వరంగల్

పెద్దనోట్ల ప్రభావంతో పెరిగిన బ్యాంకు డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 17: పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద డిపాజిట్లు భారీగా పెరిగిన కారణంగా బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్లి విరివిగా రుణాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేసారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు అభినందించాయని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. వరంగల్ నగరంలోని నిట్ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన డిజి ధన్ మేళా-2017ను కేంద్రమంత్రి దత్తాత్రేయ సహచర కేంద్ర ఉక్కుశాఖ మంత్రి విష్ణుదేవ్ సాయిజీతో కలిసి శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతు నగదు రహిత లావాదేవీల నిర్వహణతో ధనికులకు, పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం త్వరలో తగ్గే అవకాశం ఉందని, ఈ చర్య దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. డిజిటల్ లావాదేవీలతో చిన్న వ్యాపారులకు చిల్లర సమస్య తగ్గుతుందని చెప్పారు. కార్మికశాఖ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి వేతనాలు ఖాతాలలో వేసేలా చర్యలు తీసుకోవటం ద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 26కోట్లమందికి జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయని, వీరంతా సాంకేతికతను ఉపయోగించుకుంటే దేశాభివృద్ధికి వీలుకలుగుతుందని చెప్పారు. బ్యాం కు ఖాతాల నుంచి సెల్‌ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించే అవకాశం ఏర్పడిందని, (మిగతా 3వ పేజీలో)

జిల్లా స్థాయి ప్రమాణాలు పాటించాలి
* సమన్వయంతో పనిచేయాలి
* అప్ అండ్ డౌన్ అధికారులపై ఆగ్రహం
* మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా
కురవి, ఫిబ్రవరి 17: ఈనెల 23వ తేదీన ఆరంభయ్యే కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలను అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. కురవి మండల కేంద్రంలోని వీరభద్రుని ఆలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతోపాటు జాయింట్ కలెక్టర్ కట్కూరి దామోదర్‌రెడ్డిలు పూజలు నిర్వహించారు. ఆలయ వర్గాలు, చైర్మన్ బాదావత్ రాజునాయక్ లు కలెక్టర్‌కు సాధర స్వాగతం పలికారు. పూజారులు గోత్రనామార్చనలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజారులు కలెక్టర్ ప్రీతిమీనాకు కాలక్షేపమండపంలో ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందచేశారు.
జిల్లా స్థాయిలో ఏర్పాట్లు చేయాలి
జాతరకు వచ్చే భక్తులకు గ్రామం మొత్తం పండుగ వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకే తలమానికమైన వీరభద్రుని ఆలయ జాతరకు ఏర్పాట్లు కూడా జిల్లా స్థాయిలోనే చేయాలన్నారు. ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ పరిసరాలలో ఆమె జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయంలోని బాగంలో ఫ్లోరింగ్ గురించి ఆలయ ఇఓ రాజేంద్రంతో అడిగి తెలుసుకున్నారు. జాతరలోపు పూర్తికాని పనులపై తరువాత దృష్టి కేంద్రీకరించవచ్చన్నారు. అదేవిధంగా ఆలయ ముఖద్వారం వద్ద మెట్లను మరమ్మత్తులు చేయాలన్నారు. ఆలయంలోపల ఉన్న క్షౌరశాల(కళ్యాణకట్ట)ను ఉత్తరం వైపున సింహాద్వారం వద్దకు తాత్కాలికంగా మార్చాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా బారీకేడ్లను బందోబస్తుగా ఏర్పాటుచేయాలని సూచించారు. ఒన్‌వేను అనుసరించి, భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట ఉన్న రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాల సముదాయాన్ని లోపలకు మార్చేలా చూడాలని సిఐ కృష్ణారెడ్డికి సూచించారు. ఆలయ సత్రాల వద్దకు వెల్లి పరిశీలించి, భూమిని చదును చేయాలని ఆదేశించారు. చలువపందిర్ల ఎత్తును పెంచాలని వాటి అవసరాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆలయం ఎదుట ఇటీవల నిర్మించిన సులాభ్ కాంప్లెక్స్‌ను, స్నానాల ఘట్టాలను పరిశీలించారు. ఎమ్మెల్యే నిధులతో వేస్తున్న సిమెంట్ ఫ్లోరింగ్ గురించి ఆలయ చైర్మన్ రాజునాయక్ కలెక్టర్‌కు వివరించారు. మరికొన్ని నిధుల గురించి కలెక్టర్‌ను చైర్మన్, ఇఓ రాజేంద్రంగా అడగగా ఆలయంలో రూ.50లక్షలు ఉన్నాయని, వాటితో పనులు చేయలేరా అని ప్రశ్నించారు. దేవాదాయ కమీషనర్ నుండి అప్రూవల్ వచ్చేవరకు ఆలస్యం అవుతుందన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణమండపాన్ని పరిశీలించారు. సిసికి అవకాశం ఉందా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధుల గురించి మరోసారి చర్చకు రావడంతో ఆలయ అధికారులు ఒకసారి కలెక్టరేట్‌కు రావాలన్నారు.
