వరంగల్

ఆంక్షలు కఠినం.. అమలులో నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 30: ఉమ్మడి వరంగల్‌జిల్లా వ్యాప్తంగా 11రోజులపాటు జరిగిన పదోతరగతి పరీక్షలు గురువారంతో ముగిసాయి. పూర్వపు వరంగల్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోటుపాట్లు విద్యార్థులపై తీవ్రప్రభావాన్ని చూపించాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని గట్టి పట్టుదలతో అధికార యంత్రాంగం ముందుకు సాగేందుకు ప్రయత్నించినా కిందిస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వారి ఆశలపై నీళ్లు చల్లింది. పాఠశాల విద్యలో పదోతరగతి పరీక్షలు కీలకమైనవి. వర్ధమానంలో విద్యార్థి భవిత నిర్ణయించే భవిషత్‌లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఒక గీటురాయిగా నిలుస్తున్న పదవతరగతి వార్షిక పరీక్షల్లో ‘ఎలాగైనా’ మార్కులు దండిగా దక్కించుకోవాలన్నా తాపత్రయమే ప్రైవేట్ విద్యా సంస్థలను, సిబ్బందిని తప్పుదోవ పట్టేలా చేసింది. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణలో గతంలోని లోటుపాట్లను అధిగమించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ముందునుంచి జాగ్రత్తలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజిలేటర్ల నియామకం, మొబైల్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు... ఇలా ఏ దశలో కూడా పొరపాట్లు జరగవద్దని మార్గదర్శకాలు జారీచేసింది. ఆక్ట్ 25/1997ను అమలు చేస్తామని చెబుతూ వచ్చినప్పటికి యంత్రాంగం పెడచెవిన పెట్టడంతో విద్యాశాఖ అప్రతిష్టపాలైంది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో చోటుచేసుకున్న వరుస ఘటనలు విద్యాశాఖ పాఠాలు నేర్వలేదనే అంశానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పదకొండు రోజుల పరీక్షల నిర్వహణను ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు చేసిన హడావుడి అంతా పైపై ప్రచారమేననే విమర్శలు ఉన్నాయి. పరీక్షల నిర్వహణ సందర్భంగా స్క్యాడ్ బృందాల తనిఖీలు విద్యార్థుల డిబార్‌ల సంఖ్య పరీశీలిస్తే ఆ ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతోంది. ప్రైవేట్ పాఠశాలల నడుమ నెలకొన్న పోటీ శృతిమించగా, గ్రేడింగ్ కోసం అడ్డదార్లు ఎంచుకోవడం, కాసుల కోసం పంతుళ్ల కక్కుర్తి, ఇన్విజిలేటర్ల నియామకం మొదలు పరీక్షలు పూర్తి అయ్యేదాకా జిల్లాలో నిబంధనలకు నీళ్లు వదిలి వ్యవహరించడంతో గందరగోళం నెలకొంది.
ఖమ్మం జిల్లాలో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టడానికి మూలకేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) దంతాలపల్లి పరీక్ష కేంద్రం కావడం గమనార్హం. ఇక్కడ ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి ప్రశ్నాపత్రాన్ని వాట్సప్‌లో వర్థన్నపేటలోని ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్‌కు పంపించడంతో ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారం వెలుగుచూసింది. అంతటితో ఆగకుండా అది ఖమ్మంలోను చక్కర్లు కొట్టింది. ఖమ్మ పోలీసులు అప్రమత్తమై విచారణ జరిపితే మూలాలు వెలుగులోకి వచ్చాయి. దంతాలపల్లి కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం సాగుతున్నట్లు ప్రచారం ఉంది. వర్ధన్నపేటలోని ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్‌గా ఇంగ్లీష్ పాఠాలు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆశపడి ఇందులో భాగస్వామ్యం అయినట్లు ఆరోపణలున్నాయి. దీనికి బాధ్యులుగా సిఎస్, డివోతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు పడగా ఏడుగురిపై కేసు నమోదైంది. ఇదే ఘటనలో ఖమ్మం జిల్లాలో ఏడుగురిపై కేసు నమోదయింది.
నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం పార్ట్-బి పేపర్ ఏకంగా గల్లంతైంది. ఈ ఘటనలో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన పేపర్ ఎక్కడకు చేరిందనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. కేవలం ఇన్విజిలేటర్‌పై వేటు వేయడంతోపాటు ఒక విద్యార్థిని డిబార్ చేయడం మినహా ఎలాంటి పురోగతి లేదు. తొర్రూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని బి-పరీక్ష కేంద్రంలో గణితశాస్త్ర ప్రశ్నాపత్రానికి బదులుగా సాంఘికశాస్త్రం బండిల్స్‌ను నిర్వాహకులు తీసుకెళ్లారు. పరీక్ష ప్రారంభ సమయంలో తప్పిదాన్ని గుర్తించి సరిచేసారు. అప్పటికే విద్యార్థులకు అరగంట ఆలస్యమై గందరగోళం నెలకొనగా గడువు ముగిసాక ఉన్నతాధికారుల అనుమతితో మరో అరగంట పరీక్ష రాసేందుకు అనుమతించారు. ఈ ఘటనలో నలుగురిని సస్పెండ్ చేసారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో పరీక్షలు రాస్తున్న ఒక ప్రైవేట్ విద్యార్థి వద్ద తనిఖీ బృందాలకు ఏకంగా ఉపాధ్యాయుడి సంతకంతో కూడిన చిట్టీలు దొరికాయి. దీనిపై ఆరా తీయగా ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సమాధానాలను తయారు చేసి చేరవేసినట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థిని డిబార్ చేయడంతోపాటు పోలీసులు విచారణ సాగిస్తున్నారు. జనగాంలో కూడా ఒక ఇన్విజిలేటర్ ప్రశ్నలను మొబైల్ ఫోన్‌లో ఇతరులకు చేరవేస్తూ తనిఖీ బృందాల కంటపడడంతో సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎనిమిది కిలోమీటర్లకు పైబడి ఉన్నవారిని ఇన్విజిలేటర్లుగా నియమించడం, తమ పాఠశాలల విద్యార్థులు ఉన్నచోట కూడా ఇన్విజిలేషన్ బాధ్యతలు ఇవ్వడం, ఎడాపెడా మొబైల్ ఫోన్లను వినియోగించడం, నామమాత్రంగా తనిఖీ బృందాలు బాధ్యతలు నిర్వహించడంతో పరీక్షల నిర్వహణ జిల్లాలో ప్రహసనంగా సాగిందని విమర్శలున్నాయి. ఇప్పటికైన ఉన్నతస్థాయి యంత్రాంగం జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తేనే పది పరీక్షలు పదిలమనే భావన నెలకొంటుంది.

