వరంగల్

మాస్ కాపీయంగ్‌కు తావివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 28: వరంగల్ రూరల్ జిల్లాలో పదో తరగతి పరీక్షల సందర్భంగా మాస్ కాపీకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. విద్యార్థులు ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ఈనెల రోజులపాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి అధ్యక్షతన విజయపథం, మధ్యాహ్నభోజన పథకం, డిజిటల్ తరగతుల నిర్వహణ, మన టివి, యూనిఫారాల పంపిణీ, ప్రి-మెట్రిక్ స్కాలర్‌షిప్పుల పంపిణీ తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడుతు పదవతరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అమలు చేస్తున్న విజయపథం కార్యక్రమం ద్వారా సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షల సందర్భంగా మాస్‌కాపీ అవకాశం ఇవ్వకూడదని, సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కస్తూరిభా విద్యాలయాలు, మోడల్ పాఠశాలల్లో పదవతరగతి పరీక్షల్లో ఫలితాలు సరిగా రాకుంటే సంబంధిత సిఆర్‌టిలను తొలగిస్తామని స్పష్టం చేసారు. కెజిబివి, మోడల్ స్కూళ్లలో ప్రతిరోజు ఇద్దరు ఉపాధ్యాయులు రాత్రివేళ బస చేయాలని ఆదేశిస్తూ, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కెజిబివి, మోడల్ స్కూళ్ల ఆవరణలో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్న కారణంగా క్రీడా మైదానాల ఏర్పాటుకు, అవసరమైన క్రీడాసామాగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. ప్రతి మండలంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న రెండు పాఠశాలలను గుర్తించాలని, ఈ పాఠాశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించేందుకు తగిన ప్రతిపాదనలు పంపిస్తే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కంప్యూటర్లపై కనీస పరిజ్ఞానం ఏర్పరచుకోవాలని సూచించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల వద్ద అందుబాటులో ఉన్న నిధులతో పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటం ద్వారా స్వచ్ఛ పాఠశాలలుగా మార్చాలని సూచించారు.

క్రీడాకారులకు రిజర్వేషన్లు
* ఉపముఖ్యమంత్రి కడియం హామీ
నక్కలగుట్ట,జనవరి 28: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా విద్య, ఉద్యోగ రంగాలలో క్రీడాకారులకు 5 శాతం రిజర్వేషన్లు ఉండేలా, ముఖ్యమంత్రితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 62వ తెలంగాణ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2017ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్టేడియంలో క్రీడాకారులు రాత్రి వేళల్లో కూడా ఆడేందుకు తగిన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ గద్దల పద్మ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేందుకు పివి సింధులాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలతోపాటు, క్రీడారంగాన్ని కూడా ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు ఇళ్ల స్థలాలను కూడా ఇవ్వడానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి సారయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.

