే నిధులను 42 శాతం చేశామని, అంతేకాకుండా రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల రూపాయల నిధులతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 2500 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం ఇప్పటికే అందించామని, అయితే ఇంత వరకు అక్కడ పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 850 కోట్ల రూపాయలను అందించామని, దీనిలో ఇంత వరకు 250 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి లెక్కలు చెప్పలేదని తెలిపారు. అంతేకాకుండా పోలవరాన్ని, పట్టిసీమను కలిపి కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే పోలవరం ప్రాజెక్టు మాత్రమే కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ విధంగా ఎన్నో రకాల సహాయాన్ని అందిస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం ప్రత్యేక హోదా అంశాన్ని సెంటిమెంటుగా మార్చి బిజెపికి చెడ్డపేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వాస్తవానికి అంతకుమించి రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఈ అంశాలపై కూడా కార్యవర్గ సమావేశాల్లో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొరళ్ల సుధాకర్‌కృష్ణ, నగర అధ్యక్షులు నాగం శివ, ముద్దాని దుర్గారావు తదితర నాయకులు పాల్గొన్నారు.
తణుకులో ఘనంగా యోగా దినోత్సవం
తణుకు, జూన్ 21: ప్రపంచ యోగా దినోత్సవాన్ని తణుకులో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థలు, స్వచ్ఛ సేవాసంస్థలు, యోగా అభివృద్ధి సంఘాలు, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగదళ్, పతంజలి యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామకృష్ణ సేవా సమితి, నన్నయ భట్టారక పీఠం, రోటరీ, లయన్స్ క్లబ్‌లు తదితర పలు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ పర్యవేక్షణలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక కమ్మ కల్యాణ మండపంలో ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా ప్రాధాన్యతను వివరించారు. అనంతరం మంత్రితోపాటు పలువురు ప్రముఖులు యోగా ఆసనాలు వేసి అందర్నీ ఉత్సాహపరిచారు.
అలాగే పట్టణంలోని ఎస్‌కెఎస్‌డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత కళాశాల ప్రాంగణంలో జరిగిన యోగా శిక్షణా తరగతుల్లో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
ఇక్కడ కూడా ఆయన విద్యా సంస్థల అధినేత చిట్టూరి సుబ్బారావుతో కలిసి యోగా సాధన చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీగా బయల్దేరి నరేంద్ర సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం రహదారిపై యోగాసనాలు ప్రదర్శించారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. ఈ రెండు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు వైటి రాజా, ముళ్లపూడి వెంకట కృష్ణారావు, డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పట్టణ ప్రముఖుడు, ప్రజావైద్యుడు తాతిన రామబ్రహ్మం, యోగా ఉద్యమ నాయకులు డాక్టర్ జివివి సత్యనారాయణ, ఎంఎస్‌ఆర్ ఆంజనేయులు, అనపర్తి ప్రకాశరావు, కర్రి శ్రీనివాసులరెడ్డి, మురళీకృష్ణారెడ్డి, కోడే భాస్కరరావు, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎన్జీవోస్ భవనంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పీతాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ముద్రగడ ఆరోగ్యం కోసం పూజలు
వీరవాసరం, జూన్ 21: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుటపడాలంటూ మంగళవారం వీరవాసరం మండలం చింతలకోటిగరువు గ్రామ కాపు సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని వారు పేర్కొన్నారు.

పోలీసులమని బెదిరించి పోకిరీ వేషాలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూన్ 21: భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్త ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి పోలీసులమంటూ ఇద్దరు యువకులు యువతిని వేధించారు. అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు, ఆటోవాలాలు అక్కడకు చేరుకుని ఆ పోకిరీలకు దేహశుద్ధి చేశారు. కాళ్ళ మండలం సీసలి గ్రామంలోని ఆర్‌డిఆర్ సీఫుడ్స్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం నవగమ గ్రామానికి చెందిన గుండు కోటేశ్వరి గత కొంతకాలంగా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం కోటేశ్వరితో పాటు విశాఖపట్టణానికి చెందిన మహేష్, సింహాద్రి వారి స్వగ్రామాలకు వెళ్దామని స్థానిక టౌన్ రైల్వేస్టేషన్‌కు 11 గంటల ప్రాంతానికి వచ్చారు. అయితే అప్పటికే విశాఖపట్టణం మీదుగా వెళ్ళాల్సిన రైలు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక బస్సు ఎక్కడానికి టూటౌన్‌లోని టౌన్ రైల్వేస్టేషన్ నుండి వన్‌టౌన్‌లోని కొత్త ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. అదే సమయంలో కోటేశ్వరిని వెంబడిస్తూ వచ్చిన స్థానిక మెంటేవారితోటకు చెందిన ఆచంట చినబాబు, పొట్లూరి శ్యామ్‌కుమార్ తాము పోలీసులమని, ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. కోటేశ్వరితో పాటు ఉన్న మహేష్, సింహాద్రిలను ఎవరు మీరు అంటూ ప్రశ్నిస్తూ చున్నీ లాగబోతుండగా కోటేశ్వరి బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చినబాబు, శ్యామ్‌కుమార్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వీరిపై మంగళవారం కేసు నమోదు చేశారు.