వరంగల్

బ్యాంకుల నిబంధనలతో ఖాతాదారుల బేజారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 26: నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహం పేరిట అటు కేంద్రప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంకు కొత్తకొత్త నిబంధనలు అమలు చేస్తుండటంతో సామాన్య ఖాతాదారులు బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేయడానికి విముఖత చూపుతున్నారు. గతంలో ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లు ఇబ్బడిముబ్బడిగా సేకరించటం రివాజుగా మారగా, పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకులు తీసుకుంటున్న కొత్తకొత్త నిర్ణయాల వల్ల ఈ అర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రజల నుంచి ఖాతాలలో డబ్బు డిపాజిట్ చేసే కార్యక్రమానికి పెద్దగా స్పందన లభించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కనీసం 30శాతం వరకు డిపాజిట్లు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే పేరుతో ఏటిఎంలను కూడా క్రమంగా కుదించాలని రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు సూచించిన కారణంగా కొత్తగా డిపాజిట్ల సంగతి అటుంచి ఖాతాదారులు తమ ఖాతాలలోని సొమ్మును క్రమక్రమంగా డ్రా చేసుకుని ఇళ్లలో దాచుకునే పాత సంస్కృతికి అలవాటుపడే పరిస్థితి మొదలయింది.గత నవంబర్‌లో వేయి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకువచ్చిన సందర్భంలో నగదు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంకు విధించిన షరతులు ఇప్పటికీ ప్రజలను కోలుకోలేని విధంగా చేసాయి. ప్రారంభంలో రెండువేల రూపాయలు మాత్రమే ఖాతా నుంచి తీసుకోవాలని విధించిన షరత క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు నగదు ఉపసంహరణపై పరిమితులను ఎత్తివేసినా బ్యాంకుల నుంచి, ఏటిఎంల నుంచి డబ్బు తీసుకోవటం ఖాతాదారులకు ఇప్పటికీ ఇబ్బందికరంగానే మారింది. అత్యధిక ఏటిఎంలలో నగదు లేక పనిచేయకపోవటం, అతికొద్ది ఏటిఎంలలో పెడుతున్న డబ్బు కొద్ది నిముషాలకే అయిపోవటంతో ప్రజలు డబ్బుల కోసం నానాఅగచాట్లు పడుతున్నారు. నగదు లావాదేవీలపై పరిమితులు విధించిన రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల నుంచి చెక్కుల ద్వారా డబ్బులు తీసుకోవటానికి కూడా తాజాగా పరిమితులు విధించటంతో ఇదెక్కడి తలనొప్పి అని ఖాతాదారులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులలో డబ్బులు వేసినా రుసుములు, తీసినా రుసుములు అనే విధానం అమలులోకి రావటంతో ఉన్న డబ్బు ఏదో ఇంట్లో జాగ్రత్త చేసుకుంటే సరిపోతుందనే అభిప్రాయం సామాన్య ఖాతాదారుల్లో క్రమక్రమంగా బలపడుతోంది. దీనివల్ల బ్యాంకులలో డిపాజిట్లు, లావాదేవీలు క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. తాజాగా ఏటిఎంలను కుదించాలనే రిజర్వ్ బ్యాంకు నిర్ణయం కూడా బ్యాంకు ఖాతాలు ఖాళీ అవటానికి దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు బ్యాంకులకు వెళ్లకుండా అందుబాటులో ఉన్న ఏటిఎంల నుంచి ఖాతాదారులు డబ్బులు తీసుకోవటం క్రమక్రమంగా పెరుగుతుండగా ఏటిఎంల సంఖ్య తగ్గించాలనే నిర్ణయం ఖాతాదారులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు, జాతీయ, ప్రైవేటు బ్యాంకులు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు మినహా సామాన్య ప్రజలు బ్యాంకులలో ఖాతాలు, లావాదేవీలు అంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం బ్యాంకు అధికార, ఉద్యోగ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.