కొత్త మాస్టర్ ప్లాన్
పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా వరంగల్ నగర ప్రణాళిక రూపొందించాలి * కుడా, జిడబ్ల్యూఎంసి అధికారులకు డిప్యూటీ సిఎం సూచన
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 28: పెరుగుతున్న నగర జనాభా, దానికి అనుగుణంగా పెరుగుతున్న నగర విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. 2014లో తయారుచేసిన మాస్టర్‌ప్లాన్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో కుడా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ నగరపాలక సంస్థ, కుడా పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, కుడా, నగరపాలక సంస్థ అధికారులతో చర్చించారు. 1971లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ మాస్టర్‌నే ఇప్పటికీ అమలు చేయటం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని, ఇటు కుడాకు, అటు నగరపాలక సంస్థకు ఆదాయం రాకుండా పోతోందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం దృష్టికి తీసుకువచ్చారు. 2014లో తయారుచేసిన మాస్టర్ ప్లాన్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవటాన్ని ఆయన గుర్తుచేసారు. దీనివల్ల 33వేల భూక్రమబద్ధీకరణ పిటిషన్లు పరిష్కారం లభించక పెండింగులో ఉంటున్నాయని, కుడాకు సుమారు 150 కోట్ల ఆదాయం నిలిచిపోతోందని చెప్పారు. దాంతో వరంగల్ నగరానికి మంజూరైన అమృత్, హృదయ్, స్మార్ట్‌సిటీ పథకాలతో పాటు ఒఆర్‌ఆర్‌లను సమీకృతం చేసి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఉపముఖ్యమంత్రి కడియం సూచించగా, మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన ఏజెన్సీ ప్రతినిధులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, మార్పులు, చేర్పులు మినహా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయటం సాధ్యం కాదని, దీనికోసం మళ్లీ ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసి ఉంటుందని, టెండర్ పిలవవలసి ఉంటుందని తెలిపారు. ఇదంతా జరగటానికి మరో రెండేళ్లు పడుతుందని స్పష్టం చేయటంతో 2014లో తయారుచేసిన మాస్టర్‌ప్లాన్‌ను ప్రస్తుత అవసరాల మేరకు మార్పులు చేస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు లభించేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. కాగా, వరంగల్ నగరం చుట్టూ నిర్మించాలని ప్రతిపాదించిన ఔటర్ రింగురోడ్డు అలైన్‌మెంట్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుపై సమావేశంలో చర్చించారు. ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్, భూసేకరణ, పనులకు సంబంధించి రిపోర్టు పక్కాగా ఉండాలని ఎఇసిఓఎం ఇండియా ప్రతినిధులకు సూచించారు. ఔటర్ రింగురోడ్డు నిర్మాణం సర్కిల్ మాదిరిగా ఉండాలని చెబుతూ, రింగురోడ్డు నిర్మాణం జరిగే సందర్భంలోనే నాలుగు సెక్టార్లుగా విభజించాలని, ప్రతి ఒక కిలోమీటర్‌కు రోడ్డును ఆనుకుని గ్రోడ్ కారిడార్ల ఏర్పాటు కోసం కనీసం 15ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ స్థలాల్లో విద్య, పారిశ్రామిక, ఐటి కారిడార్ల ఏర్పాటు జరగవలసి ఉంటుందని, దీనిపై కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, నగరపాల సంస్థ ప్రత్యేకదృష్టి పెట్టాలని తెలిపారు. ఔటర్ రింగురోడ్డు వెంట గ్రీన్‌బెల్ట్ ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో 21 జంక్షన్లను అభివృద్ధి చేయాలని, ఇందులో వరంగల్ నగరపాలక సంస్థ 14 జంక్షన్లను, కుడా ఏడు జంక్షన్లను చేపట్టాలని నిర్ణయించామని నగరపాలక సంస్థ కమిషనర్, కుడా ఇన్‌చార్జ్ వైస్‌చైర్మన్ శృతిఓఝా ఉపముఖ్యమంత్రికి తెలిపారు. జంక్షన్ల అభివృద్ధి పనులు అన్నీ ఒకేసారి కాకుండా ప్రాధాన్య క్రమంలో కొన్నికొన్ని జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టాలని, వీటి నిర్మాణం పూర్తయ్యాక వచ్చే ఫలితాల ఆధారంగా తదుపరి జంక్షన్ల నిర్మాణణ జరపాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. కుడా ఆధ్వర్యంలో మూడు జంక్షన్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, ఫిబ్రవరి రెండవ వారంలో పనులు ప్రారంభమవుతాయని కుడా వైస్‌చైర్మన్ తెలిపారు.
పాలకవర్గాలు ఏర్పడినా
ఆశించిన ఫలితాలు రావటం లేదు
కాగా, నగరపాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థల పనితీరుపై ఉపముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి ఏడు, ఎనిమిమి నెలలు గడిచాయని, కుడా పాలకవర్గం నియామకం జరిగి రెండు నెలలు గడిచాయని, కొత్త పాలకవర్గాలు ఏర్పడినందున తమ ప్రజాప్రతినిధులు నగరాభివృద్ధికి, తమకు ఏదో చేస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని అన్నారు. కానీ ఆశిస్తున్న అభివృద్ధి జరగటం లేదని వ్యాఖ్యానించారు. నగరంలోని పలు జంక్షన్లలో చెట్లు ఎండిపోయి గ్రీనరీ కనిపించటం లేదంటూ, కనీసం నీళ్లు పోయడానికి కూడా నిధులు లేవా అని నగరపాలక సంస్థ మేయర్‌ను ప్రశ్నించారు. వరంగల్ నగరం పారిశ్రామిక, విద్య, వైద్యం, క్రీడలకు హబ్‌గా మారేందుకు అవకాశాలు ఉన్నాయని ఉపముఖ్యమంత్రి చెబుతు పక్కా ప్రణాళికతో, అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ ఎంపి దయాకర్, నగర మేయర్ నరేందర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, సతీష్‌రావు, కుడా ప్రాజెక్టు అధికారి అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుప్తనిధుల దొంగలకు బేడీలు
13 లక్షల విలువచేసే 426 గ్రాముల బంగారం స్వాధీనం
నలుగురి అరెస్టు * పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 28: జయశంకర్ జిల్లా ములుగు గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ల సమీపంలో జరిపిన తవ్వకాల సందర్భంగా పురాతన కాలంనాటి బంగారునగలు బయటపడిన ఘటనలో నలుగురు నిందితులను గణపురం పోలీసులు శనివారం ఆరెస్ట్ చేసారు. వీరినుంచి తవ్వకాల్లో బయటపడిన 426గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మరో వంద గ్రాముల బంగారు నగలతో ఫరారీలో ఉన్న వ్యక్తికోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. నగల పంపకాల సందర్భంగా ఏర్పడిన అభిప్రాయబేధాల కారణంగా గుప్తనిధుల విషయం బయటకు పొక్కటం, గుప్తనిధులకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే గణపురం పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేయగా నిధుల విషయం బట్టబయలయింది. గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు వద్ద గణపేశ్వరాలయానికి సుమారు 300మీటర్ల దూరంలో ఈనెల రెండవ తేదీన గణపురం మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సుధాకర్, కిశోర్, భద్రయ్య కలిసి జెసిబి సహాయంతో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల సందర్భంగా భూమిలో పురాతన కాలంనాటి రాగితో తయారుచేసిన చిన్నపెట్టే లభించగా, వాటిని తెరిచి చూడగా బంగారునగలు కనిపించాయి. దాంతో ఆ ఐదుగురు నగలను పోలీసులకు అప్పగించకుండా తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ నగలను కరిగించేందుకు మరో వ్యక్తి సహాయం కోసం ప్రయత్నించారు. కానీ బంగారునగలను పంచుకునే సందర్భంలో బేదాభిప్రాయాలు ఏర్పడటంతో గుప్తనిధ సమాచారం బయటపడింది. ఇది తెలిసి పోలీసులు మొదట ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. తవ్వకాలలో 526గ్రాముల వివిధ రకాల ఆభరణాలు ఉన్న రాగి పెట్టే లభించినట్లు తేల్చారు. అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సుధాకర్, కిషోర్‌లను అరెస్ట్ చేసి వారినుంచి 426 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 100 గ్రాముల బంగారంతో పరారీలో ఉన్న నిందితుడు చిదర్ల భద్రయ్య కోసం గాలిస్తున్నామని డిఎస్పీ దక్షిణామూర్తి శనివారం తెలిపారు. గుప్తనిధుల బయటపడిన సమాచారం తెలిసి పురావస్తుశాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్, పురావస్తు శాఖ కన్సల్టెంట్ రంగాచారి శనివారం కోటగుళ్ల ప్రాంతంలో గుప్తనిధులు బయటపడిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల నుంచి సమాచారం తీసుకోవటంతోపాటు స్వాధీనం చేసుకున్న నగలను పరిశీలించారు. తవ్వకాలలో బయటపడిన నగలు కొన్ని వందల ఏళ్ల కిందటివని, ఈ గుప్తనిధుల గురించి పురావస్తుశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందచేస్తామని వారు తెలిపారు.