నేరస్థులకు శిక్షలు పడాల్సిందే
* పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి
* నేరాల నియంత్రణ కోసం విజిబుల్ పోలీసింగ్
* నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ భాస్కరన్

మహబూబాబాద్,మార్చి 30: వివిధ కేసుల్లో నేరస్థులకు శిక్షపడేవిధంగా పకడ్భంది చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ, మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ భాస్కరన్ అన్నారు. గురువారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని కాన్ఫరేన్స్ హాల్లో ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ.. నేరస్తులకు శిక్షపడినట్లైతే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణ కోసం విజిబుల్ పోలీసింగ్ అవసరమన్నారు. అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల నియంత్రణ కోసం స్పెషల్‌డ్రైవ్‌లు చేపట్టాలని, రోడ్డు ప్రమాధాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే గుడుంబా, గుట్కా, ఇసుక అక్రమ రవాణపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలన్నారు. అంతేకాకుండా పెండింగ్ కేసులపై దృష్టి సారించి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు ఎస్పీ భాస్కరన్ సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు డిఎస్పిలు రాజమహేంద్రనాయక్, రాజారత్నం, స్పెషల్‌బ్రాంచ్ డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, సంతోష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సదానందం, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

కమలాపూర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
ఆర్థిక మంత్రి ఈటల
కమలాపూర్,మార్చి 30: కమలాపూర్‌ను విద్య, వైద్యం ఆధ్యాత్మికతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కోన్నారు. గురువారం కమలాపూర్‌లో జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని స్థానిక ఎంపిపి లక్ష్మణ్‌రావు, జడ్పిటిసి సభ్యుడు నవీణ్‌కుమార్‌కు సభ్యత్వాన్ని అందజేశారు. రామాలయం వద్ద నూతనంగా నిర్మించే 15లక్షల రూపాయలతో ఈటెల వెంకటమ్మ జ్ఞాపకార్థం నిర్మాణం చేసే కళ్యాణ మండపం రేకుల షెడ్డును మంత్రి మిత్రుడు మోహన్‌రావు కోటి రూపాయలతో రామాలయ పునఃనిర్మాణం చేపట్టిన పనులను పరిశీలించారు. మిషన్ కాకతీయ చెరువుల పూడకతీతల పనులను చెరువు కట్ట మరమ్మత్తు పనులను అధికారులతో సమీక్షించి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వరంగల్ అతి సమీపంగా ఉన్న కమలాపూర్ పెద్ద చెరువును ట్యాంక్ బండ్‌లాగా అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కమాలపూర్‌లో ఇప్పటికే 75శాతం సిసి రోడ్డు పనులు పూర్తి అయ్యాయని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మట్టి రోడ్డు లేని గ్రామంగా త్వరలోనే ప్రకటించబోతున్నామని అన్నారు. టి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంటింట చేయించాలని అన్నారు.

