వరంగల్

ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 19: రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని, ఈ కారణంగా అన్ని వర్గాల ప్రజలు పార్టీకి చేరువ అవుతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భారీగా పార్టీసభ్యత్వం నమోదు అయ్యేలా పార్టీశ్రేణులు కృషి చేయాలని కోరారు. ఆదివారం నగరంలోని అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కడియం, కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం మాట్లాడుతు సాధారణంగా మేధావులు, ఉన్నత విద్యావంతులు రాజకీయాలకు దూరంగా, వౌనంగా ఉంటారని, కానీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులైన అటు హైదరాబాద్ నగరం, ఇటు వరంగల్ నగరంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మేధావి, ఉన్నత విద్యావంతులను, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులకు పార్టీ సభ్యత్వం ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీనాయకులకు, శ్రేణులకు సూచించారు. పార్టీ సభ్యత్వం ఎంత ఎక్కువగా జరిగితే ప్రభుత్వంపై ప్రజలకు అంత నమ్మకం పెరిగినట్లుగా ఉపముఖ్యమంత్రి అభివర్ణిస్తూ పార్టీక్యాడర్ సభ్యత్వ నమోదుపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వం నమోదు జరిగేలా చూడాలని కోరారు. కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతు మలిదశ తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాకు ప్రముఖపాత్ర ఉందని చెప్పారు.
ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు, ముఖ్యంగా వరంగల్ జిల్లా పార్టీ అధినేత కెసిఆర్‌కు అండగా నిలిచిందని అన్నారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు నాలుగు జిల్లాలకే ఉద్యమం పరిమితం అని ఎద్దేవా చేసేవారని, కానీ విప్లవాలు, ఉద్యమాలు అనేవి అన్ని ప్రాంతాల్లో సరిసమానంగా జరగవని, దేశస్వాతంత్య్రం కోసం జరిగిన ఆందోళనలను కూడా గాంధీజీ ఉద్యమం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో నిర్వహించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వరంగల్ జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందని, వరంగల్ జిల్లాకు చెందిన చాలామంది నాయకులను అధినేత కెసిఆర్ పేరుపెట్టి పిలవటాన్ని గమనిస్తే వరంగల్‌కు ఉన్న గుర్తింపు స్పష్టం అవుతోందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పార్టీశ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ సభ్యత్వం భారీగా జరిగేలా ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ యాదవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, పార్టీ నాయకులు రవికుమార్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