అప్‌అండ్‌డౌన్ అధికారులపై ఆగ్రహాం
స్థానిక ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు అని కలెక్టర్ దృష్టికి రావడంతో ఎంపిడిఓ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్‌అండ్ డౌన్ అధికారుల పనితీరుపై అగ్రహాం వ్యక్తం చేశారు. అప్‌అండ్ డౌన్ అధికారుల సమాచారాన్ని సేకరించాలని జెసిని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సంవత్సరం జాతరకు రెండు లక్షలు మంది వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే భక్తులకు పండుగ వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఏ అధికారి తనకు పురమాయించిన పని చేయకపోయిన శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ శ్రీరాం, ఇఇ రవికుమార్, మండల ప్రత్యేక అధికారి పురందర్, సిఐ కృష్ణారెడ్డి, సర్పంచ్ గుగులోత్ పూర్ణచంద్యానాయక్, విద్యుత్ డిఇ బిక్షపతి, వివిధ జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. పెద్ద చెరువును కలెక్టర్ పరిశీలించారు. చెరువు వద్ద భక్తుల సౌకర్యార్థం బాత్ షవర్‌లను తాత్కాలికంగా ఏర్పాటుచేసే అవకాశం పరిశీలించారు.

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ చర్యలు
*జనగామ కలెక్టర్ శ్రీదేవసేన
జనగామ టౌన్, ఫిబ్రవరి 17: వచ్చే నెలలో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జనగామ కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్మీడియట్ విద్య, పోలీసు, వైద్య, రవాణా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుంచి నిర్వహించే పరీక్షలకు కావాల్సిన సౌకర్యాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందిరాకుండా చూడాలని అన్నారు. ప్రధానంగా తాగునీరు, సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సరైన సమయానికి వెళ్లే విధంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎసిపి పద్మనాభరెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శ్రీనివాస్, డిఇవో యాద య్య, అధికారులు త్రినాథ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరీష్‌రాజ్‌లు పాల్గొన్నారు.

గ్రామ సభలో ఘర్షణ
*సభ అకస్మికంగా రద్దు
ఆత్మకూరు, ఫిబ్రవరి 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం పథకంలో, శుక్రవారం మండలంలోని గూడెప్పాడ్‌లో నిర్వహించిన గ్రామ సభ లబ్ధిదారులకు, గ్రామస్థులకు మధ్యన ఘర్షన చోటుచేసుకొని అకస్మికంగా రద్దు అయ్యింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని గూడెప్పాడ్ గ్రామానికి 30 డబుల్ బెడ్ రూంలు మంజూరయ్యాయి. అందులో భాగంగా రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి స్థానిక సర్పంచ్ జనగాం స్వరూప అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సభలో లబ్దిదారుల పేర్లు చదువుతుండగా గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మేల్యే అణుచరులను లబ్ధిదారులుగా గుర్తించారని అసలైనా లబ్ధిదారులను విస్మరించారని సభలో గందరగోళం సృష్టించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో అధికారులు విఫలం అయ్యారని ఆరోపించారు, సభలో గందరగోళం సృష్టించి లబ్ధిదారులతో గొడవకు దిగడంతో తహసిల్దారు డి.ఎస్ వెంకన్న సభను అకస్మికంగా రద్దు చేసి రీసర్వే నిర్వహిస్తామని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయారు. దీంతో డబుల్ బెడ్ రూంల లబ్ధిదారుల ఎంపిక తాత్కాలికంగా రద్దు అయ్యింది.