ప్రజావాణి ఫిర్యాదులను
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
* అధికారులకు జనగామ కలెక్టర్ శ్రీదేవసేన హెచ్చరిక
జనగామ టౌన్, జనవరి 28: ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జనగామ కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. అధికారిక కార్యక్రమాల కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన ప్రత్యక్ష్యంగా పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తక్షణమే పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో అందుతున్న దరఖాస్తులను పరిష్కరించినప్పుడే ప్రజలకు ఈ కార్యక్రమంపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఇప్పటివరకు ఎంతమంది దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించారో వచ్చే ప్రజావాణిలో తెలియచేయాలని కోరారు. నేడు (ఆదివారం) నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావత్ యంత్రాంగం కృషిచేయాలని కోరారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్‌పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిఅండ్‌ఎహెచ్ అధికారి డా. నర్సింహరావు, డిఈవో యాదయ్య, డిఎస్‌సిడివో గట్టుమల్లు, డిపిసిడబ్ల్యూవో టి. నరేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఆత్మ విశ్వాసంతో
పరీక్షలకు సిద్ధం కండి
* విద్యార్థులకు డిపిఓ సూచన
కాటారం, జనవరి 28: ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రవౌళి సూచించారు. శనివారం ఆయన మండలంలోని ఓడిపిలవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు ఉన్నతాశయంతో ముందుకు వెళ్ళాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సజ్జన సాంగత్యం అనేవి వ్యక్తిగా రాణించడానికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. జీవితంలో పేరు, ప్రఖ్యాతులు సంపాదించడానికి సన్మార్గాన్ని ఎంచుకోవాలని హితబోధ చేశారు. ఆయనతో పాటు ఎంపిడిఓ మల్లికార్జునరెడ్డి, కార్యదర్శి షగీర్ తదితరులు ఉన్నారు. ఓడిపిలవంచలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ కింద నడుస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజుకు 194 రూ.లు దినసరి వేతనంగా సవరించడమైందని తెలిపారు.

చారిత్రాత్మక ఆలయాలపై వివక్ష
* బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ
భీమదేవరపల్లి, జనవరి 28: తెలంగాణలోని చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. శనివారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుని దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని వివిధ ఆలయాల అభివృద్ధికి కేంద్రం 90 కోట్లు మంజూరి ఇచ్చిందన్నారు. ఆలయాల అభివృద్ధి ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరధకు వాడుకుంటుందని ఆరోపించారు. కేంద్రమంత్రి హన్సీరాజ్‌తో మాట్లాడి కొత్తకొండకు ప్రత్యేక నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని ఐనవోలు, కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాలు అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ అర్భన్ జిల్లాలో గ్రామాగ్రామాన బూత్ కమిటీలు, గ్రామ కమీటీలు వేయడం జరుగుతుందన్నారు.