దాహార్తి తీర్చాలని
జాతీయ రహదారిపై మహిళల ధర్నా
నల్లబెల్లి, మార్చి 19: గ్రామపంచాయతీ నిర్లక్ష్యం వల్లే సంవత్సరం నుండి తాగునీటి కోసం తల్లడిల్లాల్సి వస్తోందని పేర్కొంటూ 365 జాతీయ రహదారిపై రుద్రగూడెం కాలనీ వాసులు రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో వల్ల రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ రహదారి పనుల వల్ల మంచినీటి కోసం వేసిన పైపులైన్లు ధ్వంసం అయ్యాయని అన్నారు. పైపులైన్లు కోసం నిధులు మంజూరైనా సర్పంచ్, అదికారులు పట్టించుకోక పోవడం వల్లే తాము తాగునీటి కోసం తల్లడిల్లాల్సిన పరిస్థితి దాపురించిదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రుద్రగూడెం కాలనీ వాసులకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి, ఎస్సీ, కాలనీవాసులు పాల్గొన్నారు
ఇద్దరు గొత్తికోయల అరెస్ట్
ఏటూరునాగారం, మార్చి 19: ఛత్తీస్‌గఢ్‌లోని తాళ్ళగూడ పోలీస్టేషన్‌కు చెందిన పోలీసులు ఏటూరునాగారం మండల కేంద్రంలో ఇద్దరు గొత్తికోయలను ఆదివారం అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే... ఛత్తీస్‌గఢ్‌లోని కొంజేరు ప్రాంతానికి చెందిన మడవి అడమయ్య, మడవి మంగుడు, మడవి కొమ్మయ్య అనే గొత్తికోయలు దొంగతనం కేసులో ముద్దాయిలని, వారు ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో తలదాచుకున్నారనే సమాచారం మేరకు శనివారం పోలీస్ అధికారులు ఏటూరునాగారం చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఏటూరునాగారం పోలీస్టేషన్‌కు తరలించారు. ఆదివారం విచారించిన అనంతరం మడవి మంగుడు, మడవి అడమయ్యలను అదుపులోకి తీసుకుని, కొమ్మయ్యను విడిచి పెట్టారు. అదుపులోకి తీసుకున్న ఇరువురిని ఛత్తీస్‌గఢ్‌లోని తాళ్ళగూడ పోలీస్టేషన్‌కు తరలించినట్లు తాళ్ళగూడ సిఐ సుశీల్ పటేల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
నర్సంపేట, మార్చి 19: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సంపేట పట్టణంలోని వల్లబ్‌నగర్ పాలశీతల కేంద్రం సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన కారుకూరి ప్రసాద్ తన ద్విచక్రవాహనంపై తన స్వగ్రామానికి నర్సంపేట నుండి ఆదివారం సాయంత్రం బయలుదేరారు. అయితే ముందు వెళుతున్న ఆటో హఠాత్తుగా యూటర్న్ తిరగ్గా వెనుక ఉన్న ప్రసాద్ ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో ప్రసాద్ కుడి చేయి విరిగిపోయింది. తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడికి ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి వరంగల్‌కు తరలించారు.
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి
సంగెం, మార్చి 19: అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై గీసుకొండ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలోసంగెం, గీసుకొండ పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి గుడుంబా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఆదివారం గీసుకొండ మండలం నందానాయక్ తండాలో అక్రమంగా తయారుచేస్తున్న 15లీటర్ల గుడుంబాను వంద లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమంగా గుడుంబా తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగెం, గీసుకొండ ఎస్సైలు దీపక్, రామకృష్ణ పాల్గొన్నారు.
బొగ్గు లారీ ఢీకొని
ఐదుగురికి తీవ్రగాయాలు
కమలాపూర్, మార్చి 19: కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామ వంతెనపై ఆదివారం బొగ్గు లారీ, ప్యాసింజర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు అయినట్టు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎల్కతుర్తి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో పరకాల నుండి ఆరెపల్లికి వస్తున్న క్రమంలో చెల్పూర్ జెన్‌కో నుండి ఉప్పల్ వైపు వస్తున్న బోగ్గు లారీ శనిగరం వంతెన దగ్గర అతివేగంగా వచ్చి లారీ ఆటోను ఓవర్‌టేక్ చేసుకుంటూ ఢీకొనడంతో ఒకరికి తలపగలగా, మిగతా వారికి గాయాలయినట్టు, వారిని చికిత్స నిమిత్తం 108 ద్వారా వరంగల్ ఎంజిఎం తరలించినట్లు తెలిపారు.