అమ్ముడుపోని మిర్చిపంట
* ఆగ్రహించిన రైతులు - మార్కెట్ యార్డులో ఆందోళన
* తాలు మిర్చి తగులబెట్టి నిరసన

వరంగల్, మార్చి 30: మార్కెట్‌కు అమ్మకానికి తీసుకువచ్చిన మిర్చిపంటకు సరైన ధర లభించకపోవటం, తెచ్చిన మిర్చిపంట పూర్తిగా విక్రయాలు జరగకపోవటంతో ఆగ్రహించిన మిర్చి రైతులు గురువారం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో తాలు కాయ తగులబెట్టి నిరసన తెలిపారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఫలితంగా సుమారు మూడుగంటల పాటు మార్కెట్ యార్డు ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. గిట్టుబాటు ధర విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు, మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేసారు. గత ఏడాది క్వింటాలు నాణ్యమైన మిర్చికి 12వేల రూపాయల పైచిలుకు మద్దతుధర లభించటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతలు ఈ సీజన్‌లో మిర్చిపంట విస్తరంగా వేసారు. కానీ పంట మార్కెట్‌కు వచ్చేసరికి రేటు తారమారయింది. మొదట్లో 10వేలు పలికిన మిర్చి ధర ఆ తరువాత ఐదువేల రూపాయలకు పడిపోయింది. రేటు పడిపోవటంతో గత కొన్ని వారాలుగా మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. అడపాతడపా మార్కెట్ యార్డు వద్ద ఆందోళనలకు దిగటం, అధికారులు వారికి నచ్చజెప్పటం మామూలు వ్యవహారమయింది.
నాలుగురోజుల వరుస సెలవుల అనంతరం గురువారం ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి అమ్మకాలు ప్రారంభమవగా ధర తగ్గిపోవటంతో రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు సుమారు 75వేల బస్తాల మిర్చిపంట రాగా 50వేల బస్తాలు రేటు కుదిరింది. నాణ్యమైన మిర్చికి ఐదువేల నుంచి ఏడువేల రూపాయల ధర పలుకగా తాలు మిర్చి 1200కు పడిపోయింది. సెలవుల విషయం తెలియక కొందరు రైతులు తమ మిర్చిపంటను అమ్మకానికి తీసుకువచ్చి మార్కెట్‌లో లావాదేవీలు లేని కారణంగా రెండు, మూడురోజుల నుంచి మార్కెట్ యార్డులో పంటతో పడిగాపులు కాసారు. కానీ తీరా గురువారం కొనుగోళ్లు ప్రారంభంతోనే ధర పడిపోవటం, తెచ్చిన పంటను వ్యాపారులు పూర్తిగా కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవటంతో ఆగ్రహం చెందిన మిర్చి రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఒక దశలో రైతులు మార్కెట్ కార్యాలయంలోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని గేట్లు మూసివేసారు. ధర్నా చేస్తున్న రైతులలో కొందరు మిర్చి యార్డులోని ఐదు, ఆరుచోట్ల తాలు మిరపకాయలను కుప్పలు పోసి తగులబెట్టి ప్రభుత్వానికి, మార్కెట్ కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తాలు మిర్చిని తగులబెట్టడంతో ఘాటుతో మార్కెట్‌యార్డులో ఉన్న రైతులు ఉక్కిరిబిక్కిరి కావలసి వచ్చింది. పోలీసులు, మార్కెట్ కమిటీ సిబ్బంది ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పి మంటలు ఆర్పివేసారు. వరంగల్ ఏసిపి చైతన్యకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మరాజు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని, మార్కెట్‌లో గురువారం అమ్మకానికి వచ్చిన మిర్చిపంటను వ్యాపారులు కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు. ఈ సందర్భంలో కొందరు రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్‌తో వాగ్వివాదానికి దిగగా పోలీసులు వారికి నచ్చజెప్పి శాంతింపచేసారు.

