వరంగల్

క్రీస్తు మార్గం అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, డిసెంబర్ 23: క్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి వ్యక్తి అనుసరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాణిరుద్రమదేవి ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవేడుకలలో ముందుగా కమిషనర్ మత పెద్దల చేతుల మీదుగా క్రిస్మస్ స్టార్‌ను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తనలో ఐక్యం చేసుకొని శిలువ వేసుకున్న పరమాత్ముడు యేసుక్రీస్తు ప్రభువని అన్నారు. బైబిల్ తెలియజేసినవి మనుషులు ఆచరిస్తే ప్రతివ్యక్తి గొప్పవారు అవుతారని తెలిపారు. జీసస్ ప్రజల కోసం జీవితం త్యాగం చేసినట్లే పోలీస్‌లు సైతం ప్రజల రక్షణ కోసం జీవితాలు త్యాగం చేస్తున్నారని అన్నారు. మనిషి ఏ వృత్తిలో ఉన్న తోటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంగా జీవితాన్ని కొనసాగించాలని తెలిపారు. రెవరెండ్ కురియన్ మాట్లాడుతూ ఎవరికి భయపడకుండా నిజాయితీతో పనిచేసే ప్రతి మనిషికి దేవుని ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. పొరుగు వారిని ప్రేమించే తత్వాన్ని పెంపొందించుకోవాలని ప్రభువు బోధనలను అనుసరించాలన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్‌ను కమిషనర్, మత పెద్దలు ఇతర అధికారులతో కలిసి కట్ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు వేణుగోపాల్‌రావు, ఇస్మాయిల్, ఏసిపిలు మురళీధర్, జనార్దన్, ఈశ్వర్‌రావు, మహేందర్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల గురించి మాట్లాడే
అర్హత విపక్షాలకు లేదు
* మద్దతు ధర పెట్టాలని మిల్లర్లను కోరాం‚
* పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి
ఖానాపురం, డిసెంబర్ 23: రైతులు పండించిన సన్న ధాన్యం క్వింటాల్‌కు 18వందల రూపాయలు పెట్టాలని మిల్లర్లను తాను స్వయంగా కోరానని, ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు తన వ్యాఖ్యలను వక్రీకరించి రాద్దాంతం చేయడం సరి కాదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత వారికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఖానాపురం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. రైతులు పంటలు నష్టపోయిన సమయంలో తాను బాధిత రైతాంగానికి పంట నష్టపరిహారం చెల్లించాలని ఉద్యమించానని చెప్పారు. ధాన్యంకు మద్దతు ధర అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని చెప్పారు. కనీస పరిజ్ఞానం లేక కొంత మంది తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గుర్తించిన నాలుగు రకాల సన్నధాన్యాన్ని 18వందల రూపాయలకు కొనుగోలు చేయాలని మిల్లర్లు కోరానని చెప్పారు. అనంతరం ఖానాపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో డిజిటల్ తరగతులను పెద్ది ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది శివరావు, నిమ్మగడ్డ శ్రీనివాస్‌లు పాఠశాలకు లక్షా 80వేల రూపాయల విలువ గల మూడు ప్రొజెక్టర్లను విరాళంగా పాఠశాలకు అందజేశారు. బుధరావుపేట మోడల్ స్కూల్‌లో 200ల మంది విద్యార్థినిలకు పెద్ది దుప్పట్లు పంపిణీ చేశారు.
60 మంది టిఆర్‌ఎస్‌లో చేరికలు
మండలంలోని రాగంపేట, ఖానాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన నాయకులు దాదాపు 60 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

విద్యార్థి నాయకుల
అరెస్టు అప్రజాస్వామికం
* అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన

మహబూబాబాద్, డిసెంబర్ 23: ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానుకోటలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, టివియువి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా సహాయ కార్యదర్శి పి.మురళీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతకుమార్, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల యాకాంబ్రం, టివియువి జిల్లా అధ్యక్షుడు వెంకన్నలు మాట్లాడుతూ.. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తు ఈ రోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నిన్న రాత్రి నుంచే విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గత ప్రభుత్వాల పోలికలే కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దుచేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, అన్నారపు శ్రీధర్, రజాక్, శ్రావణ్, రఫి, మహేష్, మహేందర్, భరత్, ప్రశాంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

