వరంగల్

హామీగానే మిగిలిపోతున్న ఉద్యోగాల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 17: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన సందర్భంలో, కొత్త రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం ద్వారా ఇంటికో ఉద్యోగం లభించేలా చూస్తామని హామీ ఇచ్చారని, అసెంబ్లీలో కూడా ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేసిందని, కానీ ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమని ప్రశ్నించటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమేనని తెలంగాణ జెఎసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు చేపడితే విద్యార్థులను, యువకులను హింసావాదులుగా, నక్సలైట్లుగా చిత్రీకరించటం, ఆందోళనల వల్ల శాంతిభద్రతలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పుపడుతు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలకు ఇప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన బాధ్యుడని, మరి వాటికి కెసిఆర్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ సెమినార్ హాలులో నిరుద్యోగ గర్జన సభ నిర్వహించారు. పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుశురాం, పివైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి పునాదిగా ఉన్న అంశాలలో నిరుద్యోగం ప్రధానమని, కానీ రాష్ట్రం ఏర్పాటు జరిగాక పాలకులు ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటు జరిగి మూడేళ్లు కావస్తున్నా ఉద్యోగాల భర్తీ నత్తనడకన జరగటంపై ఆందోళన వ్యక్తం చేసారు. ఉద్యోగాల భర్తీ అనేది పాలకుల ఎన్నికల పాచికలుగా మారిపోయాయని విమర్శిస్తూ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తక్షణం క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేసారు. తెలంగాణలో విద్యార్థులు, యువకులు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఆందోళనలు తీవ్రం చేయవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్నా స్వరాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఉద్యమించవలసిన పరిస్థితులు తలెత్తడం ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం ఒకపక్క ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ఇస్తూనే మరోపక్క ఈ నోటిఫికేషన్లను వివాదాస్పదం చేయటం శోచనీయమని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలకు, ఆంధ్ర రాష్ట్ర పాలకుల విధానాలకు పెద్ద తేడా ఏమీలేదని అన్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉద్యోగాలను పోరాడి సాధించుకోవాలని సూచించారు. కెయు జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతు విద్యార్థులు, యూనివర్సిటీలు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారి ఊసెత్తకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో యూనివర్సిటీల అభివృద్ధి పేరిట కేటాయించిన నిధులు దేనికి సరిపోవని, తెలంగాణలో ఉన్న అన్నీ యూనివర్సిటీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, పిడిఎస్‌యు, పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పస్క నర్సయ్య, రాజేందర్ పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ ఖన్నా, పివైఎల్ జిల్లా కార్యదర్శి రణధీర్ పాల్గొన్నారు.