పశ్చిమగోదావరి

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 5 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడలో హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు పట్టిసీమ వద్ద వెంకటాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం వద్ద పంపులు ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఇటుకలకోట సమీపంలోని డెలివరీ పాయింట్‌కు చేరుకుని నీటి ప్రవాహతీరును పరిశీలిస్తారు. తిరిగి 10.30 గంటలకు హెలిప్యాడ్ చేరుకుని హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటారు. అనంతరం వ్యూ పాయింట్, రోడ్డు మార్గంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అధికారులతో పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల నిర్మాణం పనులపై సమీక్షించి మధ్యాహ్నం 12.30 గంటలకు పోలవరం నుండి బయలుదేరి విజయవాడ వెళతారు.
భారీ బందోబస్తు నడుమ పర్యటన
పోలవరం: అత్యంత బందోబస్తు నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన బుధవారం జరగనుంది. బందోబస్తు నిమిత్తం సుమారు 2 వేల మంది పోలీసులు మంగళవారం ఉదయం పోలవరం వచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు వెంకటాపురం హెలీపాడ్ వద్దకు హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి చేరుకుని ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చి, మోటార్లు ఆన్ చేస్తారని మంత్రి దేవినేని తెలిపారు. అక్కడి నుండి డెలివరీ పాయింట్ వద్దకు చేరుకుని పోలవరం ప్రాజెక్టు కుడికాలువ లోకి వెళ్లే గోదావరి నీటిని పరిశీలించిన అనంతరం తిరిగి హెలీపాడ్ వద్దకు చేరుకుని హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటారని, కాంట్రాక్టు ఏజెన్సీ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రతినిధులతో పనుల పురోగాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను డిఐజి రామకృష్ణ, కాన్వాయి ట్రయల్ రన్ ద్వారా పరిశీలించారు.

వృథా జలాల వినియోగానికే పట్టిసం

పోలవరం, జూలై 5: సముద్రంలోకి వృథాగా వెళ్తున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్దకు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వరదల సమయంలో సముద్రంలోకి వెళ్తున్న నీటిని కృష్ణా డెల్టాకు తరలించే ఉద్దేశంతో రికార్డు సమయంలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, అయిదున్నర నెలల్లో పాక్షికంగా పూర్తిచేసి, అయిదు మోటార్లు ఆన్‌చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరు తరలించడంతో రూ.2500 కోట్ల విలువైన పంటను కాపాడుకున్నట్టు తెలిపారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో రికార్డు సమయంలో పూర్తిచేశామన్నారు. ప్రస్తుతం బుధవారం నుండి తరలించే గోదావరి నీరు కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చుకోవడంతోబాటు నారుమళ్లు వేసుకోడానికి ఉపయోగించనున్నట్టు చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు జూన్ 1 నుండి ప్రారంభించామని, తూర్పు గోదావరి జిల్లాలో జూన్ 15 నుండి ప్రారంభించినట్టు తెలిపారు. అలాగే జిల్లాలోని మెట్ట ప్రాంతానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తున్నామని, 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసేందుకు బుధవారం ముఖ్యమంత్రి అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో చర్చిస్తారన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రకృతి వనరులను వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం గోదావరి వరద నీరు సముద్రంలోకి 3 వేల టిఎంసిల నీరు వెళ్తుందని, 80 టిఎంసిల నీటిని కృష్ణా డెల్టాకు తరలించే ఉద్దేశంతో పట్టిసీమ నిర్మించినట్టు చెప్పారు. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేసి, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టిసం ఎత్తిపోతల పథకం నిర్మాణం ఒక అద్భుతమన్నారు. తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసినట్టే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ముఖ్యమంత్రి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వెంట ఎత్తిపోతల పథకం సిఇ విఎస్ రమేష్‌బాబు, డిఐజి పివిఎస్ రామకృష్ణ, డిఎస్పీ జె వెంకట్రావు, ఆర్డీవో ఎస్ లవన్న, ఎత్తిపోతల ఇఇ ఆదిశేషయ్య, నల్లజర్ల ఎస్‌డిసి పుష్పమణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుంచె దొరబాబు తదితరులు ఉన్నారు.

ఏ అధికారంతో వచ్చారు

ద్వారకాతిరుమల, జూలై 5: తాడిపూడి నాల్గవ ఎత్తిపోతల కాలువ పనుల్లో సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుని నిర్బంధించారు. తమ పంట పొలాల్లోకి ఏ అధికారంతో ప్రవేశించారో తెలపాలంటూ వారు అధికారులను నిలదీయడంతోపాటు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హైకోర్టులో స్టేటస్‌కోలో ఉన్న సర్వే పేరిట వేధిస్తున్న అధికారుల తీరును వారు దుయ్యబట్టారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో మంగళవారం అర్ధరాత్రి వరకూ జరిగిన రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. వివరాలిలా ఉన్నాయి. తాడిపూడి కాలువ పనుల నిమిత్తం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇదిలావుంటే భూసేకరణ జరిపిన ప్రాంతంలో సర్వే నిర్వహించేందుకు వెళ్లిన అధికారులను రైతులు అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే మండలంలోని తిరుమలంపాలెంలో సర్వే నిర్వహించిన అధికారులు సాయంత్రం సమయానికి తిమ్మాపురం చేరుకున్నారు. ఇక్కడి రైతులు తాము హైకోర్టులో స్టేటస్‌కో పొందామంటూ ఉత్తర్వులను అధికారులకు చూపారు. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు జరుపుతామని అధికారులు అనడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ఇవ్వకుండా తమ పొలాల్లోకి వచ్చి ఏ విధంగా మార్కింగ్ వేస్తారని, ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చారో తమకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులను నిలదీశారు. సరైన సమాచారం ఇచ్చేవరకూ వదిలేది లేదంటూ అధికారులను నిర్బంధించి భీమడోలు- ద్వారకాతిరుమల ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాత్రైనా ఆందోళన కొనసాగుతూనే ఉంది.