నగదురహిత లావాదేవీలపై అవగాహన

వరంగల్, ఫిబ్రవరి 17: డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ ఎన్‌ఐటి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన డిజి ధన్‌మేళా స్టాళ్లను వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నగరపాలక సంస్థ కమీషనర్ శృతిఓఝా, అర్బన్ జాయింట్ కలెక్టర్ దయానంద్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ డిజి ధన్‌మేళా బ్యాంకులు, ఐటి, టెలికాం, వ్యాపార, వాణిజ్య సంస్థలు, గ్యాస్ కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటుచేసాయి. జిల్లాయంత్రాంగం పర్యవేక్షణలో సుమారు 85స్టాళ్లు ఏర్పాటు జరిగాయి. తమ సంస్థల ద్వారా జరుగుతున్న డిజిటిల్ చెల్లింపుల వ్యవస్థపై మేళాకు హాజరైన ప్రజలకు అవగాహన కల్పించారు. దాంతోపాటు తమ ఉత్పత్తుల ప్రచారం, అమ్మకాలు జరిపారు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, సిండికేట్, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ తదితర ప్రైవేటు బ్యాంకులు కూడా తమ స్టాళ్లను ఏర్పాటు చేసాయి. తమ బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న నగదురహిత లావాదేవాలపై సందర్శకులకు బ్యాంకుల అధికారులు అవగాహన కల్పించారు. స్టాళ్లలో ఆధార్ కార్డులలో మార్పులు, చేర్పుల నమోదుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ముల్కనూరు సహకార పాల కేంద్రం, ప్రభుత్వ రంగ విజయ డెయిరీలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టారు. అదే విధంగా టెలికాం రంగానికి చెందిన బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో తదితర సంస్థలు స్టాళ్లు ఏర్పాటుచేసి తమ సంస్థల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించటంతోపాటు అమ్మకాలు నిర్వహించాయి. చేనేత సహకార సంఘాలు, ఖాదీ ఉత్పత్తుల సంస్థలు, వరంగల్ నగరంలో జంపుఖానాలు తయారు చేసే సంఘాలు తమ ఉత్పత్తులను స్టాళ్ల ద్వారా ప్రదర్శనకు పెట్టాయి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో వివిధ ఆహార ఉత్పతులను కూడా డిజి ధన్‌మేళాలలో ప్రదర్శనకు పెట్టారు. వరంగల్ నగర పాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్‌లో 1695 స్వచ్ఛతా యాప్ ద్వారా ప్రజల స్పందన తెలియచేసేలా ఏర్పాట్లు చేసారు. ఆయుష్, పెటిఎం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ తదితర గ్యాస్ కంపెనీలు, మహర్షి గోశాల, ఆర్గానిక్ ఉత్పత్తులను తయారు చేసే సంఘాలు, స్వయం సహాయక సంఘాల స్టాళ్లు కూడా ధన్‌మేళా కార్యక్రమంలో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడుతు హైదరాబాద్ తరువాత వరంగల్ నగరంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించటం ద్వారా ప్రజల్లో నగదురహిత లావాదేవీలపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ప్రజల నుంచి మంచిస్పందన లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌నెట్ సిఇఓ శైలేష్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి చక్రధర్, వరంగల్ ఆర్డీఓ వెంకటరమణారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.

