వరంగల్

అభివృద్ధి, సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 26: అభివృద్ధి, సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకుని ప్రజలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాట అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వౌలిక సౌకర్యాల ద్వారా ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ తరువాత పెద్దనగరమైన వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు చేదోడువాదోడుగా నిలవాలని కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ ఆమ్రపాలి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నగర అభివృద్ధిలో భాగంగా వరంగల్ చుట్టూ 70కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి వేయికోట్ల రూపాయల వ్యయంతో డిపిఆర్ తయారు చేసినట్లు తెలిపారు. వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ పథకం కింద 45కోట్లు, అమృత్ పథకం కింద మూడేళ్లలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు 545కోట్లు కేటాయించిందని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో 12వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పథకానికి డిపిఆర్ రూపొందించారని తెలిపారు. వీటికి అదనంగా వరంగల్ నగర అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మూడువందల కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. నగర సమగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరుగుతోందని చెప్పారు. వరంగల్ నగర చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేలా పథకాలు సిద్ధం చేసామని కలెక్టర్ అన్నారు. 50కోట్ల రూపాయల వ్యయంతో అత్యుత్తమ హంగులతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పనులు జరుగుతున్నాయని, 3.84కోట్ల రూపాయలతో వరంగల్ కోటలో చేపట్టిన పురావస్తు ప్రదర్శన శాల నిర్మాణం చివరి దశలో ఉందని చెప్పారు. 250 ఎకరాలలో థీమ్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీనికోసం స్థల సేకరణ జరుపుతున్నామని, అదే విధంగా ధర్మసాగర్ చెరువులో ఎకో టూరిజం, వరంగల్ కేంద్రంగా శిల్పారామం క్రాఫ్ట్ విలేజి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పద్మాక్షమ్మ గుట్టలపై ఉన్న జైన విగ్రహాల పరిరక్షణతోపాటు ధ్యానకేంద్రం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అర్బన్ జిల్లా పరిధిలో మిషన్ కాకతీయ పథకం కింద మొదటి రెండు విడతలలో 128కోట్లతో 168చెరవుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి 132 పనులు పూర్తిచేసామని, త్వరలో మూడవ విడత పనులు ప్రారంభిస్తామని అన్నారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలోని గ్రామీణ మండలాల్లో 1045కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ ఏడాది జూన్ నాటికి మొదటివిడతగా వరంగల్, ధర్మసాగర్, ఐనవోలు మండలాల్లో ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటి సరఫరా జరిపేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరంగల్ నగరంతోపాటు గ్రామీణ మండలాల్లో హరితహారం కింద ఈ ఏడాది 51లక్షల మొక్కలు నాటగా వచ్చే ఏడాది 56లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కాళోజీ మెడియల్ యూనివర్సిటీని ఇప్పటికే ప్రారంభించిందని, ఈ ఏడాది హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్, వ్యవసాయ కళాశాల ప్రారంభమవగా, వచ్చే ఏడాది వెటర్నరీ కళాశాల, సైనిక్ స్కూల్ ప్రారంభించేందుకు చర్యలు మొదలయ్యాయని, అదే విధంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థల పరిశీలన జరుగుతోందని తెలిపారు. నగరంలోని అన్ని పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు ఐదుకోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ విద్యాసంవత్సరం నుంచి 52 పాఠశాలల్లో డిజిటల్ విధానంలో ఇంగ్లీష్ మాథ్యమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని అన్నారు. అర్బన్ జిల్లా పరిధిలోని గ్రామీణ మండలాల్లో సాంప్రదాయ వ్యవసాయంతోపాటు పండ్లతోటలు, పూలతోటలు, కూరగాయల పెంపకం కోసం రైతులకు అవగాన కల్పించటంతోపాటు పలు రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు వస్తున్న రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రైతులు పండిస్తున్న కూరగాయలు నగరంలోని నాలుగు రైతుబజారుల ద్వారా ప్రజలకు సరైన ధరలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నగరంలోని ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయలు కల్పిస్తున్నామని, దీనికితోడు నగర పరిధిలోని హసన్‌పర్తిలో 250 పడకలు, కాజపేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణాలకు, అర్బన్ జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతోపాటు ఎల్కతుర్తి, ముల్కనూరు, వేలేరు, కడిపికొండ, ఐనవోలు ప్రాథమిక కేంద్రాలను 24గంటలు పనిచేసే ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. జిల్లా పరిధిలో వ్యవసాయ అవసరాలకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా, గృహ, వాణిజ్య అవసరాలకు 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కొత్తగా పదికోట్ల రూపాయల వ్యయంతో ఒక 132కెవి విద్యుత్ సబ్ స్టేషన్, రెండు 33కెవి సబ్ సబ్‌స్టేషన్ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించే చర్యలో భాగంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిని మినహాయించి కుడా పరిధిలో, గ్రామీణ మండలాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా చేపడుతున్న కార్యక్రమాలకు అన్ని వర్గాలు సహకారం అందించాలని కోరారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ ఆమ్రపాలి శాలువలతో సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందచేసారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి తిరుమల దేవి, నగర మేయర్ నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు, డిఐజి రవివర్మ, సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాల్‌రావు, జాయింట్ కలెక్టర్ దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ధ్యేయం.. వ్యవ‘సాయం’
టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు భూసేకరణ పూర్తి * విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి * గణతంత్ర వేడుకల్లో రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

వరంగల్, జనవరి 26: వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందచేయటంతోపాటు పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా వంటి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర వేడుకలకు హాజరైన ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం కింద మూడవ విడతలో రూరల్ జిల్లాలోని 36వేలమంది రైతులకు 168కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ చేసామని చెప్పారు. సమీకృత ఉద్యాన మిషన్ ద్వారా పూలు, పండ్లతోటల పెంపకాన్ని, ఉద్యాన యాంత్రీకరణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సూక్ష్మనీటిపారుదల పథకం కింద ఈ ఏడాది 4.24కోట్ల రూపాయలతో 628హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేసామని అన్నారు. రైతులు పండించే పంటలను నిలువ చేసేకునేందుకు జిల్లాలో ప్రస్తుతం 20గోదాములు ఉండగా కొత్తగా 36కోట్ల రూపాయల ఖర్చుతో 13గోదాములు మంజూరయ్యాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ పార్కు నిర్మాణం కోసం అవసరమైన 1017ఎకారల భూమిని సేకరించి టిఎస్‌ఐఐసికి అప్పగించామని చెప్పారు. ఈ పార్కు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పన జరుగుతోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్త్తోందని అన్నారు. రూరల్ జిల్లా పరిధిలో విద్య, వైద్యరంగాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది జిల్లాలో 55పాఠశాలల్లో డిజిటల్ తరగతు ప్రారంభించామని, వచ్చే ఏడాదికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పదవతరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం విజయపథం పేరిట 40రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు 70రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సదుపాయాలు మెరుగుపరచటం ద్వారా 100శాతం ప్రసవాలు ఇక్కడే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడటంతోపాటు గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం కింద జిల్లాలోని 19గ్రామాలలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవటంతో వాటిని ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించామని, 2018 మార్చి నాటికి రూరల్ జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. మండలానికి రెండు గ్రామాల చొప్పున జిల్లాలోని అన్ని మండలాల నుంచి మోడల్ గ్రామాలను ఎంపిక చేసి వీటిలో అన్ని ప్రభుత్వ పథకాలు అమలుకు ప్రణాళిక రూపొందించామని, ఇజిఎస్ పనుల అమలులో జాతీయ స్థాయిలో అవార్డు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మిషన్ భగీర్థ, మిషన్ కాకతీయ పనులు జిల్లాలో సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని అన్నారు. హరితహారం కార్యక్రమం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1.08కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకున్నామని, దీనికోసం అవసరమైన మొక్కల పెంపకం నర్సరీలలో కొనసాగుతోందని చెప్పారు. పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొమ్మాల లక్ష్మినరసింహస్వామి ఆలయం అభివృద్ధి పనులకు 29లక్షలు, కొండపర్తి త్రికూటాలయం పునరుద్ధరణ పనులకు 20లక్షల రూపాయలు ఖర్చు చేసామని, ఎకో టూరిజం కింద పాఖాల చెరువు అభివృద్ధి పనులు 80లక్షల రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా సాధాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు అందాయని, వీటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించిందని అన్నారు. రూరల్ జిల్లా పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా జరిపేందుకు కొత్తగా నర్సంపేట, ఖానాపూర్ మండలాల్లో రెండు 33కెవి సబ్‌స్టేషన్లు ఏర్పటుచేయగా, మరో నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని చెప్పారు. చేనేత కార్మికులను దృష్టిలో పెట్టుకుని శాయంపేట మండలంలో 1.33కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆధునిక హ్యాండ్లూమ్ యూనిట్‌ను ఏర్పాటు చేసామని, చేనేత కార్మికులకు ఆధునిక డిజైన్లపై శిక్షణ కూడా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ పరంగా పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నా కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా మరింత అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉందని, దీనికోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం గణతంత్ర వేడుకలకు హాజరైన స్వాతంత్ర సమరయోధులను రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శాలువాలతో సన్మానించారు. శాఖాపరంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేసారు. వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను, ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఎస్పీ బదిలీతో
ఉలిక్కిపడిన ‘పోలీస్’!