విద్యుత్ మీటర్‌కు ఆధార్ అనుసంధానం

పరకాల, మార్చి 19: జిల్లా వ్యాప్తంగా ప్రతి విద్యుత్ మీటర్‌కు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. విద్యుత్ మీటర్ల నెల వారీ రీడింగ్‌లు తీసే సిబ్బంది ఇప్పటికే ఆధార్ సంఖ్యలు సేకరించే కార్యక్రమం ప్రారంభించారు. వినియోగదారుడు ఆధార్ సంఖ్యలతో పాటు సెల్‌ఫోన్ నెంబర్, వినయోగదారుడి వివరాల సమాచారం కూడా సేకరించే పనిలో సిబ్బంది ఉన్నారు. విద్యుత్ మీటర్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయితే సరఫరాలో తరుచూ ఏర్పడుతున్న అంతరాల గురించి విద్యుత్ కోతల గురించి సమాచారాన్ని వినియోగదారుల సెల్‌ఫోన్‌లకు సంక్షిప్త సందేశాల ద్వారా పంపనున్నారు. ఈ ప్రక్రియ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా పరిధిలోని విద్యుత్ సెక్షన్ పరిధిలో గృహావసర, వాణిజ్య, వ్యవసాయ పరిశ్రమలకు సంబందించి విద్యుత్ మీటర్లున్నాయి. వీటిన్నింటినీ అయా సెక్షన్ల పరిధిలోని ఉన్నతాధికారులు ఆధార్‌కు అనుసంధానం చేసేందుకు సిబ్బందిని సమాయత్తం చేశారు. మీటరు వినియోగదారుడి పేరు, ప్రస్తుత ఇంటి నెంబర్, ఆధార్ సంఖ్య, సెల్‌ఫోన్ నెంబర్లు, వినియోగదారుల వివరాలు సేకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో మీటర్లు ఉన్న వినియోగదారులకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకుంటే వారికి ప్రభుత్వం రాయితీ కల్పించనుంది. ఎస్సీ, ఎస్టీలకు నేరుగా బిల్లుల్లోనే రాయితీ వర్తించేలా స్ట్ఫావేర్‌ను కూడా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరు నెలల్లోగా విద్యుత్ మీటర్లన్నీ అధార్ సంఖ్యను అనుసంధానం చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు.
విద్యుత్ మీటర్ల ఆధార్ అనుసంధానం వల్ల ఒక్కో వ్యక్తి పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి... ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయి... అవి గృహావసర మీటర్లా? నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేశారా? సామాజిక వర్గాల వారీగా ఎన్ని మీటర్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి అన్న పూర్తి సమాచారం పూర్తి స్థాయిలో లభించనుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ మీటర్ల ఏర్పటు, వినియోగంలో అక్రమాలు తొలగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆధార్ సంఖ్యలు సేకరిస్తున్నాం...
విద్యుత్ మీటర్లకు సంబంధించి వినియోగదారుల ఆధార్ సంఖ్యలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందాయని ఆధార్ సంఖ్యలు సేకరించే పనిలో ఉన్నామని విద్యుత్ ఏఈ రవికుమార్ తెలిపారు. అధార్ అనుసంధానం వల్ల విద్యుత్ వినియోగంలో అక్రమాలు అరికట్టే వీలుందని పేర్కొన్నారు.