జనగామ సిఐ, ఎస్సైలపైఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు
జనగామటౌన్, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రమైన జనగామకు చెందిన ముగ్గురి పోలీసుల అధికారులపై కేసు నమోదు చేయాలని శుక్రవారం జనగామ కోర్టు అదేశించింది. జనగామ రెండవ ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా సాధన ఉద్యమ సమయంలో గండి నాగరాజుతోపాటు మరో ఎనిమిది మంది స్థానిక మున్సీపాలిటీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
వారిపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో నాగరాజును విచారాణ నిమిత్తం గత ఏడాది అక్టోబర్ 13న ఎస్సై రవీందర్ స్టేషన్‌కు పిలిపించారు. ఆ సమయంలో నాగరాజు పోలీసుల కళ్లుగప్పి పోలీస్‌స్టేషన్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
పోలీస్‌ష్టేషన్‌లో కులం పేరుతో తనను ఎస్సై రవీందర్ దూషించి వేధించినందునే తాను ఆత్మహత్మ చేసుకేనేందుకు ప్రయత్నించానని.. తనకు చట్టపరంగా న్యాయం చేయలని నాగరాజు కోర్టును ఆశ్రయిచాంచాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు జనగామ న్యాయస్థానం ఎస్సై రవీందర్‌తోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న సిఐ ముస్కే శ్రీనువాసు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణలపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినట్లు రెండవ ఎస్సై పరమశే్వర్ తెలిపారు. కోర్టు ఆదేశానుసారం ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

కార్మిక కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తాం
*వరంగల్‌ను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతాం
*కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
వడ్డేపల్లి,్ఫబ్రవరి 17: భారత దేశంలోని పేద, మద్యతరగతి కార్మిక కుటుంబాలన్నింటికి కేంద్ర గృహనిర్మాణ పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఇండ్లులేని కార్మికులు దేశంలో లేకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ అధ్యక్షతన విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిడీకార్మికులు, భవన నిర్మాణ, సినీ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులందరికి ఒక్కొ ఇంటికి లక్ష యాభై వేల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. విజన్ 2020 ప్రణాళికలో భాగంగా దేశంలోని గ్రామాలలో తాగునీటికి కొరత లేకుండా, ఫ్లోరైడ్ గ్రామాలలో కూడా శుద్దిచేసిన నీటిని అందించేందుకు కేంద్రం పక్కా ప్రణాళికలను రూపొందించిందని వివరించారు. దేశంలోని రైతులందరికి పంట నష్టాలను అధిగమించేందుకు ఫజల్‌భీమా సమర్థవంతంగా అమలు చేసి రైతులను ఆదుకుంటామని, పంట పొలాలకు విద్యుత్తు అంతరాయం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రూరల్ జిల్లాలోని చారిత్రాత్మకమైన రామప్ప దేవాలయాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ది చేసి, సుప్రసిద్ద పర్యాటక కేంద్రంగా తయారుచేస్తామని, కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్దికి కేంద్రం నుండి నిధులు మంజూరు చేస్తామని, జయశంకర్ జిల్లా ములుగు కేంద్రంలో గిరిజన విశ్వవిద్యాలయానికి అన్ని సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. ఆకర్షణీయ నగరాలలో ఎన్నికైన వరంగల్ నగరాన్ని అమృత్ పథకం కింద దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఆధునీకరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి విష్ణుదేవ్ సాయిజీ, మాజీ ఎంపి జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, డాక్టర్ విజయలక్ష్మీ, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి
*ఎఎస్పీ రాహుల్ హెగ్డే
*లొంగిపోయిన మావోయిస్టుకు రూ.లక్ష డిడి అందజేసిన ఎఎస్పీ
ఏటూరునాగారం, ఫిబ్రవరి 17: అజ్ఞాతవాసం వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఏటూరునాగారం ఎఎస్పీ రాహుల్ హెగ్డే నక్సల్స్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం స్ధానిక ఎఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 2012లో మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలో అడుగుపెట్టి అనారోగ్యంతో ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కుంజం ఇరుమణి అలియాస్ కవితకు రూ. లక్ష రూపాయల డిడిని ఆర్ధిక సహాయంగా జీవన భృతికోసం అందజేసినట్లు ఎఎస్పి తెలిపారు. ఇరుమణి జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం తడపాల గ్రామంలో కుంజం సోమలింగం-మంగమ్మ దంపతుల కుమార్తె. అప్పట్లో నక్సల్స్ కార్యకలాపాలకు ఆకర్షితురాలైన కవిత 2012లో అజాతంలోకి వెళ్ళి , తాడ్వాయి మండలం మొద్దులగుట్ట ఎన్‌కౌంటర్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రెండు ఎన్‌కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొని, అనారోగ్య కారణంతో 2016 మార్చిలో పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీంతో ప్రభుత్వం ఆమెకు జీవన భృతికోసం లక్ష రూపాయలు మంజూరు చేయగా ఎఎస్పి చేతుల మీదుగా డిడిని అందజేశారు. కార్యక్రమంలో స్ధానిక సిఐ దుర్శేటి రఘుచందర్, కన్నాయిగూడెం ఎస్సై సిహెచ్.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

మిర్చి రైతు కంట్లో కారం..!
*మధ్య దళారుల జోరు..