నోటీసులతో సరా..?
*నకిలీ పట్టాపాస్‌పుస్తకాలతో
కేసముద్రం సోసైటీకి 12లక్షలు కుచ్చుటోపి కేసు..
* రెండేళ్లు దాటినా చర్యలు శూన్యం
* తాజా విచారణకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు
కేసముద్రం, మార్చి 30: నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో కేసముద్రం సింగిల్‌విండో (సొసైటీ)కు 18 మంది 12 లక్షల 50 వేల 600 రూపాయలు కుచ్చుటోపి పెట్టారు. అయితే ఈ వ్యవహారాన్ని గుర్తించి రెండేళ్లు దాటుతున్నా అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేసముద్రం సోసైటీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ప్రతి ఏటా వ్యవసాయ రుణాలు ఇస్తోంది. రుణాల కోసం వందల సంఖ్యలో రైతులు పట్టాపాస్ పుస్తకాలతో దరఖాస్తు చేసుకోగా సొసైటీ సిబ్బంది డిసిసిబి నుంచి క్రెడిట్ లిమిట్ తీసుకొని అప్పు తెచ్చి ఇవ్వడం జరుగుతోంది. ఆ మేరకు 2014, 2015 సంవత్సరాల్లో మండలంలోని కోమటిపల్లి, కోర్కొండపల్లి, ఇనుగుర్తి, కలువల గ్రామాలకు చెందిన కొందరు నకిలీ పట్టాపాస్ పుస్తకాలు సమర్పించి రుణాలు పొందినట్లు ఫిర్యాదులు రావడంతో అప్పటి డిసిసిబి మేనేజర్ సురేందర్ అదే ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరపగా ఆయా గ్రామాలకు చెందిన 18 మంది నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో ఒక్కొక్కరు కనీష్టంగా 40 వేల నుంచి గరీష్టంగా 95 వేల వరకు మొత్తంగా 12 లక్షల 50 వేల 600 రూపాయలు రుణం పొందినట్లు గుర్తించారు. ఆ మేరకు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందినవారికి తక్షణం తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని డిమాండ్ నోటీస్‌లు జారీ చేశారు. దీనితో ఇనుగుర్తికి చెందిన ఇద్దరు మాత్రమే స్పందించి తీసుకున్న రుణాలు వడ్డీతో సహా చెల్లించగా మిగతా 16 మంది ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. అయితే నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో సొసైటీని బురిడి కొట్టించిన వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా మారింది. రుణం తీసుకొని గడువులోగా చెల్లించని రైతుల ఆస్తులను జప్తు చేయడం, లేదంటే భూములు వేలం వేస్తామని హెచ్చరించి బారు వడ్డీ, చక్రవడ్డీతో సహా ముక్కుపిండి వసూళ్లకు పాల్పడే సొసైటీ అధికారులు, పాలకమండలి నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో ఏకంగా 12లక్షల రూపాయలకు పైగా రుణం పొందినవారిపట్ల ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో రుణం పొందినవారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నోటీస్‌లిచ్చాం: సొసైటీ సిఇఓ వెంకటచలం:
సొసైటీ నుంచి గత ఏడాది వివిధ గ్రామాలకు చెందిన 18 మంది నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు డిసిసిబి జిఎం గుర్తించారు. ఆ మేరకు నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో సొసైటీ నుంచి రుణాలు పొందిన వారికి నోటీస్‌లు ఇవ్వగా ఓ వ్యక్తి తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించారు. మిగిలినవారి నుంచి కూడా రికవరి కోసం తిరుగుతున్నాం.. ఇప్పుడూ.. అప్పుడంటూ గడువు పెడుతున్నారు. మరోసారి అధికారులకు వివరించి చర్యలు తీసుకుంటామని సోసైటీ సిఇఓ వెంకటచలం తెలిపారు.
రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు
కాగా కేసముద్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిసిసిబి అనేక మందికి ఉదారంగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలతో పాటు అనర్హులకు లక్షల రూపాయలు రుణంగా ఇచ్చిందనే ఫిర్యాదులపై రాష్ట్ర సహాకార బ్యాంక్ ఉన్నతాధికారులు తాజా విచారణకు రంగంలోకి దిగారు. ఈ నేపధ్యంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన సోసైటీల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు మహబూబాబాద్, తొర్రూరు డిసిసిబి బ్రాంచీల పరిధిలోని పలు సొసైటీల్లో విచారణ జరపడానికి ప్రత్యేక అధికారుల బృందం వస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఈ ఘటనలకు కారకులైన వారిపై చర్యలతో పాటు అప్పనంగా తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వసూలు చేయనున్నారు.

ప్రజాసంక్షేమానికి సిఎం కేసిఆర్
నిరంతర కృషి

మంత్రి చందూలాల్
ములుగుటౌన్, మార్చి 30 : ప్రజా సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నిరంతరం పాటుపడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. ములుగులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి సాంబారి సమ్మారావుతో కలిసి నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి చందూలాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టని పథకాలను నేడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని అన్నారు. ఆ పథకాల వల్లే ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలను తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా పట్టణంలోని డిఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్, నాయకులు వేల్పూరి సత్యనారాయణ, లింగంపల్లి సంపత్‌రావు, గొర్రె సమ్మయ్య, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గట్ల శ్రీనివాసరెడ్డి, గజ్జి నగేష్, తదితరులు పాల్గొన్నారు.