కారు ఎక్కుతున్న కామ్రేడ్లు

వరంగల్, మార్చి 19: గ్రూపు తగాదాల కారణంగా పార్టీనుంచి బహిష్కృతులైన అర్బన్ జిల్లా సిపిఎం నాయకులు తెలంగాణ రాష్టస్రమితి పార్టీలో చేరుతున్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్యనాయకులు చేసిన మంత్రాంగం ఫలించింది. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కెసిఆర్ సమక్షంలో సిపిఎం నాయకులు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జిల్లాల పునర్విభజన జిల్లా సిపిఎం పార్టీలో తుఫాను సృష్టించిందని చెప్పవచ్చు. ప్రారంభంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించే నేపథ్యంలో వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం మొదట్లో భావించింది. ఈ సందర్భంలో వరంగల్ జిల్లా సిపిఎం నాయకత్వం పార్టీ సీనియర్ నాయకుడు మెట్టు శ్రీనివాస్‌కు, మరో సీనియర్ నాయకుడు వాసుదేవరెడ్డికి హన్మకొండ జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ జిల్లాలకు బదులు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను ఏర్పాటు చేయటం సిపిఎంలో ముసలానికి నాంది అయింది. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులలో మెజారిటీ అభిప్రాయం పేరిట వాసుదేవరెడ్డికి వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి పార్టీలో చాపకింద నీరులా అసమ్మతి మొదలయింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశాల్లో, ఇతర ముఖ్య సమావేశాల్లో జిల్లా నాయకత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు గళం విప్పటం ప్రారంభించారు. తాజాగా నెలరోజుల కిందట అర్బన్ జిల్లాకు చెందిన కొందరు ముఖ్యనాయకులు జిల్లా నాయకత్వాన్ని నిలదీసే విధంగా మాట్లాడటంతో అరడజను మంది నాయకులను పార్టీనుంచి సస్పెండ్ చేసారు. దాంతో ఆగ్రహించిన వారి మద్దతుదారులు హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంపై దాడిచేసిన సందర్భంలో రెండువర్గాలకు చెందిన నాయకులు గాయపడ్డారు. మరుసటి రోజు అసమ్మతి నాయకుల మద్దతుదారులు పోలీసుల సాక్షిగా మళ్లీ పార్టీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంలో పరిస్థితి అదుపుతప్పుతుందనే అభిప్రాయంతో పోలీసులు పార్టీ కార్యాలయానికి తాళం వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరుసటి రోజు పార్టీ రాష్ట్ర ముఖ్యనాయకులు వరంగల్ వచ్చి జిల్లా నాయకుల మధ్య రాజీకి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొన్నిరోజుల పాటు అర్బన్ జిల్లా పార్టీ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోని రాష్టక్రమిటీ తాజాగా పార్టీలో అసమ్మతికి కారకుడనే అభిప్రాయంతో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మెట్టు శ్రీనివాస్‌ను పదవుల నుంచి తొలగించి సాధారణ సభ్యునిగా మిగిల్చారు. ఈ చర్య అసమ్మతి, బహిష్కత నేతలకు పుండుమీద కారం చల్లినట్లుగా మారింది.
సిపిఎం జిల్లా నాయకుల్లో ఏర్పడిన విభేధాలు, బహిష్కరణల నేపథ్యంలో బహిష్కృత నేతలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు జిల్లా ముఖ్యనాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. వరంగల్ మేయర్ నరేందర్, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, ధర్మారెడ్డి తదితరులు ఎవరికివారే బహిష్కృత సిపిఎం నాయకులతో చర్చలు జరిపి ‘కారు’ నీడకు చేరేందుకు ఒప్పించారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న డబుల్ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణంలో తమ పార్టీ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌లో చేరే పేదకుటుంబాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరగా టిఆర్‌ఎస్ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. టిఆర్‌ఎస్‌లో పార్టీలో చేరుతున్న సిపిఎం నాయకులు ఆదివారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలియటంతో వారి చేరిక ఖాయమని తేలిపోయింది. సోమవారం హైదరాబాద్‌లో కెసిఆర్ సమక్షంలో తమ మద్దతుదారులతో కలిసి గులాబీ కండువా కప్పుకుని టిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

స్వచ్ఛమైన తాగునీరు
అందించడమే ప్రభుత్వ లక్ష్యం
శాయంపేట, మార్చి 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ బృహతరమైన కార్యక్రమమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించడానికి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణ పనులకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ శాయంపేట మండలంలో మండల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు త్రాగించడానికి రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే 50 సంవత్సరాల వరకు ప్రజలకు త్రాగునీరు అందించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు కష్టాలు దూరం అవుతున్నట్లు చెప్పారు. గత పాలకుల వైఫల్యాల కారణంగా ప్రజలు అభివృద్ధికి దూరం అయ్యారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల కష్టాలను దూరం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పోలపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ వలుపదాసు చంద్రవౌళి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్, తహశీల్దార్ రజనీ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయ పెద్ద వరం

