పశ్చిమగోదావరి

దుమ్మురేపిన కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : ఎంతోకాలంగా ఏలూరు కృష్ణకాలువ తీరుపై తీవ్ర విమర్శలు, ఆవేదనలు వ్యక్తం కావడం తెలిసిందే. ఈ కాలువ దాదాపు డంపింగ్ యార్డుగా మారిందన్న ఆరోపణలూ వున్నాయి. మరోవైపు దశాబ్ధాలుగా కాలువగట్లను ఆక్రమించుకుని కొనసాగుతున్న వ్యాపారాలు అనేకం వున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏళ్ల తరబడి సాగుతున్నా కార్పొరేషన్ ఇంత వరకు స్పందించింది లేదు. అయితే శనివారం నాటి పరిణామాల్లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వారితో పాటు పోలీసులు వారి వెనుకే పెద్ద సంఖ్యలో జెసిబిలు రంగ ప్రవేశం చేయడంతో దాదాపుగా కృష్ణాకాలువ గట్ల వెంబడి వ్యాపారాలు చేసుకుంటున్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోందోనన్న ఆందోళనతో వారంతా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారి వేడుకోళ్లకు ఎటువంటి స్పందన రాకపోగా ఒక్కసారిగా మొత్తం యంత్రాంగం రంగంలోకి దిగి స్థానిక కర్రవంతెన సెంటర్ నుంచి గట్ల వెంబడి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ఒక్కసారిగా ప్రారంభించారు. సాయంత్రం పొద్దుపోయేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. శనివారం కావడం నిమిషాల వ్యవధిలో జెసిబిలు రంగంలోకి దిగి దుకాణాల తొలగింపు చేపట్టడంతో దుకాణదారులు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. చివరకు దుకాణాల తొలగింపు తప్పదన్న ఆందోళనతో దుకాణాల్లో వున్న సామాగ్రిని హడావిడిగా తరలించుకున్నారు. ఈ పరిణామాలతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో తీవ్ర సంచలనమే రేగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గట్ల ఆక్రమణలు తొలగించడం ఎవరి వల్లా కాదన్న అభిప్రాయం అందరిలోనూ స్థిరపడిన నేపధ్యంలో ఒక్కసారిగా తొలగింపు కార్యక్రమం ప్రారంభం కావడం గమనార్హం. అయితే ఇదే సమయంలో బాధితులు మాత్రం తీవ్రస్థాయిలో గగ్గోలు పెడుతున్నారు. కనీసం ముందుగా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా దుకాణాలను తొలగిస్తున్నారంటూ ఆవేదనలు, అసంతృప్తులు పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏలూరు పరిధిలో వెళుతున్న కృష్ణాకాలువ గట్ల వెంబడి ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై కార్పొరేషన్ గత కొద్దివారాలుగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ముందస్తుగా అంతర్గత కసరత్తును పూర్తి చేసింది. గట్ల వెంబడి ఎన్ని దుకాణాలున్నాయి. ఎన్ని పక్కా నిర్మాణాలు, ఇంకెన్ని తాత్కాలిక ఏర్పాట్లు, ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలన్నీ ముందుగానే పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకాకుండా న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. దానికి అనుగుణంగానే శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చి శనివారం ఉదయం నుంచి ఒక్కసారిగా రంగంలోకి దిగి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ ప్రక్రియలో దాదాపుగా 500 నుంచి 600 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఉదయానికే కార్పొరేషన్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో జెసిబిలను రప్పించారు. ఆ తరువాత ట్రాక్టర్లను మట్టి తొలగించే కార్యక్రమాలను, ఉద్యోగులను, అధికారులను రప్పించారు. అయితే ఈ హడావిడంతా చూసి గట్ల వెంబడి వున్న దుకాణదారులు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఒక్కసారిగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు రెండు మూడొందలమంది అక్కడకు చేరుకోగా కార్పొరేషన్‌లో వారికి సమాధానం చెప్పే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. అప్పటికే కార్పొరేషన్‌లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఒక దశలో ఆక్రమణల తొలగింపు కోసమే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రహించిన దుకాణదారులు కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని వెనువెంటనే అక్కడి నుంచి తరలించి వేశారు. ఇక ఆ తరువాత నుంచి కర్రవంతెన నుంచి ప్రారంభమైన ఆక్రమణల తొలగింపు సాయంత్రం పొద్దుపోయే నాటికి వసంతమహల్ సెంటర్ దాటింది. ఈ మధ్యలో గట్లకు రెండు వైపులా వున్న దాదాపు 60కి పైగా దుకాణాలను తొలగించినట్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి తూర్పులాకుల నుంచి పడమటి లాకుల వరకు వున్న కృష్ణాకాలువ గట్లపై ఇరువైపులా వున్న ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా శనివారంనాటి పరిణామాలను చూసిన నగర ప్రజలు ఒక రకంగా ఈ స్థాయి కార్యక్రమం కార్పొరేషన్ చేయగలగడం పట్ల విస్తుపోతుండగా దుకాణదారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ దుకాణదారులు తొలగింపును వ్యతిరేకించినా దాన్ని ఎదుర్కొనేందుకు పోలీసు బలగాలను సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా తాళాలు వేసి వెళ్లిపోతే అలాంటి వాటిని కూడా తొలగించేందుకు పెద్ద సంఖ్యలో వి ఆర్‌వోలను సిద్ధం చేసి తాళాలు పగలకొట్టి పంచనామా నిర్వహించి ఆ తరువాత ఆ దుకాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే దుకాణాల తొలగింపు తప్పదన్న ఆందోళనతో చాలా వరకు దుకాణదారులే తమ దుకాణాల్లో వున్న సామాగ్రిని సొంతంగానే తరలించుకున్నారు. ముందస్తుగా ఆక్రమణల తొలగింపులో భాగంగా గతంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన హాకర్స్ జోన్ పరిధిలోని దుకాణాలను తొలగించడం గమనార్హం. ఆ తరువాతే మిగిలిన దుకాణాల వైపు ఈ ఆక్రమణల తొలగింపు వెళ్లింది. మొత్తం మీద ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగే అవకాశం వుందని తెలుస్తోంది.