1800 కోట్లతో మిషన్ భగీరథ పనులు
* డిఈ బాల్‌రాజు వెల్లడి
భీమదేవరపల్లి, డిసెంబర్ 23: మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ లలోని మూడు నియోజక వర్గాల్లో మిషన్ భగీరధ పనులు 392 గ్రామాల్లో రూ 1800 కోట్లతో చేపడుతున్నట్లు డిఈ బాల్‌రాజు పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన డిఈ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ మూడు నియోజక వర్గాల్లో మిషన్ భగీరధ కార్యక్రమం పనులు నడుస్తున్నాయని, ఆయా గ్రామాల్లో సంపులు, ట్యాంకుల నిర్మాణం పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఆయా గ్రామాల్లో ఓహెచ్‌బిఆర్, జిఎల్‌బిఆర్ పనులు చేయడం జరుగుతుందన్నారు. మానకొండూరు నియోజక వర్గంలో ఫిల్టర్‌బెడ్ పనులు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. భీమదేవరపల్లి మండలంలో దాదాపుగా అన్ని పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మూడు నియోజక వర్గాల్లో అధికంగా పైప్‌లైన్ల పనులు పూర్తి కావచ్చినట్లు వెల్లడించారు. మూడు నియోజకవర్గాల్లో మెయిన్ గ్రిడ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఆయా గ్రామాలలో లోపల జరిగే పనులు పూర్తి కావాల్సి ఉన్నాయని, 2017 డిసెంబరు 31 లోగా అన్ని పనులు పూర్తి చేసి 392 గ్రామాలకు మిషన్ భగీరధ కింద నీటిని అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ముల్కనూర్ ఎంపిటిసి సభ్యులు చొల్లేటి ప్రకాశం, భీమదేవరపల్లి ఎంపిటిసిలు చిట్టంపల్లి అయిలయ్య తదితరులున్నారు.

మండలానికో నగదు రహిత గ్రామం
* రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
వడ్డేపల్లి, డిసెంబర్ 23: మండలానికి ఒక గ్రామపంచాయతీ చొప్పున నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం బ్యాంకు కంట్రోలర్‌లతో నగదు రహిత చెల్లింపులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత ఉన్న వారందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అధికారులు, బ్యాంకర్లకు తెలిపారు. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలతో పాటు మండలానికి ఒక గ్రామపంచాయతీని బ్యాంకర్లు దత్తత తీసుకొని క్యాష్‌లెస్ విధానానికి కృషి చేయాలన్నారు. గ్రామాల గుర్తింపులో ట్రేడ్ పాయింట్ ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బ్యాంకులు శాఖల వారీగా ఖాతాల వివరాలు, రూపే కార్డుల జాబితా అందజేయాలన్నారు. ఇప్పటికే ఖాతాలు తెరిచి ఉపయోగించని ఖాతాలను వందశాతం ఆపరేషన్‌లోకి తేవాలన్నారు. అన్ని ఖాతాలను ఆధార్, మోబైల్ నెంబరులతో అనుసంధానం చేయాలన్నారు. సిండికేట్ బ్యాంకు ఆత్మకూర్ మండలం తక్కళ్లపాడు, ముస్తాలపల్లి గ్రామాలను దత్తత తీసుకోగా గ్రామీణ బ్యాంకు పరకాల మండలం వెల్లంపల్లి, దుగ్గొండి మండలం నాచినపల్లి, నల్లబెల్లి మండలం లెంకాలపల్లి, వర్దన్నపేట్ మండలం నల్లబెల్లి గ్రామం దత్తత తీసుకోవడం జరిగిందన్నారు.