*మార్కెట్ లేక ఇబ్బందులు

కేసముద్రం, ఫిబ్రవరి 17: పత్తిసాగు తగ్గించాలని ప్రభుత్వం చేసిన సూచనతో రైతులు పత్తిని తగ్గించిన విస్తీర్ణంలో మిర్చిసాగు చేపట్టగా కేసముద్రం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు లేక పోవడంతో దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. మిర్చి రైతు కంట్లో కారం కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలో గత రెండేళ్ల క్రితం వరకు మిర్చి సాగు కేవలం పెనుగొండ, కాట్రపల్లి, అర్పనపల్లి గ్రామాలకే పరిమితం కాగా ఈ ఏడాది ప్రభుత్వ సూచనకు తోడు గత ఏడాది మిర్చికి విపరీతమైన ధర దక్కడంతో మండలంలోని అన్ని గ్రామాలకు మిర్చిసాగు విస్తరించింది. ఫలితంగా వాణిజ్య పంటలైన పత్తి, పసుపు తరువాత ఇప్పుడు మిర్చి కూడా ప్రధాన పంటగా మారింది. రెండేళ్ల క్రితం వరకు మండల వ్యాప్తంగా 250 ఎకరాలకు మించిసాగు చేయని మిర్చి పంట గత ఖరీఫ్‌లో 2500 పైగా ఎకరాల్లో సాగవడం విశేషం. ఈ నెలలో మిర్చి పంట దిగుబడి ఆరంభం కాగా కేసముద్రం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు లేక పోవడంతో కొందరు వ్యాపారులు తమ నివాస గృహాలు, ట్రేడింగ్ కంపెనీలు, మిల్లులో మిర్చి కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. ఉదయం పూట గ్రామాల్లోకి వెళ్లి మిర్చి కళ్లంలోనే ధర నిర్ణయించి సరుకును కేసముద్రం తీసుకువస్తే తూకం వేసి డబ్బులు చెల్లిస్తామని బేరం కుదుర్చుకుంటున్నారని రైతులు పేర్కొంటున్నారు. తీరా మిర్చిని లోడ్ చేసి వ్యాపారి వద్దకు తెచ్చిన తరువాత సరుకు అక్కడ చూసినంత నాణ్యత లేదని, పదును ఎక్కువగా ఉందని లేని పోని సాకులు పెట్టి ముందుగా కుదుర్చుకున్న ధరకు కొంత ‘కట్’ చేయడం, మచ్చు పేరుతో బస్తాకు కిలో మిర్చి తీయడం, తక్షణ నగదు చెల్లింపుల పేరుతో వందకు 1 రూపాయి మినహాయించుకొని నానా ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో కాకుండా ఇంటి వద్దే కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఎలక్ట్రానిక్ కాంటా కాకుండా తూకం రాళ్లతో కాంటా వేసి కాంటాలో కూడా మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ లేదు.. మిర్చి మార్కెట్లోనే అమ్మాలంటే.. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం వెళ్లాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్లలేక తప్పని పరిస్థితిలో ఇక్కడ విక్రయించడానికి వస్తే ఇలా తమను నిలువుదోపిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్ నిబంధనల ప్రకారం రెగ్యులేటెడ్ మార్కెట్ ఉన్న చోట కచ్చితంగా మార్కెట్లోనే వ్యవసాయ ఉత్పత్తులు ఖరీదు చేయాలని చట్టం చెబుతోంది. నిబంధనలకు విరుద్ధంగా మిర్చి ఖరీదులు చేస్తున్న వ్యాపారులు మార్కెట్‌కు ఒక్కపైసా పన్ను చెల్లించకుండా నేరుగా రైతుల పేరుతోనే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లక్షలు గడిస్తూ.. అటు రైతులకు, ఇటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేసముద్రం మార్కెట్ పరిధిలోని గ్రామాల్లో మిర్చిసాగు విస్తీర్ణం పెరిగినందున ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు తక్షణం ప్రారంభించాలని, మిల్లులు, ట్రేడింగ్ కంపెనీల్లో ఖరీదులు చేయకుండా చర్యలు తీసుకొని మార్కెట్ ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మార్కెట్ బయట కొనుగోళ్లపై తనిఖీ:
కాగా మార్కెట్ బయట నిబంధనలకు విరుద్ధంగా మిర్చి కొనుగోళ్లపై శుక్రవారం మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శి అంజిత్‌రావు, సూపర్‌వైజర్ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించి మోహన్ టాకీస్ సమీపంలో ఇంటి వద్ద మిర్చి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారి శ్రీరాంచంద్రన్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఖరీదు చేసిన 8లక్షల 25వేల విలువైన మిర్చికి మార్కెట్ ఫీజు కింద 8వేల 250 రూపాయలు వసూలు చేయడంతో పాటు ఇద్దరు వ్యాపారులకు నోటీస్‌లు జారీ చేశారు. కాగా మార్కెట్లో త్వరలో మిర్చి కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులతో చర్చలు నిర్వహిస్తామని మార్కెట్ చైర్మెన్ బీరవెళ్లి ఉమారెడ్డి తెలిపారు.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు...
