పశ్చిమగోదావరి

బాప్‌రే... ఇ-క్రాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 11 : వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాధించి ఈ రంగంలో లాభదాయకతను పెంచడంలో యాంత్రీకరణ అవసరం ఎంతగానో వుందన్నది ప్రతీ ఒక్కరూ చెప్పేదే. అయితే ఈ యాంత్రీకరణ వ్యవహారం ఎంత వరకు ముందడుగు పడిందో తెలియదు కానీ చంద్రబాబు మార్కు ఆధునిక పరిజ్ఞానం మాత్రం శరవేగంగా ముందడుగు వేస్తూ ఈ రంగాన్ని అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తాజాగా ఇ-క్రాప్ విధానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇ-పోస్‌ను కూడా అమలు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాంప్రదాయక విధానాలకు తెరవేసి ఆధునిక పరిజ్ఞానాన్ని లోపాలను అరికట్టే పేరుతో ప్రవేశపెట్టి చివరకు వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని గందరగోళంలో పడవేస్తున్నారు. తాజా పరిస్థితి చూస్తే ఈ గందరగోళం నుంచి అసలు రైతులు ఎప్పటికి గట్టెక్కుతారో అర్ధంకాని పరిస్థితి. ఈక్రాప్ విధానంలో ఆయా ప్రాంతాల్లో ఏ పొలంలో ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో ఆ పంటలు సాగవుతున్నాయి అన్న వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఆ పొలాలను ట్యాబ్ ద్వారా ఫొటో తీసి వాటిని వెబ్‌లాండ్‌కు అనుసంధానం చేయాల్సి వుంటుంది. ఇంత వరకు బాగానే వున్నట్లు కనిపించినా క్షేత్రస్థాయికి వెళ్లే సరికి మాత్రం సవాలక్ష ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణంగా జిల్లాలో పరిస్థితి చూస్తే అత్యధిక శాతం కౌలు రైతుల సాగులోనే వుందన్న విషయం బహిరంగ రహస్యమే. మరోవైపు ఆయా భూములకు సంబంధించి కౌలు రైతుల సంఖ్యకు తగ్గట్టుగా ఎల్‌ఇసి కార్డులు మంజూరు కాకపోవడం కూడా బహిరంగ రహస్యమే. ఈ నేపధ్యంలో ట్యాబ్‌ల ద్వారా ఆ పొలాల ఫొటోలు తీసి వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేస్తే చివరకు అవన్నీ అసలు యజమానుల పేరు మీద నమోదవుతున్నాయి. వాస్తవంగా సాగు చేస్తున్నది ఒకరైతే ఆ సాగు మరొకరు చేస్తున్నట్లుగా వెబ్‌ల్యాండ్‌లో నమోదవుతోంది. ఇప్పటికే వెబ్‌ల్యాండ్ వ్యవహారం పూర్తిస్థాయి లోపభూయిష్టంగా వుందన్న విమర్శలు ఎలాగూ వున్నాయి. అవి సరికాకుండానే తాజాగా ప్రవేశపెట్టిన ఇ-క్రాప్‌తో ఫొటోలు అనుసంధానం చేసే ప్రక్రియ ముందుకు వెళ్లడంతో సమస్య సాంకేతికంగా మరింత జఠిలమవుతోంది. వాస్తవానికి ఇ-క్రాప్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో ఎన్ని ఎకరాల్లో ఫలానా రైతు ఫలానా పంట సాగు చేస్తున్నాడన్న అంశం తేటతెల్లమవుతుంది. దాని ఆధారంగానే ఎరువులను ఇచ్చే విధానం కూడా నిర్ణయమవుతుంది. అంటే వెంకటేశ్వరరావు అనే రైతు ఒక గ్రామంలో రెండెకరాలు సాగు చేస్తున్నట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదైతే అతనికి సంబందిత ఎరువుల దుకాణంలో ఇ-పోస్ విధానం ద్వారా నిర్ధేశించిన పరిమాణంలో ఆయా ఎరువులను కేటాయిస్తారు. ఇక్కడే మొత్తం కధంతా తిరగబడుతోంది. వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వారు భూ యజమానులైతే అసలు సాగు చేస్తున్నది కౌలు రైతులు. అయితే కౌలు రైతుల పేర్లు వెబ్‌ల్యాండ్‌లో వుండనందున ఆ పొలాలు, పంటలు అన్నీ భూ యజమానుల పేరునే నమోదవుతాయి. ఇదే సమయంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు కూడా ఉండే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న సాంకేతిక ఇబ్బందులతోనే సమాచారం వెబ్‌ల్యాండ్‌లో నమోదైతే చివరకు ఎరువులు తీసుకునే సమయంలో అనేక సమస్యలు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సాగు చేస్తున్నది కౌలు రైతు అయినా పంట మాత్రం భూ యజమాని పేరున నమోదు కావడంతో ఆ యజమాని పేరునే ఎరువులు కూడా ఇ-పోస్ విధానంలో మంజూరవుతాయి. ఒక వేళ భూ యజమాని ఈ ప్రాంతంలో ఉండకపోతే కౌలు రైతుకు ఎరువులు ఎలా వస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా భూయజమాని నిక్కచ్చిగా కౌలు రైతుకే ఎరువులు ఇస్తారన్న గ్యారంటీ కూడా వుండదు. ఇలా ఈ విధంగా అయోమయం, గందరగోళం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇ-క్రాప్ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అన్న విషయంలో వ్యవసాయ శాఖలోనే గందరగోళం నెలకొంది. ఇదే అంశం గురువారం వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి క్షేత్రస్థాయి పరిస్థితికి అనుగుణంగా సమస్యను పరిష్కరించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇ-క్రాప్ విధానాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారన్నది వేచి చూడాలి.