సిఎం గజ్వేల్‌కా.. రాష్ట్రానికా!?
ప్రజలను మోసం చేస్తున్న కెసిఅర్ * టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా
వడ్డేపల్లి, డిసెంబర్ 23: ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయాల్సిన కెసిఅర్... మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతానికే సిఎంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మోసగిస్తున్నారని విమర్శించారు. నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో 8778 గ్రామ పంచాయతీలు, 10761 రెవెన్యూ గ్రామాలు, 158 పట్టణాలు, ఆరు కార్పొరేషన్లు, 38 మున్సిపాల్టీలు, 28 నగర పంచాయతీలు కలిగి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 16 నెలల్లో ఎర్రవల్లి, నర్సన్నపేటలలో 580 ఇళ్లను నిర్మించి, రాష్ట్ర ప్రజలకు రంగుల సినిమా చూపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేలో రాష్ట్రంలో యాభై లక్షల మంది ప్రజలు ఇళ్లు లేనివారిగా గుర్తించారని, 580 ఇళ్లు మాత్రమే కట్టి ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. 2014 జనవరిలో వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు బస చేసి, పేదల ఇళ్ల నిర్మాణాలకోసం శంకుస్థాపనలు జరిపి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, ఒక్క ఇంటి నిర్మాణం కూడా నిర్మించలేక పోయారని ఎద్దేవా చేశారు. గోదావరి నది నుండి హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి కోసం గత ప్రభుత్వాలు చేపట్టిన పైపు లైన్ల పనులను, తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పనులకు మార్చుకోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలోని ప్రజాధనాన్ని గుత్తేదారులకు, వ్యాపార వర్గాలకు దోచి పెడుతున్నారని, ప్రతి పనిలో ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చలి తీవ్రతతో వృద్ధులు మృతి చెందుతుంటే వారిని ఆదుకోవడం మరిచి, ముఖ్యమంత్రి పండుగలు చేసుకోవడం విడ్డూరమన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షులు ఈగ మల్లేశం మాట్లాడుతూ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయితి, మున్సిపాలిటీలలోని పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్దీకరిస్తానని చెప్పి నేటికి క్రమబద్ధీకరించకపోవడం శోచనీయం అన్నారు. మూడువేల 600 మంది పారిశుద్ధ్య కార్మికులకు చట్టబద్ధత లేదని, నాడు తెలంగాణ సెంటిమెంట్‌తో, నేడు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆ నలుగురు కుటుంబసభ్యులే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పి, దరిద్ర రాష్ట్రంగా తయారు చేస్తున్నారని, ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన లేదని దుయ్యబట్టారు. రైతాంగ, విద్యార్థుల, దళితుల, డబుల్ బెడ్‌రూం ఇండ్ల సమస్యలు ప్రభుత్వ పరిష్కరించేంత వరకు టిడిపి నిరంతర పోరాటం కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు, కొండం మధుసూదన్ రెడ్డి, తాళ్ళపల్లి జయపాల్, చాడా రఘునాధ్ రెడ్డి, సాంబయ్య, విజయ్ కుమార్, ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ పనులపై
సమగ్ర నివేదిక ఇవ్వండి
* అధికారులను ఆదేశించిన కమిషనర్ శృతి ఓఝా
వడ్డేపల్లి, డిసెంబర్ 23: నగర పాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పనుల సమగ్ర సమాచారాన్ని అందజేయాలని మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థలోని కమిషనర్ కార్యాలయంలో ఇంజనీరింగ్ ఆధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా ఇంతవరకూ ఎన్ని పనులు అయ్యాయ? ఎన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయ? ప్రారంభోత్సవం అయినవి ఎన్నో పూర్తి వివరాలను జనవరి ఒకటో తేదీకల్లా అందజేయాలని అధికారులకు ఆదేశించారు. వీధి దీపాల మానిటరింగ్, వాహనాల నిర్వహణలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనరల్ ఫండ్స్, సిటీ అభివృద్ధి పనులు, ఎంపి పనులను ప్రోగ్రెసింగ్ చేసి అగ్రిమెంటులను పూర్తి చేయాలని అన్నారు. అలా పూర్తి చేయని గుత్తేదారులపై లిక్విడిటీ డ్యామేజ్ వేయాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థలోని రిపేరింగ్‌లో ఉన్న వాహనాలను తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. బాలసముద్రంలోని బయోగ్యాస్ ప్లాంటును తక్షణమే మరమ్మతులు చేయించాలని ఈఈ బాలమణిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ ఈ రెహ్మన్, ఈఈలు భిక్షపతి, శివకుమార్, డిఈలు లక్ష్మారెడ్డి, సంతోష్, మనోహర్, రవీందర్ పాల్గొన్నారు.