వరంగల్

జంక్షన్ల నిర్మాణం సత్వరం పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 18: గ్రేటర్ వరంగల్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జంక్షన్ల నిర్మాణం పనులు సకాలంలో పూర్తిచేయాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. శనివారం హరితా హోటల్‌లో నగరపాలక సంస్థ, కుడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నన్నపునేని నరేందర్ సోమవారం టెండర్లు పిలిచి శుక్రవారం నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌కు తెలిపారు. దీనికోసం అవసరమైన పరిపాలనా అనుమతులు వెంటనే జారీచేస్తామని చెప్పారు. జంక్షన్ల నిర్మాణాన్ని ఒకే కాంట్రాక్టర్‌కు కేటాయించకుండా ఒక్కోపనిని ఒకొక్క కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే పనులు సత్వరంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. మొదటివిడతలో వరంగల్ నగరపాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 12 జంక్షన్లు, నేషనల్ హైవే పరిధిలో 14జంక్షన్లు, ఆర్‌అండ్‌బి పరిధిలో ఎనిమిది జంక్షన్ల సుందరీకరణ పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. చారిత్రక అంశాలపై జాగ్రత్తలు తీసుకుంటు జంక్షన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రతి జంక్షన్‌లో వరంగల్ చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణం జరగాలని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ శృతిఓఝా మాట్లాడుతూ నగర సందరీకరణపై దృష్టిపెట్టడంతోపాటు చారిత్రాత్మక ఆధారాలు దెబ్బతినకుండా, కాకతీయ కట్టడాలు, చిహ్నాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరంగల్ నగరం హెరిటేజ్ నగరంగా గుర్తింపు లభించినందువల్ల చారిత్రాక ఆనవాళ్లు కోల్పోకుండా భావితరాలకు నగర విశిష్టతను తెలియచెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సిటీ ప్లానర్ అజిత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భీంరావు, నగరపాలక సంస్థ ఎస్‌ఇ భిక్షపతి, డిఇ లక్ష్మారెడ్డి, నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, కలెక్టర్ ఆమ్రపాలి వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలో చేపడుతున్న ప్రధాన జంక్షన్ల ప్రాంతాలను పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు విద్యార్థుల మృతి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 18: వరంగల్ నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మరణించారు. నగరంలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవీన్ రాథోడ్ అనే విద్యార్థి తన మిత్రుడు సౌమిత్‌తో కలిసి మోటారుసైకిల్‌పై హన్మకొండ వైపు వేగంగా వెళుతూ నక్కలగుట్ట ప్రాంతంలోని మెయిన్‌రోడ్డుపైన యు టర్న్ తీసుకుంటున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో నవీన్ రాథోడ్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన సౌమిత్‌ను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మరణించిన నవీన్, సౌమిత్ ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసారు. రనవీన్, సౌమిత్ కుటుంబ సభ్యులు, బంధువులు ఎంజిఎం చేరుకుని మార్చురీలో మృతదేహాలను చూసి బోరున విలపించారు.

బిడ్డా ఇంటికిరా

మావోయిస్టు రవీందర్ తల్లిదండ్రుల పిలుపు

మంగపేట, మార్చి 18: ఇంటి నుండి వెళ్ళిన తమ కుమారుడు రవీందర్ ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని అజ్ఞాత మావోయిస్టు కొండగొర్ల రవీందర్ తల్లిదండ్రులు కొండగొర్ల దుర్గయ్య - సమ్మక్క కోరుకుంటున్నారు. మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన కొండగొర్ల రవీందర్ తల్లిదండ్రులు దుర్గయ్య - సమ్మక్కలకు పోలీసులు శనివారం నిత్యావసర సామాగ్రిని, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టు కొండగొర్ల రవీందర్ తల్లిదండ్రులు దుర్గయ్య - సమ్మక్క మాట్లాడుతూ ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం నుండి బతుకుదెరువు కోసం తమ కుటుంబం 12 సంవత్సరాల క్రితం మంగపేట మండలం బోరు నర్సాపురానికి వలస వచ్చిందన్నారు. తమకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కాగా కుమార్తెకు వివాహం చేశామని, చిన్న కుమారుడు లక్ష్మణ్ ప్రస్తుతం ఏటూరునాగారంలో డిగ్రీ చదువుతున్నాడని తెలిపారు. తమ పెద్ద కుమారుడైన రవీందర్ 2013లో ఇంటి నుండి వెళ్ళిపోయాడని, ఇప్పటి వరకు రాలేదని తెలిపారు. తమ కుమారుడు నక్సల్స్‌లో కలిశాడని తెలుస్తోందని అన్నారు. ఎక్కడైనా ఎన్ కౌంటర్ జరిగిందని టివిలలో, పేపర్లలో వస్తే ఆ ఎన్‌కౌంటర్‌లో తమ కుమారుడు ఉన్నాడో ఏమో అని ఆందోళన చెందుతామని అన్నారు. పోలీసులకు తమ కుమారుడు కన్పిస్తే ఎన్‌కౌంటర్ చేయకుండా ఇంటికి పంపించాలని కోరుతున్నారు.
నక్సల్స్ వనం వీడి జనంలోకి రావాలి
నక్సల్స్ అడవుల్లో ఉండి సాధించేది ఏం లేదని నక్సల్స్ వనం వీడి జనంలోకి రావాలని ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మంగపేట మండలం బోరు నర్సాపురంకి చెందిన అజ్ఞాత మావోయిస్టు కొండగొర్ల రవీందర్ అలియాస్ వినోద్ తల్లిదండ్రులు దురగయ్య - సమ్మక్కలను ఏటూరునాగారం ఏఎస్పీ రాహల్ హెగ్డే, ఏటూరునాగారం సిఐ రఘుచందర్, మంగపేట ఎస్‌ఐ ఆరకూటి మహేందర్‌లు శనివారం కలుసుకున్నారు. రవీందర్ తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకుని వారికి బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఏఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ కొండగొర్ల రవీందర్ అలియాస్ వినోద్ లొంగిపోతే అతని మీద ఉన్న కేసులు ఎత్తివేస్తామని, పునరావాసం కోసం తగిన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నక్సల్స్ అగ్రనేతలే విప్లవం ద్వారా ఏం సాధించలేమని తెలసుకుని లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారని, తెలిసీతెలియక నక్సల్స్‌లోకి వెళ్ళిన వారు ఈ సంగతి గ్రహించి జనజీవన స్రవంతిలో కలవాలని అన్నారు.
తమ తల్లిదండ్రుల పరిస్థితిని గ్రహించి కొండగొర్ల రవీందర్ అజ్ఞాతం విడనాడి బయటకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే, ఏటూరునాగారం సిఐ రఘుచందర్, మంగపేట ఎస్‌ఐ ఆరకూటి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