నెల్లికుదురు, మార్చి 19: మిషన్ కాకతీయ పధకం రైతులకు, రైతు కూలీలకు, అన్ని వర్గాల ప్రజలకు ఒ గొప్ప వరం అని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పెద్ద చెరువును మిషన్ కాకతీయ పధకంలో భగంగా పనులు ప్రారంభించారు. అనంతరం రామన్నగూడెం గ్రామంలో రూ.16లక్షలతో చెపట్టే నూతన గ్రామ పంచాయితీ భవనానికి అయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. నెల్లికుదురు పెద్ద చెరువును రూ.1.18కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, చెరువు కట్టను ఏడు మీటర్ల వెడేల్పు చేసి నెల్లికుదురు, రామన్నగూడెనాకి రవాణ సౌకర్యం మెరుగుపరుచనున్నట్లు తెలిపారు. చెరువులు బాగుంటేనే పంటలు పండి బావుల్లో నీళ్లు ఉంటాయన్నారు. మిషన్ కాకతీయ పనులలో అవినీతి లేకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటికే మండలంలో 16గ్రామపంచాయితీలకు ఎక్కడాలేని విధంగా నూతన భవనాలను మంజూరు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్‌లను, కళ్యాణలక్ష్మి, దళితులకు మూడెకరాల భూమి, 2లక్షల డబుల్‌బెడ్‌రూం ఇల్లను, ఇంటింటికి నల్లా ఏర్పాటు చేయడానికి మిషన్ భగీరధ తదితర పధకాలను ప్రవేశపెట్టి జనహృదయ నేతగా గణతికెక్కారన్నారు. రామన్నగూడెం అభివృద్ధికి సిడిఎఫ్ నుండి రూ.5లక్షలతో సిసి రోడ్డు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కట్టకాల్వ మరామత్తులకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో మాట్లాడి పనులను మంజూరు చెయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ దద్దమ్మలు గత కొన్ని దశాబ్ధాలుగా పనులు చేయకుండా కాలం గడిపారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణమని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారంత టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చెరుతున్నారన్నారు.
కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిక
రామన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపిటీసి పాశం వీరయ్యతోపాటు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు పాశం రమేష్‌తోపాటు నాయకులు కనకం వీరయ్య, కె.వెంకటేశ్వర్లు, వెంకన్న, జి.వెంకన్న, ప్రభాకర్, శ్రీనివాస్, దేవయ్యలతోపాటు మరో 50మంది టిఆర్‌ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎల్తూరి వెంకటమ్మ, నెల్లికుదురు, రామన్నగూడెం సర్పంచ్‌లు కస్తూరి శ్రీను, కనకం హైమ పాల్గొన్నారు.

మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెళ్లి

చేర్యాల, మార్చి 19: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి జాతర ఆదివారం నాటికి తొమ్మిదవ వారానికి చేరుకుంది. ఈ వారానికి వేలాదిగా భక్తులు వివిద ప్రాంతాల నుండి మల్లన్నను దర్శించుకోవడానికి తరలివచ్చారు. గత ఎనిమిది వారాల కంటే ఈ వారం పెద్ద సంఖ్యలో భక్తులు కొమురవెళ్లికి తరలిరావడంతో మల్లన్న నామస్మరణతో ఆదివారం కొమురవెళ్లి క్షేత్రం మారుమోగింది. స్వామివారి సన్నిదికి చేరుకున్న భక్తులు ముందుగా కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానమాచరించారు. అనంతరం గంగరేణి చెట్టు, ముఖ మండపం వద్ద పంచరుంగులతో ఒగ్గు పూజారుల ఢమరుక నాదాల మద్య పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. వేలాదిగా భక్తులు రావడంతో ఎల్లమ్మ దేవాలయ ప్రవేశ ద్వారం వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహిళలు వారు బసచేసిన ప్రాంతాల వద్ద బోనాలను వండుకొని వాటిని నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఎల్లమ్మ దేవాలయానికి తరలి వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించి కల్లును ఆరగింపుగా చూపి తమ భక్తి బావాన్ని చాటుకున్నారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో గదులు, తాగునీరు, దర్శనం విషయాలలో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గదుల సౌకర్యం లేకపోవడంతో చెట్ల వద్దనే బోనాలను వండుకునే పరిస్థితి ఏర్పడింది. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఇవో రామక్రిష్ణారావు, చైర్మన్ బద్దిపడిగ క్రిష్ణారెడ్డి తెలిపారు.

