పశ్చిమగోదావరి

చింతలపూడి సర్వే పనులు వారంలోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 2 : జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పధకానికి సంబంధించి మిగిలి ఉన్న సర్వే పనులను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పనులను అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పూర్తిచేయాలని ఆదేశించారు. చింతలపూడి ఎత్తిపోతల పధకంకు సంబంధించి ఇంకా సర్వే చేయాల్సిన వంద ఎకరాలకు సర్వే పనులు వచ్చేవారంలోగా పూర్తి చేసి ప్లగ్ మార్కింగ్ కూడా పూర్తి చేయాలన్నారు. సర్వే పనులకు అవసరమైతే ఎక్కువ టీమ్‌లను పెంచి పనులు పూర్తి చేయాలని అంతేగానీ అధికారులు తమ ఇష్టప్రకారం కాలయాపన చేస్తే సహించబోనని చెప్పారు. ఏజెన్సీ ప్రతినిధులు ప్రాజెక్టుకు సంబంధించి తమకు అప్పగించిన భూములను ఎప్పటికప్పుడు సాగుకు పనికిరాకుండా చేసి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకూ విస్తరించనున్న జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అలాగే కొవ్వూరు నుండి విజయవాడ వరకు ఏర్పాటు చేసే మూడవ రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే పనులు పూర్తి చేసి ఆ వివరాలను త్వరితగతిన తమకు అందజేస్తే ఆ తర్వాత భూసేకరణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో యనమదుర్రు డ్రైన్‌కు సంబంధించి భూమి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో డి ఆర్‌వో కె ప్రభాకరరావు, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ భాను ప్రసాద్, ఐటిడి ఏ పివో షాన్ మోహన్, నరసాపురం సబ్ కలెక్టర్ ఎ ఎస్ దినేష్‌కుమార్, ఏలూరు ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్, కొవ్వూరు ఆర్‌డివో శ్రీనివాసరావు, పోలవరం ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ డిడి రంగారావు, వ్యవసాయ శాఖ జెడి సాయిలక్ష్మీశ్వరి, ఉద్యానవన శాఖ ఎడిలు దుర్గేష్, విజయలక్ష్మి, మండల తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులు ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన రహదారిపై వరినాట్లు!
భీమోలు గ్రామస్థుల వినూత్న నిరసన

గోపాలపురం, జూలై 2: ఈ చిత్రం చూసి పొలాల్లో వరి నాట్లు వేస్తున్నారనుకుంటే పొరపాటే..అందరూ నడిచే రహదారిపై ఈ నాట్లువేసి శనివారం తమ నిరసన ఈ విధంగా వ్యక్తం చేశారు భీమోలు గ్రామస్థులు. తమ గ్రామ ప్రధాన రహదారిని అభివృద్ధి చేయమని ఎన్నిమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం..ఈ రహదారి మీదుగా ప్రయాణించే వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో గ్రామస్థులు వినూత్న రీతిలో ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జగన్నాధపురం నుండి గుడ్డిగూడెం, భీమోలు మీదుగా గజ్జరం వెళ్లే తారు రోడ్డును రెండు దశాబ్దాల కిందట నిర్మించారు. ప్రస్తుతం ఆ రహదారి గోతుల మయమై ఛిద్రంగా తయారైంది. చినుకుపడితే రహదారి బుదరమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్డుపై ఏర్పడిన గోతుల్లోకి వర్షపునీరుచేరి వాహనదారులు, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బురదమయమైన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ద్విచక్ర వాహనదారులు జారిపడి పలు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిని అభివృద్ధి చేయాలని గత నాలుగైదు సంవత్సరాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. కొద్దిపాటి వర్షం పడితే గ్రామం మీదుగా వచ్చే ఒక బస్సు కూడా అటుగా రాదని, దీంతో భీమోలు నుండి వివిధ గ్రామాలకు చదువుకునేందుకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇటీవల ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తారని ప్రజాప్రతినిధుల మాటలు అందని ద్రాక్షగా మారాయని, కురుస్తున్న వర్షాలకు రహదారులు తూట్లుతూట్లు పడ్డాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భీమోలుకు చెందిన మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