రాయగిరి -కాజీపేటకు మూడవ లైన్

జనగామ టౌన్, మార్చి 18: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రాయగిరి నుండి కాజీపేట వరకు మూడవ రైల్వేలైన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. శనివారం జనగామ ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే ప్రయాణికుల రద్దీ దినదినం పెరుగుతునందున తాను చేసిన విజ్ఞప్తి మేరకు మూడవ రైల్వేలైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అలాగే జనగామ రైల్వేస్టేషన్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చేందుకు జిఎం అంగీకరించాడని తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ సుందరీకరణ, వీవర్స్‌కాలనీ అండర్ బ్రిడ్జి విస్తరణకు కావల్సిన నిధులను మంజూరు చేయాలని రైల్వేశాఖ మంత్రిని కోరానని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా రూ.1450 కోట్ల ప్రతిపాదనలు పంపితే అందులో కేవలం రూ.150 కోట్లు మాత్రమే మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలో ఎంపి నిధులు రూ.5.51 కోట్లతో నిర్వహిసున్న సిసి రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శ్మశానవాటికల మరమ్మతుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశంలో రుణమాఫీపై చర్చిస్తానన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ రైల్వేస్టేషన్ సమీపంలో మున్సిపల్ స్థలం కేటాయిస్తే సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులిస్తానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎంపిపి బైరగోని యాదగిరిగౌడ్, జడ్పీటిసి బాల్దె విజయసిద్దులు, టిఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, మేకల కళింగరాజు, కౌన్సిలర్లు ఉపేందర్, ఎజాజ్ పాల్గొన్నారు.

ఘనంగా సైలాని బాబా ఉర్సు జాతర

ఆత్మకూరు,మార్చి 18: దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలో సైలాని బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా కుల, మతాలకు అతీతంగా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి సైలాని బాబాను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి బ్యాండు మేళాలతో భక్తజన సందోహం మధ్యన భారీ ఊరేగింపుగా ఒంటెపైన గంధం తీసుకుని దర్గాకు చేరుకున్నారు. దీంతో భక్తులు సైలాని బాబాను దర్శించుకుని పునీతులు అయ్యారు. దర్గా ఉత్సవాలకు నగర పోలీస్ కమీషనర్ సుధీర్‌బాబు, ఈస్ట్‌జోన్ డిసిపి ఇస్మాయిల్, పరకాల ఎసిపి సుదీంద్ర పాల్గొని దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకూరు సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు. ఉత్సవాలలో దర్గా పీఠాధిపతి అబ్దుల్ హమీద్ సైలాని బాబా భక్తులతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు మహ్మద్ రషీద్, సైలాని అమీర్ బాబా, ఎస్కే మొయిన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ అడవులను సంరక్షించాలి

పరకాల, మార్చి 18: హరిత రక్షణ కమిటిలను వేసి అడవులను సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళి మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసే హరిత రక్షణ కమిటీ అధ్యక్షులుగా సర్పంచ్‌లు, సభ్యులుగా విఆర్‌ఓ, గ్రామ కార్యదర్శి, బీట్ ఆఫీసర్, ఎఎన్‌ఎం, హెచ్‌ఎం, ఎస్‌జిఓ, అంగన్‌వాడి టీచర్, యువజన సభ్యులు ఉండే విధంగా కమిటీలను వేయాలన్నారు.
గ్రామాల్లో హరితహారం కమిటిలు వేసి కమిటీ ఆధ్వర్యంలో అడవులను పాడు చేయకుండా, నరకకుండా చూడాలన్నారు. అడవులు వేసవి కాలంలో తగలబడుతున్నాయని, అగ్ని ప్రమాదాలు జరగకుండా నిలువరించాలన్నారు. అడవులతోనే మానవ మనగడ ముడిపడి ఉందన్నారు. అడవులు లేకుంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మానవ జీవన విధానమే అతలాకుతలం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ దిశగా అందరూ ముందుకు సాగి అడవులను సంరక్షించాలన్నారు. సమావేశంలో డిఎఫ్‌ఓ రవికుమార్, డిపిఓ చంద్రవౌళి, డిఆర్‌డిఓ మనోహర్, అటవీ శాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.