చురుకుగా సభ్యత్వ నమోదు

మహబూబాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మానుకోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ పుస్తకాలను ఆయా గ్రామాల బాధ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వాలు స్వీకరించడాన్ని తెలంగాణ ప్రజలు ఒక గౌరవంగా భావిస్తున్నారన్నారు. తెరాస సభ్యత్వాలు కావాలని స్వచ్ఛందంగా గ్రామాలు, తండాలలో ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా తెరాస నాయకులు పనిచేయాలని, సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి పార్టీ సభ్యత్వాన్ని అందించే విధంగా కార్యక్రమ రూపకల్పన చేసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వార్డు కమిటీలు, గ్రామకమిటీలు మండల కమిటీలతో సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషికి ప్రజల నుండి అనుహ్యమైన స్పందన లభిస్తుందన్నారు. ఇదే తరహా పాలన రానున్న రోజుల్లో మరింత ప్రజా సంక్షేమ హితంగా సాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలకు పెరుగుతున్న ఆధరణను చూసి తట్టుకోలేని ప్రతి పక్షాలు అవాస్తవ ఆరోపణలతో ప్రజలను పక్కదారి పట్టింటే ప్రయత్నాలు చేస్తున్నారని శంకర్‌నాయక్ అన్నారు. ప్రతి పక్షాల విమర్శలను కార్యకర్తలు ఉపేక్షించరాదని, ఎక్కడికక్కడ విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ ఆధిక్యత తెలంగాణ రాష్ట్ర సమితిదే అని ప్రజాభిప్రాయం స్పష్టం చేస్తుందని దానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిలువేత్తు సాక్ష్యంగా నిలువనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మార్నేని వెంకన్న, ఎండి ఫరీద్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, భూక్య ప్రవీణ్‌నాయక్, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, జెర్రిపొతుల వెంకన్న, దామునాయక్, స్వామినాయక్, డోలి లింగుబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి ప్యానల్ ఘన విజయం