విహారయాత్రలో హక్కుల కమిటీ సభ్యులు
పోలవరం, జూలై 2: గోదావరి నదిపై విహార యాత్రలో శాసన మండలి హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సభ్యులు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం పట్టిసం తీర్థం రేవుకు శాసన మండలి హక్కుల కమిటీ అధ్యక్షురాలు శమంతకమణి, సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, విశ్వప్రసాద్ చేరుకున్నారు. అక్కడి నుండి వారు ఎపి టూరిజం బోటులో గోదావరి నదిపై సింగన్నపల్లి వరకు వెళ్లి, తిరిగి పట్టిసం చేరుకుని రాజమండ్రి తరలివెళ్లారు. అనధికార పర్యటనలో భాగంగా పట్టిసం వచ్చి వెళ్లారు. కమిటీ వెంట పోలవరం సిఐ కె బాలరాజు, ఎస్‌ఐ కె శ్రీహరిరావు, రాజమండ్రి నుండి వచ్చిన రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
వారతిప్పలో వింతచేప
మొగల్తూరు, జూలై 2: మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో సర్పంచ్ కె పల్లయ్య చేపల చెరువులో శనివారం చేపలు పడుతుండగా వింత చేప ఒకటి బయటపడింది. ఈ చేపను మత్స్యకారులు దెయ్యం చేపగా పేర్కొన్నారు. దీని మూతి మనిషి మూతిని పోలి ఉంది. ఈ రకం జాతి చేపలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని, అయితే వీటిని ఆహారంగా ఎవరూ వినియోగించరని వృద్ధ మత్స్యకారులు చెబుతున్నారు.
ద్వారకా తిరుమలలో తగ్గిన భక్తులర ద్దీ
ద్వారకాతిరుమల, జూలై 2: చిన వెంకన్న క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి సాధారణంగా ఉంది. అమావాస్య ముందు రోజులు కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. ప్రతి శనివారం స్వామివారిని 20 నుండి 30 వేల మంది వరకు దర్శిస్తుంటారు. అయితే ఈ వారం 15 వేల మంది భక్తులు మాత్రమే స్వామి వారిని దర్శించినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. 6,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే 31,860 లడ్డూ ప్రసాదాలు, 13,392 పులిహోర ప్యాకెట్లు, 5,036 చక్కెర పొంగలి ప్యాకెట్ల విక్రయాలు జరిగినట్టు ఇఒ వివరించారు.
జన్మభూమి కమిటీలపై హైకోర్టు స్టే
తాళ్లపూడి, జూలై 2: తాడిపూడి జన్మభూమి కమిటీ, ఎన్టీఆర్ గృహనిర్మాణాల జాబితా అమలుపై హైకోర్టు స్టే జారీ చేసింది. స్టే ఆదేశాలు శనివారం ఉదయం సంబంధిత అధికారులకు అందాయి. జన్మభూమి కమిటీల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు గోల చేస్తున్న నేపథ్యంలో తాడిపూడిలో కొత్త వివాదం నెలకొరిగింది. జన్మభూమి కమిటీలో సర్పంచ్ సభ్యుడైనా తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్టీఆర్ గృహనిర్మాణాల జాబితా తయారుజేయడంతో సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. తాడిపూడిలో 12మంది లబ్ధిదారులను ఎన్టీఆర్ గృహనిర్మాణాలకు ఎంపికచేస్తూ జన్మభూమి కమిటీ తీర్మానించింది. అయితే ఈ తీర్మానంపై తన సంతకాన్ని ఫోర్జరీచేసి జన్మభూమి కమిటీ జాబితాను పంపించిందని హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై హైకోర్టు జారీచేసిన (19399/2016 ప్రకారం) స్టే ఆదేశాలు అధికారులకు చేరాయి.
రోడ్డు ప్రమాదంలో సువర్ణరాజుకు గాయాలు
దేవరపల్లి, జూలై 2: దేవరపల్లిలో జరిగిన ఒక రోడ్డుప్రమాదంలో స్థానిక బిహెచ్‌ఎస్‌ఆర్ అండ్ విఎల్‌ఎం డిగ్రీ అండ్ పిజి కళాశాల ఛైర్మన్ డి సువర్ణరాజుకు గాయాలయ్యాయి. శనివారం ఉదయం ఇంటి వద్దనుండి బైకుపై కళాశాలకు వెళుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన తలకు, భుజానికి గాయాలయ్యాయి. స్థానిక పిహెచ్‌సిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రైవేటు వైద్యశాలలో చేరారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సువర్ణరాజును పరామర్శించేందుకు ఏలూరు తరలివెళ్లారు. ప్రస్తుతం సువర్ణరాజు కోలుకుంటున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.