ఇంటర్వ్యూ నిర్వహించిన భూపాలపల్లి కలెక్టర్
*10 పోస్టులకు 91 మంది హాజరు
పరకాల, ఫిబ్రవరి 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న 10 మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తి చేయడానికి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10 పోస్టులకు గాను సుమారు 91 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పురుషులు 56 మంది, మహిళలు 35 మందితో కలిపి మొత్తం 91 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూ కలెక్టర్ మురళితో పాటు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, డాక్టర్ గోపాల్, డాక్టర్ నారాయణరెడ్డిలు నిర్వహించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
*జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
బచ్చన్నపేట, ఫిబ్రవరి 17: ఏ గ్రామమైన అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామ ప్రజల భాస్వామ్యం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. శుక్రవారం ఆమె బండనాగారం గ్రామ సందర్శన కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ముందుగా గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్యం, స్వచ్ఛతను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. జాబ్‌కార్డు కల్గిన ప్రతికూలీ వందరోజులు పనిచేయాలని సూచించారు. ఇజిఎస్ కింద బండనాగారం గ్రామానికి వచ్చిన రూ. 60లక్షలను గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. గ్రామస్థులు వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. మహిళలు ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి మరుగుదొడ్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రోడ్లపై పడిన గోతులను వెంటనే పూడ్చివేయాలని, అదే రోడ్ల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని పేర్కొన్నారు. పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల నుంచి తడి, పొడి చెత్తను పంచాయతీ సిబ్బంది వేరుగా సేకరించాలని సూచించారు. వేరుగా సేకరించి తడిచెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే విధంగా గ్రామస్థులకు వివరించాలని తెలిపారు. సేకరించిన చెత్తలో భూమిలో కలవని చెత్తను వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు సేకరించాలని వివరించారు. ముఖ్యంగా ప్రతి పౌరుడు మొక్కల పెంపకం కాని ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట డిపివో రవికుమార్, సర్పంచ్ కొప్పురపు శ్రీలత, ఎంపిటిసి సభ్యురాలు కవిత, ఎంపిడివో అనిత, తహశీల్దార్ విజయ్‌భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలను పరిశీలించిన పెద్దపెల్లి కలెక్టర్
మహాదేవపూర్, ఫిబ్రవరి 17: దసలి పట్టు వస్త్రాలను పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని టసర్ కాలనీలో పరిశీలించారు. చేనేత కార్మికుల స్థితిగతులపై అక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు. దసలి పట్టు దారం తీయడం, గుడ్ల ఉత్పత్తి దీనికి సంబందించిన క్రయ విక్రయాలను ఏలా చేస్తారని రైతులను అడిగి తెలుసుకొని పట్టువస్త్రాలను రంగులో అద్దడం, ప్రభుత్వ పరంగా ఏమైన శిక్షణ ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మంథని సర్పంచ్ పట్టు శైలాజ, మహాదేవపూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి బాబు, జడ్పిటిసి హసినాభాను, ఎంపిపిలు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
మొగుళ్ళపల్లి, ఫిబ్రవరి 17: మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట గ్రామం నుండి పరకాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొజ్జం స్వామి అనే బియ్యం కొనుగోలుదారుడు పరకాలకు చెందిన ఎం. మహేశ్ అనే టాటా ఏసి యజమానితో కలిసి 20 బస్తాల రేషన్ బియ్యాన్ని పరకాలకు తరలిస్తుండగా పక్క సమాచారం మేరకు మొగుళ్ళపల్లి పోలీసులు కిరణ్, రాజారాం పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. వారి ఇద్దరిపై కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని తహశీల్దార్ సునీతాకు అప్పగించడం జరిగిందని ఎస్సై రాజు తెలిపారు.