భీమదేవరపల్లి, మార్చి 19: సహకార రంగంలో ఆసియా ఖండంలో అతి పెద్దదైన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకుకు ఐదు నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికలలో బ్యాంకు అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి చెందిన ప్యానెల్ ఘన విజయం సాధించింది. మూడవ నియోజక వర్గం నుండి పింగిళి జైపాల్‌రెడ్డిపై పోల్నేని మధుసూదన్‌రావు1222 ఓట్లు మెజారిటీతో గెలుపొందినట్లు, 8 వ నియోజక వర్గం నుండి కడారి శ్రీనివాస్‌పై ఆరెపల్లి రమేశ్ 1311 ఓట్లు మెజారీటి వచ్చినట్లు, 9వ నియోజక వర్గం నుండి నమిండ్ల లక్ష్మీపై గుండెల్లి ఎల్లమ్మ 1270 ఓట్లతో, కాలేరు శివాజీపై అప్పని రాములు 1299 ఓట్ల మెజారీటీతో గెలుపొందినట్లు, మండల సురేందర్‌పై 1297 ఓట్ల మెజారీటిపై గెలుపొందినట్లు వరంగల్ అర్బన్ సహకార ఎన్నికల అధికారి కర్ణాకర్ ఆదివారం వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగగా గెలుపుకోసం పింగిళి జైపాల్‌రెడ్డి వర్గం తీవ్రంగా కృషి చేసినప్పటికీ ప్రవీణ్‌రెడ్డి వర్గం ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడించగానే బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇంటి వద్ద నుండి ఆయన వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముల్కనూర్ సహకార బ్యాంకు ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులకు బ్యాంకు అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కి పూలమాలలు వేసి సత్కరించారు. సహకార బ్యాంకు ఎన్నికలకు ఏసిపి జనార్దన్ ఆధ్వర్యంలో 115 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
పార్టీలకతీతంగా పనిచేయడంవల్లే..
ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ పాలక మండలి రాజకీయ పార్టీలకతీతంగా పనిచేస్తూ ఉండడం వల్లనే ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ పాలక మండలి ఐదు నియోజకవర్గాలను రైతులు ఘన విజయంతో గెలిపించారని ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకులో బ్యాంక్ అద్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో అధ్యక్షుల నివాసం నుండి బ్యాంక్ వద్దకు వేలాది మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో బ్యాంక్ అధ్యక్షుడు మాట్లాడుతూ సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికలలో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరు కలిసి బ్యాంక్ పాలకమండలికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీ రైతులందరూ ఒకే తాటిపై నిలబడి ప్రస్తుతం పనిచేస్తున్న పాలక మండలితో పాటు నూతనంగా తాము నిలబెట్టిన అభ్యర్థులకు విజయం చేకూర్చి పెట్టారని పేర్కొన్నారు. సహకార బ్యాంకు ఎన్నికల్లో ముల్కనూర్ సహకార బ్యాంక్ పాలకమండలిపై అసభ్య ఆరోపణలు, ఇతరత్రా ప్రచారం చేసినప్పటికీ రైతులంతా తాము చేస్తున్న పనులను గుర్తించి తమ ప్యానల్‌కు విజయం చేకూర్చిపెట్టినారని పేర్కొన్నారు. భారీ ర్యాలీలో పాల్గొన్న వారిలో ముల్కనూర్ ఎంపిటిసి సభ్యులు చొల్లేటి ప్రకాశం, మాజీ మండల అధ్యక్షులు బొజ్జపురి అశోక్‌ముఖర్జి, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మంగ రాంచంద్రం, మారుపాటి శ్రీనివాస్ రెడ్డి, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, చిట్కూరి రాంచంద్రం, గోనెల సంపత్, పత్తిపాక వేణు, బోడ భిక్షపతి, పత్తిపాక కొమురెల్లి, కొమురవెల్లి చంద్రశేఖర గుప్తా తదితరులు ఉన్నారు.

బంగారు తెలంగాణ లక్ష్యంగా కృషి చేయాలి
సంగెం, మార్చి 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కలలుకన్న బంగారు తెలంగాణే లక్ష్యంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కృషి చేయాలని ఎంపిటిసి కందకట్ల కళావతి అన్నారు. సంగెం మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు నాగార్జున శర్మ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందినప్పుడే అభివృద్ధిలో దూసుకుపోతామని అన్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకవెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో సంగెం మండలం రూరల్ జిల్లాలోని మొదటిస్థానంలో ఉండే విధంగా నమోదు కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్ళికాంబ, సొసైటీ డైరెక్టర్ సదయ్య, నాయకులు నరహరి, బాబు, రమేశ్, సంపత్, ఉమా తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాపార్కు ధర్నా చౌక్ ఎత్తివేయొద్దు

నర్సంపేట, మార్చి 19: హైద్రాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ ఎత్తివేతను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ వరంగల్ రూరల్ జిల్లా సహాయ కార్యదర్శి పంజాల రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ధర్నా చౌక్ ఎత్తివేతపై అఖిల పక్ష సమావేశం ఇల్లందుల సాంబయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈసందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ దొరల అహంకారిలా పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. అనేక ఉద్యమాలకు, హక్కుల సాధనకు వేదిక అయిన ఇందిరాపార్కు ధర్నా చౌక్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం సరి కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కును టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాసేందుకు పూనుకోవడం దారుణమని అన్నారు. హైద్రాబాద్ శివార్లలో ధర్నాలు చేసుకోవాలని చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈసమావేశంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, న్యూడెమోక్రసీ నాయకులు ప్రభాకరన్న, తోటకూరి రాజు, ఎమ్మార్పీ ఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కల్లెపల్లి ప్రణయ్‌దీప్ మాదిగ, సిపిఐ నాయకులు అక్కపెల్లి రమేష్, కందికట్ల వీరేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుంకరనేని బాలనర్సయ్య, చెన్నమళ్ల నర్సయ్య, దిడ్డి పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.