మురళీధర్ బదిలీతో కలకలం

వరంగల్, జనవరి 26: పాత జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి నాలుగు నెలలు గడవకముందే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మురళీధర్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయటం పోలీసు వర్గాలలో కలకలం రేగింది. ఎస్పీ మురళీధర్‌పై వివిధ వర్గాల నుంచి ఆరోపణలు రావటం, వీటిపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపించి ఆయనపై బదిలీ వేటు వేయటంతో పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్‌కు మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పోలీసు అకాడమిలో పనిచేస్తున్న మురళీధర్‌ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా నియమించారు. ప్రారంభంలో ఆయన పనితీరు మామూలుగానే ఉన్నా ఆ తరువాత ఆయనపై వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తొర్రూరు-మరిపెడ జాతీయ రహదారిపై వెళ్లే భారీ వాహనాల నుంచి కొందరు హోమ్‌గార్డులు, ప్రైవేటు వ్యక్తులు రెండువందల రూపాయల చొప్పున జరిపిన వసూళ్ల వ్యవహారంలో ఎస్పీ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. భారీ వాహనాల వెనక స్టిక్కర్లు అతికిస్తు రెండువందల రూపాయల చొప్పున వసూలు చేసారని, దీనిపై లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే ఎస్పీ ఆదేశాల మేరకే స్టిక్కర్లు అతికించి డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిపారని సమాచారం. దీంతో లారీ డ్రైవర్లు తమకు తెలిసిన ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇకపోతే మహబూబాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, దీనివెనుక పోలీసు అధికారుల సహకారం ఉందని ఆ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసారనే ప్రచారం కూడా ఉంది. దీనికితోడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి కిందిస్థాయి అధికారులు, పోలీసు సిబ్బందితో ఎస్పీ వ్యవహరశైలి దురుసుగా ఉండటంతో కిందిస్థాయి పోలీసు యంత్రాంగం ఆయనపై కినుకతో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి నాలుగు నెలల్లోనే ఎస్పీ మురళీధర్‌కు స్థానచలనం జరిగింది.

అభివృద్ధికి సహకరించండి
* గణతంత్ర వేడుకల్లో జనగామ కలెక్టర్ శ్రీదేవసేన
జనగామ టౌన్, జనవరి 26: జనగామ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. జనగామ మిని స్టేడియంలో గురువారం నిర్వహించిన 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన మూడు నెలల్లో సాధించిన విజయాన్ని వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తున్నానని అన్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్ని జాగృతం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉన్నందున వ్యవసాయ సాగు విస్తీర్ణం అధికంగా పెరిగి రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. రైతులు పండించే సరుకులకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికి సంబంధిత అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. విద్యా, వైద్యంతో పాటు ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు సరైన సేవలు అందించడం కోసం అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి క్షేత్రస్థాయి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎంతో పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని అన్నారు. అనంతరం రెవెన్యూ, విద్యా, పోలీసు, వైద్య శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో నుంచి ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జనగామ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ, డిసిపి తేజావత్ వెంకన్న, ఆర్డీవో వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.