మంగపేట బిజెపిలో వర్గపోరు

మంగపేట, మార్చి 19: మంగపేట బిజెపి నాయకులలో వర్గపోరు మొదలయింది. మంగపేట మండలంలో బిజెపి నాయకులను, కార్యకర్తలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. మండలంలో బిజెపికి ఉన్న కొద్దిపాటి కేడర్ కూడా ఇటీవల వరకు ఐక్యంగా ఉండేది. అయితే గత కొంతకాలంగా మండలానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులకు, మండల అధ్యక్షుడికి మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్టీలో ఉన్న కొద్దిమంది రెండు వర్గాలుగా చీలిపోయారు. మండల అధ్యక్షుడు గాజుల కృష్ణ ఒంటెద్దు పోకడ పోతూ సీనియర్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తున్నాడని ఒక వర్గం, కొంతమంది సీనియర్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పార్టీ మండల అధ్యక్షుడు ఇలా ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పత్రికలకు కూడా ఎక్కారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి మంచి ఫలితాలను సాధించి ఊపుమీద ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళుతూ టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపియే అంటూ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు ఓ వైపు ప్రజల్లోకి దూసుకువెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటే మంగపేట మండలంలో మాత్రం బిజెపి ఎదుగుదల గురించి పట్టించుకోకుండా నాయకులే ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నాయకుల మధ్య ఉన్న వర్గ పోరుతో తాము ఎటు వైపు ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని, నాయకుల తీరు మారకుంటే కార్యకర్తలు ఇతర పార్టీలలోకి జంప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని దాంతో మండలంలో బిజెపి మరింత బలహీనపడుతుందని బిజెపి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం మంగపేట మండల బిజెపి నాయకులలో ఉన్న వర్గపోరును రూపుమాపకపోతే భవిష్యత్‌లో మంగపేటలో బిజెపి కనుమరుగయినా ఆశ్చర్యపోవక్కర్లేదని కొంతమంది బిజెపి నాయకులే బాహాటంగా చర్చించుకుంటున్నారు.
త్వరలో పార్టీ మండల అధ్యక్షుడి మార్పు ?
బిజెపి మంగపేట మండల అధ్యక్షుడిని అధిష్టానం త్వరలో ఆ పదవి నుండి తప్పించనుందని సీనియర్లు అంటున్నారు. బిజెపి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పాపయ్య కమలాపురం విచ్చేసినప్పుడు, బిజెపి శాసన సభా పక్ష నేత, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి కమలాపురం వచ్చినప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గాజుల కృష్ణ కనీసం హాజరుకాలేదని ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్న జిల్లా అధిష్టానం త్వరలో తమ పార్టీ మండలాధ్యక్షుడిని మార్చనుందని మండల బిజెపి సీనియర్ నాయకులు అంటున్నారు.

‘ప్రజాబలం టిఆర్‌ఎస్ వైపే’

మంగపేట, మార్చి 19: రాష్ట్రంలో ప్రజలందరూ టిఆర్‌ఎస్ వెంటే ఉన్నారని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఏటూరునాగారం డివిజన్ ఛైర్మన్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారంలో టిఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పంట పొలాలలో రైతులను కలుసుకుని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా నాశిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం సియం కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు టిఆర్‌ఎస్‌కు అండగా ఉంటున్నారని అన్నారు. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ కే దక్కుతుందన్నారు. మంత్రి చందులాల్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్‌ల ఆధ్వర్యంలో ములుగు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గడువులోపు టిఆర్‌ఎస్ సభ్యత్వాలను అనుకున్న దాని కంటే ఎక్కువగా నమోదు చేస్తామని అన్నారు.